మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. “అరణ్యకాండ” ద్వితీయ సర్గలో, రాముడు, సీత, లక్ష్మణులు అరణ్యంలో మరింత లోతుగా ప్రవేశిస్తారు. వారు అటవీ జీవులతో మమేకమై, సురక్షితంగా ఉండేందుకు ప్రయత్నిస్తారు. అటవీ సహజ సౌందర్యం వారికి అద్భుత అనుభూతిని కలిగిస్తుంది. ఈ సమయంలో, సీత తన భక్తి మరియు ప్రేమతో రాముడిని నడిపిస్తుంది, లక్ష్మణుడు రాముడి ఆజ్ఞలను అనుసరిస్తూ రక్షణను కల్పిస్తాడు.
|| విరాధసంరోధః ||
కృతాతిథ్యోఽథ రామస్తు సూర్యస్యోదయనం ప్రతి |
ఆమంత్ర్య స మునీన్సర్వాన్వనమేవాన్వగాహత ||
1
నానామృగగణాకీర్ణం శార్దూలవృకసేవితమ్ |
ధ్వస్తవృక్షలతాగుల్మం దుర్దర్శసలిలాశయమ్ ||
2
నిష్కూజనానాశకుని ఝిల్లికాగణనాదితమ్ |
లక్ష్మణానుగతో రామో వనమధ్యం దదర్శ హ ||
3
వనమధ్యే తు కాకుత్స్థస్తస్మిన్ఘోరమృగాయుతే |
దదర్శ గిరిశృంగాభం పురుషాదం మహాస్వనమ్ ||
4
గంభీరాక్షం మహావక్త్రం వికటం విషమోదరమ్ |
బీభత్సం విషమం దీర్ఘం వికృతం ఘోరదర్శనమ్ ||
5
వసానం చర్మ వైయాఘ్రం వసార్ద్రం రుధిరోక్షితమ్ |
త్రాసనం సర్వభూతానాం వ్యాదితాస్యమివాంతకమ్ ||
6
త్రీన్సింహాంశ్చతురో వ్యాఘ్రాన్ద్వౌ వృషౌ పృషతాన్దశ | [వృకౌ]
సవిషాణం వసాదిగ్ధం గజస్య చ శిరో మహత్ ||
7
అవసజ్యాయసే శూలే వినదంతం మహాస్వనమ్ |
స రామం లక్ష్మణం చైవ సీతాం దృష్ట్వా చ మైథిలీమ్ ||
8
అభ్యధావత సంక్రుద్ధః ప్రజాః కాల ఇవాంతకః |
స కృత్వా భైరవం నాదం చాలయన్నివ మేదినీమ్ ||
9
అంకేనాదాయ వైదేహీమపక్రమ్య తతోఽబ్రవీత్ |
యువాం జటాచీరధరౌ సభార్యౌ క్షీణజీవితౌ ||
10
ప్రవిష్టౌ దండకారణ్యం శరచాపాసిధారిణౌ |
కథం తాపసయోర్వాం చ వాసః ప్రమదయా సహ ||
11
అధర్మచారిణౌ పాపౌ కౌ యువాం మునిదూషకౌ |
అహం వనమిదం దుర్గం విరాధో నామ రాక్షసః ||
12
చరామి సాయుధో నిత్యమృషిమాంసాని భక్షయన్ |
ఇయం నారీ వరారోహా మమ భార్యా భవిష్యతి ||
13
యువయోః పాపయోశ్చాహం పాస్యామి రుధిరం మృధే |
తస్యైవం బ్రువతో ధృష్టం విరాధస్య దురాత్మనః ||
14
శ్రుత్వా సగర్వం వచనం సంభ్రాంతా జనకాత్మజా | [సగర్వితం వాక్యం]
సీతా ప్రావేపతోద్వేగాత్ప్రవాతే కదలీ యథా ||
15
తాం దృష్ట్వా రాఘవః సీతాం విరాధాంకగతాం శుభామ్ |
అబ్రవీల్లక్ష్మణం వాక్యం ముఖేన పరిశుష్యతా ||
16
పశ్య సౌమ్య నరేంద్రస్య జనకస్యాత్మసంభవామ్ |
మమ భార్యా శుభాచారాం విరాధాంకే ప్రవేశితామ్ ||
17
అత్యంతసుఖసంవృద్ధాం రాజపుత్రీం యశస్వినీమ్ |
యదభిప్రేతమస్మాసు ప్రియం వరవృతం చ యత్ ||
18
కైకేయ్యాస్తు సుసంపన్నం క్షిప్రమద్యైవ లక్ష్మణ |
యా న తుష్యతి రాజ్యేన పుత్రార్థే దీర్ఘదర్శినీ ||
19
యయాఽహం సర్వభూతానాం హితః ప్రస్థాపితో వనమ్ |
అద్యేదానీం సకామా సా యా మాతా మమ మధ్యమా ||
20
పరస్పర్శాత్తు వైదేహ్యా న దుఃఖతరమస్తి మే |
పితుర్వియోగాత్సౌమిత్రే స్వరాజ్యహరణాత్తథా ||
21
ఇతి బ్రువతి కాకుత్స్థే బాష్పశోకపరిప్లుతే |
అబ్రవీల్లక్ష్మణః క్రుద్ధో రుద్ధో నాగ ఇవ శ్వసన్ ||
22
అనాథ ఇవ భూతానాం నాథస్త్వం వాసవోపమః |
మయా ప్రేష్యేణ కాకుత్స్థ కిమర్థం పరితప్యసే ||
23
శరేణ నిహతస్యాద్య మయా క్రుద్ధేన రక్షసః |
విరాధస్య గతాసోర్హి మహీ పాస్యతి శోణితమ్ ||
24
రాజ్యకామే మమ క్రోధో భరతే యో బభూవ హ |
తం విరాధే ప్రమోక్ష్యామి వజ్రీ వజ్రమివాచలే ||
25
మమ భుజబలవేగవేగితః
పతతు శరోఽస్య మహాన్మహోరసి |
వ్యపనయతు తనోశ్చ జీవితం
పతతు తతః స మహీం విఘూర్ణితః ||
26
[* అధికశ్లోకః – ఇత్యుక్త్వా లక్ష్మణః శ్రీమాన్రాక్షసం ప్రహసన్నివ | కో భవాన్వనమభ్యేత్య చరిష్యతి యథాసుఖమ్ || *]
ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే అరణ్యకాండే ద్వితీయః సర్గః ||
Aranya Kanda Sarga 2 Meaning In Telugu PDF
రామలక్షణులు, సీత ఆ రాత్రికి ఆ పర్ణశాలలోనే విశ్రమించారు. మరునాడు ఉదయము ఆ మునుల వద్ద అనుజ్ఞ తీసుకొని రాముడు, లక్ష్మణుడు, సీతతో సహా అరణ్యములోకి వెళ్లాడు. వారు అడవిలో ప్రయాణము చేస్తూ ఎన్నో వన్యమృగములను చూచారు.
హటాత్తుగా వారి ఎదురుగా ఒక రాక్షసుడు ప్రత్యక్షం అయ్యాడు. వాడి శరీరం ఒక కొండ మాదిరి ఉంది. వాడు నరమాంసభక్షకుడు అని రాముడు గ్రహించాడు. రామలక్ష్మణులు వాడి వంక నిశితంగా చూచారు.
వాడు నల్లగా కొండ మాదిరి ఉన్నాడు. కళ్లు ఎర్రగా ఉన్నాయి. వికృతాకారంతో ఉన్నాడు. వాడి శరీరం అంతా రక్తంతో తడిసి ఉంది. వాడి బుజం మీద ఒక శూలం ఉంది. దానికి మూడు సింహాలను, నాలుగు పెద్దపులులను, రెండు తోడేళ్లను, పది జింకలను, గుచ్చి తీసుకొని వెళుతున్నాడు.
ఆ రాక్షసుడు రామ లక్ష్మణులను చూచాడు. గట్టిగా అరిచాడు. వారిని చంపడానికి వారి దగ్గరకు పరుగెత్తుకుంటూ వచ్చాడు. వాడి కళ్లక అందమైన సీత కనిపిపించింది. రావడం రావడం సీతను పట్టుకొన్నాడు. సీతను తీసుకొని పక్కకు వెళ్లాడు. రామలక్ష్మణులను చూచి ఇలా అన్నాడు.
“జటలు ధరించిన మీరు ఎవరు? ఇక్కడకు ఎందుకు వచ్చారు? మీరు ఎవరైనా ఈ రోజు నా చేతిలో చావడం ఖాయం. మీరు ఇద్దరూ ముని కుమారుల వేషాలలో ఉన్నారు కదా! మీ వెంట ఈ స్త్రీ ఎందుకు ఉంది? ఈమె ఎవరు? ఈమెతో మీకు ఏమి సంబంధం? మునులు జితేంద్రియులు, సన్యాసులు కదా! మరి ముని ధర్మమునకు విరుద్ధంగా ప్రవర్తించి మీరు ఎందుకు పాపం చేస్తున్నారు?” అని అన్నాడు ఆ రాక్షసుడు.
దానికి రాముడు ఆ రాక్షసుని చూచి ఇలా అన్నాడు. “నీవు మమ్ములను ఇలా అడుగుతున్నావే. ఇంతకూ నీవు ఎవరు? ఇక్కడ ఎందుకు ఉన్నావు?” అని అడిగాడు.
“నేను ఒక రాక్షసుడను. నా పేరు విరాధుడు. నేను ఈ అరణ్యములో ఉన్న మునులను చంపి ఆహారంగా తింటూ ఉంటాను. మీ వెంట ఉన్న ఈ స్త్రీ నాకు కావాలి. ఈమెను నేను పెళ్లి చేసుకుంటాను. ముని వేషములలో ఉండి కూడా ఈ స్త్రీని వెంటబెట్టుకొని తిరుగుతూ పాపం చేస్తున్న మిమ్ములను చంపి తింటాను.” అని అన్నాడు విరాధుడు.
ఆ మాటలు విన్న సీత చాలా భయపడింది. సీత శరీరం అంతా భయంతో వణికిపోయింది. విరాధుని ఒడిలో చిగురుటాకులా వణికిపోతున్న సీతను చూచి రాముడు చలించి పోయాడు. రాముడి మొహం పాలిపోయింది. లక్ష్మణుని చూచి ఇలా అన్నాడు.
లక్ష్మణా! ఆ దుర్మార్గుడు విరాధుడు సీతను తన ఒడిలోకి ఎలా లాక్కున్నాడో చూచావా! కైక మనకు ఏమి జరగాలని మనసులో అనుకున్నదో అదే జరుగుతూ ఉంది. లక్ష్మణా! కైక తన కుమారుడు భరతునికి రాజ్యం ఇప్పించుకోవచ్చు. మనలను అడవులకు పంపి ఇన్ని కష్టాలకు గురిచెయ్యడం ఎందుకు? కైక మనకు ఏమి జరగాలని కోరుకుంటూ అడవులకు పంపిందో అదే జరుగుతూ ఉంది. నాకు వనవాస ప్రాప్తి, నా తండ్రి మరణము, ఇదుగో ఇప్పుడు నా భార్యను పరపురుషుడు తాకడం, ఒడిలోకి లాక్కోవడం… ఇంతకన్నా కష్టాలు ఏముంటాయి?” అని వాపోయాడు రాముడు.
ఆ మాటలు విన్న అక్ష్మణుడు కోపంతో రగిలిపోయాడు.
“రామా! ఏమిటీ వెర్రి? నీవు దేవేంద్రునితో సమానమైన పరాక్రమము కలవాడవు. ఇలా బేలగా మాట్లాడటం నీకు తగునా? అసలు ఇలా ఎందుకు పరితపిస్తున్నావు? రామా! నువ్వు చూస్తూ ఉండు. ఒకే బాణంతో వీడిని మట్టి కరిపిస్తాను. వీడి రక్తంతో నేలను తడిపేస్తాను. దేవేంద్రుడు పర్వతముల మీద వజ్రాయుధమును ప్రయోగించినట్టు విరాధుని మీద నేను బాణప్రయోగము చేస్తాను. వీడు కొండ కూలినట్టు కూలిపోతాడు. వీడి వక్షస్థలమును చీలుస్తాను. వీడి ప్రాణాలు హరిస్తాను.” అని కోపంతో ఊగిపోతూ అన్నాడు.
లక్ష్మణుడు. (ఒక్కమాట. విరాధుడురాక్షసుడు. నరమాంసము తినేవాడు. వాడు అన్న మాటలు చదివారు కదా. సన్యాసులు జితేంద్రియులు. వారి వెంట స్త్రీ ఉండకూడదు. వారికి స్త్రీ సాంగత్యము పనికిరాదు. ఇదీ ఆ రాక్షసునికి తెలిసిన నీతి. కాని ఈ నాడు మన మధ్యఉన్న స్వామీజీలు, సన్యాసుల చుట్టు ఉండేది ఆడవాళ్లే. సిల్కుజుబ్బాలు, చుట్టు ఆడవాళ్లు. తాము ఉండే గదుల్లో కిలోల కొద్దీ వెండి బంగారాలు, అక్రమ ఆస్తులు, పోలీసుకేసులు, అరెస్టులు ఇవి నిత్యకృత్యం అయ్యాయి. మరి ఆ రాక్షసుడికి ఉన్న జ్ఞానం కూడా మన స్వామీజీలకు లేదా! ఏమో! మీరే ఆలోచించండి)
శ్రీమద్రామాయణము
అరణ్యకాండము రెండవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్