Sri Ramadasu Keerthanalu 21-30 In Telugu – శ్రీ రామదాసు కీర్తనలు

Sri Ramadasu Keerthanalu 21-30 In Telugu – శ్రీ రామదాసు కీర్తనలు

ఈ పోస్ట్ లో శ్రీ రామదాసు గారి కీర్తనలు వేదములో అనేక సంగీత పారంపర్యాలు ఉన్నాయి.

21. అసావేరి చాపుతాళం

పల్లవి : రామచంద్రులు నాపైచలము చేసినారు సీతమ్మ చెప్పవమ్మ
కటకటవినడేమి సేయుదు కఠినచిత్తుని మనసు కరుగదు
కర్మములు నెటులుండునోగద ధర్మమే నీకుండునమ్మ

||రామచంద్రుడు||

దినదినము మీచుట్టు దీనతతో దిరుగ దిక్కెవ్వరిక నోయమ్మ
దీనపోషకుడనుచు వేడితి దిక్కులన్నియు ప్రకటమాయెను
ఒక్కమాటైనను వినడు ఎక్కువేమని తలతునమ్మ

॥ రామచంద్రుడు||

కౌసల్యతనయుడు కపటము చేసినాడు కారణమిటుండెను
కన్నడచేసెదవా నీ కన్నుల వైభవంబు విన్నవింపగదమ్మ
నీ కన్న దిక్కెవ్వరోయమ్మ

||రామచంద్రుడు||

దశరథాత్మజుడెంతో దయాశాలియనుకొంటి ధర్మహీనుడేయమ్మ
దాసజనులకు దాతయతడట వాసిగ భద్రగిరీశుడట రామదాసుని
ఏలరాడట రవికులాంబుధి సోముడితడట

॥రామచంద్రుడు||

22. బిళహరి చాపుతాళం

పల్లవి : రావయ్యా భద్రాచలరామ శ్రీరామ
రార రమణీయ జగదభిరామ లలామా
కేవలభక్తి విలసిలు భావముదెలిసి దేవుడవైతే

॥రావయ్యా||

ప్రొద్దు ప్రొద్దున నిన్ను పొగడుచు నెల్లిపుడు
ప్రొద్దు మీరగాను భజన చేసెదను
గద్దరితనమున ప్రొద్దులు పుచ్చుము
ముద్దులు గులుకుచు మునుపటివలె నిటు

||రావయ్యా||

నన్ను గన్న తండ్రి నా మదిలోన
నీకన్న నితరముల గొలిచెదనా
శ్రీకరదివ్య ప్రభాకర కులరత్నా
శరత్పూర్ణ సుధాకర తేజా

॥రావయ్యా॥

అంజలి జేసెద నరమరలేక
అమిత కటాక్షము నాపైని పూని
ముజ్జగములకు ముదమిడు పదముల
గజ్జెలు గలగల ఘల్లుఘల్లు మన

॥రావయ్యా॥

దోషము నెంచని దొరవని నీకు
దోసిలియొగ్గితి తొలుత పరాకు
దాసుని తప్పులు దండముతో తీరె
మోసము గలిగిన దాసపోషకుడవై

॥రావయ్యా॥

23. నాదనామక్రియ ఆదితాళం

పల్లవి : వినరయ్య తానీషాగారు మా మనవి చేకొనరయ్య మహారాజ మీరు

||వినరయ్య||

దినదినమును వారియింట విప్రవరుల సంతర్పణం
విందులవంట చేసేది సర్కారులంట
ఋజువు చేస్తాము సర్కారులను బంపువెంట

||వినరయ్య||

దండికాపులు బలిసిరందుచేసి చేసెడు తంటాలు నేమనుకొందు
ఆరులక్షల పైకమందునిలచి సర్కారునకు రాకపోయెనందు

॥వినరయ్య॥

బొక్కసములు పాడాయె దేవాలయములు బహుచక్కనాయె
తక్తాధికారులు మీరు తహసీలు చేసెడి గోపన్నగారు

॥వినరయ్య||

చాలతంటాలు జేసినారు తానీషాపైకమంత కొల్లగొట్టుచున్నారు
రామచంద్రుని నమ్మినారు శ్రీ భద్రాద్రిపురమందు దాగియున్నారు

||వినరయ్య||

జాగుసేయక యిక మీరె వారిని రప్పింప దెలియనతని కార్బారు

||వినరయ్య||

24. గౌళీపంతు ఆదితాళం

పల్లవి : శ్రీరామ నీ నామమెంత రుచిరా
ఓరామా నీ నామ మేమి రుచిరా
కరిరాజా ప్రహ్లాద ధరణి విభీషణుల
గాచిన నీనామ మేమి రుచిరా

||శ్రీరామ||

గోవిందు నేవేళ గొలుతాం గొలుతాం
దేవుని గుణములు దలుతాం దలుతాం

||శ్రీరామ||

విష్ణుకథలు చెవుల విందాం విందాం
వేరే కథలు చెవుల మందాం మందాం

||శ్రీరామ||

రామదాసులు మాకు సారాం సారాం
కామదాసులు మాకు దూరం దూరం

||శ్రీరామ||

నారాయణుని మేము నమ్మేం నమ్మేం
నరులనింక మేము నమ్మాం నమ్మాం

||శ్రీరామ||

మాధవ నామము మరువాం మరువాం
మరి యమబాధకు వెరువాం వెరువాం

||శ్రీరామ||

అవనిజపతి సేవ మానాం మానాం
మరియొకజోలంటే మౌనాం మౌనాం
భద్రగిరీశుని కందాం కందాం
భద్రముతో మన ముందాం ముందాం

||శ్రీరామ||

25. సావేరి ఆదితాళం

పల్లవి : సీతారామస్వామీ నేజేసిన నేరమేమి
ఖ్యాతిగ నీపదకంజ యుగళమునే
ప్రీతిగ దలపగ భేదమెంచితినా

॥సీతా॥

రంగుగ నాపదివేళ్ళకు రత్నపుటుంగరములు నిన్నడిగితినా
సరిగ బంగారు శాలువ పాగాలుంగీల్ నడికట్లడిగితినా
చెంగట భూసురపుంగవు లెన్నగ చెవులకు చౌకట్లడిగితినా
మువ్వలు గొలుసులు ముత్యపుసరములు అంగనలకు నిన్నడిగితినా

॥సీతా॥

ప్రేమతో నవరత్నంబులు దాపిన హేమకిరీటంబడిగితినా
కోమలమగు మెడలో పుష్పదామములిమ్మని యడిగితినా
మోమాటము పడకుండగ నీదగు మురుగులు గొలుసుల నడిగితినా
కమలేక్షణ మిము సేవించుటకై ఘనముగ రమ్మని పిలిచితిగాని

||సీతా॥

తరచున నీ పదముల నమరిన సరిగజ్జెల నిను నేనడిగితినా
కరుణారస ముప్పొంగ గజతురగము లిమ్మని నేనడిగితినా
పరమాత్మ నీ బంగారుశాలువ పై గొప్పగ నేనడిగితినా
స్మరసుందరవర సంరక్షణ ధనమిమ్మని నిన్నడిగితినా

||సీతా॥

ప్రశస్త భద్రాధీశుడవని ప్రభుత్వమిమ్మని యడిగితినా
దశరథ సుతనీచేత ధరించిన దానకంకణం బడిగితినా
విశదముగా నీమేలిమి మొలనూల్ వేడుకతో నిన్నడిగితినా
ఏలుము భూమిని కుచ్చల నేలకు నెక్కువగా నిన్నడిగితినా

||సీతా॥

26. వరాళి రూపతాళం

పల్లవి : అడుగుదాటి కదలనియ్యను
నాకభయమియ్యక నిన్నువిడువను
గడియ గడియ తిరిగి తిరిగి యడిగితిని వేసరగ వచ్చెను
గడువు దప్పినను నిక బహుదుడుకుతనములు చేయుదునిను

||అడుగు||

కుదురుగ గూర్చుండనియ్యను నీకు కోపమొచ్చిన భయపడను
మరల నెరిగియునింక నీ మొగమాటమేమియు లేదుగద నా
హృదయకమలమునందు నీ మృదుపదములను బంధించి వేయుదు
రేపు మాపని జరిపితే నే నాపుపెసెడి వాడగాను
ప్రాపు నీవనినమ్మి గొలిచిన పావముల నెడబాపి దయతో
తేవతేవక నీదుమోమిటు చూపకుండిన నోర్వసుమ్మి

॥అడుగు||

పతితపావన బిరుదు లేదా నన్ను పరిపాలన చేయరాదా
ప్రతిదినంబును దేవనిను భూపతినటంచును వేడినను నీ
హితజనంబులు వచ్చి నన్ను వేడుకొనినను విడువ నిన్ను

||అడుగు||

రాక్షసాంతక సీతారమణాసారసాక్ష సద్గుణ భక్తాభరణ
యీక్షణంబున దీనజనుడని మోక్షమియ్యక యుంటివెనను
సాక్షిబెట్టియు నేడు నేనొక దీక్షచే సాధింతునిన్ను

॥అడుగు||

భూరిభద్రాచల నివాసరామ భుజగశయన భక్తపోషా
కూరిమిగ నినువిడిచిపెట్టిన ధరణిలో భద్రాద్రిరాఘవ
రామదాసుండనెడి నామము మారుపేరున బిలువు నన్ను

||అడుగు||

27. బేగడ ఆదితాళం

పల్లవి : అని యిట్లురామదాసు డనుకొనుచు సీతారాములకడ కేగెను
పనిబూనిభక్తవత్సల రామచంద్ర నా మనవి చేకొమ్మనెను

||అనియిట్లు||

వినవయ్య నీకు నేవిన్న వింతనొక్క ఘనకార్య మీవేళను
అనువొందనెల్ల రాజ్యము గొనియాడ పాపసముగ వేనోళ్ళను

||అనియిట్లు||

దానపోషణ బిరుదాంక సజ్జనులను గాసి నొందగ జేతురా
ఏసీమనైన దినేశవంశజలిట్లు మోసము చేయుదురా

||అనియిట్లు||

కరి మొరలిడనాడు త్వరగను నేగి మకరినుంచికరిగావవే
పరమపావన రామ చెరసాలనున్న భూసురునేలరక్షింతివో

||అనియిట్లు||

అతిపాపియైన యజామిశునేలి వతడేమి నీ చుట్టమా
పతితపావన రామ భద్రాద్రినిలయ నన్ పాలింపవిది దిట్టమా

||అనియిట్లు||

భద్రగిరీశుడ భక్తులపాలిట పారిజాతంబనుచు
భద్రాత్ముడై యున్న వాడు రామదాసు పాలించెదవనుచు

||అనియిట్లు||

28. ధన్యాసి చాపు తాళం

పల్లవి : అబ్బబ్బా రామ నామమది
సారము లేని సంసారసార మిదే రామనామం
పారద్రోలు మున్నూట ఇరువది భవరోగములన్ని
చేరి పంచేంద్రియములన్ని చేరక పారదోలు నామం
ఘోరమైన యమదూత కొట్టెడి నామం

||అబ్బబ్బా||

దినదినము జిహ్వకింపై దీయగనుండు నామం
ధనకనక వస్తువులు దయచేయు నామం
అసలు కొసలు నొక్క సమాభివృద్ధి చేయునామం
తనువును రెండనుచు తుదిని తారక నామం

||అబ్బబ్బా||

ముక్కంటిసతికి శాశ్వత కీర్తినిచ్చె రామనామం
ఎక్కువైన వాల్మీకి ఋషికి యెప్పుడనుష్ఠానం
ఒక్కసారి రామాయన్న ఓం భూస్వాహా పాపములన్ని
మ్రొక్కి రెండుమారులన్న మోక్షమునకు

||అబ్బబ్బా||

దగ్గర రాముడు మన్మథుడు దవ్వులనుండు
దుష్కర్మలు గొబ్బున మోహపాశముల తెగగోయు నామం
మబ్బుదూరి కొండవంటి మొయిలు ముట్టిన పాపములనే
మినుగురువలె గాల్చును రామనామం

||అబ్బబ్బా||

కామక్రోధలోభమోహ గర్వమడచు రామనామం
స్వామి భద్రాధీశుని నద్దతి నామం
నీమముతో బిలిచిన నితగ మోక్షపదవి నామం
రామదాసు నేలిన శ్రీరామ నామం

||అబ్బబ్బా||

29. వరాళి రూపకతాళం

పల్లవి : అయ్యయ్యూచెల్ల యీ జీవునకు సుఖమెయ్యెడలేదుగదా
రామయ్య జన్మాలు ఎన్నెన్నో గలవయ్య
చయ్యన రఘుకుల సార్వభౌమ చందాన బ్రోచేవో రామయ్య

వనజనాభుని మాయతెలియకనే వెట్టివగల బొందుచు నుంటిగా కొన్నాళ్ళు
మునుపుజేసిన పుణ్యపాప సంఘములచే మునిగితేలుచుంటిగా కొన్నాళ్ళు
యెనుబడినాలుగులక్ష యోనులందెల్ల వేసరక పుట్టితిని కొన్నాళ్ళు
అనయమున నరకమనుభవించి స్వర్గమంతట జొచ్చితిగ ఓరామ

||అయ్యయ్యో||

ఆలంబనము లేక నాకాశమందున నలసటనొందితిరా కొన్నాళ్ళు
మేలు తెలియగ మిన్నులోపల జిక్కుమినుగక నుంటిగద కొన్నాళ్ళు
ఈలాగుతావచ్చి మేఘమధ్యమునందు నిడుమలపడుచుంటిగా కొన్నాళ్ళు
జాలినొంది సూర్యకిరణములలో జొచ్చి చలనము నొందితిగ కొన్నాళ్ళు

||అయ్యయ్యో ॥

ఓ రామయ్య వర్షములో జిక్కి వసుమతిమీదనే వర్తించు చుంటిగద కొన్నాళ్ళు
వరుసశేషసస్యగతమైన ధాన్యమును వదలి వర్తించితిగదకొన్నాళ్ళు
వరశరుని తేజస్సువల్ల నారీతనువల్ల నోరీగర్భనరకమునబడి యుంటిగ ఓ రామ

||అయ్యయ్యో||

త్రిప్పుడు తిత్తిలోబడి దినము ప్రవర్తిల్లు చుంటిగద కొన్నాళ్ళు
అప్పుడు మాతల్లి యుప్పుపులుపు దిననంగలార్చుచుండ కొన్నాళ్ళు
ఎప్పుడు నిందుండి బదులు వెళుదునని ఎదురుచూచుచుంటిగ కొన్నాళ్ళు
చెప్పరానియట్టి ద్వారములోనుండి జననమునొందితి ఓరామ

||అయ్యయ్యో!|

పొరలుచు దురగాధపొత్తిలో నలిగిరనుచుచు పోనుంటిగద కొన్నాళ్ళు
పెరుగుచు బాల్యావస్థల దినముల పరుగులాడుచుంటి గదకొన్నాళ్ళు
తరుణంతోగూడి మదమత్సరముల కన్నెరుగనైతిగద కొన్నాళ్ళు
తరువాత దారాపుత్రాది మోహములదవిలి వర్తించిగద ఓ రామా

||అయ్యయ్యో||

తలయుతెల్లనై దంతములూడి వణకుచు అడిబడుచుంటిగద కొన్నాళ్ళు
తలుపుదగ్గరచేరి బనిబిక్షుకులనైతి తగిలి దిట్టుచునుంటిగద కొన్నాళ్ళు
పిలిచినదాని పెండ్లాము బిడ్డలచేత నిడుమలబడుచుంటిగద కొన్నాళ్ళు
బలముదీరి కండ్లు పొరలుగప్పి పరుల బ్రతిమాలు చుంటిగద ఓ రామా

||అయ్యయ్యో||

ఆచట మృతినొందియలయుచు యమునిచే నానాబాధ లొంగద కొన్నాళ్ళు
వింతగా నీరీతిపుట్టుచుగిట్టుచు బాధలుపడుచుంటిగద కొన్నాళ్ళు
కంజనయన భద్రాచలపతివగు నిన్ను గనరకతిరిగితిని గదకొన్నాళ్ళు
వింతగనే రామదాసుడనైతి నికనెట్లు బ్రోచెదవో ఓ రామా

||అయ్యయ్యో||

30. అసావేరి ఆదితాళం

పల్లవి : అయ్యయ్యో నే నేరనైతిని
అదినారాయణడని దెలియనైతిని
వెయ్యారుజన్మాల వెతలజెందితిగాని
చయ్యన సద్గతి సాధింపలేనైతిని

॥అయ్యయ్యో॥

మోసమే మదితలచి యుందు
ఆశపాశముల తగిలి నే యుందు
ఆశాపాశములన నరసి బ్రోచి ముందు
వాసిగ వైరాగ్య వాసన గననైతి

|॥అయ్యయ్యో॥

మూడు మేలని నమ్మి యుంటి
నిరుమూఢ శత్రులగూడి యుంటి
మూటి రెంటి మార్చి మూటికెక్కువయైన
కూటస్థు పొడగని కూడలేనైతి

||అయ్యయ్యో||

బంధకములు ద్రుంచి నేను
భద్రగిరి రాఘవుతోను గలిసి నే
సదయుడయి నెలకొన్న శ్రీరామదాసుని
స్థిరముగ చేపట్టి పోషించుమననైతి

॥అయ్యయ్యో॥

మరిన్ని కీర్తనలు:

  1. అసావేరి రూపకతాళం
  2. నాదనామక్రియ ఆదితాళం
  3. కాంభోజి చాపుతాళం
  4. ఆనందభైరవి ఏకతాళం
  5. వరాళి రూపకతాళం
  6. కల్యాణి చాపుతాళం
  7. వరాళి రూపకతాళం
  8. ఆనందభైరవి చాపుతాళం
  9. వరాళి చాపుతాళం
  10. బిలహరి ఆదితాళం

Leave a Comment