మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. అరణ్యకాండ చతుఃషష్టితమః సర్గం (64వ సర్గ) రామాయణంలో ముఖ్యమైన భాగం. ఈ సర్గలో రాముడు సీతను వెతికే క్రమంలో హనుమంతుని, జటాయువును కలుస్తాడు. జటాయువు రావణుడి చేతిలో సీత అపహరణను చూసి రామునికి ఆ విషయాన్ని తెలియజేస్తాడు. జటాయువు ధైర్యం మరియు సీతను రక్షించడానికి చేసిన ప్రయత్నం రాముడికి ఎంతో ప్రేరణ ఇస్తుంది.
రామక్రోధః
స దీనో దీనయా వాచా లక్ష్మణం వాక్యమబ్రవీత్ |
శీఘ్రం లక్ష్మణ జానీహి గత్వా గోదావరీం నదీమ్ ||
1
అపి గోదావరీం సీతా పద్మాన్యానయితుం గతా |
ఏవముక్తస్తు రామేణ లక్ష్మణః పునరేవ హి ||
2 [పరవీరహా]
నదీం గోదావరీం రమ్యాం జగామ లఘువిక్రమః |
తాం లక్ష్మణస్తీర్థవతీం విచిత్వా రామమబ్రవీత్ ||
3
నైనాం పశ్యామి తీర్థేషు క్రోశతో న శృణోతి మే |
కం ను సా దేశమాపన్నా వైదేహీ క్లేశనాశినీ ||
4
న హ్యహం వేద తం దేశం యత్ర సా జనకాత్మజా |
లక్ష్మణస్య వచః శ్రుత్వా దీనః సంతాపమోహితః ||
5
రామః సమభిచక్రామ స్వయం గోదావరీం నదీమ్ |
స తాముపస్థితో రామః క్వ సీతేత్యేవమబ్రవీత్ ||
6
భూతాని రాక్షసేంద్రేణ వధార్హేణ హృతామితి |
న తాం శశంసూ రామాయ తథా గోదావరీ నదీ ||
7
తతః ప్రచోదితా భూతైః శంసాస్మత్తాం ప్రియామితి |
న తు సాఽభ్యవదత్సీతాం పృష్టా రామేణ శోచతా ||
8
రావణస్య చ తద్రూపం కర్మాణి చ దురాత్మనః |
ధ్యాత్వా భయాత్తు వైదేహీం సా నదీ న శశంస తామ్ ||
9
నిరాశస్తు తయా నద్యా సీతాయా దర్శనే కృతః |
ఉవాచ రామః సౌమిత్రిం సీతాఽదర్శనకర్శితః ||
10
ఏషా గోదావరీ సౌమ్య కించిన్న ప్రతిభాషతే |
కిన్ను లక్ష్మణ వక్ష్యామి సమేత్య జనకం వచః ||
11
మాతరం చైవ వైదేహ్యా వినా తామహమప్రియమ్ |
యా మే రాజ్యవిహీనస్య వనే వన్యేన జీవతః ||
12
సర్వం వ్యపనయేచ్ఛోకం వైదేహీ క్వ ను సా గతా |
జ్ఞాతిపక్షవిహీనస్య రాజపుత్రీమపశ్యతః ||
13
మన్యే దీర్ఘా భవిష్యంతి రాత్రయో మమ జాగ్రతః |
మందాకినీం జనస్థానమిమం ప్రస్రవణం గిరిమ్ ||
14
సర్వాణ్యనుచరిష్యామి యది సీతా హి దృశ్యతే |
ఏతే మృగా మహావీర్యా మామీక్షంతే ముహుర్ముహుః ||
15
వక్తుకామా ఇవ హి మే ఇంగితాన్యుపలక్షయే |
తాంస్తు దృష్ట్వా నరవ్యాఘ్రో రాఘవః ప్రత్యువాచ హ ||
16
క్వ సీతేతి నిరీక్షన్ వై బాష్పసంరుద్ధయా దృశా |
ఏవముక్తా నరేంద్రేణ తే మృగాః సహసోత్థితాః ||
17
దక్షిణాభిముఖాః సర్వే దర్శయంతో నభఃస్థలమ్ |
మైథిలీ హ్రియమాణా సా దిశం యామన్వపద్యత ||
18
తేన మార్గేణ ధావంతో నిరీక్షంతే నరాధిపమ్ |
యేన మార్గం చ భూమిం చ నిరీక్షంతే స్మ తే మృగాః ||
19
పునశ్చ మార్గమిచ్ఛంతి లక్ష్మణేనోపలక్షితాః |
తేషాం వచనసర్వస్వం లక్షయామాస చేంగితమ్ ||
20
ఉవాచ లక్ష్మణో జ్యేష్ఠం ధీమాన్ భ్రాతరమార్తవత్ |
క్వ సీతేతి త్వయా పృష్టా యథేమే సహసోత్థితాః ||
21
దర్శయంతి క్షితిం చైవ దక్షిణాం చ దిశం మృగాః |
సాధు గచ్ఛావహై దేవ దిశమేతాం హి నైరృతిమ్ ||
22
యది స్యాదాగమః కశ్చిదార్యా వా సాఽథ లక్ష్యతే |
బాఢమిత్యేవ కాకుత్స్థః ప్రస్థితో దక్షిణాం దిశమ్ ||
23
లక్ష్మణానుగతః శ్రీమాన్ వీక్షమాణో వసుంధరామ్ |
ఏవం సంభాషమాణౌ తావన్యోన్యం భ్రాతరావుభౌ ||
24
వసుంధరాయాం పతితం పుష్పమార్గమపశ్యతామ్ |
తాం పుష్పవృష్టిం పతితాం దృష్ట్వా రామో మహీతలే ||
25
ఉవాచ లక్ష్మణం వీరో దుఃఖితో దుఃఖితం వచః |
అభిజానామి పుష్పాణి తానీమానీహ లక్ష్మణ ||
26
పినద్ధానీహ వైదేహ్యా మయా దత్తాని కాననే |
మన్యే సూర్యశ్చ వాయుశ్చ మేదినీ చ యశస్వినీ ||
27
అభిరక్షంతి పుష్పాణి ప్రకుర్వంతో మమ ప్రియమ్ |
ఏవముక్త్వా మహాబాహుం లక్ష్మణం పురుషర్షభః ||
28
ఉవాచ రామో ధర్మాత్మా గిరిం ప్రస్రవణాకులమ్ |
కచ్చిత్ క్షితిభృతాం నాథ దృష్టా సర్వాంగసుందరీ ||
29
రామా రమ్యే వనోద్దేశే మయా విరహితా త్వయా |
క్రుద్ధోఽబ్రవీద్గిరిం తత్ర సింహః క్షుద్రమృగం యథా ||
30
తాం హేమవర్ణాం హేమాభాం సీతాం దర్శయ పర్వత |
యావత్సానూని సర్వాణి న తే విధ్వంసయామ్యహమ్ ||
31
ఏవముక్తస్తు రామేణ పర్వతో మైథిలీం ప్రతి |
శంసన్నివ తతః సీతాం నాదర్శయత రాఘవే ||
32
తతో దాశరథీ రామ ఉవాచ చ శిలోచ్చయమ్ |
మమ బాణాగ్నినిర్దగ్ధో భస్మీభూతో భవిష్యసి ||
33
అసేవ్యః సంతతం చైవ నిస్తృణద్రుమపల్లవః |
ఇమాం వా సరితం చాద్య శోషయిష్యామి లక్ష్మణ ||
34
యది నాఖ్యాతి మే సీతామార్యాం చంద్రనిభాననామ్ |
ఏవం స రుషితో రామో దిధక్షన్నివ చక్షుషా ||
35
దదర్శ భూమౌ నిష్క్రాంతం రాక్షసస్య పదం మహత్ |
త్రస్తాయా రామకాంక్షిణ్యాః ప్రధావంత్యా ఇతస్తతః ||
36
రాక్షసేనానువృత్తాయా మైథిల్యాశ్చ పదాన్యథ |
స సమీక్ష్య పరిక్రాంతం సీతాయా రాక్షసస్య చ ||
37
భగ్నం ధనుశ్చ తూణీ చ వికీర్ణం బహుధా రథమ్ |
సంభ్రాంతహృదయో రామః శశంస భ్రాతరం ప్రియమ్ ||
38
పశ్య లక్ష్మణ వైదేహ్యాః శీర్ణాః కనకబిందవః |
భూషణానాం హి సౌమిత్రే మాల్యాని వివిధాని చ ||
39
తప్తబిందునికాశైశ్చ చిత్రైః క్షతజబిందుభిః |
ఆవృతం పశ్య సౌమిత్రే సర్వతో ధరణీతలమ్ ||
40
మన్యే లక్ష్మణ వైదేహీ రాక్షసైః కామరూపిభిః |
భిత్త్వా భిత్త్వా విభక్తా వా భక్షితా వా భవిష్యతి ||
41
తస్యా నిమిత్తం వైదేహ్యా ద్వయోర్వివదమానయోః |
బభూవ యుద్ధం సౌమిత్రే ఘోరం రాక్షసయోరిహ ||
42
ముక్తామణిమయం చేదం తపనీయవిభూషితమ్ |
ధరణ్యాం పతితం సౌమ్య కస్య భగ్నం మహద్ధనుః ||
43
రాక్షసానామిదం వత్స సురాణామథవాఽపి వా |
తరుణాదిత్యసంకాశం వైడూర్యగులికాచితమ్ ||
44
విశీర్ణం పతితం భూమౌ కవచం కస్య కాంచనమ్ |
ఛత్రం శతశలాకం చ దివ్యమాల్యోపశోభితమ్ ||
45
భగ్నదండమిదం కస్య భూమౌ సమ్యఙ్నిపాతితమ్ |
కాంచనోరశ్ఛదాశ్చేమే పిశాచవదనాః ఖరాః ||
46
భీమరూపా మహాకాయాః కస్య వా నిహతా రణే |
దీప్తపావకసంకాశో ద్యుతిమాన్ సమరధ్వజః ||
47
అపవిద్ధశ్చ భగ్నశ్చ కస్య సాంగ్రామికో రథః |
రథాక్షమాత్రా విశిఖాస్తపనీయవిభూషణాః ||
48
కస్యేమేఽభిహతా బాణాః ప్రకీర్ణా ఘోరకర్మణః |
శరావరౌ శరైః పూర్ణౌ విధ్వస్తౌ పశ్య లక్ష్మణ ||
49
ప్రతోదాభీషుహస్తో వై కస్యాయం సారథిర్హతః |
కస్యేమౌ పురుషవ్యాఘ్ర శయాతే నిహతో యుధి ||
50
చామరగ్రాహిణౌ సౌమ్య సోష్ణీషమణికుండలౌ |
పదవీ పురుషస్యైషా వ్యక్తం కస్యాపి రక్షసః ||
51
వైరం శతగుణం పశ్య మమేదం జీవితాంతకమ్ |
సుఘోరహృదయైః సౌమ్య రాక్షసైః కామరూపిభిః ||
52
హృతా మృతా వా సీతా సా భక్షితా వా తపస్వినీ |
న ధర్మస్త్రాయతే సీతాం హ్రియమాణాం మహావనే ||
53
భక్షితాయాం హి వైదేహ్యాం హృతాయామపి లక్ష్మణ |
కే హి లోకేఽప్రియం కర్తుం శక్తాః సౌమ్య మమేశ్వరాః ||
54
కర్తారమపి లోకానాం శూరం కరుణవేదినమ్ |
అజ్ఞానాదవమన్యేరన్ సర్వభూతాని లక్ష్మణ ||
55
మృదుం లోకహితే యుక్తం దాంతం కరుణవేదినమ్ |
నిర్వీర్య ఇతి మన్యంతే నూనం మాం త్రిదశేశ్వరాః ||
56
మాం ప్రాప్య హి గుణో దోషః సంవృత్తః పశ్య లక్ష్మణ |
అద్యైవ సర్వభూతానాం రక్షసామభవాయ చ ||
57
సంహృత్యైవ శశిజ్యోత్స్నాం మహాన్ సూర్య ఇవోదితః |
సంహృత్యైవ గుణాన్ సర్వాన్ మమ తేజః ప్రకాశతే ||
58
నైవ యక్షా న గంధర్వా న పిశాచా న రాక్షసాః |
కిన్నరా వా మనుష్యా వా సుఖం ప్రాప్స్యంతి లక్ష్మణ ||
59
మమాస్త్రబాణసంపూర్ణమాకాశం పశ్య లక్ష్మణ |
నిఃసంపాతం కరిష్యామి హ్యద్య త్రైలోక్యచారిణామ్ ||
60
సన్నిరుద్ధగ్రహణమావారితనిశాకరమ్ |
విప్రనష్టానలమరుద్భాస్కరద్యుతిసంవృతమ్ ||
61
వినిర్మథితశైలాగ్రం శుష్యమాణజలాశయమ్ |
ధ్వస్తద్రుమలతాగుల్మం విప్రణాశితసాగరమ్ ||
62
త్రైలోక్యం తు కరిష్యామి సంయుక్తం కాలధర్మణా |
న తాం కుశలినీం సీతాం ప్రదాస్యంతి యదీశ్వరాః ||
63
అస్మిన్ ముహూర్తే సౌమిత్రే మమ ద్రక్ష్యంతి విక్రమమ్ |
నాకాశముత్పతిష్యంతి సర్వభూతాని లక్ష్మణ ||
64
మమ చాపగుణోన్ముక్తైర్బాణజాలైర్నిరంతరమ్ |
అర్దితం మమ నారాచైర్ధ్వస్తభ్రాంతమృగద్విజమ్ ||
65
సమాకులమమర్యాదం జగత్పశ్యాద్య లక్ష్మణ |
ఆకర్ణపూర్ణైరిషుభిర్జీవలోకం దురాసదైః ||
66
కరిష్యే మైథిలీహేతోరపిశాచమరాక్షసమ్ |
మమ రోషప్రయుక్తానాం సాయకానాం బలం సురాః ||
67
ద్రక్ష్యంత్యద్య విముక్తానామతిదూరాతిగామినామ్ |
నైవ దేవా న దైతేయా న పిశాచా న రాక్షసాః ||
68
భవిష్యంతి మమ క్రోధాత్ త్రైలోక్యే విప్రణాశితే |
దేవదానవయక్షాణాం లోకా యే రక్షసామపి ||
69
బహుధా న భవిష్యంతి బాణౌఘైః శకలీకృతాః |
నిర్మర్యాదానిమాన్ లోకాన్ కరిష్యామ్యద్య సాయకైః ||
70
హృతాం మృతాం వా సౌమిత్రే న దాస్యంతి మమేశ్వరాః |
తథారూపాం హి వైదేహీం న దాస్యంతి యది ప్రియామ్ ||
71
నాశయామి జగత్సర్వం త్రైలోక్యం సచరాచరమ్ |
ఇత్యుక్త్వా రోషతామ్రాక్షో రామో నిష్పీడ్య కార్ముకమ్ ||
72
శరమాదాయ సందీప్తం ఘోరమాశీవిషోపమమ్ |
సంధాయ ధనుషి శ్రీమాన్ రామః పరపురంజయః ||
73
యుగాంతాగ్నిరివ క్రుద్ధ ఇదం వచనమబ్రవీత్ |
యథా జరా యథా మృత్యుర్యథా కాలో యథా విధిః ||
74
నిత్యం న ప్రతిహన్యంతే సర్వభూతేషు లక్ష్మణ |
తథాఽహం క్రోధసంయుక్తో న నివార్యోఽస్మి సర్వథా ||
75
పురేవ మే చారుదతీమనిందితాం
దిశంతి సీతాం యది నాద్య మైథిలీమ్ |
సదేవగంధర్వమనుష్యపన్నగం
జగత్సశైలం పరివర్తయామ్యహమ్ ||
76
ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే అరణ్యకాండే చతుఃషష్టితమః సర్గః ||
Aranya Kanda Sarga 64 Meaning In Telugu PDF
రాముడికి ఇంకాఆశ చావలేదు. ‘ఏమో సీత ఎక్కడికైనా వెళ్లిందేమో. మనము అనవసరంగా ఆందోళన పడుతున్నామేమో’ అనే ఆలోచన వచ్చింది. వెంటనే లక్ష్మణుని పిలిచి
“లక్ష్మణా! నీవు వెంటనే గోదావరీనదీ తీరానికి వెళ్లు. అక్కడ సీత తామరపూలు కొయ్యడానికి కానీ, స్నానానికి కానీ వెళ్లిందేమో చూడు.’ ఇదే ఆఖరి ఆశ.” అన్నాడు రాముడు.
అన్న మాట ప్రకారము లక్ష్మణుడు గోదావరీ నదీతీరానికి వెళ్లాడు. తీర ప్రాంతము అంతా వెదికాడు. కానీ సీత జాడ ఎక్కడా కనపడలేదు. నిరాశతో రాముని వద్దకు వచ్చాడు.
“అన్నయ్యా! నేను గోదావరి తీరం అంతా వెదికాను. బిగ్గరగా అరిచాను. సీత ఎక్కడా కనిపించలేదు.” అని చెప్పాడు.
ఆఖరి ఆశకూడా వమ్ముకావడంతో రాముడు హతాశు డయ్యాడు. కాని రామునికి ఇంకా కొస ఆశ మిగిలి ఉంది. “లక్ష్మణుడు సరిగా చూచాడో! లేదో ఏమో!” అని తానే స్వయంగా గోదావరీ నదీ తీరానికి వెళ్లాడు. సీతా! సీతా! అని బిగ్గరగా అరుస్తూ ఆ ప్రాంతమంతా కలయ తిరిగాడు.
రావణుడు సీతను అపహరించిన సంగతి అక్కడ ఉన్న వృక్షములకు, జంతువులకు, పక్షులకు, గోదావరీ నదికి తెలుసు. కాని అవి చెప్పలేవు. రాముడు నిరాశ చెందాడు. లక్ష్మణునితో ఇలా అన్నాడు. “లక్ష్మణా! నేను ఎంత ఎలుగెత్తి పిలిచిననూ ఈ వనములో ఉన్న చెట్లు, పక్షులు, జంతువులు, గోదావరి నది ఎవరూ బదులు చెప్పడం లేదు. ఏం చేయాలి. నీ పాణిని గ్రహించిన సీత ఏదీ అని సీత తల్లి తండ్రులు అడిగితే నేను ఏమి సమాధానము చెప్పాలి.
లక్ష్మణా! నా రాజ్యము పోయినా, అరణ్యవాసము సంప్రాప్తిం చినా, నేను అధైర్యపడక సీతను చూచి బతుకుతున్నాను. ఇప్పుడు ఆ సీత నన్ను విడిచి పోయింది. ఇప్పుడు నేను ఎవరిని చూచి బతకాలి. నాకు ధైర్యము చెప్పేవాళ్లు ఎవరు.
లక్ష్మణా! చూచావా! ఈ మృగములు నన్ను చూచి తలలు ఎత్తి ఏమో చెప్పాలి అనుకుంటున్నాయి. కాని చెప్పలేకపోతున్నాయి. సీత గురించి వీటికి తెలిసి ఉంటుంది. ఉండు వీటిని అడుగుతాను.” అని రాముడు ఒక్కొక్క మృగం దగ్గరకు పోయి “సీత ఎక్కడ ఉందో నీకు తెలుసా!” అని ప్రతి మృగమును అడుగుతున్నాడు.
వాటి కళ్ల వెంట కన్నీరు కారుతూ ఉంది. కాని ఏమీ చెప్పలేకపోతున్నాయి. కాని అవి ఒక సంకేతమును ఇచ్చాయి. ఆ మృగములు తమ మోరలు ఎత్తి అరుస్తూ దక్షిణ దిక్కుకు పరుగెడుతున్నాయి. ఆకాశం వంక చూస్తున్నాయి. మరలా దక్షిణ దిక్కుగా పరుగెడుతున్నాయి.
రాముడు సీతా వియోగ దుఃఖంలో ఉన్నాడు. కానీ లక్ష్మణుడు సూక్ష్మబుద్ధితో వాటి సంకేతాలు గ్రహించాడు. “రామా! గమనించావా! నువ్వు “మీరు సీతను చూచారా! సీత ఎక్కడకు వెళ్లింది” అని అడగగానే ఈ మృగములు ఆకాశం వంక చూస్తూ దక్షిణ దిక్కుగా పరుగెడుతున్నాయి. ఎవరో సీతను ఆకాశ మార్గంలో దక్షిణదిక్కుగా తీసుకువెళ్లినట్టు వాటి చర్యలను బట్టి తెలుస్తూ ఉంది. కాబట్టి మనము దక్షిణ దిక్కుగా వెళ్లి వెదుకుదాము. సీత జాడ ఏమైనా తెలుస్తుందేమో!” అని అన్నాడు లక్ష్మణుడు.
ప్రవాహంలో కొట్టుకుపోతున్నవాడికి గడ్డిపరక దొరికినా లాభమే అన్నట్టు రాముడికి లక్ష్మణుడు చెప్పిన ఈ చిన్న మాట ఆశను రేకెత్తించింది. “లక్ష్మణా! అలాగే చేద్దాము. పద పోదాం.” అన్నాడు రాముడు. రాముడు లక్ష్మణుడు ఇద్దరూ దక్షిణ దిక్కుగా వెళు తున్నారు.మార్గంలో సీత ధరించిన పూలు చెల్లాచెదురుగా పడిఉ డ చూచారు.
రాముడు ఆపూలను చూచాడు. “లక్ష్మణా! ఈ పూలు చూచావా! ఈ రోజు ఉదయం నేను అడవిలో నుండి కోసుకొని వచ్చి సీతకు ఇచ్చాను. ఈ పూలు ఇంకా వాడిపోలేదు. ఇప్పుడు ఈ పుష్పాలు మనకు దారి చూపుతున్నాయి.” అని సంతోషించాడు.
మరలా రాముడు తన ధోరణిలో మాట్లాడుతున్నాడు. “ఓ పర్వతములారా! మీకు సీత జాడ తెలుసు. ఎవరు తీసుకొనిపోయారో తెలుసు. తెలిసీ చెప్పకపోయారో నా బాణములతో మిమ్ములను పిండి పిండి చేస్తాను.” అని పెద్దగా అరిచాడు. రాముని మాటలకు పర్వతములు బదులు చెబుతున్నాయా అన్నట్టు రాముని మాటలు ప్రతిధ్వనించాయి.
ఇంతలో నేలమీద అటు ఇటు పరుగెట్టినట్టు పెద్ద పెద్ద అడుగులు, చిన్న చిన్న అడుగులు కనపడ్డాయి. పెద్ద అడుగులు రాక్షసునివి గానూ చిన్న అడుగులు సీతవి గానూ పోల్చుకున్నారు రామలక్ష్మణులు. ఆతురతగా ముందుకు నడిచారు.
వారికి ఒక వటవృక్షము దగ్గర విరిగిన ధనుస్సు బాణములు, ముక్కలైన రథము కనపడ్డాయి. అక్కడ ఒక యుద్ధం జరిగినట్టు ఆనవాళ్లు కనపడ్డాయి. అక్కడక్కడా విరిగిన ఆభరణములు చెల్లాచెదురుగా పడిఉన్నాయి. వాటిని సీత ఆభరణములుగా గుర్తించాడు రాముడు. వారు అక్కడ సీత జాడ కోసరం నిశితంగా వెదుకుతున్నారు. “లక్ష్మణా! ఇటు చూడు. ఇక్కడ నేల మీద రక్త బిందువులు కనపడుతున్నాయి. ఇది చూస్తుంటే ఇక్కడ ఆ రాక్షసుడు సీతను చంపి ఉంటాడు. లక్ష్మణా! చూస్తుంటే ఇక్కడ ఇద్దరు రాక్షసులు యుద్ధము చేసిన గుర్తులు కనిపిస్తున్నాయి. ఇదుగో ఇటు చూడు! బంగారముతో అలంకరింపబడిన ధనుస్సు ఇక్కడ విరిగిపడి ఉంది. ఇది ఎవరిదిఅయి ఉంటుందో తెలియదు. లక్ష్మణా! ఇటుచూడు. ఇక్కడ బంగారు కవచము పడిఉంది. ” అని అన్నాడు రాముడు.
“అన్నయ్యా! ఇక్కడ ఎవరిదో పెద్ద ఛత్రము పడిఉంది. అదుగో అక్కడ పిశాచముఖములు కలిగిన గాడిదలు చచ్చి పడిఉన్నాయి. ఇవన్ని చూస్తుంటే నువ్వు అన్నట్టు ఇక్కడ ఏదో యుద్ధము జరిగినట్టు కనపడుతూ ఉంది.” అని అన్నాడు లక్ష్మణుడు.
“లక్ష్మణా! ఈ రథము ఎవరిదో మహారాజుదిగా ఉంది. అంతా బంగారంతో చేయబడి ఉంది. ఇక్కడ పడిఉన్న బాణములు కూడా చాలా పొడుగ్గా ఉన్నాయి. బంగాచపు ములికలు కలిగి ఉన్నాయి. రెండు అమ్ములపొదులు కూడా ఉన్నాయి. రథసారథికూడా చచ్చిపడి ఉన్నాడు. ఈసారథి చేతిలో రథమునకు కట్టిన గాడిదల కళ్ళెములు, కొరడా ఉన్నాయి. ఇక్కడ ఇద్దరు చామరములు వీచే వాళ్లుకూడా చంపబడినట్టున్నారు. వాళ్ల శరీరాలు చెల్లాచెదరుగా పడిఉన్నాయి. వీరందరూ ఇక్కడ జరిగిన యుద్ధములో చంపబడినట్టున్నారు” అని రాముడు అక్కడ పడి ఉన్న మృతదేహాలను చూస్తున్నాడు.
లక్ష్మణుడు కూడా వారిని చూచి వారు రాక్షసులు అని పోల్చుకున్నాడు. కాని సీత ఏమయిందో తెలయడం లేదు. రామునికి అర్థం అయింది. ఇదంతా రాక్షసుల పని అని. లక్ష్మణుని చూచి రాముడు ఇలా అన్నాడు.
“ఓ లక్ష్మణా! ఇదంతా చూస్తుంటే ఇక్కడ రాక్షసుల మధ్య యుద్ధం జరిగినట్టు కనపడుతూ ఉంది. సీతను తీసుకువెళ్లడం గానీ, చంపి తినడం గానీ జరిగి ఉండవచ్చు. సీత గురించి ఇక్కడ ఘోరయుద్ధం జరిగినట్టు ఆనవాళ్లు కనపడు తున్నాయి. దేవతలుగానీ వనదేవతలు గానీ సీతను రక్షించలేదు. ఏది ఏమయినా నాకు తీరని నష్టం కలుగజేసారు. నాకు సహజంగా దయాగుణం ఉంది. అనవసరంగా నేను ఎవరికీ అపకారము చెయ్యను. నా దయా గుణమును దేవతలు, వనదేవతలు, రాక్షసులు నా చేతగాని తనంగా భావిస్తున్నారు. నన్ను పరాక్రమము లేని వాడుగా అనుకొంటున్నారు. నా దయాగుణమే నాకు శత్రువుగా పరిణమించింది.
అందుకని, నేను నా దయాగుణమును తొక్కిపట్టి, విజృంభిస్తాను. సకల భూతములను, రాక్షసులను నాశనం చేస్తాను. యక్షగంధర్వ, పిశాచ, దానవులను క్షోభపెడతాను. ఎవరినీ సుఖంగా బతకనివ్వను. నా అస్త్ర శస్త్రములతో ముల్లోకములను అల్లకల్లోలం చేస్తాను. ఈ దేవతలు నా సీతను నాకు క్షేమంగా అప్పగించకపోతే నా పరాక్రమము ఏమిటో వారికి తెలియజేస్తాను.” అని పలికి విల్లు ఎక్కుపెట్టాడు రాముడు.
“లక్ష్మణా! ఇక్కడ ఉన్న వారందరికీ నా సీతకు ఏమయిందో తెలుసు. కానీ నాకు చెప్పడం లేదు. వారు, దేవతలు కానీ, రాక్షసులు గానీ, నా సీత జాడ చెప్పకపోయినా, నా సీతను నాకు సజీవంగా నాకు అప్పగించకపోయినా, ఈ బాణంతో ముల్లోకములను క్షోభింపజేస్తాను.” అని విల్లు ఎక్కుపెట్టాడు రాముడు.
శ్రీమద్రామాయణము
అరణ్యకాండము అరువది నాల్గవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్
అరణ్యకాండ పంచషష్టితమః సర్గః (65) >>