మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు నీతికథలు గురించి తెలుసుకుందాం.
నీతికథలు
విక్రమార్కుని సాహసగాధల నీతికథలలో మనకు బాగా సుపరిచితమైన నీతికథ మీ అందరికోసం. అది ఎమిటంటే… భర్తృహరి కథ.
భర్తృహరి కథ
మహానుభావుడైన కేశవశర్మకు నలుగురు ఉత్తములైన పుత్రులు దైవానుగ్రహము వలన కలిగినారు. సంస్కృత వ్యాకరణకర్త దివ్య శివమహిన్మా: స్తుతికర్త అయిన కాత్యాయన వరరుచి, అతిలోక సాహవంతుడు ధర్మాత్ముడు మహాకాళీభక్తుడు అయోధ్యాలయ పునరుద్ధారకుడు శకకర్త అయిన విక్రమార్కుడు, పండితుడు మహావివేకవంతుడు కాళీ అనుగ్రహపాత్రుడు అయిన భట్టి మరియు సంస్కృత మహాకవి సుభాషిత రత్నావళికర్త వాక్యప్రదీప, రాహత, కారిక గ్రంథకర్త అయిన భర్తృహరి ఆయన నలుగురు కుమారులు. కేశవశర్మ యోగ్యుడైన భర్తృహరికి రాజ్యభారమప్పగించి వానప్రస్థమును స్వీకరించాడు. చిన్నప్పటినుంచి భర్తృహరి సాధుసజ్జనుల సేవలుచేస్తూ ఉండేవాడు.
భర్తృహరి రాజ్యములో ఒక నిరుపేద బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడు ధనానికి పేదకాని గుణానికి కాదు. సౌశీల్యుడు మంత్రతంత్రశాస్త్ర కోవిదుడు అయిన ఆ విప్రోత్తముడు భువనేశ్వరీదేవి ఉపాసకుడు. మాత ఆ పరమభక్తుని అనుగ్రహించదలచి ఆయన ముందు ప్రత్యక్షమై “కుమారా! నీ గుణసంపదను భక్తిని మెచ్చినాను. ఈ దివ్యఫలం తీసుకో. ఈ ఫలం తిన్నవాడికి జరామరణాలు ఉండవు!” అని ఆజ్ఞాపించింది జగజ్జనని.
గుణాగ్రగణ్యుడైన ఆ బ్రాహ్మణుడు ఇలా ఆలోచించాడు “నేను ఒక పేదబ్రాహ్మణుడను. అమృతత్వము సంపాదించిననూ నేను ఎవరిని కాపాడగలను? ఈ పండు కనక మన మహారాజుగారు తింటే ఎందఱో నిర్భాగ్యులను రక్షించగలడు. అప్పుడే నేనీ ఫలమును సద్వినియోగము చేసినవాడను అవుతాను”. ఇలా తలచి ఆ బ్రాహ్మణుడు మహారాజైన భర్తృహరి వద్దకు వెళ్ళి అతనిని ఆశీర్వదించి ఆ దివ్యఫలాన్ని అతనికిచ్చి వచ్చేశాడు!
ఫలము యొక్క మహిమను అర్థంచేసుకోలేక భర్తృహరి ఆ ఫలమును తన ప్రియురాలైన అనంగసేనకు ఇచ్చివేసాడు. కుటిలాత్మురాలైన ఆ అనంగసేన తన సఖుడైన అశ్వపోషకునికి ఆ దివ్యఫలం ఇచ్చింది. మూర్ఖుడైన ఆ అశ్వపోషకుడు తన దాసికి ఆ ఫలాన్ని ఇచ్చాడు. ఆమె తనకు ప్రియుడైన ఒక గోపాలకునికి ఫాలాన్ని ఇవ్వగా వాడు దానిని తన ప్రియురాలికిచ్చాడు. ఆ చిన్నది పశువులపెంట ఉన్న బుట్టలో పండును పెట్టి రాజమార్గముగుండా ఆ బుట్టను తలపైపెట్టుకొని తన ఇంటికి వెళ్ళింది. భర్తృహరి ఆ పండును చూశాడు. బ్రాహ్మణుడు మహాత్యాగం చేసి లోకహితార్థం తనకిచ్చిన దివ్యఫలం చివరికి పెంటబుట్టలో చేరిందని బాధపడ్డాడు. ఆ పండు ఎంతమంది చేతులు మారిందో తెలుసుకున్నాడు.
ఒక్కసారిగా భర్తృహరికి వైరాగ్యం వచ్చింది. సంసారం మీద విరక్తి పుట్టింది. తను ఎవరినైతే ప్రియులు అనుకుంటున్నాడో వాళ్ళు నిజమైన ప్రియులు కాదని పరమేశ్వరుడొక్కడే ప్రాణబంధుడని తెలుసుకున్నాడు. మిథ్యాజగత్తులోని విషయభోగాలను త్యజించి రెమేశునిపై అనురక్తుడై వైరాగ్యముతో తపోవనాలకు వెళ్ళడనికి సిద్ధపడ్డాడు. దేవీప్రసాదమైన ఆ దివ్యఫలాన్ని తన రాజ్యసర్వస్వాన్ని యోగ్యుడైన విక్రమార్కుని చేతిలో పెట్టి తపస్సుకై వెళ్ళిపోయాడు.
మహౌదార్యుడైన విక్రమాదిత్యుడు తన వద్దకు వచ్చిన దీనుడైన ఒక బ్రాహ్మాణునిపై జాలిపడి ఆ దివ్యఫలాన్ని అతనికి ఇచ్చివేశాడు!!
రత్నైర్మాహార్హైస్తుతుషుర్న దేవా న భేజిరే భీమ విషేణ భీతిమ్|
సుధాం వినా న పరయుర్విరామం న నిశ్చితార్థాద్విరమన్తి ధీరాః||
– భర్తృహరి నీతిశతకమ్
ఈ కథలోనితి మరొక్కమాణు మీ అందరికోసం
విప్రోత్తముని సద్భావము మనకు కనువిప్పుకావాలి. లోకంలో జనాలు వృద్ధాప్యం రాకూడదు మృత్యువు రాకూడదు అని తపిస్తుంటే ఆ బ్రాహ్మణుడు జరామరణ రహితముగా చేసే దివ్యఫలాన్ని లోకహితార్థం మహారాజుకు ఇచ్చివేశాడు. స్వధర్మపాలలనో పరాకాష్టను చూపిన ఆ భూసురుడు ధన్యుడు.
“అంతా మిథ్య తలంచిచూచిన” అన్న సత్యాన్ని తెలుసుకున్నాడు భర్తృహరి. లౌకిక విషయాలను విడిచి మోక్షమార్గోన్ముఖుడైనాడు. ఆయన మనకు అందించిన సుభాషితాలను చదివి అర్థంచేసుకుని మన నిత్యజీవితములో అనుసంధానం చేసుకోవడం మన కర్తవ్యము.
విక్రమార్కుని ఔదార్యము గొప్పది. దీనుడైన విప్రునికి దివ్యఫలాన్ని దానం చేసి తన త్యాగబుద్ధిని మనకు చూపినాడు.
మరిన్ని నీతికథలు మీకోసం: