మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. అరణ్యకాండ పంచత్రింశః సర్గంలో, రాముడు, సీత, లక్ష్మణులతో కలిసి అరణ్యంలో నివసిస్తూ రాక్షసులను సంహరిస్తున్నాడు. శూర్పణఖా అనే రాక్షసి రాముని ఆకర్షించడానికి ప్రయత్నిస్తుంది, కానీ రాముడు తన భార్య సీతతో ఉండటం వల్ల ఆమెను తిరస్కరిస్తాడు. కోపంతో శూర్పణఖా లక్ష్మణుడిపై దాడి చేస్తుంది.
మారీచాశ్రమపునర్గమనమ్
తతః శూర్పణఖావాక్యం తచ్ఛ్రుత్వా రోమహర్షణమ్ |
సచివానభ్యనుజ్ఞాయ కార్యం బుద్ధ్వా జగామ సః ||
1
తత్కార్యమనుగమ్యాథ యథావదుపలభ్య చ |
దోషాణాం చ గుణానాం చ సంప్రధార్య బలాబలమ్ ||
2
ఇతి కర్తవ్యమిత్యేవ కృత్వా నిశ్చయమాత్మనః |
స్థిరబుద్ధిస్తతో రమ్యాం యానశాలాముపాగమత్ ||
3
యానశాలాం తతో గత్వా ప్రచ్ఛన్నో రాక్షసాధిపః |
సూతం సంచోదయామాస రథః సంయోజ్యతామితి ||
4
ఏవముక్తః క్షణేనైవ సారథిర్లఘువిక్రమః |
రథం సంయోజయామాస తస్యాభిమతముత్తమమ్ ||
5
కాంచనం రథమాస్థాయ కామగం రత్నభూషితమ్ |
పిశాచవదనైర్యుక్తం ఖరైః కనకభూషణైః ||
6
మేఘప్రతిమనాదేన స తేన ధనదానుజః |
రాక్షసాధిపతిః శ్రీమాన్ యయౌ నదనదీపతిమ్ ||
7
స శ్వేతవాలవ్యజనః శ్వేతచ్ఛత్రో దశాననః |
స్నిగ్ధవైడూర్యసంకాశస్తప్తకాంచనకుండలః ||
8
వింశద్భుజో దశగ్రీవో దర్శనీయపరిచ్ఛదః |
త్రిదశారిర్మునీంద్రఘ్నో దశశీర్ష ఇవాద్రిరాట్ ||
9
కామగం రథమాస్థాయ శుశుభే రాక్షసేశ్వరః |
విద్యున్మండలవాన్ మేఘః సబలాక ఇవాంబరే ||
10
సశైలం సాగరానూపం వీర్యవానవలోకయన్ |
నానాపుష్పఫలైర్వృక్షైరనుకీర్ణం సహస్రశః ||
11
శీతమంగళతోయాభిః పద్మినీభిః సమంతతః |
విశాలైరాశ్రమపదైర్వేదిమద్భి సమావృతమ్ ||
12
కదల్యాఽఽఢకిసంబాధం నాలికేరోపశోభితమ్ |
సాలైస్తాలైస్తమాలైశ్చ పుష్పితైస్తరుభిర్వృతమ్ ||
13
నాగైః సుపర్ణైర్గంధర్వైః కిన్నరైశ్చ సహస్రశః |
ఆజైర్వైఖానసైర్మాషైః వాలఖిల్యైర్మరీచిపైః ||
14
అత్యంతనియతాహారైః శోభితం పరమర్షిభిః |
జితకామైశ్చ సిద్ధైశ్చ చారణైరుపశోభితమ్ ||
15
దివ్యాభరణమాల్యాభిర్దివ్యరూపాభిరావృతమ్ |
క్రీడారతివిధిజ్ఞాభిరప్సరోభిః సహస్రశః ||
16
సేవితం దేవపత్నీభిః శ్రీమతీభిః శ్రియావృతమ్ |
దేవదానవసంఘైశ్చ చరితం త్వమృతాశిభిః ||
17
హంసక్రౌంచప్లవాకీర్ణం సారసైః సంప్రణాదితమ్ |
వైడూర్యప్రస్తరం రమ్యం స్నిగ్ధం సాగరతేజసా ||
18
పాండురాణి విశాలాని దివ్యమాల్యయుతాని చ |
తూర్యగీతాభిజుష్టాని విమానాని సమంతతః ||
19
తపసా జితలోకానాం కామగాన్యభిసంపతన్ |
గంధర్వాప్సరసశ్చైవ దదర్శ ధనదానుజః ||
20
నిర్యాసరసమూలానాం చందనానాం సహస్రశః |
వనాని పశ్యన్ సౌమ్యాని ఘ్రాణతృప్తికరాణి చ ||
21
అగురూణాం చ ముఖ్యానాం వనాన్యుపవనాని చ |
తక్కోలానాం చ జాత్యానాం ఫలానాం చ సుగంధినామ్ ||
22
పుష్పాణి చ తమాలస్య గుల్మాని మరిచస్య చ |
ముక్తానాం చ సమూహాని శుష్యమాణాని తీరతః ||
23
శంఖానాం ప్రస్తరం చైవ ప్రవాలనిచయం తథా |
కాంచనాని చ శైలాని రాజతాని చ సర్వశః ||
24
ప్రస్రవాణి మనోజ్ఞాని ప్రసన్నాని హ్రదాని చ |
ధనధాన్యోపపన్నాని స్త్రీరత్నైః శోభితాని చ ||
25
హస్త్యశ్వరథగాఢాని నగరాణ్యవలోకయన్ |
తం సమం సర్వతః స్నిగ్ధం మృదుసంస్పర్శమారుతమ్ ||
26
అనూపం సింధురాజస్య దదర్శ త్రిదివోపమమ్ |
తత్రాపశ్యత్స మేఘాభం న్యగ్రోధమృషిభిర్వృతమ్ ||
27
సమంతాద్యస్య తాః శాఖాః శతయోజనమాయతాః |
యస్య హస్తినమాదాయ మహాకాయం చ కచ్ఛపమ్ ||
28
భక్షార్థం గరుడః శాఖామాజగామ మహాబలః |
తస్య తాం సహసా శాఖాం భారేణ పతగోత్తమః ||
29
సుపర్ణః పర్ణబహులాం బభంజ చ మహాబలః |
తత్ర వైఖానసా మాషా వాలఖిల్యా మరీచిపాః ||
30
అజా బభూవుర్ధూమ్రాశ్చ సంగతాః పరమర్షయః |
తేషాం దయార్థం గరుడస్తాం శాఖాం శతయోజనామ్ ||
31
జగామాదాయ వేగేన తౌ చోభౌ గజకచ్ఛపౌ |
ఏకపాదేన ధర్మాత్మా భక్షయిత్వా తదామిషమ్ ||
32
నిషాదవిషయం హత్వా శాఖయా పతగోత్తమః |
ప్రహర్షమతులం లేభే మోక్షయిత్వా మహామునీన్ ||
33
స తేనైవ ప్రహర్షేణ ద్విగుణీకృతవిక్రమః |
అమృతానయనార్థం వై చకార మతిమాన్ మతిమ్ ||
34
అయోజాలాని నిర్మథ్య భిత్త్వా రత్నమయం గృహమ్ |
మహేంద్రభవనాద్గుప్తమాజహారామృతం తతః ||
35
తం మహర్షిగణైర్జుష్టం సుపర్ణ కృతలక్షణమ్ |
నామ్నా సుభద్రం న్యగ్రోధం దదర్శ ధనదానుజః ||
36
తం తు గత్వా పరం పారం సముద్రస్య నదీపతేః |
దదర్శాశ్రమమేకాంతే రమ్యే పుణ్యే వనాంతరే ||
37
తత్ర కృష్ణాజినధరం జటావల్కలధారిణమ్ |
దదర్శ నియతాహారం మారీచం నామ రాక్షసమ్ ||
38
స రావణః సమాగమ్య విధివత్తేన రక్షసా |
మారీచేనార్చితో రాజా సర్వకామైరమానుషైః ||
39
తం స్వయం పూజయిత్వా తు భోజనేనోదకేన చ |
అర్థోపహితయా వాచా మారీచో వాక్యమబ్రవీత్ ||
40
కచ్చిత్ సుకుశలం రాజన్ లంకాయాం రాక్షసేశ్వర |
కేనార్థేన పునస్త్వం వై తూర్ణమేవమిహాగతః ||
41
ఏవముక్తో మహాతేజా మారీచేన స రావణః |
తం తు పశ్చాదిదం వాక్యమబ్రవీద్వాక్యకోవిదః ||
42
ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే అరణ్యకాండే పంచత్రింశః సర్గః ||
Aranya Kanda Sarga 35 Meaning In Telugu
శూర్పణఖ చెప్పిన విషయాలను సావధానంగా విన్నాడు. రావణుడు. సభచాలించాడు. మంత్రులకు దండనాధులకు వెళ్లడానికి అనుమతి ఇచ్చాడు. శూర్పణఖ చెప్పిన విషయములను ఒకటికి రెండు సార్లు ఆలోచించాడు. ఒక నిర్ణయానికి వచ్చాడు.
శూర్పణఖ మాటల్లో అతనికి నచ్చింది సీత సౌందర్యవర్ణన. ఎక్కడ తగలాలో అక్కడే తగిలింది శూర్పణఖ వదిలిన మాటల బాణము. అంతా రహస్యంగా జరగాలి అనుకున్నాడు. మారువేషంలో రథశాలకు వెళ్లాడు. సారధిని వెంటనే రథము సిద్ధం చేయమన్నాడు. సారథి రథం సిద్ధం చేసాడు. రథానికి గాడిదలను కట్టాడు. వాటి ముఖాలు పిశాచాల మాదిరి ఉన్నాయి. రావణుడు రథం ఎక్కి సముద్రం వైపుకు వెళ్లాడు.
రావణుడు సముద్రం తీరం వెంట తన రథములో ప్రయాణం చేస్తున్నాడు. దారిలో ఎన్నో ముని ఆశ్రమములను చూస్తున్నాడు. ఆ అరణ్యములలో నాగులు, పక్షులు, గంధర్వులు, కింనరులు, వైఖానసులు, వాలఖిల్యులు, ఋషులు, సిద్ధులు, చారణులు స్వేచ్ఛగా నివసిస్తున్నారు. దారిలో రావణునికి దేవతలు ప్రయాణిస్తున్న విమానాలు కనపడుతున్నాయి. ఈ ప్రకారంగా అనేకములైన అరణ్యములను ఉద్యానవనములను, సరస్సులను దాటుకుంటా ప్రయాణిస్తున్నాడు రావణుడు.
రావణుడు ప్రయాణిస్తున్న ప్రదేశమును జలప్రాయ ప్రదేశము అని అంటారు. ఆ ప్రదేశములో ఒక పెద్ద వటవృక్షము ఉంది. దాని కొమ్మలు, ఊడలు నూరు యోజనముల మేర విస్తరించి ఉన్నాయి. ఆ చెట్టు మీద కొంత మంది ఋషులు తపస్సు చేసుకుంటున్నారు. వాలఖిల్యులు అనే ఋషులు కేవలము చంద్రకిరణములను మాత్రం ఆహారంగా తీసుకుంటూ ఆ కొమ్మలకు తలకిందులుగా వేలాడుతూ తపస్సుచేసుకుంటున్నారు.
ఒక సారి గరుడుడు తన తల్లి దాస్య విముక్తి కొరకు స్వర్గలోకము నుండి అమృతము తీసుకొని రావడానికి వెళుతున్నాడు. ఆహారంగా ఒక ఏనుగును, ఒక తాబేలును రెండు కాళ్లతో పట్టుకొని ఎగురుతున్నాడు. అంతలో విశాలమైన ఈ వటవృక్షము కనిపించింది. గరుడుడు నూరుయోజనముల పొడవు గల ఒక బలిష్టమైన కొమ్మమీద ఆ గజ,కచ్ఛపములతో వాలాడు. గరుడుని బరువుకు ఆ కొమ్మ పెళపెళమని విరిగింది. ఆ కొమ్మ విరిగితే దాని మీద తపస్సు చేసుకుంటున్న ఋషులకు, వేలాడుతున్న వాలఖిల్యులకు తపోభంగము అవుతుందని, గజకచ్ఛపములను చెరి ఒక కాలితో పట్టుకొని, ఆ కొమ్మను నోట కరచుకొని మరలా పైకి ఎగిరాడు. వారిని ఒక సమతల ప్రదేశముమీద దింపి, ఆ కొమ్మను నిషాదులు ఉన్న చోట విసిరేసాడు. తరువాత గరుడుడు గజ కచ్ఛపములను ఆరగించి, తరువాత అమృతం తేవడానికి స్వర్గమునకు వెళ్లాడు. (ఈ కధ మహాభారతంలో ఉన్నది).
రావణుడు ఆ వటవృక్షమును దాటుకుంటూ వెళ్లాడు. అలా ప్రయాణిస్తూ రావణుడు సముద్రమును దాటాడు. సముద్రమునకు ఆవల ఉన్న ఒక ఆశ్రమమునకు వెళ్లాడు.
అది మారీచుడు అనే రాక్షసుని ఆశ్రమము. మారీచుడు జన్మత: రాక్షసుడే అయినా ముని వృత్తి స్వీకరించి, జటావల్కలములు ధరించి ఆ ఆశ్రమంలో తపస్సుచేసుకుంటున్నాడు. రావణుడు తన ఆశ్రమమునకు రావడం చూచాడు మారీచుడు. రావణునికి స్వాగతం పలికాడు. అర్ఘ్యపాద్యాదులు ఇచ్చి ఉచిత రీతిని సత్కరించాడు. రావణునికి భోజన, పానీయాలుసమకూర్చాడు. కాస్త సేద దీరిన తరువాత మారీచుడు రావణుని ఇలా అడిగాడు.
“రావణా! రాక రాక ఇన్నాళ్లకు ఈ మారీచుని ఆశ్రమానికి వచ్చావు. ఏమి కారణము? లంకలో అంతా క్షేమంగా ఉన్నారు కదా!” అని కుశల ప్రశ్నలు వేసాడు. అప్పుడు రావణుడు మారీచునితో ఈ విధంగా ఉన్నాడు.
శ్రీమద్రామాయణము
అరణ్యకాండము ముప్పది ఐదవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్
అరణ్యకాండ షట్త్రింశః సర్గః (36) >>