మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు నీతికథలు గురించి తెలుసుకుందాం.
నీతికథలు
పెద్దలు చెప్పిన నీతికథలలో మనకు బాగా సుపరిచితమైన నీతికథ మీ అందరికోసం. అది ఎమిటంటే… దీపకుని గురుసేవ నీతికథ.
దీపకుని గురుసేవ
పూర్వం దీపకుడనే నైష్ఠిక బ్రహ్మచారి ఉండేవాడు. అతడొకనాడు శాస్త్రాలలో చెప్పబడిన ఈ సుక్తిని చదివినాడు “పతివ్రతకు భర్త పుత్రునికి తల్లిదండ్రులు శిష్యునకు గురువు దైవసమానులు. వీరిని మించిన దైవము లేదు. వీరి సేవను మించిన తీర్థాలు వ్రతాలు ఉపవాసాలు లేవు. తరించుటకు ఇదియే అతిసులభ మార్గము” అని చదివినాడు. వెంటనే గురువును అన్వేషించుటకు బయలుదేరినాడు. పవిత్ర గోదావరీ నదీ తీరమున వేదధర్య మహర్షి ఆశ్రమము ఉన్నదని ఆయన సకల వేద వేదాంగాలు తెలిసినవాడని ఉత్తమ గురువు అని ఎందఱో చెప్పగా విని ఆయనను ఆశ్రయించి సాష్టాంగ నమస్కారము చేసినాడు. వినయవంతుడైన దీపకుని శిష్యునిగా స్వీకరించినాడు వేదధర్యుడు. గురుసేవ ప్రభావం వలన తన చిత్తశుద్ధి ఏకాగ్రతల వలన అచిరకాలంలోనే దీపకుడు సకల శాస్త్రాలు నేర్చాడు. అనన్య గురుసేవా నిరతుడై ప్రకాశించాడు.
శిష్యుని విద్యాతేజస్సు చూసి వేదధర్యుడు ఒకనాడు “కుమారా! నేను పూర్వజన్మలలో చేసిన పాపాలకు ప్రాయశ్చిత్తము చేసుకున్నాను. కానీ రెండు భయంకరమైన పాపాల ఫలము ఇంకా అనుభవించాలి. చేసిన కర్మ చెడని పదార్థముకదా. నేను అతిపురాతనము సనాతనము పవిత్రము సాక్షాత్ విశ్వనాథుని ధామమైన కాశీ క్షేత్రములో ఆ పాపాలకు ప్రాయశ్చిత్తము చేయదలచినాను. పుణ్యక్షేత్రములో ఏ కార్యానికైనా ఫలితము రెండింతలు
కదా!
నేను ఆ పాపాలను ప్రాయశ్చిత్తార్థము ఆవాహన చేయగానే భయంకరమైన కుష్ఠురోగం వస్తుంది. శరీరమంతా చీము నెత్తురు కారుతుంటుంది. వికారరూపము అంధత్వము వస్తాయి. నాలో సహనం సాధుత్వం ఆది సద్గుణాలు నశిస్తాయి. కఠినాత్ముడనై ఇతరుల సేవలకై దీనముగా ఎదురు చూస్తుంటాను. అట్టి దుస్థితిలో నీవు నాకు సేవ చేయగలవా”? అని అడిగినాడు వేదధర్యుడు.
గురుసేవయే పరమభాగ్యమని త్రికరణశుద్ధిగా నమ్మిన దీపకుడు “గురూత్తమా! నేను మీ పాపాలను ఆవహింప చేసుకొని పాపఫలితాన్ని అనుభవిస్తాను. నాకా అవకాశాన్ని ప్రసాదించండి” అని అన్నాడు. “దీపకా! నీ వంశాన్నంతా దీపింపచేయగల వాడవు అలా అనక ఏమంటావు? కానీ ఎవరు చేసిన కర్మకు వారే బాధ్యులు కదా! పుణ్యమైనా పాపమైనా ఫలితమును అనుభవించక తప్పదు కదా! నా పాపాలను కడుక్కుంటే గాని ఈశ్వర సాన్నిధ్యాన్ని పొందలేను” అని వేదధర్యుడు చెప్పినాడు. గురు ఆజ్ఞ ప్రకారమే చేశాడు దీపకుడు. ఇద్దరు మణికర్ణికా ఘాట్ కు ఉత్తరంగా ఉన్న కమలేశ్వర మహాదేవ మందిరం వద్దకు చేరి అక్కడ బస ఏర్పాటు చేసుకున్నారు.
కశీ విశ్వనాథునికి అన్నపూర్ణాభవానికి పూజలు చేసి పాపాల ఆవాహన చేశాడు వేదధర్యుడు. గురువుగారు చెప్పినట్టే జరిగింది. గురువుగారి దుస్థితి చూసి ఎంతో బాధపడ్డాడు దీపకుడు. చీము నెత్తురు తుడిచి కట్టు కట్టి మలమూత్రాదులను కడిగి అతని శుభ్రపఱచే వాడు దీపకుడు! ప్రతిపూట దీపకుడు తెచ్చిన భిక్షను తానే తినేసి “ఇంత కొంచెం తెచ్చావెందుకు” అని నిష్ఠూరాలాడేవాడు వేదధర్యుడు. అతడెంత కోపించినా గద్దించినా ధర్మనిష్ఠతో నిరంతర గురుసేవ చేసినాడు ఆనందపరశుడై దీపకుడు.
అంబికానాథుడు దీపకుని అసమాన గురుభక్తి మెచ్చి “వత్సా! అనన్య గురుసేవా దీక్షను మెచ్చినాను. ఏమి వరము కావాలో కోరుకో” అని అన్నాడు. గుణనిధి అయిన దీపకుడు “స్వామి! నాకు ఈ లోకములో గురుసేవ తప్ప ఏదీ తెలియదు. వారి అభీష్టమేమో కనుక్కొని చెప్తాను” అని అన్నాడు దీపకుడు. గురువుగారికీ విషయం చెప్పి “గురుదేవా! మీకు స్వస్థత కోరుతాను” అని అన్నాడు. వేదధర్యుడు “నాయనా! ఎవరు చేసిన పాపాలకు ఫలితం వారు అనుభవిస్తేనే పోతాయి” అని చెప్పాడు.
మరునాడు విశ్వనాథుని ఆలయానికి వెళ్ళి ఏ వరమూ కోరలేదు దీపకుడు. భగవంతుడు ఆ దీపకుని చూసి మురిసిపోయి జగజ్జనని అయిన పార్వతీదేవితో అతని విషయం చెప్పి సంబరపడిపోయాడు. తరువాత నిర్వాణ మండపములో ఉన్న శ్రీమన్నారాయణునికి సమస్త దేవతలకు దీపకుని సంగతి చెప్పి పొగిడినాడు. మహావిష్ణువు “పరమశివుని మెప్పించిన నీ గురుభక్తి అసామాన్యము. నీ మనోభీష్టమును కోరుకో” అని అన్నాడు. అందఱికీ సాష్టాంగ వందనము చేసి ఆనందాశ్రువులతో “స్వామీ! నాకు అచంచలమైన గురుభక్తిని ప్రసాదించు” అని అడిగినాడు. “తథాస్తు” అని దీవించి దీపకుని కృతార్థుని చేసినాడు మహావిష్ణువు.
ఈ కథలోనితి మరొక్కమాణు మీ అందరికోసం:
- గురువును సేవిస్తే సకల దేవతలనూ సేవించిన ఫలితం వస్తుంది. దీపకుడు తన గురునేవానిరతితో త్రిమూర్తుల సమస్త దేవతల అనుగ్రహాన్ని పొందినాడు.
- కర్మ పాశం తెగనిది. పాపకర్మలకు ప్రాయశ్చిత్తము ఎంత ఘోరముగా ఉన్నదో మనము ఈ కథలో చూచినాము. కావున పాపకర్మలెన్నడు చేయరాదు.
మరిన్ని నీతికథలు మీకోసం: