మొట్ట మొదటిగా అందరికి నమస్కారం. ఈ శ్రావణమాసంలో వచ్చే రెండవ శుక్రవారం స్త్రీలకు అత్యంత విశిష్ట మైన రోజు. ఈ రోజు ఆచరించే వరలక్ష్మీ వ్రతం స్త్రీలకు ఐదవతనాన్ని, అష్టైశ్వర్యాలను కలగజేస్తుందని నమ్ముతారు. ముత్తయిదువులు శుక్రవారం తెల్లవారుజామునే లేచి శుచిగా స్నానం చేసి పూజామందిరాన్ని అలంకరించుకొని కలశం పెట్టి ఈ వ్రతం ఆచరిస్తారు. శ్రావణమాసంలో ఈవ్రతం ఆచరించడంవలన తమ కోరికలు నెరవేరతాయని స్త్రీలు నమ్ముతారు. ఇంతటి పరమ పవిత్రమైన శ్రావణ శుక్రవారం వరలక్ష్మీ వ్రత కథ మీకోసం…
వ్రత పూర్వ వృత్తాంతం
శ్రావణమాసంలో వచ్చే రెండవ శుక్రవారం చేసుకునే వ్రతాన్నే వరలక్ష్మీ వ్రతమని అంటారు. కైలాసంలో పార్వతీ పరమేశ్వరులు ఒకరోజు పాచికలాడారు.ఆ ఆటలో పార్వతి ఓడిపోయింది దానితో పార్వతీ పరమేశ్వరులు ఇద్దరూ వాదులాడుకున్నారు. ఈ వాదాన్ని పరిష్కరించమని పార్వతీ పరమేశ్వరులు చిత్రనేమిని కోరారు. ఇరువురి వాదనలూ విన్న చిత్రనేమి పరమేశ్వరుడు గెలిచాడని చెప్పాడు. దానితో పార్వతీదేవి ఆగ్రహించి చిత్రనేమికి కుష్టు రోగం ప్రాప్తించేటట్లు శపించింది… చిత్రనేమి పార్వతీదేవిని దీనంగా ప్రార్థించి శాప విమోచనం కలిగించమని అడిగాడు. వరలక్ష్మీ వ్రతమును శ్రావణ పూర్ణిమ నాటి శుక్రవారం చేసినట్టయితే నీ రోగం పోతుందని పార్వతీదేవి శాపవిమోచనం తెలియజేసింది. చిత్రనేమి ఆ విధంగా శుక్రవారం వ్రతమును ఆచరించి మేలు పొందాడు. ఈ వరలక్ష్మీ వ్రతమును పార్వతీదేవి కూడా ఆచరించగా కుమార స్వామి జన్మించాడు. నందుడు, విక్రమార్కుడు ఈ వ్రతమును చేసి రాజ్యాలను పొందారని చెబుతారు. ఇది స్థూలంగా వరలక్ష్మీ వ్రతం పూర్వ చరిత్ర.
శ్రీ వరలక్ష్మీ వ్రత కథా ప్రారంభం
శౌనకాది మహర్షులను ఉద్దేశించి సూత మహాముని ఇలా చెప్పారు మునులరా! స్త్రీలకు సౌభాగ్యదాయకమైన వ్రతమును ఒక దానిని పరమశివుడు పార్వతికి చెప్పాడు. లోకోపకారం కోరి ఆ వ్రతాన్ని గురించి మీకు తెలియజేస్తాను. శ్రద్ధగా వినండి. పరమేశ్వరుడు ఒకనాడు తన భస్మసింహాసనముపై కూర్చుని ఉండగా నారద మహర్షి, ఇంద్రాది దిక్పాలకులు స్తుతిస్తోత్రములతో పరమశివుడ్ని కీర్తిస్తున్నారు. ఆ మహత్తర ఆనంద సమయంలో పార్వతీదేవి పరమేశ్వరుడ్ని ఉద్దేశించి “నాథా! స్త్రీలు సర్వసౌఖ్యములు పొంది, పుత్ర పౌత్రాభివృద్ధిగా తరించుటకు తగిన వ్రతం ఒక దానిని చెప్పండి” అని అడిగింది. అందుకా త్రినేత్రుడు “దేవీ! నీవు కోరిన విధంగా స్త్రీలకు సకల శుభాలు కలిగించే వ్రతం ఒకటి ఉన్నది. అది వరలక్ష్మీ వ్రతం. దానిని శ్రావణ మాసంలో రెండవ శుక్రవారంనాడు ఆచరించాలి.” అని చెప్పాడు. అప్పుడు పార్వతీ దేవి “దేవా! ఈ వరలక్ష్మీ వ్రతాన్ని ఆదిదేవతలు ఎవరు చేశారు. ఈ వ్రతాన్ని ఎలా చేయాలో వివరంగా చెప్పండని కోరింది. “కాత్యాయనీ! పూర్వకాలంలో మగధ దేశంలో విష్ణుకుండినము అనే పట్టణం ఒకటి ఉండేది. ఆ పట్టణం బంగారు కుడ్యములతో రమణీయంగా ఉండేది. ఆపట్టణంలో చారుమతి అనే ఒక బ్రహ్మణ స్త్రీ ఉండేది. అమె సుగుణవతి, వినయ విధేయతలు, భక్తి గౌరవాలు గల యోగ్యురాలు. ప్రతిరోజూ ప్రాత: కాలాన నిద్రలేచి భర్త పాదాలకు నమస్కరించుకుని ప్రాత:కాల గృహకృత్యాలు పూర్తి చేసుకుని అత్తమామలను సేవించుకుని మితంగా సంభాషిస్తూ జీవిస్తూ ఉండేది.
వరలక్ష్మీ సాక్షాత్కారం
వరలక్ష్మీ వ్రతానికి ఆదిదేవతయైన వరలక్ష్మీదేవి ఒకనాటి రాత్రిసమయంలో చారుమతికి కలలో సాక్షాత్కారించింది. “ఓ చారుమతీ.. ఈ శ్రావణ పౌర్ణమి నాటికి ముందువచ్చే శుక్రవారం నాడు నన్ను పూజించు. నీవు కోరిన వరాలు, కానుకలు ఇస్తానని” చెప్పి అంతర్థానమైంది. చారుమతి చాలా సంతోషించింది. “హే జననీ! నీ కృపాకటాక్షములు కలిగిన వారు ధన్యులు. వారు సంపన్నులుగా విద్వాంసులుగా మన్నలను పొందుతారు. ఓ పావనీ! నా పూర్వజన్మ సుకృతం వల్ల నీ దర్శనం నాకు కలిగింది.” అని పరిపరివిధాల వరలక్ష్మీ దేవిని స్తుతించింది. అంతలోనే చారుమతి మేల్కొని, అదంతా కలగా గుర్తించి తన కలను భర్తకు, అత్తమామలకు తెలియచెప్పింది. వారు చాలా సంతోషించి, చారుమతిని వరలక్ష్మీ వ్రతమును చేసుకోవలసిందని చెప్పారు. ఊరిలోని వనితలు చారుమతి కలను గురించి విన్నవారై పౌర్ణమి ముందు రాబోయే శ్రావణ శుక్రవారం రోజున పట్టణంలోని స్త్రీలందరూ ఉదయాన్నే లేచి తలారా స్నానం చేసి పట్టు వస్త్రాలు ధరించి చారుమతి గృహనికి చేరుకున్నారు. చారుమతి తన గృహంలో మండపం ఏర్పరచి ఆ మండపం పై బియ్యంపోసి పంచపల్లవాలైన రావి, జువ్వి, మర్రి, మామిడి, ఉత్తరేణి మొదలైన ఆకులతో కలశం ఏర్పాటు చేసి వరలక్ష్మీదేవిని సంకల్పవిధులతో “సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే దేవీ నారాయణి నమోస్తుతే” అంటూ ఆహ్వానించి ప్రతిష్టించుకన్నారు. (శక్తి కొలదీ బంగారు, వెండి, రాగి, మట్టి మూర్తులను ప్రతిష్టించుకోవచ్చు) అమ్మవారిని షోడశోపచారాలతో పూజించారు. భక్ష్య, భోజ్యాలను నివేదించారు. తొమ్మిది పోగుల తోరమును చేతికి కట్టుకున్నారు. ప్రదక్షిణ నమస్కారాలు చేశారు.
ఉత్తమమైన ఈ వ్రతమును బ్రాహ్మణాది నాలుగు జాతుల వారును జేయవచ్చును. అట్లు చేసినచో సర్వసౌభాగ్యములును కలిగి సుఖముగానుందురు. ఈ కథను వినువారలకు, చదువువారలకు వరలక్ష్మీ వ్రత ప్రసాదము వలన సకల సుఖములు
కలుగును.
మరిన్ని వ్రతాలు: