Balakanda Sarga 61 In Telugu – బాలకాండ ఏకషష్టితమః సర్గః

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. బాలకాండ లోని ఏకషష్టితమః సర్గలో, శునాశేప పురాణం ప్రారంభమైంది మరియు విశ్వామిత్ర పురాణంలో భాగంగా శతానంద మహర్షి దీనిని కొనసాగిస్తున్నాడు. రాముడి తాతయ్య అంబరీషుడు ఒక కర్మను చేపట్టినప్పుడు, ఇంద్రుడు ఆ కర్మ యొక్క గుర్రాన్ని బంధించాడు. అప్పుడు అంబరీషుడు ఆ తప్పిపోయిన గుర్రానికి బదులుగా ఒక మానవ-జంతువుని తీసుకురావలసి వచ్చింది. ఎవరూ అందుబాటులో లేనప్పుడు ఋషికా ఋషి కుమారుడు మరియు విశ్వామిత్రుని మేనల్లుడు అయిన శునాశేప అనే వ్యక్తి తన తల్లిదండ్రులకు ధన మార్పిడిని అందజేస్తాడు.

శునఃశేపవిక్రయః

విశ్వామిత్రో మహాత్మాథ ప్రస్థితాన్ప్రేక్ష్య తానృషీన్ |
అబ్రవీన్నరశార్దూలః సర్వాంస్తాన్వనవాసినః ||

1

మహావిఘ్నః ప్రవృత్తోఽయం దక్షిణామాస్థితో దిశమ్ |
దిశమన్యాం ప్రపత్స్యామస్తత్ర తప్స్యామహే తపః ||

2

పశ్చిమాయాం విశాలాయాం పుష్కరేషు మహాత్మనః |
సుఖం తపశ్చరిష్యామో పరం తద్ధి తపోవనమ్ ||

3

ఏవముక్త్వా మహాతేజాః పుష్కరేషు మహామునిః |
తప ఉగ్రం దురాధర్షం తేపే మూలఫలాశనః ||

4

ఏతస్మిన్నేవ కాలే తు అయోధ్యాధిపతిర్నృపః |
అంబరీష ఇతి ఖ్యాతో యష్టుం సముపచక్రమే ||

5

తస్య వై యజమానస్య పశుమింద్రో జహార హ |
ప్రణష్టే తు పశౌ విప్రో రాజానమిదమబ్రవీత్ ||

6

పశురద్య హృతో రాజన్ప్రణష్టస్తవ దుర్నయాత్ |
అరక్షితారం రాజానం ఘ్నంతి దోషా నరేశ్వర ||

7

ప్రాయశ్చిత్తం మహద్ధ్యేతన్నరం వా పురుషర్షభ |
ఆనయస్వ పశుం శీఘ్రం యావత్కర్మ ప్రవర్తతే ||

8

ఉపాధ్యాయవచః శ్రుత్వా స రాజా పురుషర్షభ |
అన్వియేష మహాబుద్ధిః పశుం గోభిః సహస్రశః ||

9

దేశాంజనపదాంస్తాంస్తాన్నగరాణి వనాని చ |
ఆశ్రమాణి చ పుణ్యాని మార్గమాణో మహీపతిః ||

10

స పుత్రసహితం తాత సభార్యం రఘునందన |
భృగుతుంగే సమాసీనమృచీకం సందదర్శ హ ||

11

తమువాచ మహాతేజాః ప్రణమ్యాభిప్రసాద్య చ |
బ్రహ్మర్షి తపసా దీప్తం రాజర్షిరమితప్రభః ||

12

పృష్ట్వా సర్వత్ర కుశలమృచీకం తమిదం వచః |
గవాం శతసహస్రేణ విక్రీణీషే సుతం యది ||

13

పశోరర్థే మహాభాగ కృతకృత్యోఽస్మి భార్గవ |
సర్వే పరిసృతా దేశా యజ్ఞీయం న లభే పశుమ్ ||

14

దాతుమర్హసి మూల్యేన సుతమేకమితో మమ |
ఏవముక్తో మహాతేజా ఋచీకస్త్వబ్రవీద్వచః ||

15

నాహం జ్యేష్ఠం నరశ్రేష్ఠ విక్రీణీయాం కథంచన |
ఋచీకస్య వచః శ్రుత్వా తేషాం మాతా మహాత్మనామ్ ||

16

ఉవాచ నరశార్దూలమంబరీషమిదం వచః | [తపస్వినీ]
అవిక్రేయం సుతం జ్యేష్ఠం భగవానాహ భార్గవః ||

17

మమాపి దయితం విద్ధి కనిష్ఠం శునకం నృప |
తస్మాత్కనీయసం పుత్రం న దాస్యే తవ పార్థివ ||

18

ప్రాయేణ హి నరశ్రేష్ఠ జ్యేష్ఠాః పితృషు వల్లభాః |
మాతౄణాం చ కనీయాంసస్తస్మాద్రక్షే కనీయసమ్ ||

19

ఉక్తవాక్యే మునౌ తస్మిన్మునిపత్న్యాం తథైవ చ |
శునఃశేపః స్వయం రామ మధ్యమో వాక్యమబ్రవీత్ ||

20

పితా జ్యేష్ఠమవిక్రేయం మాతా చాహ కనీయసమ్ |
విక్రీతం మధ్యమం మన్యే రాజన్పుత్రం నయస్వ మామ్ ||

21

[* అధికశ్లోకం –
అథ రాజా మహాన్రామ వాక్యాంతే బ్రహ్మవాదినః |
హిరణ్యస్య సువర్ణస్య కోటిభీ రత్నరాశిభిః ||
*]

గవాం శతసహస్రేణ శునఃశేపం నరేశ్వరః |
గృహీత్వా పరమప్రీతో జగామ రఘునందన ||

22

అంబరీషస్తు రాజర్షీ రథమారోప్య సత్వరః |
శునఃశేపం మహాతేజా జగామాశు మహాయశాః ||

23

Balakanda Sarga 61 In Telugu Pdf With Meaning

ఆ ప్రకారంగా త్రిశంకు స్వర్గము సృష్టించి త్రిశంకును అక్కడ ఆ తలకిందులుగా నిలిపాడు విశ్వామిత్రుడు. తరువాత యాగమునకు వచ్చిను ఋషులతో ఇలా అన్నాడు. “ఇప్పటి వరకూ నేను దక్షిణ దిక్కున తపస్సు చేసాను. ఇక్కడ అన్నీ విఘ్నములు కలుగుతున్నాయి. ఇంక మీదట పడమర దిక్కున ఉన్న పుష్కర క్షేత్రములో తపస్సు చేసు కుంటాను.”అని అన్నాడు.

ఆ ప్రకారంగా విశ్వామిత్రుడు పశ్చిమ దిక్కుగా ప్రయాణమై వెళ్లాడు. పుష్కర క్షేత్రము చేరుకున్నాడు. అది ఒక పవిత్రమైన వనము. అక్కడ విశ్వామిత్రుడు కేవలము ఫలములు మాత్రమే ఆహారంగా తీసుకుంటూ ఘోరమైన తపస్సు చేసాడు.

అదే కాలంలో అంబరీషుడు అనే రాజు ఉండేవాడు. అంబరీషుడు ఒక యాగము చేస్తున్నాడు. అంబరీషుడు యాగం చేయడం ఇష్టం లేని ఇంద్రుడు, యాగపశువును దొంగిలించాడు. యాగ పశువు కనపడకపోయేసరికి పురోహితుడు అంబరీషునితో ఇలా అన్నాడు.

“రాజా! యజ్ఞపశువును ఎవరో తీసుకొని పోయారు. నీవు చేసిన అధర్మము వలననే ఈ ప్రకారము జరిగింది. దీనికి ప్రాయశ్చిత్తము చేయాలి. నీవు యజ్ఞపశువును అయినా తీసుకొని రా లేక పోతే పశు వుకు బదులు ఒక మనిషిని అన్నా తీసుకొని రా. అప్పుడు యజ్ఞము పూర్తి అవుతుంది.” అని అన్నాడు పురోహితుడు.

అంబరీషుడు వేల కొలదీ ఆవులు ఇస్తాను ఒక్క మనిషిని ఇవ్వండి అని ఎందరినో అడిగాడు. కాని ఎవరూ ఒప్పుకోలేదు. గ్రామములు, జనపదములు, పురములు ఎన్నో తిరిగాడు. కాని ఫలితం లేక పోయింది. ఆ సమయంలో ఋచీకుడు అనే మహర్షి తన భార్యా పుత్రులతో భృగుతుంగ పర్వతము మీద ఆశ్రమము నిర్మించుకొని తపస్సు చేసుకుంటూ ఉన్నాడు.

అంబరీషుడు ఆ ఋచీకమహర్షి వద్దకు వెళ్లాడు. జరిగినది అంతా చెప్పాడు. “ ఓ మహర్షీ! నేను నీకు లక్ష ఆవులను ఇస్తాను. నీ కుమారుని నాకు యజ్ఞపశువుగా ఇవ్వగలరా!” అని అడిగాడు.

“లేదు. నేను నా పెద్ద కుమారుడిని ఇవ్వను. తండ్రికి పెద్ద కుమారుడు అంటే ప్రేమ కదా!” అని అన్నాడు.

ఋచీకుని భార్య ఇలా అంది. “నాకు నా చిన్న కుమారుడు అంటే ఎంతో ఇష్టం. కాబట్టి నేను నా చిన్న కుమారుని ఎట్టి పరిస్థితులలో కూడా ఇవ్వను.” అని చెప్పింది.

ఋచీకునకు ముగ్గురు కుమారులు. పెద్దకుమారుని తండ్రి, చిన్న కుమారుని తల్లి ఇవ్వను అన్నారు. మిగిలింది మధ్యముడైన శునశ్శేపుడు. ఆ శునశ్శేపుడు అంబరీషునితో ఇలా అన్నాడు.

“ఓ అంబరీషా! పెద్ద కుమారుని నా తండ్రి, చిన్న కుమారుని నా తల్లి అమ్మడానికి ఇష్టపడటంలేదు అంటే మధ్యముడనైన నన్ను అమ్మడానికి ఇష్టపడుతున్నారు అని అర్థం కదా. కాబట్టి మీరు వారికి తగిన మూల్యం ఇచ్చి నన్ను తీసుకొని వెళ్లండి.” అని అన్నాడు.

అంబరీషుడు సంతోషంగా ఋచీకునకు లక్షగోవులు మూల్యంగా చెల్లించి శునశేపుని తన వెంట యజ్ఞపశువుగా తీసుకొని వెళ్లాడు.

శ్రీమద్రామాయణము
బాలకాండము అరవైఒకటవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్.

బాలకాండ ద్విషష్టితమః సర్గః (62) >>

Leave a Comment