Aranya Kanda Sarga 37 In Telugu – అరణ్యకాండ సప్తత్రింశః సర్గః

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. అరణ్యకాండ సప్తత్రింశః సర్గంలో, రావణుడు తన సహచరుడు మరీచుని రాముని కోసం మాయా మృగంగా మారమని ఆదేశిస్తాడు. మరీచుడు మొదట తిరస్కరించినా, రావణుడి బలవంతం చేయడంతో అంగీకరిస్తాడు. మరీచుడు అందమైన మృగంగా మారి రాముడి ఆశ్రమం వద్ద ప్రత్యక్షమవుతాడు.

అప్రియపథ్యవచనమ్

తచ్ఛ్రుత్వా రాక్షసేంద్రస్య వాక్యం వాక్యవిశారదః |
ప్రత్యువాచ మహాప్రాజ్ఞో మారీచో రాక్షసేశ్వరమ్ ||

1

సులభాః పురుషా రాజన్ సతతం ప్రియవాదినః |
అప్రియస్య తు పథ్యస్య వక్తా శ్రోతా చ దుర్లభః ||

2

న నూనం బుద్ధ్యసే రామం మహావీర్యం గుణోన్నతమ్ |
అయుక్తచారశ్చపలో మహేంద్రవరుణోపమమ్ ||

3

అపి స్వస్తి భవేత్తాత సర్వేషాం భువి రక్షసామ్ |
అపి రామో న సంక్రుద్ధః కుర్యాల్లోకమరాక్షసమ్ ||

4

అపి తే జీవితాంతాయ నోత్పన్నా జనకాత్మజా |
అపి సీతానిమిత్తం చ న భవేద్వ్యసనం మమ ||

5

అపి త్వమీశ్వరం ప్రాప్య కామవృత్తం నిరంకుశమ్ |
న వినశ్యేత్ పురీ లంకా త్వయా సహ సరాక్షసా ||

6

త్వద్విధః కామవృత్తో హి దుఃశీలః పాపమంత్రితః |
ఆత్మానం స్వజనం రాష్ట్రం స రాజా హంతి దుర్మతిః ||

7

న చ పిత్రా పరిత్యక్తో నామర్యాదః కథంచన |
న లుబ్ధో న చ దుఃశీలో న చ క్షత్రియపాంసనః ||

8

న చ ధర్మగుణైర్హీనః కౌసల్యానందవర్ధనః |
న తీక్ష్ణో న చ భూతానాం సర్వేషామహితే రతః ||

9

వంచితం పితరం దృష్ట్వా కైకేయ్యా సత్యవాదినమ్ |
కరిష్యామీతి ధర్మాత్మా తాత ప్రవ్రజితో వనమ్ ||

10

కైకేయ్యాః ప్రియకామార్థం పితుర్దశరథస్య చ |
హిత్వా రాజ్యం చ భోగాంశ్చ ప్రవిష్టో దండకావనమ్ ||

11

న రామః కర్కశస్తాత నావిద్వాన్నాజితేంద్రియః |
అనృతం దుఃశ్రుతం చైవ నైవ త్వం వక్తుమర్హసి ||

12

రామో విగ్రహవాన్ ధర్మః సాధుః సత్యపరాక్రమః |
రాజా సర్వస్య లోకస్య దేవానాం మఘవానివ ||

13

కథం త్వం తస్య వైదేహీం రక్షితాం స్వేన తేజసా |
ఇచ్ఛసి ప్రసభం హర్తుం ప్రభామివ వివస్వతః ||

14

శరార్చిషమనాధృష్యం చాపఖడ్గేంధనం రణే |
రామాగ్నిం సహసా దీప్తం న ప్రవేష్టుం త్వమర్హసి ||

15

ధనుర్వ్యాదితదీప్తాస్యం శరార్చిషమమర్షణమ్ |
చాపపాశధరం వీరం శత్రుసైన్యపహారిణమ్ ||

16

రాజ్యం సుఖం చ సంత్యజ్య జీవితం చేష్టమాత్మనః |
నాత్యాసాదయితుం తాత రామాంతకమిహార్హసి ||

17

అప్రమేయం హి తత్తేజో యస్య సా జనకాత్మజా |
న త్వం సమర్థస్తాం హర్తుం రామచాపాశ్రయాం వనే ||

18

తస్య సా నరసింహస్య సింహోరస్కస్య భామినీ |
ప్రాణేభ్యోఽపి ప్రియతరా భార్యా నిత్యమనువ్రతా ||

19

న సా ధర్షయితుం శక్యా మైథిల్యోజస్వినః ప్రియా |
దీప్తస్యేవ హుతాశస్య శిఖా సీతా సుమధ్యమా ||

20

కిముద్యమమిమం వ్యర్థం కృత్వా తే రాక్షసాధిప |
దృష్టశ్చేత్త్వం రణే తేన తదంతం తవ జీవితమ్ ||

21

జీవితం చ సుఖం చైవ రాజ్యం చైవ సుదుర్లభమ్ |
యదీచ్ఛసి చిరం భోక్తుం మా కృథా రామవిప్రియమ్ ||

22

స సర్వైః సచివైః సార్ధం విభీషణపురోగమైః |
మంత్రయిత్వా తు ధర్మిష్ఠైః కృత్వా నిశ్చయమాత్మనః ||

23

దోషాణాం చ గుణానాం చ సంప్రధార్య బలాబలమ్ |
ఆత్మనశ్చ బలం జ్ఞాత్వా రాఘవస్య చ తత్త్వతః |
హితాహితం వినిశ్చిత్య క్షమం త్వం కర్తుమర్హసి ||

24

అహం తు మన్యే తవ న క్షమం రణే
సమాగమం కోసలరాజసూనునా |
ఇదం హి భూయః శృణు వాక్యముత్తమం
క్షమం చ యుక్తం చ నిశాచరేశ్వర ||

25

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే అరణ్యకాండే సప్తత్రింశః సర్గః ||

Aranya Kanda Sarga 37 Meaning In Telugu

“ఓ రాక్షసరాజా! నీ చుట్టూ ఎల్లప్పుడూ నిన్ను పొగిడేవాళ్లు, ప్రియంగా మాట్లాడేవాళ్లు ఉంటారు కానీ నీకు హితము చెప్పేవాళ్లు ఉండరు. ఒకవేళ అలాంటి వాళ్లు ఉన్నా నీలాంటి రాజులు వాళ్లు చెప్పే మాటలు వినరు. ఎందుకంటే అవి మీకు చెవులకు ఇంపుగా తోచవు కాబట్టి.

నీవు ఎవరి మీద కైనా యుద్ధానికి పోయేముందు వారి గురించి తెలుసుకోడానికి గూఢచారులను నియమించావా? అలా నియమించి ఉంటే నీకు రాముని గురించి తెలిసి ఉండేది. నీకు రాముని గురించి ఏమీ తెలియదు అని తెలుస్తూ ఉంది. రాముడు గుణవంతుడు, పరాక్రమవంతుడు. వీరుడు. రాముడు తలుచుకుంటే ఈ భూమి మీద రాక్షసుడు అనేవాడు లేకుండా చేయగలడు. రాముడు అంత సమర్థుడు.

ఇప్పుడు నీవు సీత గురించి మాట్లాడుతున్నావు. ఆ సీత నీకు మృత్యువు అయిందేమో అని నా అనుమానము. లేకపోతే నీకు సీతను అపహరించవలెనని ఆలోచన పుట్టదు. దానికి నన్ను సాయం అడగవు. సీతాపహరణంలో నేను నీకు సాయం చేస్తే నాకు కూడా మృత్యువు తప్పదు. నీవు లంకారాజ్యానికి రాజుగా ఉన్నందుకు, లంక సర్వనాశనం కాక తప్పదు. నీ వలన లంకా వాసులు అష్టకష్టాలు పడక తప్పదు.

ఓ రావణా! నీ వంటి వాడు రాజుగా ఉంటే, ఆ రాజే కాదు అతడు పాలించే రాజ్యము కూడా నశించిపోతుంది. ఇంక అసలు విషయం చెబుతాను విను. రాముడు తండ్రిచేత వెళ్లకొట్టబడలేదు. నీకు ఎవరో కల్పించి చెప్పారు. రాజ్యమునుండి వెళ్లగొట్టబడేంత చెడ్డపనులు చేసేవాడు కాదు రాముడు. రాముడు నీవు అనుకున్నంత లుబ్ధుడు, దుశ్శీలుడు, దుష్టుడు, అధర్మపరుడు కాడు.

అసలు విషయం నేను చెబుతాను విను. దశరథుని భార్య కైక రాముని అడవులకు పంపమని దశరథుని వరం కోరితే, తల్లితండ్రుల మాట ప్రకారము అడవులకు వచ్చాడు రాముడు. కేవలము తండ్రి మాటను గౌరవించడానికి సమస్త రాజభోగములను, రాజ్యమును విడిచి అరణ్యవాసం చేస్తున్నాడు. అంతేగాని నీవు అనుకున్నట్టు రాజ్యం నుండి వెళ్ల గొట్టబడలేదు.

(ఇక్కడ మారీచుడు చెప్పినట్టు వాల్మీకి ఒక శ్లోకం రాసాడు. అది ఇప్పుడు ఒక నానుడి అయిపోయింది.)
రామో విగ్రహవాన్ ధర్మ: సాధు: సత్య పరాక్రమః॥
రాజాసర్వస్య లోకస్య దేవానాం మఘవానిమ॥

రాముడు సాక్షాత్తు ధర్మ స్వరూపుడు. రాముని శరీరమే ధర్మానికి ప్రతీక. రాముడు సాధువు. నిజమైన పరాక్రమవంతుడు. దేవేంద్రుని వలె సకలలోకములను పాలించగల సమర్థుడు. రాముని భార్య సీత. రాముడు ఆమెను ఎల్లప్పుడూ కంటికి రెప్పలా కాపాడు తుంటాడు. సూర్యుని నుండి తేజస్సును వేరుచేయునట్లు రాముని నుండి సీతను వేరుచేయాలనే దుర్బుద్ధి నీకు ఎలా పుట్టింది. రామ బాణము అనే మంటలలోకి నీవు శలభము వలె దూకపోతున్నావు. జాగ్రత్త. నా మాటవిను. సుఖంగా రాజ్యం చేసుకో. రాముని జోలికి వెళ్లకు. కోరి కోరి రాముని కోపజ్వాలలో పడి దగ్ధంకాకు.

రాముని రక్షణలో ఉన్నంత కాలము సీతను నీవు హరించలేవు. ఆ సీత కూడా రాముని విడిచి ఉండలేదు. అందుకే కదా సమస్తరాజభోగములను తృణప్రాయంగా త్యజించి రాముని వెంట అడవులకు వచ్చింది. సీతంటే ఎవరనుకున్నావు? అయోనిజ. మిథిలాధిపతి జనకమహారాజు కూతురు. ఆమె నీవంటి దుర్మార్గులకు అగ్నిజ్వాల వంటిది. కాబట్టి నా మాట విని సీత జోలికి పోకు.

ఇటువంటి వ్యర్ధమైన పనికి ఎందుకు పూనుకుంటావు? సీతను అపహరిస్తే నిన్ను రాముడు ఎదుర్కొంటాడు. రాముని ఎదుటపడ్డ నీకు మరణం తప్పదు. ఎంతో కాలము రాజ్యము పాలిస్తూ, రాజభోగములు అనుభవించవలసిన వాడివి. అర్ధాంతరంగా . జీవితాన్ని ఎందుకు అంతం చేసుకుంటాడు. నాలుగు కాలాలపాటు బతకాలని ఉంటే రాముని జోలికి పోకు. నా జోలికి రాకు.

నామాట మీద నమ్మకం లేకపోతే, నీ తమ్ముడు విభీషణుడు ఉన్నాడుకదా! అతనితో ఆలోచించు. నీ ఆలోచన మంచిదో కాదో వారిని అడిగి తెలుసుకో. వారుచెప్పినట్టు చెయ్యి. రామునితో వైరం పెట్టుకొనే ముందు, రాముని బలాన్ని నీ బలాన్ని తులనాత్మకంగా పరిశీలించు. హితాహితములు పరిశీలించి ఒక నిర్ణయం తీసుకో. అంతేగానీ తొందరపాటు నిర్ణయం తీసుకొని కష్టాలపాలుగాకు.

రాముడితో నా స్వానుభవం గురించి చెబుతాను విను. అప్పుడు నీకు తెలుస్తుంది, రామునితో వైరం మంచిదో కాదో!” అని మారీచుడు రామునితో తన అనుభవాన్ని ఈ విధంగా చెప్పాడు.

శ్రీమద్రామాయణము
అరణ్యకాండము ముప్పదిఏడవ సర్గ సంపూర్ణము.
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్

అరణ్యకాండ అష్టాత్రింశః సర్గః (38) >>

Leave a Comment