Ayodhya Kanda Sarga 109 In Telugu – అయోధ్యాకాండ నవోత్తరశతతమః సర్గః

అయోధ్యాకాండ నవోత్తరశతతమః సర్గః వాల్మీకి రామాయణంలో ఒక శోకకరమైన ఘట్టం. ఈ సర్గలో, దశరథ మహారాజు రాముని వనవాసం వల్ల కలిగిన వేదనను తట్టుకోలేక మరణిస్తాడు. ఆయన మరణ వార్తను విని, కైకేయి తన చర్యల పట్ల పశ్చాత్తాపపడుతుంది. భారతుడు, శత్రుఘ్నుడు, తక్షిణ ప్రాంతం నుండి తిరిగి వస్తారు. అయోధ్యలో జరిగిన మార్పులు, రాజకుమారుల హృదయాన్ని బాధిస్తాయి. దశరథుని మరణంతో, భరతుడు ఆవేదనతో రాముని తిరిగి తీసుకురావాలని నిర్ణయిస్తాడు. ఈ సర్గ, కుటుంబ బంధాలు, బాధ్యత, మరియు పితృఋణాన్ని నొక్కి చెబుతుంది. ఇది భరతుడు తన అన్న రాముడి పట్ల చూపించే ప్రేమ, భక్తిని స్పష్టంగా చూపిస్తుంది.

సత్యప్రశంసా

జాబాలేస్తు వచః శ్రుత్వా రామః సత్యాత్మనాం వరః |
ఉవాచ పరయా భక్త్యా స్వబుద్ధ్యా చావిపన్నయా || ౧ ||

భవాన్ మే ప్రియకామార్థం వచనం యదిహోక్తవాన్ |
అకార్యం కార్యసంకాశమపథ్యం పథ్యసమ్మితమ్ || ౨ ||

నిర్మర్యాదస్తు పురుషః పాపాచారసమన్వితః |
మానం న లభతే సత్సు భిన్నచారిత్రదర్శనః || ౩ ||

కులీనమకులీనం వా వీరం పురుషమానినమ్ |
చారిత్రమేవ వ్యాఖ్యాతి శుచిం వా యది వాఽశుచిమ్ || ౪ ||

అనార్యస్త్వార్యసంకాశః శౌచాద్ధీనస్తథా శుచిః |
లక్షణ్యవదలక్షణ్యో దుఃశీల శీలవానివ || ౫ ||

అధర్మం ధర్మవేషేణ యదీమం లోకసంకరమ్ |
అభిపత్స్యే శుభం హిత్వా క్రియావిధివివర్జితమ్ || ౬ ||

కశ్చేతయానః పురుషః కార్యాకార్యవిచక్షణః |
బహుమంస్యతి మాం లోకే దుర్వృత్తం లోకదూషణమ్ || ౭ ||

కస్య ధాస్యామ్యహం వృత్తం కేన వా స్వర్గమాప్నుయామ్ |
అనయా వర్తమానో హి వృత్త్యా హీనప్రతిజ్ఞయా || ౮ ||

కామవృత్తస్త్వయం లోకః కృత్స్నః సముపవర్తతే |
యద్వృత్తాః సంతి రాజానస్తద్వృత్తాః సంతి హి ప్రజాః || ౯ ||

సత్యమేవానృశంసం చ రాజవృత్తం సనాతనమ్ |
తస్మాత్సత్యాత్మకం రాజ్యం సత్యే లోకః ప్రతిష్ఠితః || ౧౦ ||

ఋషయశ్చైవ దేవాశ్చ సత్యమేవ హి మేనిరే |
సత్యవాదీ హి లోకేఽస్మిన్ పరమం గచ్ఛతి క్షయమ్ || ౧౧ ||

ఉద్విజంతే యథా సర్పాన్నరాదనృతవాదినః |
ధర్మః సత్యం పరో లోకే మూలం స్వర్గస్య చోచ్యతే || ౧౨ ||

సత్యమేవేశ్వరో లోకే సత్యం పద్మా శ్రితా సదా |
సత్యమూలాని సర్వాణి సత్యాన్నాస్తి పరం పదమ్ || ౧౩ ||

దత్తమిష్టం హుతం చైవ తప్తాని చ తపాంసి చ |
వేదాః సత్యప్రతిష్ఠానాస్తస్మాత్ సత్యపరో భవేత్ || ౧౪ ||

ఏకః పాలయతే లోకమేకః పాలయతే కులమ్ |
మజ్జత్యేకో హి నిరయైకః స్వర్గే మహీయతే || ౧౫ ||

సోఽహం పితుర్నియోగంతు కిమర్థం నానుపాలయే |
సత్యప్రతిశ్రవః సత్యం సత్యేన సమయీకృతః || ౧౬ ||

నైవ లోభాన్న మోహాద్వా న హ్యజ్ఞానాత్తమోఽన్వితః |
సేతుం సత్యస్య భేత్స్యామి గురోః సత్యప్రతిశ్రవః || ౧౭ ||

అసత్యసంధస్య సతశ్చలస్యాస్థిరచేతసః |
నైవ దేవా న పితరః ప్రతీచ్ఛంతీతి నః శ్రుతమ్ || ౧౮ ||

ప్రత్యగాత్మమిమం ధర్మం సత్యం పశ్యామ్యహం స్వయమ్ |
భారః సత్పురుషాచీర్ణస్తదర్థమభిమన్యతే || ౧౯ ||

క్షాత్త్రం ధర్మమహం త్యక్ష్యే హ్యధర్మం ధర్మసంహితమ్ |
క్షుద్రైర్నృశంసైర్లుబ్ధైశ్చ సేవితం పాపకర్మభిః || ౨౦ ||

కాయేన కురుతే పాపం మనసా సంప్రధార్య చ |
అనృతం జిహ్వయా చాహ త్రివిధం కర్మ పాతకమ్ || ౨౧ ||

భూమిః కీర్తిర్యశో లక్ష్మీః పురుషం ప్రార్థయంతి హి |
స్వర్గస్థం చానుపశ్యంతి సత్యమేవ భజేత తత్ || ౨౨ ||

శ్రేష్ఠం హ్యనార్యమేవ స్యాద్యద్భవానవధార్య మామ్ |
ఆహ యుక్తికరైర్వాక్యైరిదం భద్రం కురుష్వ హ || ౨౩ ||

కథం హ్యహం ప్రతిజ్ఞాయ వనవాసమిమం గురౌ |
భరతస్య కరిష్యామి వచో హిత్వా గురోర్వచః || ౨౪ ||

స్థిరా మయా ప్రతిజ్ఞాతా ప్రతిజ్ఞా గురుసన్నిధౌ |
ప్రహృష్యమాణా సా దేవీ కైకేయీ చాభవత్తదా || ౨౫ ||

వనవాసం వసన్నేవం శుచిర్నియతభోజనః |
మూలైః పుష్పైః ఫలైః పుణ్యైః పితన్ దేవాంశ్చ తర్పయన్ || ౨౬ ||

సంతుష్టపంచవర్గోఽహం లోకయాత్రాం ప్రవర్తయే |
అకుహః శ్రద్దధానస్సన్ కార్యాకార్యవిచక్షణః || ౨౭ ||

కర్మభూమిమిమాం ప్రాప్య కర్తవ్యం కర్మ యచ్ఛుభమ్ |
అగ్నిర్వాయుశ్చ సోమశ్చ కర్మణాం ఫలభాగినః || ౨౮ ||

శతం క్రతూనామాహృత్య దేవరాట్ త్రిదివంగతః |
తపాంస్యుగ్రాణి చాస్థాయ దివం యాతా మహర్షయః || ౨౯ ||

అమృష్యమాణః పునరుగ్రతేజాః
నిశమ్య తన్నాస్తికవాక్యహేతుమ్ |
అథాబ్రవీత్తం నృపతేస్తనూజో
విగర్హమాణో వచనాని తస్య || ౩౦ ||

సత్యం చ ధర్మం చ పరాక్రమం చ
భూతానుకంపాం ప్రియవాదితాశ్చ |
ద్విజాతిదేవాతిథిపూజనం చ
పంథానమాహుస్త్రిదివస్య సంతః || ౩౧ ||

తేనైవమాజ్ఞాయ యథావదర్థమ్
ఏకోదయం సంప్రతిపద్య విప్రాః |
ధర్మం చరంతః సకలం యథావత్
కాంక్షంతి లోకాగమమప్రమత్తాః || ౩౨ ||

నిందామ్యహం కర్మ పితుః కృతం తత్
యస్త్వామగృహ్ణాద్విషమస్థబుద్ధిమ్ |
బుద్ధ్యానయైవంవిధయా చరంతమ్
సునాస్తికం ధర్మపథాదపేతమ్ || ౩౩ ||

యథా హి చోరః స తథా హి బుద్ధః
తథాగతం నాస్తికమత్ర విద్ధి |
తస్మాద్ధి యః శంక్యతమః ప్రజానామ్
న నాస్తికేనాభిముఖో బుధః స్యాత్ || ౩౪ ||

త్వత్తో జనాః పూర్వతరే వరాశ్చ
శుభాని కర్మాణి బహూని చక్రుః |
జిత్వా సదేమం చ పరంచ లోకమ్
తస్మాద్ద్విజాః స్వస్తి హుతం కృతం చ || ౩౫ ||

ధర్మే రతాః సత్పురుషైః సమేతాః
తేజస్వినో దానగుణప్రధానాః |
అహింసకా వీతమలాశ్చ లోకే
భవంతి పూజ్యా మునయః ప్రధానాః || ౩౬ ||

ఇతి బ్రువంతం వచనం సరోషం
రామం మహాత్మానమదీనసత్త్వమ్ |
ఉవాచ తథ్యం పునరాస్తికం చ
సత్యం వచః సానునయం చ విప్రః || ౩౭ ||

న నాస్తికానాం వచనం బ్రవీమ్యహమ్
న చాస్తికోఽహం న చ నాస్తి కించన |
సమీక్ష్య కాలం పునరాస్తికోఽభవమ్
భవేయ కాలే పునరేవ నాస్తికః || ౩౮ ||

స చాపి కాలోఽయముపాగతశ్శనైః
యథా మయా నాస్తికవాగుదీరితా |
నివర్తనార్థం తవ రామ కారణాత్
ప్రసాదనార్థం తు మయైతదీరితమ్ || ౩౯ ||

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే అయోధ్యాకాండే నవోత్తరశతతమః సర్గః || ౧౦౯ ||

Ayodhya Kanda Sarga 109 Meaning In Telugu

జాబాలి చెప్పినది అంతా శ్రద్ధగా విన్నాడు రాముడు. జాబాలితో ఈ విధంగా పలికాడు. “ఓ మహాత్మా! మీరు నా హితము కోరి చెప్పినమాటలు నాకు బాగున్నా లోకసమ్మతము కావు. అవి లోకానికి హితమును చేకూర్చలేవు. మీ మాటలు ఆచరిస్తే ప్రజలలో కట్టుబాటు తప్పుతుంది. స్వేచ్ఛా విహారము పెచ్చరిల్లుతుంది. ఎవడి ఇష్టం వచ్చినట్టు వారు ప్రవర్తిస్తారు. అరాచకము నెలకొంటుంది. అటువంటి వారిని ఎవరూ గౌరవించరు.

ఒక మనిషియొక్క గుణగణములు అతని ప్రవర్తనను బట్టి తెలుస్తాయి. అదీ కాకుండా పైకి ఒకటి లోన ఒకటి పెట్టుకొని ప్రవర్తించేవారు అంటే పైకి గౌరవనీయుల మాదిరి కనపడుతూ లోపల ఎన్నో చెయ్యకూడని పనులు చేసేవారు, పైకి ఉత్తమ లక్షణములు కనబరుస్తూ లోపల పరమ నీచంగా ప్రవర్తించేవారు, పైకి నీతి మంతుడి మాదిరి కనపడుతూ లోపల నీతి బాహ్యమైన పనులు చేసేవారు, అటువంటి వారు ఎల్లప్పుడూ ధర్మము విడిచి అధర్మమునే ఆచరిస్తారు. కాని పైకి మాత్రం ధర్మాత్ములు మాదిరి కనపడతారు.

మీరు చెప్పిన మాదిరి చేస్తే నేను కూడా అలాగే అవుతాను. పైకి నీతులు చెబుతూ లోపల సింహాసనము కోసరం వెండ్లాడేవాడి నవుతాను. ఈనాడు నన్ను వెంటనే అయోధ్యకు రమ్మని ఆహ్వానించే వారు కూడా రేపు నన్ను దురాత్ముడని నిందిస్తారు. నన్ను ఎవరూ గౌరవించరు. గౌరవం లేని రాముడు జీవించి కూడా వృధా!

నేను నా తండ్రి మాటను పక్కన బెట్టి రాజ్యము స్వీకరిస్తే, లోకంలో అందరూ నా మాదిరే ఆడిన మాట తప్పడంలో పోటీ పడతారు తప్ప నన్ను ఎవరూ గౌరవించరు. నీమాటలు నమ్మిన వారికి నీవు నమ్మిన ఈలోకంలో సుఖం దక్కదు. పైగా, వారికి, నేను నమ్మిన పరలోకంలో నరకం ప్రాప్తిస్తుంది.

రాజు అనే వాడు ప్రజలకు ఆదర్శప్రాయుడుగా ఉండాలి. రాజు ఆచరించే ఆదర్శాలను ప్రజలుకూడా ఆచరిస్తారు. అలా కాకుండా నేనే మాటతప్పి రాజ్యం స్వీకరిస్తే, ప్రజలుకూడా నా మార్గాన్నే అనుసరిస్తారు. స్వేచ్ఛాజీవులు అవుతారు. అది దీర్ఘకాలంలో చెడుఫలితాలను ఇస్తుంది.

రాజధర్మము సనాతనమైనది. సత్యము, ధర్మము ఈ రెంటి మీదనే రాజ్యము నడవాలి. అప్పుడు ప్రజలకు రాజుమీద నమ్మకం కలుగుతుంది. కాబట్టి సత్యమును మించిన ధర్మము మరొకటి లేదు. మేమే చేసే యజ్ఞాలు, యాగాలు, క్రతువులు అన్నీ ఆ సత్యము మీదనే ఆధారపడ్డాయి. కాబట్టి మానవునకు సత్యవ్రతమును అవలంబించడం ఆవశ్యకము. నేను కూడా ఆ సత్యవాక్పరిపాలననే నమ్ముకున్నాను. ఆడిన మాట తప్పను. నా తండ్రికి ఇచ్చిన మాటను జవదాటను.
ఈ లోకంలో జనులు పలురకాలు. ఒకడు రాజ్యపాలన చేస్తాడు. మరొకడు పాపపు పనులు చేస్తాడు. మరొకడు వంశ గౌరవాన్ని కాపాడుతాడు. మరొకడు నరకద్వారాలు వెతుక్కుంటూ నరకానికివెళతాడు. ఎవరు చేసిన కర్మలకు తగ్గ ఫలములను వారు అనుభవిస్తారు. నేను సత్యమును పాటించడమే ధర్మంగా పెట్టుకున్నాను. అదే ఆచరిస్తాను. తగిన ఫలితాన్ని పొందుతాను.

నేను నా తండ్రి గారికి ఇచ్చిన మాటను, మోహము చేతగానీ, ఆశాపాశముల చేతగానీ, చిత్తభ్రమలో గానీ, అజ్ఞానమువలన గానీ, ఇంకా ఎటువంటి పరిస్థితులలో గానీ తప్పను. ఇదే నా నిశ్చయం. నేనే గనక ఆడిన మాట తప్పితే దేవతలు గానీ, నా పితృదేవతలు గానీ నేను చేసిన పనిని సమర్థించరు.

నేను ఆడిన మాట కోసరము నా క్షత్రియ ధర్మమును కూడా త్యజించుటకు వెనుకాడను. ఎందుకంటే క్షత్రియ ధర్మంలో ఎక్కువగా క్రూరత్వానికి, దురాశకు తావు ఉంటుంది కానీ సత్యధర్మానికి తావు లేదు. మానవుడు తాను చెప్పదలచుకొన్నది ముందుగా మనసులో తలచుకుంటాడు. దానిని వాక్కు రూపంలో బయటకు చెబుతాడు. కాబట్టి నీవు చెప్పినవి అన్నీ నీచెడ్డ ప్రవర్తనను సూచిస్తున్నాయి. నేను నా తండ్రి ఎదుట వనవాసమునకు పోతాను అని అంగీకరించాను. అప్పుడు నా తండ్రి దశరథుడు, నా తల్లి కైక, ఎంతో సంతోషించారు. ఇప్పుడు భరతుని మాట, నీ మాట విని ఎలా అయోధ్యకు పోగలను. కాబట్టి వనవాసమే నాకు శ్రేయోదాయకము. ఇక్కడ స్వచ్ఛమైన గాలీ పీలుస్తూ, కందమూలములు తింటూ, నిర్మలమైన జలములు త్రాగుతూ, హాయిగా కాలం గడుపుతాను.

ఇది కర్మభూమి. మనం చేసే పనులను బట్టి మనకు ఫలితాలు వస్తాయి. నీ మాట విని నేను అధర్మంగా ప్రవర్తిస్తే నాకు చెడుఫలితాలే వస్తాయి. దేవేంద్రుడు నూరు అశ్వమేధ యాగములు చేసి ఇంద్రపదవి అధిష్ఠించాడు. ఎంతో మంది మహాఋషులు ఘోరమైన తపస్సులు చేసి ఉత్తమలోకములు పొందారు. వారే కాకుండా, సత్యము, ధర్మము, పరాక్రమము, భూతదయ, సరళమైన మాట, దేవతలను, బ్రాహ్మణులను పూజించడం, వీటిని మార్గములుగా చేసుకొని మానవులు ఉత్తమ లోకములు పొందారు. ఆ మానవులలో కూడా, బ్రాహ్మణులు, పైన చెప్పబడిన మార్గంలో పయనించి ఉత్తమలోకములు పొందారు.

నీవు బ్రాహ్మణుడవు. కాని అపమార్గంలో పయనిస్తున్నావు. నీ వంటి అధర్మపరుడిని, అవినీతి పరుడిని దగ్గర చేర్చి నా తండ్రి తప్పుచేసాడు. నీవు ఎవరిని ఆదర్శంగా తీసుకొని ఈ మాటలు అన్నావో ఆ బుద్ధుడు, తథాగతుడు, పరమ నాస్తికుడు, ఒట్టి దొంగ. అందుకే ప్రజలు అతనినినమ్మలేదు. జ్ఞానులు ఎప్పుడూ నాస్తికులతో సంబంధం పెట్టుకో.

ఓ జాబాలీ! నీకు పూర్వులు చాలామంది ఉన్నారు. వారు ఎన్నో యజ్ఞయాగములు, శుభమైన కర్మలు చేసారు. వారు ఈ లోకము లోనూ పరలోకములోనూ సుఖాలు అనుభవించారు. బ్రాహ్మణులు మానవుల చేత యజ్ఞములు, యాగములు మొదలగు మంగళ కరమైన కార్యములు చేయిస్తారు కానీ నీ మాదిరి నాస్తిక వాదమును వ్యాప్తి చేయరు. ఎల్లప్పుడూ ధర్మమును ఆచరించువారు. మంచివారి స్నేహము చేయువారు, తేజస్సు కలవారు, దానవ్రతులు, అహింసాపరులు, పాపము చేయని వారూ, ఉత్తములు అయిన వారు లోకములో పూజింపబడతారు. నీ లాంటి వారిని ప్రజలు గౌరవించరు.” అని కోపంతో అన్నాడు రాముడు.

రాముని మాటలు విన్న జాబాలి రాముని అనునయిస్తూ ఈ విధంగా అన్నాడు. “రామా! నీవు పొరపడుతున్నావు. నేను నాస్తికుడను కాను. నాస్తికత్వమును వ్యాప్తిచేయడం లేదు. కేవలము నిజాలు చెప్పడమే నా సంకల్పము అది నాస్తికత్వము మాదిరి అనిపిస్తుంది. నేను కూడా ఆస్తికుని వలె మాట్లాడగలను. కేవలము నిన్ను మరలా అయోధ్యకు పట్టాభిషిక్తుని చేసి, అయోధ్యా ప్రజలు, భరతుని కోరిక నెరవేరవలెననే కోరికతో అలా మాట్లాడాను కానీ వేరు కాదు.” అని రాముని అనునయించాడు జాబాలి. అంతటితో ఆ వివాదము ముగిసిపోయింది.

శ్రీమద్రామాయణము
అయోధ్యాకాండము నూట తొమ్మిదవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్

(ఈ సర్గలో మీకు ఒక శ్లోకము కనిపిస్తుంది. అందులో బుద్ధుడు, తథాగతుని ప్రస్తావన వచ్చింది. రాముడు బుద్ధుని చోరుడు అని కూడా అంటాడు. “యథాహి చోర: స తథా హి బుద్ధ స్తథాగతం నాస్తిక మత్ర విద్ధి,”. ఇది ఎలా సంభవము. రాముడు త్రేతాయుగము కాలము నాటి వాడు. బుద్ధుడు క్రీ.పూ.563 వ సంవత్సరములో జన్మించాడు. 80 సంవత్సరాలు జీవించాడు. కీ.పూ.483 సంవత్సరములో మరణించాడు. ఆయన బౌద్ధమతమును వ్యాప్తిచేసాడు. బౌద్ధము భారతదేశంలో వ్యాప్తి చెందకపోయినా దేశాలలో అవలంబింపబడుతూ ఉంది.

రామాయణ ప్రాశస్త్యమునకు ముగ్ధులై బౌద్ధులు రామాయణమును తమకు అనుకూలంగా మార్చి రాసుకున్నారు అని అంటారు. కాబట్టి బుద్ధుని కాలం నాటికే రామాయణము ఉంది అని తెలుస్తూ ఉంది. ఆ కారణం చేత రాముడు బుద్దుని గూర్చి చెప్పడం, దూషించడం అసంగతం అని అర్థం అవుతూ ఉంది. అందువలన ఈ శ్లోకములు ప్రక్షిప్తములు అనగా తరువాత “తరువాత చేర్చబడినవి” అని నిర్ధారణ అయింది. ఈ విషయమును శ్రీమద్రామాయణమునకు వ్యాఖ్య రాసిన బ్రహ్మశ్రీ ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడు గారు కూడా ధృవీకరించారు. వారి అభిప్రాయము ప్రకారము ఈ శ్లోకములు ఛందస్సు మార్చి రాయబడ్డాయి. అప్పటిదాకా అనుష్టుప్ ఛందస్సులో నడిచిన రామాయణ కధ ఈ సర్గలో ఆఖరి పదిశ్లోకములు ఉపజాతి వృత్తంలో రాయబడ్డాయి. కాబట్టి ఈ పదిశ్లోకములను ప్రక్షిప్తములు అనడంలో సందేహము లేదు. అని అభిప్రాయపడ్డారు. రాముడు బుద్ధుని గురించి చెప్పడంలోనే ఈ విషయం తేటతెల్లము అవుతోంది. బుద్ధుని మీద, బౌద్ధము మీద ద్వేషము ఉన్న అజ్ఞాత రచయిత, ఎవరో ‘ ఔచిత్యమును మరిచి, ఈ శ్లోకములను రామాయణములో చేర్చి ఉండవచ్చు అని అనుకొనవలసి వస్తోంది.)

అయోధ్యాకాండ దశోత్తరశతతమః సర్గః (110) >>

Leave a Comment