మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. హిందూమత ధర్మములో స్తోత్రము అనగా స్థుతిస్తూ గానము చేసేది లేక ప్రశంశములతో కూడిన గానం (ప్రశంశా గానం) లేదా కీర్తన లేదా పాట. స్తోత్రములు, ప్రసిద్ధిపొందిన ధార్మిక సాహిత్యం, వీటిని దైనందిన జీవితంలో నిత్యమూ ఉపయోగిస్తుంటారు. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు శ్రీ అన్నపూర్ణా స్తోత్రమ్ గురించి తెలుసుకుందాం…
Sri Annapurna Devi Stotram In Telugu
శ్రీ అన్నపూర్ణా స్తోత్రమ్
శ్లో॥ 1
నిత్యానందకరీ వరాభయకరీ సౌందర్యరత్నాకరీ
నిర్ధూతాఖిలదోషపావనకరీ ప్రత్యక్షమాహేశ్వరీ |
ప్రాలేయాచలవంశపావనకరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ || 1 ||
సీ॥ నిత్యమానందమ్ము నెనరుతొ గల్పించు శ్రేష్ఠాభయపు దాత శివుని రాణి సౌందర్య శోభకు, సాగరమీవమ్మ సాక్షాన్మహేశ్వరి జనని వీవు సర్వ పాపంబులన్ సమసిపోవగజేయు మాతవు రక్షింపు మమ్ము నీవె హిమవంతు వంశపు ఇంపు పెంచగ బుట్టి పావనంబొనరించు పార్వతీవు.
తా॥ ప్రతిదినము ఆనందమును ప్రేమతో యిచ్చెడి ఈ శివుని అర్ధాంగి శ్రేష్ఠమైన అభయ ప్రదాయిని తల్లీ! నీవు సౌందర్యపయోనిధివి, సాక్షాత్తు మహేశ్వరివి. సర్వ పాపములను నశింపజేసెడి జననివి నీవు మమ్ము రక్షింపుము. హిమవంతుని పుత్రికయైన పార్వతివి నీవే. కాశీ పట్టణాధీశ్వరివైన ఓ అన్నపూర్ణమ్మా మాకు జ్ఞానమను భిక్షను ప్రసాదించి అండవై నీవే దయతో మమ్ము కాపాడుము. నీదయను మాకు పట్టుగొమ్మగా అందించుము.
శ్లో॥ 2
నానారత్నవిచిత్రభూషణకరీ హేమాంబరాడంబరీ
ముక్తాహారవిడంబమానవిలసద్వక్షోజకుంభాంతరీ |
కాశ్మీరాగరువాసితాంగరుచిరా కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ || 2 ||
సీ॥ బహు విధంబులనున్న పలు రత్నముల నొప్పు ఆభరణంబులు అలరుచుండె పీతాంబరమ్ములన్ పేర్మిధరించగ ఆడంబరము పెంచె ఆమె సొగసు ముత్యాల హారాలు ముందువ్రేలాడంగ వక్షోజముల్ కాంతి బడసి మెరిసె అగరు, కుంకుమపూల అమరిన గంధాలు దేహశోభను పెంచె దివ్యముగను.
తా॥ రకరకంబులైన రత్న ఆభరణంబులతో శోభించునది, ప్రీతితో ధరించగా బంగారు వస్త్రము దేవి నీ అందమును, ఆడంబరమును పెంచుచున్నది. నీ వక్షోజములుపై తాకు ముత్యాల హారముల కాంతితో మెరయు చున్నవి. అగరు, కుంకుమ పువ్వువంటి సుగంధ ద్రవ్యములు నీ శరీర సొగసును పెంచుచున్నవి. కాశీపట్టణాధీశ్వరివైన ఓ అన్నపూర్ణమ్మ మాకు జ్ఞాన భిక్షను ప్రసాదించుము. అండవై నీవే మమ్ము కాపాడుము. నీదయను మాకు పట్టుగొమ్మగా అందించుము.
శ్లో॥ 3
యోగానందకరీ రిపుక్షయకరీ ధర్మైకనిష్ఠాకరీ
చంద్రార్కానలభాసమానలహరీ త్రైలోక్యరక్షాకరీ |
సర్వైశ్వర్యకరీ తపః ఫలకరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ || 3||
సీ॥ యోగ ఆనందమ్ము ఒసగి గాతువు దేవి! శత్రునంతము జేయు జనని నీవు ధర్మంబున, తదైకతనరు నిష్ఠను నిల్పి తపఫలంబిచ్చెడి, తల్లివీవు సూర్యచంద్రులు, అగ్ని, జొప్పించుకాంతితో శోభింతువోయమ్మ! శుభప్రదాయి సర్వఐశ్వర్యముల్ చక్కగా గల్పించి త్రైలోక్య రక్షను దేవి యిచ్చు.
తా॥ ఓ జననీ! నీవు యోగముచే కలుగు ఆనందము గల్పించి, రక్షింతువు. శత్రు నిర్మూలనమును జేసి కాపాడెదవు. ధర్మమునందు తదైక నిష్ఠను నిలిపి తపఃఫలమునొసగెదవు. శుభప్రదాయిని వైన వోతల్లీ! సూర్యచంద్రులు అగ్నివలన కలుగు కాంతినిచ్చెదవు. సర్వైశ్వర్యములు కల్పించెదవు. త్రిలోకములను కాపాడు దేవివి. కాశీపట్టణాధీశ్వరివైన ఓ అన్నపూర్ణా! మాకు జ్ఞాన భిక్ష ప్రసాదించి మమ్ము రక్షించుము.
శ్లో॥ 4
కైలాసాచలకందరాలయకరీ గౌరీ హ్యుమాశాంకరీ
కౌమారీ నిగమార్థగోచరకరీ హ్యోంకారబీజాక్షరీ |
మోక్షద్వారకవాటపాటనకరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ || 4 ||
సీ॥ కైలాస పర్వత కందరంబది నీదు నిలయంబుగా గొన్న నీవె రక్ష గౌరీ, ఉమాదేవి, కౌమారి, శాంభవీ వేదార్ధగోచరంబొదవజేయి ఓంకారమే నీకు ఒప్పె బీజాక్షరం బుగను ఓ శర్వాణి! ఉన్నతముగ మోక్షద్వారము యొక్క ముందు కవాటముల్ తెరిపింతువోయమ్మ! దేవి! కృపతో.
తా॥ కైలాస పర్వతగుహలో నివసించు ఓ పార్వతీదేవీ నీవె మాకు రక్ష. ఓ గౌరీ, ఉమా, కౌమారీ శాంభవీ మాకు వేదార్ధము తెలియునట్లు జేయుము. ఓ శర్వాణీనీకు ఓంకారమే బీజాక్షరముగా ఒప్పి యున్నది. నీవు మోక్షద్వారకవాటములు తెరిపించగల దేవివి. కాశీ పట్టణాధీశ్వరివైన ఓ అన్నపూర్ణమ్మా! మాకు జ్ఞాన భిక్షను ప్రసాదించుము. అండవై నీవు మమ్ము కాపాడుము. పట్టుగొమ్మవై నీదయ అందించుము.
శ్లో॥ 5
దృశ్యాదృశ్యవిభూతివాహనకరీ బ్రహ్మాండభాండోదరీ
లీలానాటకసూత్రఖేలనకరీ విజ్ఞానదీపాంకురీ |
శ్రీవిశ్వేశమనః ప్రసాదనకరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ || 5 ||
సీ॥ ప్రత్యక్ష సిరులు అప్రత్యక్షమోక్షమ్ము పావనంబుగ నిచ్చు పార్వతీవు బ్రహ్మాండ భాండమ్ము పరగనీఉదరాన మాయ నాటకము ఓ మాత! జరుగు విజ్ఞాన దీపంబు వెలిగించునది నీవె మాతరో! తెలియునా మాయమాకు కాశివిశ్వేశుకు కడుప్రీతి కలిగించు అర్ధాంగివీవమ్మ అమ్మలమ్మ!
తా॥ ప్రత్యక్షముగా ఐశ్వర్యమును, పరోక్షముగా మోక్షమును అందించునట్టి పావనీ ఓ పార్వతీ! నీ ఉదరమున బ్రహ్మాండ భాండము నెలకొనియుండగా ఈ జగత్తును మాయా నాటకము ఆడించు చున్నావు. ఓ తల్లీ విజ్ఞాన దీపం వెలిగించునది నీవే. నీమాయ తెలియ సాధ్యమా. కాశీవిశ్వేశ్వరునకు ప్రియసతివి. కాశీపట్టణాధీశ్వరియైన ఓ అన్నపూర్ణమ్మా! మాకు జ్ఞాన భిక్ష ప్రసాదించుము. అండవై నీవు మమ్ము కాపాడుము. పట్టుగొమ్మవై నీదయ అందించుము.
శ్లో॥ 6
ఆదిక్షాంత సమస్తవర్ణనకరీ శంభుప్రియా శాంకరీ
కాశ్మీర త్రిపురేశ్వరీ త్రినయనీ విశ్వేశ్వరీ శర్వరీ |
స్వర్గద్వార కవాటపాటనకరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ ||6 ||
సీ॥ ‘అ’ యనెడి వర్ణంబునాదిగా ‘క్ష’ తొఅంత మయ్యెడి వర్ణంబులందుగలవు శంభుని ప్రియసతీ శాంకరీ ఓయమ్మ! త్రినయనీ దీనుల దిక్కునీవే కాశ్మీరమందున గల త్రిపురేశ్వరీ! శ్రీధరీ! నీవె విశ్వేశ్వరియును స్వర్గద్వారంబుల పలుకవాటంబులన్ దెరిపించుతల్లివి దేవి నీవు.
తా॥ ఓతల్లీ! ‘అ’ నుండి ‘క్ష’ వరకు గల అన్ని అక్షరంబులలో నీవున్నావు. ఈశ్వరుని అర్ధాంగివైన నీవు శాంభవివి, త్రినయనివి, దీనులకు దిక్కువు నీవె. కాశ్మీరమునగల త్రిపురేశ్వరీ శ్రీధరీ నీవే విశ్వేశ్వరివి. స్వర్గద్వార కవాటము తెరిపించెడి దేవతవి.
Annapurna Stotram Lyrics
శ్లో॥ 7
ఉర్వీ సర్వజనేశ్వరీ జయకరీ మాతా కృపాసాగరీ
నారీ నీల సమాన కుంతలధరీ నిత్యాన్నదానేశ్వరీ |
సాక్షాన్మోక్షకరీ సదా శుభకరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ || 7||
సీ॥ సర్వలోకంబుల జయమొసంగెడి తల్లి! సర్వజయేశ్వరి! జయము నీకు ఓదయాసంద్రమా! ఓసదాశుభకరీ! నారీ జనాప్రియ! హరుని రాణి! నీలివర్ణంబుతో నీకు శోభనొసంగు కురుల నొప్పెడి తల్లి కొలుతునమ్మ నిత్యాన్నదానమన్ నియమంపుటీశ్వరి! సాక్షాత్తు నీవల్ల మోక్షమగును.
తా॥ సమస్త లోకాలకు జయమొసగెడి ఓ తల్లీ సర్వజయేశ్వరీ నీకు మంగళమగు గాక. ఓదయాసాగరమా సదా శుభమొసంగు సదా శివుని రాణీ! స్త్రీజనప్రియా! నీలి కురులు నీ సౌందర్యమును ఇనుమడింపజేయు చున్నవి. నిత్యాన్నదానవ్రత పరాయణీ సాక్షాత్తు మోక్షప్రదాయనివి. కాశీపట్టణాధీశ్వరివైన ఓ అన్నపూర్ణమ్మా మాకు జ్ఞానభిక్ష ప్రసాదించుము అండవై నీవు మమ్ము కాపాడుము. పట్టుగొమ్మవై నీదయ మాకు అందించుము.
శ్లో॥ 8
దేవీ సర్వవిచిత్రరత్నరచితా దాక్షాయణీ సుందరీ
వామా స్వాదుపయోధరా ప్రియకరీ సౌభాగ్యమాహేశ్వరీ |
భక్తాభీష్టకరీ సదా శుభకరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ || 8 ||
సీ॥ బంగారు గరిటెను బట్టి హస్తంబున అన్నంబు బెట్టెడి అమ్మనీవు మేలు సువర్ణ రత్నాల హారాల, వా మాదేవి! మ్రొక్కెద పాదములను దక్షయజ్ఞమునందు దీక్షాపరీ దేవి! సుందర స్తనయుగ సుందరీవు భక్తాళికోరెడి వరప్రదాయిని మాకు అభయ ప్రదాతవౌ అమ్మ వీవు.
తా॥ నీవు చేతిలో బంగారు గరిటను ధరించి, అన్నము పెట్టెడి అమ్మవి. మేలైన సువర్ణరత్న హారాలను ధరించిన ఓ వామాదేవీ! నీకు మ్రొక్కెదను. దక్షయజ్ఞమున దహింపబడిన ఓ తల్లీ సుందర స్తనయుగ సుందరివి. ఎనలేని భక్తుల కోర్కెలు దీర్చెడి అమ్మా! నీవు అభయ ప్రదాయనివి, ఓ కాశీ పట్టణాధీశ్వరీ మమ్ము కాపాడుము. ఓ తల్లీ అన్నపూర్ణా మాకు జ్ఞాన భిక్షనిమ్ము. దయగొని మాకు చేగర్రవలె సహాయమందించుము. మా అండవై యుండి కాపాడుము తల్లీ.
శ్లో॥ 9
చంద్రార్కానల కోటికోటి సదృశీ చంద్రాంశుబింబాధరీ
చంద్రార్కాగ్ని సమాన కుండలధరీ చంద్రార్కవర్ణేశ్వరీ |
మాలాపుస్తక పాశసాంకుశధరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ || 9 ||
సీ॥ కోటి చంద్రాగ్నులు కోటి సూర్యులతోటి సమమైన తేజంబు జనని కుండె చంద్ర సూర్యాగ్నుల సమకుండలములతో బాల సూర్యుని వంటి వన్నెతల్లి అర్క చంద్రులు బోలు అధరంబులున్ గల దేవి ఈ ఈశ్వరి దివ్యచరిత పొత్తంబు, జపమాలబూని పాశంబును, అంకుశంబును దాల్చు అమ్మ ఈమె.
తా॥ ఆ తల్లికి కోటి సూర్య అగ్ని చంద్రుల కాంతి కలిగి యున్నది. చంద్రసూర్యఅగ్ని తేజమునకు ధీటైన కుండలములు ఈ తల్లి కర్ణాభరణములు. ఆ జనని శరీరపువన్నె బాల సూర్యునివంటిది. చంద్రసూర్య సమశోభగల అధరములు ఈ తల్లికి గలవు. ఓ అమ్మా! ఒకచేత పుస్తకము, ఒకచేత జపమాల, ఒకచేత పాశము, ఒకచేత అంకుశము ధరించి యుందువు. కాశీపట్టణాధీశ్వరివైన ఓ అన్నపూర్ణమ్మా! మాకు జ్ఞానభిక్ష ప్రసాదించుము అండవై నీవు మమ్ము కాపాడుము. పట్టుగొమ్మవై నీదయ మాకు అందించుము.
శ్లో॥ 10
క్షత్రత్రాణకరీ మహాభయహరీ మాతా కృపాసాగరీ
సర్వానందకరీ సదా శివకరీ విశ్వేశ్వరీ శ్రీధరీ |
దక్షాక్రందకరీ నిరామయకరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ || 10 ||
శ్లో॥ 11
అన్నపూర్ణే సదాపూర్ణే శంకరప్రాణవల్లభే |
జ్ఞానవైరాగ్యసిద్ధ్యర్థం భిక్షాం దేహి చ పార్వతి || 11 ||
కం॥ సంపూర్ణంబుగనన్నము నింపుగలోకాలకిమ్ము ఈశ్వరురాణీ! ఇంపుగ వైరాగ్యము సిద్ధింపగ జ్ఞానంపు భిక్షదేవీ! గిరిజా!
తా॥ ఓ పార్వతీ దేవీ! లోకాల కన్నింటికి చక్కగ అన్నము ప్రసాదించు ఓ ఈశ్వరురాణీ! మాకు రాగబంధము నసించునట్లు అనుగ్రహించి జ్ఞాన భిక్ష నొసంగుము.
శ్లో॥ 12
మాతా చ పార్వతీ దేవీ పితా దేవో మహేశ్వరః |
బాంధవాః శివభక్తాశ్చ స్వదేశో భువనత్రయమ్ || 12 ||
కం॥ జననియె పార్వతి యౌనట జనకుండే హరుడు నిజము, జగతిని బంధుల్ గొనకొని శివభక్తాళియె తనదేశమునైన భువనత్రయముననైననున్.
తా॥ ఈ మనదేశంలోనైనా ముల్లోకాలలో ఎక్కడైన ఆ పార్వతీదేవియే తల్లి, శంకరుడే తండ్రి శివభక్తులందరూ బంధువులే.