Aranya Kanda Sarga 55 In Telugu – అరణ్యకాండ పంచపంచాశః సర్గః

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. అరణ్యకాండ పంచపంచాశః సర్గః (55వ సర్గ), శ్రీరాముడు, లక్ష్మణుడు, సీతా దేవితో కలిసి పంచవటిలో నివసిస్తున్నారు. పంచవటిలో ఉన్నప్పుడు, రావణాసురుడు హరిణి రూపంలో వచ్చి సీతను అపహరిస్తాడు. సీతను రక్షించేందుకు లక్ష్మణుడికి ఆదేశాలు ఇచ్చిన రాముడు, సీత అందుబాటులో లేకపోవడంతో విచారంలో పడతాడు.

సీతావిలోభనోద్యమః

సందిశ్య రాక్షసాన్ ఘోరాన్ రావణోఽష్టౌ మహాబలాన్ |
ఆత్మానం బుద్ధివైక్లవ్యాత్ కృతకృత్యమమన్యత ||

1

స చింతయానో వైదేహీం కామబాణసమర్పితః |
ప్రవివేశ గృహం రమ్యం సీతాం ద్రష్టుమభిత్వరన్ ||

2

స ప్రవిశ్య తు తద్వేశ్మ రావణో రాక్షసాధిపః |
అపశ్యద్రాక్షసీమధ్యే సీతాం శోకపరాయణామ్ ||

3

అశ్రుపూర్ణముఖీం దీనాం శోకభారాభిపీడితామ్ |
వాయువేగైరివాక్రాంతాం మజ్జంతీం నావమర్ణవే ||

4

మృగయూథపరిభ్రష్టాం మృగీం శ్వభిరివావృతామ్ |
అధోముఖముఖీం సీతామభ్యేత్య చ నిశాచరః ||

5

తాం తు శోకపరాం దీనామవశాం రాక్షసాధిపః |
స బలాద్దర్శయామాస గృహం దేవగృహోపమమ్ ||

6

హర్మ్యప్రాసాదసంబాధం స్త్రీసహస్రనిషేవితమ్ |
నానాపక్షిగణైర్జుష్టం నానారత్నసమన్వితమ్ ||

7

కాంచనైస్తాపనీయైశ్చ స్ఫాటికై రాజతైరపి |
వజ్రవైడూర్యచిత్రైశ్చ స్తంభైర్దృష్టిమనోహరైః ||

8

దివ్యదుందుభినిర్హ్రాదం తప్తకాంచనతోరణమ్ |
సోపానం కాంచనం చిత్రమారురోహ తయా సహ ||

9

దాంతికా రాజతాశ్చైవ గవాక్షాః ప్రియదర్శనాః |
హేమజాలావృతాశ్చాసంస్తత్ర ప్రాసాదపంక్తయః ||

10

సుధామణివిచిత్రాణి భూమిభాగాని సర్వశః |
దశగ్రీవః స్వభవనే ప్రాదర్శయత మైథిలీమ్ ||

11

దీర్ఘికాః పుష్కరిణ్యశ్చ నానావృక్షసమన్వితాః |
రావణో దర్శయామాస సీతాం శోకపరాయణామ్ ||

12

దర్శయిత్వా తు వైదేహ్యాః కృత్స్నం తద్భవనోత్తమమ్ |
ఉవాచ వాక్యం పాపాత్మా సీతాం లోభితుమిచ్ఛయా ||

13

దశ రాక్షసకోట్యశ్చ ద్వావింశతిరథాపరాః |
తేషాం ప్రభురహం సీతే సర్వేషాం భీమకర్మణామ్ ||

14

వర్జయిత్వా జరావృద్ధాన్ బాలాంశ్చ రజనీచరాన్ |
సహస్రమేకమేకస్య మమ కార్యపురఃసరమ్ ||

15

యదిదం రాజతంత్రం మే త్వయి సర్వం ప్రతిష్ఠితమ్ |
జీవితం చ విశాలాక్షి త్వం మే ప్రాణైర్గరీయసీ ||

16

బహూనాం స్త్రీసహస్రాణాం మమ యోఽసౌ పరిగ్రహః |
తాసాం త్వమీశ్వరా సీతే మమ భార్యా భవ ప్రియే ||

17

సాధు కిం తేఽన్యథా బుద్ధ్యా రోచయస్వ వచో మమ |
భజస్వ మాఽభితప్తస్య ప్రసాదం కర్తుమర్హసి ||

18

పరిక్షిప్తా సహస్రేణ లంకేయం శతయోజనా |
నేయం ధర్షయితుం శక్యా సేంద్రైరపి సురాసురైః ||

19

న దేవేషు న యక్షేషు న గంధర్వేషు పక్షిషు |
అహం పశ్యామి లోకేషు యో మే వీర్యసమో భవేత్ ||

20

రాజ్యభ్రష్టేన దీనేన తాపసేన గతాయుషా |
కిం కరిష్యసి రామేణ మానుషేణాల్పతేజసా ||

21

భజస్వ సీతే మామేవ భర్తాహం సదృశస్తవ |
యౌవనం హ్యధ్రువం భీరు రమస్వేహ మయా సహ ||

22

దర్శనే మా కృథా బుద్ధిం రాఘవస్య వరాననే |
కాఽస్య శక్తిరిహాగంతుమపి సీతే మనోరథైః ||

23

న శక్యో వాయురాకాశే పాశైర్బద్ధుం మహాజవః |
దీప్యమానస్య చాప్యగ్నేర్గ్రహీతుం విమలాం శిఖామ్ ||

24

త్రయాణామపి లోకానాం న తం పశ్యామి శోభనే |
విక్రమేణ నయేద్యస్త్వాం మద్బాహుపరిపాలితామ్ ||

25

లంకాయాం సుమహద్రాజ్యమిదం త్వమనుపాలయ |
త్వత్ప్రేష్యా మద్విధాశ్చైవ దేవాశ్చాపి చరాచరాః ||

26

అభిషేకోదకక్లిన్నా తుష్టా చ రమయస్వ మామ్ |
దుష్కృతం యత్పురా కర్మ వనవాసేన తద్గతమ్ ||

27

యశ్చ తే సుకృతో ధర్మస్తస్యేహ ఫలమాప్నుహి |
ఇహ మాల్యాని సర్వాణి దివ్యగంధాని మైథిలీ ||

28

భూషణాని చ ముఖ్యాని సేవస్వ చ మయా సహ |
పుష్పకం నామ సుశ్రోణి భ్రాతుర్వైశ్రవణస్య మే ||

29

విమానం సూర్యసంకాశం తరసా నిర్జితం మయా |
విశాలం రమణీయం చ తద్విమానమనుత్తమమ్ ||

30

తత్ర సీతే మయా సార్ధం విహరస్వ యథాసుఖమ్ |
వదనం పద్మసంకాశం విమలం చారుదర్శనమ్ ||

31

శోకార్తం తు వరారోహే న భ్రాజతి వరాననే |
ఏవం వదతి తస్మిన్ సా వస్త్రాంతేన వరాంగనా ||

32

పిధాయేందునిభం సీతా ముఖమశ్రూణ్యవర్తయత్ |
ధ్యాయంతీం తామివాస్వస్థాం దీనాం చింతాహతప్రభామ్ ||

33

ఉవాచ వచనం పాపో రావణో రాక్షసేశ్వరః |
అలం వ్రీడేన వైదేహి ధర్మలోపకృతేన చ ||

34

ఆర్షోఽయం దైవనిష్యందో యస్త్వామభిగమిష్యతి |
ఏతౌ పాదౌ మయా స్నిగ్ధౌ శిరోభిః పరిపీడితౌ ||

35

ప్రసాదం కురు మే క్షిప్రం వశ్యో దాసోఽహమస్మి తే |
ఇమాః శూన్యా మయా వాచః శుష్యమాణేన భాషితాః |
న చాపి రావణః కాంచిన్మూర్ధ్నా స్త్రీం ప్రణమేత హ ||

36

ఏవముక్త్వా దశగ్రీవో మైథీలీం జనకాత్మజామ్ |
కృతాంతవశమాపన్నో మమేయమితి మన్యతే ||

37

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే అరణ్యకాండే పంచపంచాశః సర్గః ||

Aranya Kanda Sarga 55 Meaning In Telugu

ఆ ప్రకారంగా ఎనిమిది మంది రాక్షసులను జనస్థానమునకు పంపిన తరువాత రావణుడు, ఇంక రాముని వలన ఇబ్బంది లేదనుకున్నాడు. సీత గురించి ఆలోచంచడం మొదలెట్టాడు. సీతను తలచుకుంటేనే రావణుడికి మదనతాపం ఎక్కువ కాసాగింది. ఎప్పుడెప్పుడు సీతను చూద్దామా అని తొందర తొందరగా అంతఃపురమునకు వెళ్లాడు.

రాక్షస స్త్రీల మధ్య మూర్తీభవించిన శోకదేవత మాదిరి ఉన్న సీతను చూచాడు రావణుడు. సీత కళ్లనుండి కన్నీరు ధారాపాతంగా కారుతూ ఉంది. ఆమెతలవంచి కూర్చుని ఉంది. రావణుడు సీత దగ్గరకు వెళ్లాడు ఆమెను చెయ్యిపట్టుకొని లేవనెత్తాడు. బలవంతంగా ఆమెను తనతో తీసుకువెళ్లాడు. సీతకు తన అంతఃపురము అంతా చూపించాడు.

రావణుని అంతఃపురము అనేక మేడలతోనూ, ప్రాసాదము లతోనూ నిండి ఉంది. అక్కడ వేలకొలది దాసదాసీ జనములు నివసిస్తున్నారు. రావణుని అంతఃపురము అంతా రత్నములతోనూ మణి మాణిక్యాదులతోనూ తులతూగుతూ ఉంది. ప్రాసాదములకు అమర్చిన స్తంభములు అన్నీ బంగారు, వెండితో నిర్మింపబడి ఉన్నాయి. ముఖ ద్వారముల వద్ద దుందుభుల ధ్వనులు శ్రావ్యంగా వినబడుతున్నాయి.

రావణుడు సీతను తీసుకొని సోపానములు అన్నీ ఎక్కాడు. ప్రాసాదములు అన్నీ చూపించాడు. తన అంతఃపురము బయట ఉన్న అందమైన సరస్సులను, బావులను సీతకు చూపించాడు రావణుడు. తన ఐశ్వర్యము అంతా చూచి సీత తనకు వశము అవుతుందని రావణుని భ్రమ.

“ఓ సీతా! ఈ లంకలో బాలురు, వృద్ధులు, యువకులు కలిపి 32 కోట్ల మంది రాక్షసులు ఉన్నారు. వారి కందరికీ నేనే రాజును. నేను కనుసైగ చేస్తే చాలు వేయి మంది పరిచారికలు నాముందు చేతులు కట్టుకొని నిలబడతారు. నా కోరిక మన్నిస్తే నేనే నీ దాసుడిని అవుతాను. నా పరిచారికలు అందరూ నీ ఆజ్ఞానువర్తులు అవుతారు.

నేను చేసిన దండయాత్రలలో అనేక మంది అందమైన స్త్రీలను తీసుకొని వచ్చి నా అంతఃపురములో ఉంచాను. వారందరికీ నీవే యజమానివి. వారందరూ నీకు పరిచర్యలు చేస్తారు. అందుకని నీవు నా భార్యగా ఉండు. ఇంత ఐశ్వర్యము, ఇన్ని సంపదలు చూచి కూడా ఇంకా సందేహిస్తావు ఎందుకు. వెంటనే నా మదన తాపాన్ని చల్లార్చు. నా రాణిగా ఉండు.

నాచే పరిపాలింపబడు అంకారాజ్యము నూరు యోజనముల విస్తీర్ణంతో శోభిల్లుతూ ఉంది. ఈ లంక చుట్టు భయంకరమైన సముద్రము ఉంది. అందువలన మానవమాత్రులు లంక వంక కన్నెత్తి కూడా చూడలేరు. అంతెందుకు సురులు, అసురులు, దేవేంద్రుడు సైతం వచ్చినా నా లంకను జయించలేరు. ముల్లోకములలో నన్ను మించిన పరాక్రమశాలి ఇంకొకరు లేరు.

నీ రామునికి నాకు పోలికే లేదు. రాముడు రాజ్యభ్రష్టుడు. నేను లంకాధీశుడను. రాముడు ముని వృత్తిలో ఉన్నాడు. నేను రాజభోగములు అనుభవించుచున్నాను. రాముడు మానవమాత్రుడు. నేను దైవాంశసంభూతుడను. రాముడు అల్పాయుష్కుడు. నాకు చావు లేకుండా బ్రహ్మ వరం ఉంది. ఇంకా ఆ రాముని గురించి ఎందుకు ఆలోచిస్తావు.

ఓ సీతా! రా! నన్ను వరించు. నేనే నీకు తగిన భర్తను. యౌవనంలో ఉండగానే మనం రతిసుఖాలు అనుభవిద్దాము. నేటి సుఖం నేటిదే. రేపురాదు కదా!

ఓ సీతా! ఇంకా రాముడు వచ్చి నిన్ను రక్షించి తీసుకువెళతాడని ఆశపడుతున్నావేమో! అది ఒట్టి మాట. రాముడు నీ ఊహల్లో కూడా లంక దరిదాపులకు రాలేడు. ఒక వేళ రాముడు సముద్రము దాటి లంకకు వచ్చినా, నా రక్షణలో ఉన్న నిన్ను చూడటం, తాకడం, తీసుకొని వెళ్లడం అసాధ్యం.

నీవు నన్ను వరించి నా రాణివి అయితే, దేవ, దానవ, గంధర్వ, కిన్నెరలు నీకు దాస్యం చేస్తారు. నీవు నేను లంకారా సింహాసనము మీదకూర్చొని పట్టాభిషేకము చేయించుకుందాము. ఆ అభిషేక జలములతో ఇద్దరం పునీతులము అవుదాము.

సీతా! నీ కొరకు అనేక రకములైన పుష్పములను, సుగంధ ద్రవ్యములను, మైపూతలను తెప్పించాను. వాటిని అలంకరించుకో.

ఓ సీతా! నీకు ఇంకొక విషయం చెప్పడం మరిచాను. నేను నా సోదరుడు కుబేరుడిని జయించి అతని వద్దనుండి పుష్పకము అనే మహా విమానమును తీసుకొని వచ్చాను. ఆ విమానము అద్భుతమైనది. విశాలమైనది. నీవు నేను కలిసి పుష్పకవిమానములో విహరిద్దాము.

నేను ఇన్ని చెప్పినా, నా వైభవము అంతా చూపించినా నీ ముఖం అలా దీనంగా ఉండటం బాగాలేదు. నాపట్ల ప్రసన్నంగా ఉండు.” అని పరి పరి విధములుగా బతిమాలుకున్నాడు రావణుడు.

రావణుడు అన్ని మాటలు మాట్లాడుతున్నా సీత రావణుడు చూపించిన వాటి వంక కన్నెత్తి కూడా చూడలేదు. తన ముఖాన్ని పమిట చెంగుతో కప్పుకొని ఏడుస్తూ ఉంది. సీత బాధపడటం చూచాడు రావణుడు సీతలో ఇలా అన్నాడు.

“ఓ సీతా! నీకు పెళ్లి అయిందనీ, నన్ను వరిస్తే ధర్మహాని జరుగుతుందనీ అపోహ పడవద్దు. బహు భార్యాత్వము మాదిరి మా రాక్షసులలో బహుభర్తృత్వము ఆచరణలో ఉంది. కాబట్టి దానిని గురించి నీవు దిగులుపడవద్దు. ఓ సీతా! నాకు నీ పాదములే శరణ్యము నీ పాదములు అంటి వేడుకుంటున్నాను. నన్ను నీ దాసునిగా అనుగ్రహించు. నన్ను స్వీకరించు. నీకు తెలుసో లేదో! ఈ రావణుడు ఇంతవరకూ ఏ స్త్రీ ముందరా ఇలా మోకరిల్లి నమస్కరిస్తూ నిలబడలేదు. ఆ గౌరవం నీకే దక్కింది.” అని ప్రాధేయ పడ్డాడు. లోలోపల ఇంక నాకు సీత వశము అయింది అని సంతోషంతో పొంగిపోయాడు.

శ్రీమద్రామాయణము
అరణ్యకాండము ఏబది ఐదవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్.

అరణ్యకాండ షట్పంచాశః సర్గః (56) >>

Leave a Comment