మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. “అరణ్యకాండ” రామాయణంలోని అయిదు కాండల్లో మూడవది. ఇది రాముడు, సీత, లక్ష్మణులు దండకారణ్యంలో 14 ఏళ్ళ వనవాసం గడుపుతూ చేసిన అనుభవాలను వివరిస్తుంది. ప్రథమ సర్గలో, వారు అరణ్యంలో ప్రవేశించి, అటవీ జీవులను కలుస్తారు మరియు శరభంగ, సుతీక్ష్ణ మునులతో సమావేశమవుతారు.
|| మహర్షిసంఘః ||
ప్రవిశ్య తు మహారణ్యం దండకారణ్యమాత్మవాన్ |
దదర్శ రామో దుర్ధర్షస్తాపసాశ్రమమండలమ్ ||
1
కుశచీరపరిక్షిప్తం బ్రాహ్మ్యా లక్ష్మ్యా సమావృత్తమ్ |
యథా ప్రదీప్తం దుర్దర్శం గగనే సూర్యమండలమ్ ||
2
శరణ్యం సర్వభూతానాం సుసంమృష్టాజిరం తథా |
మృగైర్బహుభిరాకీర్ణం పక్షిసంఘైః సమావృతమ్ ||
3
పూజితం చోపనృత్తం చ నిత్యమప్సరసాం గణైః |
విశాలైరగ్నిశరణైః స్రుగ్భాండైరజినైః కుశైః ||
4
సమిద్భిస్తోయకలశైః ఫలమూలైశ్చ శోభితమ్ |
ఆరణ్యైశ్చ మహావృక్షైః పుణ్యైః స్వాదుఫలైర్వృతమ్ ||
5
బలిహోమార్చితం పుణ్యం బ్రహ్మఘోషనినాదితమ్ |
పుష్పైర్వన్యైః పరిక్షిప్తం పద్మిన్యా చ సపద్మయా ||
6
ఫలమూలాశనైర్దాంతైశ్చీరకృష్ణాజినాంబరైః |
సూర్యవైశ్వానరాభైశ్చ పురాణైర్మునిభిర్వృతమ్ ||
7
పుణ్యైశ్చ నియతాహారైః శోభితం పరమర్షిభిః |
తద్బ్రహ్మభవనప్రఖ్యం బ్రహ్మఘోషనినాదితమ్ ||
8
బ్రహ్మవిద్భిర్మహాభాగైర్బ్రాహ్మణైరుపశోభితమ్ |
స దృష్ట్వా రాఘవః శ్రీమాంస్తాపసాశ్రమమండలమ్ ||
9
అభ్యగచ్ఛన్మహాతేజా విజ్యం కృత్వా మహద్ధనుః |
దివ్యజ్ఞానోపపన్నాస్తే రామం దృష్ట్వా మహర్షయః ||
10
అభ్యగచ్ఛంస్తథా ప్రీతా వైదేహీం చ యశస్వినీమ్ |
తే తం సోమమివోద్యంతం దృష్ట్వా వై ధర్మచారిణః ||
11
లక్ష్మణం చైవ దృష్ట్వా తు వైదేహీం చ యశస్వినీమ్ |
మంగళాని ప్రయుంజానాః ప్రత్యగృహ్ణన్ దృఢవ్రతాః ||
12
రూపసంహననం లక్ష్మీం సౌకుమార్యం సువేషతామ్ |
దదృశుర్విస్మితాకారాః రామస్య వనవాసినః ||
13
వైదేహీం లక్ష్మణం రామం నేత్రైరనిమిషైరివ |
ఆశ్చర్యభూతాన్ దదృశుః సర్వే తే వనచారిణః ||
14
అత్రైనం హి మహాభాగాః సర్వభూతహితే రతమ్ |
అతిథిం పర్ణశాలాయాం రాఘవం సంన్యవేశయన్ ||
15
తతో రామస్య సత్కృత్య విధినా పావకోపమాః |
ఆజహ్రుస్తే మహాభాగాః సలిలం ధర్మచారిణః ||
16
మూలం పుష్పం ఫలం వన్యమాశ్రమం చ మహాత్మనః |
నివేదయిత్వా ధర్మజ్ఞాస్తతః ప్రాంజలయోఽబ్రువన్ ||
17
ధర్మపాలో జనస్యాస్య శరణ్యస్త్వం మహాయశాః |
పూజనీయశ్చ మాన్యశ్చ రాజా దండధరో గురుః ||
18
ఇంద్రస్యేహ చతుర్భాగః ప్రజా రక్షతి రాఘవ |
రాజా తస్మాద్వరాన్భోగాన్భుంక్తే లోకనమస్కృతః ||
19
తే వయం భవతా రక్ష్యా భవద్విషయవాసినః |
నగరస్థో వనస్థో వా త్వం నో రాజా జనేశ్వరః ||
20
న్యస్తదండా వయం రాజన్ జితక్రోధా జితేంద్రియాః |
రక్షితవ్యాస్త్వయా శశ్వద్గర్భభూతాస్తపోధనాః ||
21
ఏవముక్త్వా ఫలైర్మూలైః పుష్పైర్వన్యైశ్చ రాఘవమ్ |
అన్యైశ్చ వివిధాహారైః సలక్ష్మణమపూజయన్ ||
22
తథాన్యే తాపసాః సిద్ధా రామం వైశ్వానరోపమాః |
న్యాయవృత్తా యథాన్యాయం తర్పయామాసురీశ్వరమ్ ||
23
ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే అరణ్యకాండే ప్రథమః సర్గః ||
Aranya Kanda Sarga 1 Meaning In Telugu
రాముడు సీత, లక్ష్మణుడు వెంటరాగా దండకారణ్యములోనికి ప్రవేశించాడు. ఆ దండకారణ్యములో ఎంతో మంది మహా మునులు ఆశ్రమములు కట్టుకొని తపస్సు చేసుకుంటూ ఉండటం చూచాడు రాముడు. ఆ మునుల ఆశ్రమముల దగ్గర వన్య మృగములు పరస్పర వైరము, భయమూ లేకుండా స్వేచ్ఛగా సంచరిస్తున్నాయి. పక్షుల కిల కిలారావములతో, వన్యప్రాణుల విహారములతో ఆ వనసీమలో ఉన్న ముని ఆశ్రమములు ఎంతో శోభాయమానంగా ఉన్నాయి.
ఆ మునుల ఆశ్రమములు విశాలమైన అగ్ని గృహములతోనూ, యజ్ఞమునకు కావలసిన సంభారములతోనూ, వేలాడుతున్న జింక చర్మములతోనూ, దర్భలతోనూ, అగ్నికార్యమునకు కావలసిన సమిధలతోనూ, నీళ్లతో నిండి ఉన్న పాత్రలతోనూ, తినడానికి కావలసిన ఫలములతోనూ నిండి ఉన్నాయి. ఒక పక్కనుండి వేదమంత్రములు చదువుతున్న ధ్వనులు, మరొక పక్క నుండి పూజా కార్యక్రమముల మంత్ర ధ్వనులు వీనుల విందుగా వినపడుతున్నాయి. ఆ ఆశ్రమములలో కేవలము తపస్సుచేసుకొనే మునులు మాత్రమే నివసిస్తున్నారు. రామలక్ష్మణులకు ఆ ప్రాంతము బ్రహ్మలోకము వలె కనిపించింది.
రాముడు, సీత, లక్ష్మణుడు తమ ఆశ్రమముల వంక రావడం ఆ మునులు చూచారు. వారంతా రామ లక్ష్మణులకు ఎదురు వెళ్లి స్వాగతము పలికారు. వారికి అర్ఘ్యము పాద్యము సమర్పించారు. కొందరు మునులు రామ లక్ష్మణుల దేహధారుఢ్యము, అంగసౌష్టవము చూచి ఆశ్చర్యపోయారు. వారిని రెప్ప వెయ్యకుండా చూస్తున్నారు.
ఆ మునులందరూ రామ లక్ష్మణులకు, సీతకు ఒక పర్ణశాలను చూపించారు. వారు అందులో నివాసము ఉండవచ్చునని తెలిపారు. కొందరు రామలక్ష్మణులకు నీళ్లు తెచ్చి ఇచ్చారు. మరి కొందరు తినడానికి మధురమైన ఫలములను తీసుకొని వచ్చి ఇచ్చారు. అందులో ముఖ్యులు, పెద్దవారు అయిన మునులు రాముని చూచి
“రామా! నీవు అయోధ్యకు మహారాజువు. రాజు లోక పూజ్యుడు. రాజు ప్రజలను ధర్మమార్గంలో నడిపిస్తాడు. రాజు దుష్టులను శిక్షిస్తాడు. ప్రజలను రక్షిస్తాడు. అందుకే రాజును అందరూ గౌరవించాలి, పూజించాలి. ప్రజారక్షకుడైన రాజు ఇంద్రునిలో నాలుగవ అంశ అని అంటారు. అందు చేతనే రాజు ప్రజల మన్ననలు పొందుతూ, రాజభోగములు ఇంద్రుని వలె అనుభవిస్తుంటాడు. ఈ ప్రదేశము అయోధ్యారాజ్యములో ఉంది. కాబట్టి నీవే మాకు రాజువు. నీవే మమ్ములను రక్షించాలి. నీవు ప్రస్తుతము వనములో ఉన్నావని రాజువు కాకపోవు. రాజు అయోధ్యలో ఉన్నా, అడవిలో ఉన్నా, రాజు రాజే.
రామా! మా సంగతి నీకు తెలుసు కదా! మేమే అన్ని సంగములను విడిచి పెట్టి జితేంద్రియులమై, ఆ అడవిలో ప్రశాంతంగా తపస్సు చేసుకుంటున్నాము. మాకు ఎవరైనా అపకారము చేసినా, వారి మీద కోపగించకోడానికి కూడా మేము ఇష్టపడము. కాబట్టి మా అందరినీ రాజువైన నీవే మా అందరినీ రక్షించాలి.” అని పలికారు.
తరువాత ఆ మునులు రామలక్ష్మణులకు, సీతకు అనేక ఫలములు, కంద మూలములు, ఇతరములైన ఆహార పదార్థములు తెచ్చి ఇచ్చారు. రాముడు వారు చెప్పిన మాటలను ఆలకించాడు. వారు ఇచ్చిన పదార్థములను, ఫలములను భక్తితో స్వీకరించాడు.
శ్రీమద్రామాయణము
అరణ్యకాండము మొదటి సర్గ సంపూర్ణము.
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్