Sri Ramadasu Keerthanalu 1-10 In Telugu – శ్రీ రామదాసు కీర్తనలు

Sri Ramadasu Keerthanalu 1-10 In Telugu – శ్రీ రామదాసు కీర్తనలు

ఈ పోస్ట్ లో శ్రీ రామదాసు గారి కీర్తనలు వేదములో అనేక సంగీత పారంపర్యాలు ఉన్నాయి.

1. వరాళిరాగం ఆదితాళం

పల్లవి : అంతా రామమయం యీ జగమంతా రామమయం
అంతరంగమున నాత్మారాముం డనంత రూపమున వింతలు సలుపగ

||అంతా॥

సౌమసూర్యులను సురలుదారలను
ఆ మహాంబుధులు నఖిల జగంబులు
అండాండంబులు పిండాండంబులు
బ్రహ్మాండంబులు బ్రహ్మలు మొదలు

||అంతా||

నదులు వనంబులు నానామృగములు
విదితకర్మములు వేదశాస్త్రములు

||అంతా||

అష్టదిక్కులును నాదిశేషుడును
అష్టవసువులు నరిషడ్వర్గములు

||అంతా||

ధీరుడు భద్రాచల రామదాసుని
కోరిక లొసగెడి తారకనామము

||అంతా||

2. అసావేరి ఆదితాళం

పల్లవి : అబ్బ బ్బ దెబ్బలకు తాళలేనురా
రామప్ప గొబ్బున నన్నేలు కోరా

||అబ్బబ్బ||

మేలు చేయుదునంటి గదరా
వరహాలు మొహరీలు జమచేస్తిగదరా
నీ పరిచారులకు నే పెట్టితి గదరా

||అబ్బబ్బ||

పరులకొక్కరువ్వ యీయలేదు గదరా
ఓ పరమాత్మ నీ పాదముల్ నమ్మితిరా
కొరడాలు తీసుక గొట్టిరిగదరా
హరసుత గోవిందం హరితాళలేనురా

||అబ్బబ్బ||

అంతటిలో నిను నెరనమ్మినానురా
శరణాగత గోవిందలహరి తాళలేనురా
శరధి బంధించిన శౌర్యమెక్కడరా
రాక్షస సంహార రక్షింపరారా

||అబ్బబ్బ||

రామ భద్రాద్రిరామ సీతారామా
నీ నామమెప్పుడు భజయించితి గదురా
రామదాసుని నిటుల చేయించి తేరా

||అబ్బబ్బ||

3. వరాళి ఏకతాళం

పల్లవి : ఇదిగో భద్రాద్రి గౌతమి అదిగో చూడండి
ముదముతో సీతాముదిత లక్ష్మణులు
కలసి కొలువగా రఘుపతి యుండెడి
చరణములు
చారుస్వర్ణ ప్రాకార గోపుర
ద్వారములతో సుందరమై యుండెడి

||ఇదిగో||

అనుపమానమై అతిసుందరమై
దనరుచక్రము ధగధగ మెరిసెడి

||ఇదిగో||

కలియుగమందున నిలవైకుంఠము
నలరుచున్నది నయముగ మ్రొక్కుడి

||ఇదిగో||

పొన్నల పొగడల పూపొదరిండ్లను
చెన్ను మీగడను శృంగారంబడు

||ఇదిగో||

శ్రీకరముగ రామదాసునును
ప్రాకటముగ బ్రోచె ప్రభువాసము

||ఇదిగో||

4. కాంభోజి ఆదితాళం

పల్లవి : ఇక్ష్వాకుల తిలక ఇకనైన బలుకవు రామచంద్ర
నన్ను రక్షింపకున్నను రక్షకులెవరింక రామచంద్రా

॥ఇక్ష్వాకు॥

చుట్టూ ప్రాకారములు సొంపుతో గట్టిస్తి రామచంద్ర
యాప్రాకారములకు బట్టె పదివేల వరహాలు రామచంద్ర

॥ఇక్ష్వాకు॥

గోపుర మంటపాలు కుదురుగ గట్టిస్తి రామచంద్ర
నను క్రొత్తగ జూడక యిత్తరి బ్రోవుము రామచంద్ర

॥ఇక్ష్వాకు॥

భరతునకు చేయిస్తి పచ్చల పతకము రామచంద్ర
యాపతకమునకు బట్టె పదివేల వరహాలు రామచంద్ర

॥ఇక్ష్వాకు॥

శత్రుఘ్నునకు చేయిస్తి బంగారు మొలత్రాడు రామచంద్ర
ఆ మొలత్రాటికిబట్టె మొహరీలు పదివేలు రామచంద్ర

॥ఇక్ష్వాకు॥

లక్ష్మణునకు చేయిస్తి ముత్యాల పతకము రామచంద్ర
యా పతకముకు బట్టె పదివేల వరహాలు రామచంద్ర

॥ఇక్ష్వాకు॥

సీతమ్మకు చేయిస్తి చింతాకు పతకము రామచంద్ర
యా పతకమునకు బట్టె పదివేల వరహాలు రామచంద్ర

॥ఇక్ష్వాకు॥

వాహనములు మీకు వరుసతో జేయిస్తి రామచంద్ర
జగన్మోహన సంకెళ్లు వేసిరి కాళ్లకు రామచంద్ర

॥ఇక్ష్వాకు॥

కలికి తురాయి నీకు మెరుపుగ జేయిస్తే రామచంద్ర
నీవు కులుకుచు దిరిగెదవు ఎవరబ్బ సొమ్మని రామచంద్ర

॥ఇక్ష్వాకు॥

మీ తండ్రి దశరధమహారాజు పెట్టెనా రామచంద్ర
లేక మీ మామ జనక మహారాజు పంపైనా రామచంద్ర

॥ఇక్ష్వాకు॥

అబ్బ తిట్టితినని ఆయాసపడవద్దు రామచంద్ర
యీ దెబ్బలకోర్వక అబ్బ తిట్టితినయ్య రామచంద్ర

॥ఇక్ష్వాకు॥

ఏటికి చల్లిన నీళ్లాయె నా బ్రతుకు రామచంద్ర
నేను అథమురాలికంటె నన్యాయమైతిని రామచంద్ర

॥ఇక్ష్వాకు॥

సర్కారు పైకము తృణముగ నెంచక రామచంద్ర
దెబ్బలు తినలేను యప్పుదీర్చుమయ్య రామచంద్ర

॥ఇక్ష్వాకు॥

కౌసల్య పుత్రుడ దశరథ తనయుడ రామచంద్ర
కావు క్షేమముగ భద్రాద్రి నెలకొన్న శ్రీరామచంద్ర

॥ఇక్ష్వాకు॥

భక్తులందరిని పరిపాలించెడి శ్రీరామచంద్ర
నీవు క్షేమముగ శ్రీరామదాసుని నేలుము రామచంద్ర

॥ఇక్ష్వాకు॥

5. వరాళి ఆదితాళం

పల్లవి : ఏడనున్నాడో భద్రాద్రివాసు డేడ నున్నాడో
నాపాలి రాముడేడ నున్నాడో

||ఏడ||

ఏడనున్నాడో గాని జాడ తెలియలేదు
నాడు గజేంద్రుని కీడుబాపిన స్వామి

||ఏడ||

ద్రౌణీబాణ జ్వాలదాకిన బాలకునికి
ప్రాణమిచ్చిన జగత్రాణ రక్షకుడు

||ఏడ||

పాంచాలి సభలోన భంగమొందిననాడు
వంచనలేకను వలువలిచ్చిన తండ్రి

||ఏడ||

దుర్వాసు డుగ్రమున ధర్మసుతుని జూడ
నిర్వహించిన నవనీత చోరకుడు

||ఏడ||

అక్షయముగ శ్రీ భద్రాచలమందున
సాక్షాత్కరించిన జగదేకవీరుడు

||ఏడ||

6. నాదనామక్రియ ఆదితాళం

పల్లవి :ఏ తీరుగ నను దయజూచెదవో ఇనవంశోత్తమ రామా
నా తరమా భవసాగరమీదను నళిన దళేక్షణ రామా

చరణములు :
శ్రీరఘునందన సీతారమణా శ్రితిజనపోషక రామా
కారుణ్యాలయ భక్తవరద నిను కన్నది కానుపు రామా

॥ఏ తీరుగ॥

మురిపెముతో నా స్వామిని నీవని ముందుగ దెల్పితి రామా
మరువక యిక నభిమానముంచ నేమరుగు జొచ్చితిని రామా

॥ఏ తీరుగ॥

క్రూర కర్మములు నేరక చేసితి నేరములెంచకు రామా
దారిద్ర్యము పరిహారము చేయవే దైవశిఖామణి రామా

॥ఏ తీరుగ॥

గురుడవు నామది దైవము నీవని గురుశాస్త్రంబులు రామా
గురుదైవంబనీ యెరుగక తిరిగెడు క్రూరుడనైతిని రామా

॥ఏ తీరుగ॥

తాండవమున కఖిలాండకోటి బ్రహ్మాండనాయకా రామా
భండనమున నీ నామము దలచిన బ్రహ్మానందము రామా

॥ఏ తీరుగు॥

వాసవకమలభవ సురవందిత వారధిబంధన రామా
సార్చిత మాకభయమొసంగవె దాశరథీ రఘురామా

॥ఏ తీరుగ॥

వాసవనుత రామదాస పోషకవందన మయోధ్యరామా
భాసురవద సద్గుణములు కల్గిన భద్రాద్రీశ్వర రామా

॥ఏ తీరుగ॥

7. కల్యాణిరాగము రూపకతాళము

పల్లవి :ఏమయ్య రామ బ్రహ్మేంద్రాదులకైన
నీ మాయ తెలియవశమా
కామారి వినుతగుణధామకువలయదళ
శ్యామా నన్ను గన్న తండ్రి రామా
సుతుడనుచు కవులు క్షితినాథుడనుచు భూ
పతులు కొలిచిరిగాని పతితపావనుడనుచు
మతి తెలియలేరైరి.

॥ఏమయ్య॥

చెలిమి కొడవనుచు పాండవులు నిజ
విరోధివటంచు నల జరాసంధాదులు కలవాడవని
కుచేలుండు నెరింగిరి గాని ఓజలజాక్ష నిన్ను సేవింపలేరైరి

॥ఏమయ్య॥

నరుడవని నరులు తమ దొరవనుచు యాదవులు
నరుడవనుచు కోపింతురు కరివరద భద్రాద్రిపుర నిలయ
రామదాస పరమాత్ముడని నిన్ను భావింపలేరైరి

॥ఏమయ్య॥

8. పున్నాగరావళి చాపుతాళం

పల్లవి : ఏల దయరాదో రామయ్య నీకేల దయరాదో
మీ మేలుకై పాటుబడితిని యేల మీ భండము చాలుచాలును

॥ఏల॥

చరణములు
బ్రహ్మ గూర్పగదే అహోవరబ్రహ్మకావగదే
బ్రహ్మజనక భవ బ్రహ్మేంద్రాదులు బ్రహ్మానందము పాలైనారట

॥ఏల॥

పాపములచేత రామయ్య నేనోపలేను గదే
శ్రీభూపతి యే ప్రాపులేక నీ ప్రాపేగోరితి ఘోరరూపయిక

॥ఏల॥

తలపగడాల ఆనందభాష్పములూరెగదె
నీలినీరదనిభకోమలరూప భద్రశైలవాస రామదాసునేలగ

॥ఏల॥

9. నాదనామక్రియ ఏకతాళం

పల్లవి : కోదండరామ కోదండరామ కోదండరామ కోదండరామ
నీదండనాకు నీవెందుబోకు వాదేల నీకు వద్దు పరాకు

॥కోదండ॥

శ్రీరామ మమ్ము చేపట్టుకొమ్ము ఆదుకొనరమ్ము ఆరోగ్యమిమ్ము

॥కోదండ॥

జయరఘువీర జగదేకవీర భయనివార భక్తమందార

॥కోదండ॥

మణిమయభూష మంజులభాష రణజయ ఘోష రమణీయ వేష

॥కోదండ॥

ఏలరావయ్య యేమందునయ్య పాలింపవయ్య ప్రౌడిగనయ్య

॥కోదండ॥

తండ్రివి నీవే తల్లివి నీవే దాతవు నీవే దైవము నీవే

॥కోదండ॥

అద్భుత కుండలామలదండ సద్గుణదండ సమర ప్రచండ

॥కోదండ॥

సరసిజనేత్ర సౌందర్యగాత్ర పరమపవిత్ర భవ్యచరిత్ర

॥కోదండ॥

నీబుద్ధి వీడు ఎరుగనివాడు పాపడువీడు బడలియున్నాడు

॥కోదండ॥

పాపనులేపి ప్రజలనుగల్పి యాపదబాపి యటు ప్రీతిజూపి

॥కోదండ॥

నమ్మిన చిన్నవాడెందున నున్న మమ్ములగన్న మాయన్న వన్న

॥కోదండ॥

ఎవరు మీతోటి ఎవరు మీసాటిరారు మీపాటి రాజులమేటి

॥కోదండ॥

దశరథబాలదాసావన దశముఖకాల ధరణీశపాల

॥కోదండ॥

మారుతభీమ మాల్యాభిరామ కల్యాణనామ కారుణ్యధామ

॥కోదండ॥

మంజులభాష మణిమయభూష కుంజరపోష కువలయవేష

॥ కోదండ॥

పుట్టింప నీవే పోషింప నీవే కులమియ్య నీవే భాగ్యము నీవే

॥కోదండ॥

శరణన్న చోట క్షమచేయుమాట బిరుదునీదౌట నెరిగిన మాట

॥కోదండ॥

రామయ్యవీని రక్షింతుగాని సేవచేసేవాని సుతుడుగానీ

॥కోదండ॥

మురళీవిలోల మునిజనపాల తులసీవనమాల తుంబురలోల

॥ కోదండ॥

రావణభంగ రమణీయాంగ మందరోద్దార మౌక్తికహార

॥ కోదండ॥

వందనమయ్య వాదేలనయ్య దండనసేయ తగదు మీకయ్య

॥కోదండ||

లాలితహాసలక్ష్మివిలాస పాలితదాస భద్రిద్రివాస

॥ కోదండ॥

శ్రీవిజయరామ శ్రీతులసిరామ పావనరామ భద్రాద్రిరామ

॥ కోదండ॥

10. యమునా కల్యాణి ఆదితాళం

పల్లవి : గరుడగమన రారా నను నీ కరుణ నేలుకోరా
పరమపురుష ఏ వెరవులేక నీ మరుగుజొచ్చితిని
అరమర సేయక

॥గరుడ॥

పిలువగానేరమ్మి అభయము తలపగానెయిమ్మి
కలిమిబలిమి నాకలలో నీవని పలవరించిన నన్ను గన్నయ్య

॥గరుడ॥

పాలకడలిశయనా దశరథబాల జలజనయనా
పాలముంచిన నీటముంచిన నీపాలబడితిని జాలము సేయక

॥గరుడ॥

ఏలరావు స్వామి నను నిపుడేలుకోవదేమి
ఏలువాడవని చాలనమ్మితిని ఏలరావు కరుణాలవాల హరి

॥గరుడ॥

ఇంతపంతమేల భద్రగిరీశ వరకృపాళ
చింతలణచి శ్రీరామదాసుని అంతరంగపతిపై రక్షింపుము

॥గరుడ॥

మరిన్ని కీర్తనలు:

Leave a Comment