Ayodhya Kanda Sarga 56 In Telugu | అయోధ్యాకాండ షట్పంచాశః సర్గః

అయోధ్యా కాండ సర్గ 56 రామాయణంలో ముఖ్యమైన అధ్యాయం. మరునాడు ఉదయం రాముడు ముందుగా మేల్కొన్నాడు. లక్ష్మణుని నిద్రలేపాడు. “లక్ష్మణా! మనము బయలుదేరు వేళ అయినది. తొందరగా నిద్రలే.” అని నిద్రలేపాడు. తరువాత సీతకూడా నిద్రలేచింది. అందరూ యమునలో స్నానం చేసారు. ప్రాతఃసంధ్యా కార్యక్రమములు నిర్వర్తించి చిత్రకూటమునకు ప్రయాణము అయ్యారు. రాముడు సీతకు దారిలో కనపడ్డ వృక్షముల గురించి, పుష్పముల గురించి వివరిస్తున్నాడు. చిత్రకూట పర్వతము మీద ఏనుగులు గుంపులు గుంపులుగా తిరుగుతున్నాయి. వాటిని సీతకు చూపించాడు రాముడు. అలా నడుచుకుంటూ వారు ముగ్గురూ చిత్రకూట పర్వతమును చేరుకున్నారు. అక్కడ కాసేపు ఆగాడు రాముడు.

చిత్రకూటనివాసః

అథ రాత్ర్యాం వ్యతీతాయామవసుప్తమనంతరమ్ |
ప్రబోధయామాస శనైః లక్ష్మణం రఘునందనః ||

1

సౌమిత్రే శృణు వన్యానాం వల్గు వ్యాహరతాం స్వనమ్ |
సంప్రతిష్ఠామహే కాలః ప్రస్థానస్య పరంతప ||

2

స సుప్తః సమయే భ్రాత్రా లక్ష్మణః ప్రతిబోధితః |
జహౌ నిద్రాం చ తంద్రీం చ ప్రసక్తం చ పథిశ్రమమ్ ||

3

తతౌత్థాయ తే సర్వే స్పృష్ట్వా నద్యాః శివం జలమ్ |
పంథానమృషిణాఽఽదిష్టం చిత్రకూటస్య తం యయుః ||

4

తతః సంప్రస్థితః కాలే రామః సౌమిత్రిణా సహ |
సీతాం కమల పత్రాక్షీమిదం వచనమబ్రవీత్ ||

5

ఆదీప్తానివ వైదేహి సర్వతః పుష్పితాన్నగాన్ |
స్వైః పుష్పైః కింశుకాన్ పశ్య మాలినః శిశిరాత్యయే ||

6

పశ్య భల్లాతకాన్ ఫుల్లాన్ నరైః అనుపసేవితాన్ |
ఫల పత్రైః అవనతాన్ నూనం శక్ష్యామి జీవితుమ్ ||

7

పశ్య ద్రోణప్రమాణాని లంబమానాని లక్ష్మణ |
మధూని మధుకారీభిః సంభృతాని నగే నగే ||

8

ఏష క్రోశతి నత్యూహస్తం శిఖీ ప్రతికూజతి |
రమణీయే వనోద్దేశే పుష్పసంస్తరసంకటే ||

9

మాతంగయూథానుసృతం పక్షి సంఘానునాదితమ్ |
చిత్రకూటమిమం పశ్య ప్రవృద్ధశిఖరం గిరిమ్ ||

10

సమభూమితలే రమ్యే ద్రుమైర్బహుభిరావృతే |
పుణ్యే రంస్యామహే తాత చిత్రకూటస్య కాననే ||

11

తతస్తౌ పాదచారేణ గచ్ఛంతౌ సహ సీతయా |
రమ్యమాసేదతుః శైలం చిత్రకూటం మనోరమమ్ ||

12

తం తు పర్వతమాసాద్య నానాపక్షిగణాయుతమ్ |
బహుమూలఫలం రమ్యం సంపన్నం సరసోదకమ్ ||

13

మనోజ్ఞోఽయం గిరిః సౌమ్య నానాద్రుమలతాయతః |
బహుమూలఫలో రమ్యః స్వాజీవః ప్రతిభాతి మే ||

14

మునయశ్చ మహాత్మానో వసంత్యస్మిన్ శిలోచ్చయే |
అయం వాసో భవేత్తావదత్ర సౌమ్య రమేమహి ||

15

ఇతి సీతా చ రామశ్చ లక్ష్మణశ్చ కృతాంజలిః |
అభిగమ్యాశ్రమం సర్వే వాల్మీకి మభివాదయన్ ||

16

తాన్మహర్షిః ప్రముదితః పూజయామాస ధర్మవిత్ |
ఆస్యతామితి చోవాచ స్వాగతం తు నివేద్య చ ||

17

తతోఽబ్రవీన్మహాబాహుర్లకమణం లక్ష్మణాగ్రజః |
సంనివేద్య యథాన్యాయమాత్మానమృషయే ప్రభుః ||

18

లక్ష్మణానయ దారూణి దృఢాని చ వరాణి చ |
కురుష్వావసథం సౌమ్య వాసే మే అభిరతం మనః ||

19

తస్య తద్వచనం శ్రుత్వా సౌమిత్రిర్వివిధాన్ ద్రుమాన్ |
ఆజహార తతశ్చక్రే పర్ణశాలామరిందమః ||

20

తాం నిష్ఠితాం బద్ధకటాం దృష్ట్వా రమః సుదర్శనామ్ |
శుశ్రూషమాణమేకాగ్రమిదం వచనమబ్రవీత్ ||

21

ఐణేయం మాంసమాహృత్య శాలాం యక్ష్యామహే వయమ్ |
కర్తవ్యం వాస్తుశమనం సౌమిత్రే చిరజీవిభిః ||

22

మృగం హత్వాఽఽనయ క్షిప్రం లక్ష్మణేహ శుభేక్షణ |
కర్తవ్యః శాస్త్రదృష్టో హి విధిర్ధర్మమనుస్మర ||

23

భ్రాతుర్వచన మాజ్ఞాయ లక్ష్మణః పరవీరహా |
చకార స యథోక్తం చ తం రామః పునరబ్రవీత్ ||

24

ఐణేయం శ్రపయస్వైతచ్ఛాలాం యక్ష్యమహే వయమ్ |
త్వరసౌమ్య ముహూర్తోఽయం ధ్రువశ్చ దివసోఽప్యయమ్ ||

25

స లక్ష్మణః కృష్ణమృగం హత్వా మేధ్యం ప్రతాపవాన్ |
అథ చిక్షేప సౌమిత్రిః సమిద్ధే జాతవేదసి ||

26

తం తు పక్వం సమాజ్ఞాయ నిష్టప్తం ఛిన్న శోణితమ్ |
లక్ష్మణః పురుషవ్యాఘ్రమథ రాఘవమబ్రవీత్ ||

27

అయం కృష్ణః సమాప్తాంగః శృతః కృష్ణమృగే యథా |
దేవతాం దేవసంకాశ యజస్వ కుశలో హ్యసి ||

28

రామః స్నాత్వా తు నియతః గుణవాన్ జప్యకోవిదః |
సంగ్రహేణాకరోత్సర్వాన్ మంత్రాన్ సత్రావసానికాన్ ||

29

ఇష్ట్వా దేవగణాన్ సర్వాన్ వివేశావసథం శుచిః |
బభూవ చ మనోహ్లాదో రామస్యామితతేజసః ||

30

వైశ్వదేవబలిం కృత్వా రౌద్రం వైష్ణవమేవ చ |
వాస్తుసంశమనీయాని మంగళాని ప్రవర్తయన్ ||

31

జపం చ న్యాయతః కృత్వా స్నాత్వా నద్యాం యథావిధి |
పాప సంశమనం రామశ్చకార బలిముత్తమమ్ ||

32

వేదిస్థలవిధానాని చైత్యాన్యాయతనాని చ |
ఆశ్రమస్యానురూపాణి స్థాపయామాస రాఘవః ||

33

వన్యైర్మాల్యైః ఫలైర్మూలైః పక్వైర్మామ్సైర్యథావిధి |
అద్భిర్జపైశ్చ వేదోక్తైర్ధర్భైశ్చ ససమిత్కుశైః ||

34

తౌ తర్పయిత్వా భూతాని రాఘవౌ సహ సీతయా |
తదా వివిశతుః శాలాం సుశుభాం శుభలక్షణౌ ||

35

తాం వృక్షపర్ణచ్ఛదనాం మనోజ్ఞాం
యథా ప్రదేశం సుకృతాం నివాతామ్ |
వాసాయ సర్వే వివిశుః సమేతాః
సభాం యథా దేవగణాః సుధర్మామ్ ||

36

అనేకనానామృగపక్షిసంకులే
విచిత్రపుష్పస్తబకైర్ద్రుమైః యుతే |
వనోత్తమే వ్యాలమృగానునాదితే
తథా విజహ్రుః సుసుఖం జితేంద్రియాః ||

37

సురమ్యమాసాద్య తు చిత్రకూటం
నదీం చ తాం మాల్యవతీం సుతీర్థామ్ |
ననంద హృష్టః మృగ పక్షిజుష్టాం
జహౌ చ దుఃఖం పురవిప్రవాసాత్ ||

38

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే అయోధ్యాకాండే షట్పంచాశః సర్గః ||

Ayodhya Kanda Sarga 56 Meaning In Telugu

మరునాడు ఉదయం రాముడు ముందుగా మేల్కొన్నాడు. లక్ష్మణుని నిద్రలేపాడు. “లక్ష్మణా! మనము బయలుదేరు వేళ అయినది. తొందరగా నిద్రలే.” అని నిద్రలేపాడు. తరువాత సీతకూడా నిద్రలేచింది. అందరూ యమునలో స్నానం చేసారు. ప్రాతఃసంధ్యా కార్యక్రమములు నిర్వర్తించి చిత్రకూటమునకు ప్రయాణము అయ్యారు.

రాముడు సీతకు దారిలో కనపడ్డ వృక్షముల గురించి, పుష్పముల గురించి వివరిస్తున్నాడు. చిత్రకూట పర్వతము మీద ఏనుగులు గుంపులు గుంపులుగా తిరుగుతున్నాయి. వాటిని సీతకు చూపించాడు రాముడు. అలా నడుచుకుంటూ వారు ముగ్గురూ చిత్రకూట పర్వతమును చేరుకున్నారు. అక్కడ కాసేపు ఆగాడు రాముడు.

“లక్ష్మణా! ఇక్కడ మనము ప్రశాంతంగా వనవాసము చేయవచ్చును. మనకు కావలసిన ఫలములు, కాయలు దుంపలు, ఆహారమునకు పనికి వచ్చు జంతువులు, స్వచ్ఛమైన నీరు పుష్కలంగా ఉన్నాయి. ఈ పర్వతము మీద చాలామంది ఋషులు తపస్సు చేసుకుంటూ ఉన్నారు.” అని అన్నాడు.

వారు అలా మాట్లాడుకుంటూ వాల్మీకి ఆశ్రమమునకు చేరుకున్నారు. వాల్మీకి వారిని సాదరంగా ఆహ్వానించాడు. కుశల ప్రశ్నలు వేసాడు. తన గురించి తనయొక్క వనవాసము గురించి వాల్మీకి మహర్షికి వివరంగా తెలిపాడు రాముడు.
తరువాత రాముడు లక్ష్మణుని చూచి ఇలా అన్నాడు.

“లక్ష్మణా!మనము ఇచ్చటనే ఒక కుటీరము నిర్మించుకొని నివసిస్తాము. కాబట్టి వెంటనే బలమైన కర్రలు తీసుకొని వచ్చి కుటీరము నిర్మించు.” అని అన్నాడు. లక్ష్మణుడు రాముడు చెప్పిన మేరకు ఒక కుటీరము నిర్మించాడు. ఆ పర్ణశాలను చూచి ఎంతో సంతోషించాడు రాముడు. “లక్ష్మణా! మనకు ఈ పర్ణశాలలో చాలాకాలము నివసింపబోవుచున్నాము. కాబట్టి వాస్తుదేవతలను పూజించాలి. వారిని శాంతింపజేయాలి. ముందుగా మనము లేడి మాంసముతో వాస్తుపూజ చేద్దాము.

కాబట్టి ఒక లేడిని చంపి దాని మాంసము తీసుకొని రా. శాస్త్రము ప్రకారము చేయవలసిన కర్మ కనుక లేడిని చంపిన పాపము అంటదు.” అని అన్నాడు రాముడు. వెంటనే లక్ష్మణుడు అడవిలోకి పోయి ఒక లేడిని వేటాడి తీసుకొనివచ్చాడు. దాని మాంసమును అగ్నిమీద ఉడికించాడు. గృహపూజకు సిద్ధం చేసాడు. “రామా! లేడి మాంసము ఉడికించాను. పూజకు అన్నీసిద్ధం చేసాను.ఇంక పూజకు ఉపక్రమించండి.” అని అన్నాడు లక్ష్మణుడు.

రాముడు స్నానము చేసి శుచిగా వచ్చి కూర్చున్నాడు. వేదమంత్రములను పఠిస్తూ గృహపూజ,వాస్తుదేవతా పూజను శాస్త్రోక్తంగా చేసాడు. దేవతల నందరినీ పూజించాడు. సీతా సమేతంగా ఆ పర్ణశాలలో గృహప్రవేశము చేసాడు రాముడు. తరువాత రాముడు విశ్వేదేవతలకు, త్రిమూర్తులకు బలులు సమర్పించాడు.

లక్ష్మణుడు పర్ణశాల లోపల వేదికలను, అగ్ని గృహమును నిర్మించాడు. తరువాత సీతారాములు అడవిలో లభించు ఫలములు, పుష్పములు, పక్వమైన మాంసముసేకరించి వాటితో భూతతృప్తి గావించారు. తరువాత అందరూ ఆ పర్ణశాలలో ప్రవేశించారు. అప్పటి నుండి సీతారామలక్ష్మణులు ఆ పర్ణశాలలో నివసిస్తున్నారు. అరణ్యములలో విహరిస్తూ, ఫలములు, కాయలు, దుంపలు, తేనె మొదలగు తినే పదార్ధములు సేకరిస్తూ, వాటిని తింటూ, ఆహ్లాదంగా జీవితం గడుపుతున్నారు.

శ్రీమద్రామాయణము
అయోధ్యాకాండము ఏబది ఆరవ సర్గ సంపూర్ణము ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్.

అయోధ్యాకాండ సప్తపంచాశః సర్గః (౫౭) >>

Leave a Comment