మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు నీతికథలు గురించి తెలుసుకుందాం.
నీతికథలు
పెద్దలు చెప్పిన నీతికథలలో మనకు బాగా సుపరిచితమైన నీతికథ మీ అందరికోసం. అది ఎమిటంటే… రామయ్య ఎడ్లు నీతికథ.
రామయ్య ఎడ్లు
రామయ్య ఒక సాధారణ రైతు. దైవికముగా తనకి ఉన్నంతలో సంతృప్తిగా ఉండేవాడు. అతని వద్ద మంచి నాగౌరు గిట్టులుండేవి. వాటిని తన కన్నబిడ్డలవలె కంటికి తెప్పలాగా చూసుకునేవాడు. ప్రత్యక్షంగా పరోక్షంగా మానవ జీవనానికి సహాయపడే పశుసంపదను పూజించడం భారతీయుల కృతజ్ఞతా వైభవానికి తార్కాణం. ఆ భారతీయ తత్త్వానుసారముగా రామయ్య తన ఎడ్లను పూజించేవాడు. నాగౌరు గిట్టలు అవడంచేత రామయ్య ఎడ్లలో సత్తా బాగా ఉండేది. అవి ఉత్తమ జాతి అశ్వాలకన్నా వేగముగా పఱుగెత్తగలిగేవి! వాటి వేగము చూసి పుత్రోత్సాహ భావముతో రామయ్య ముఱిసిపోయేవాడు.
ఇలా ఉండగా ఒక రోజు రామయ్య వృషభాలను కొందఱు దొంగలు అపహరించారు. తన ఎద్దులు లేవని తెలుసుకొన్న రామయ్య దుఃఖాని కి అంతులేదు. పాపం! సొంత కొడుకు దూరమైనట్లు బాధపడ్డాడు. “రామా! నేనేమి పాపంచేశానయ్యా? ఎందుకింత పెద్ద శిక్ష? నా ఏడ్లు లేకుండా నేనెట్లా బ్రతికేది? ఆ దొంగలు నా ధనం తీసుకుని నా ఎడ్లను వదిలిపెట్టుంటే బాగుండేది. పశుసంపద లేని ఇంట్లో లక్ష్మీదేవి ఉంటుందా? (ఉండదు)”
ఇలా పరిపరి విధాల వగచి రామయ్య రక్షకభటులతో దొంగలు తన ఎడ్లను ఎత్తుకుపోయిన విషయం చెప్పాడు. తనుకూడా వారితో కలిసి దొంగలను వెదుక సాగాడు. చివరికి రామయ్య పాలిటి దేవతలైన వృషభాలను ఆ దొంగలు ఒక బండికి కట్టి పాఱిపోవడం రామయ్య రక్షకభటులు చూశారు. రామయ్య కళ్ళు సూర్యుని చూసిన పద్మాల్లాగా విచ్చుకున్నాయి. ఆనందంతో కళ్ళు చెమ్మగిల్లాయి. ఇంతలో ఆ రక్షకభటులు రామయ్య ఓ బండి ఎక్కి దొంగల వెనకాల పడ్డారు. దొంగల ఎడ్లబండిని త్వరగా అందుకుంటున్నారు రామయ్య రక్షకభటులు.
ఇంతలో రామయ్య వాయువేగంతో వెళ్ళే తన నాగౌరుగిట్టలను వాళ్ళు వెళ్ళే గుఱ్ఱబ్బండి అందుకోవడమేవిటి? అని అనుకున్నాడు. తన ఎడ్లు ఆ గుఱ్ఱాలతో ఓడిపోవటం ఇష్టంలేక పొయిన రామయ్య “ఆ ముక్కుత్రాటిని రెండు సార్లు లాగండిరా”! అని ఆ దొంగలకు ఎడ్లు పూర్తి వేగముతో వెళ్ళే కిటుకు చెప్పాడు. దొంగలు ఆ కిటుకు తెలుసుకుని తీవ్రవేగాన్ని అందుకున్నారు. కొద్ది సేపటిలోనే కను మఱుగైపోయారు. వచ్చిన ఒక్క అవకాశము పోయిందని విచారిస్తాడేమో అనుకున్న రక్షకభటులు రామయ్య ఆనందాన్ని చూసి ఆశ్చర్య పోయారు. ఆనందానికి కారణమేమిటని అడిగిన రక్షకభటులతో ఇలా అన్నాడు మహౌదార్యముగల రామయ్య
“అయ్యా! నా గిట్టలు ఎప్పుడూ పఱుగు పందెంలో ఓటమిని చవిచూడలేదు. వాటి పేరు ప్రతిష్ఠలే నాకు ముఖ్యం. నాకు దొఱికి అపజయం పొందడం కన్నా అవి విజేతలుగా నాకు దూరమైనా మేలు కదా! అవి నాకు దక్కాయనే స్వార్థబుద్ధి కన్నా అవి గెలిచాయనే విషయం నాకు ఎక్కువ సంతోషాన్ని ఇస్తుంది”. తోటి మనుషులనే కాకుండా పశుపక్షాదులను వృక్షములను ప్రేమభావంతో చూసే భారతీయతను రామయ్యలో నిండుగా చూసిన రక్షకభటులు రామయ్యకు నమస్కరించి వెళ్ళిపోయారు.
ఈ కథలోనితి మరొక్కమాణు మీ అందరికోసం:
పశుసంపదను ప్రేమించి పూజించే భారతీయ తత్త్వాన్ని మనకు గుర్తుచేసిన రామయ్య ధన్యజీవి. మనకు ఆచార్యతుల్యుడు.
మరిన్ని నీతికథలు మీకోసం: