మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు శ్రీ మహాలక్ష్మీదేవి వైభవము గురించి భక్తి యోగం లో తెలుసుకుందాం… అష్టలక్ష్మీ స్తోత్రం ఒక ప్రముఖమైన హిందూ ప్రార్థనా సంస్కృతిలో ఒక పవిత్ర స్తోత్రము. ఈ స్తోత్రం మహాలక్ష్మిని స్తుతిస్తుంది, అష్టలక్ష్మీలు మహాలక్ష్మి దేవికి అంగములగా అనిపిస్తాయి. ఈ స్తోత్రంలో లక్ష్మీదేవికి అనుగ్రహించే స్వర్ణదాత మహాలక్ష్మీకి అర్పించిన స్తుతులు ఉన్నాయి. ఈ స్తోత్రంలో ఆధ్యాత్మికత, ఐశ్వర్యం, ప్రేమ, క్షమా, శాంతి, సౌందర్యము, శక్తి, ధర్మము, కీర్తి, ధన సంపాదన, ఆరోగ్య లభ్యం లక్ష్మీ అనుగ్రహాన్ని చెందడంలో అందరికీ ఆశీస్సులు లభించడం వంటి విషయాలు చెప్పబడినవి.
అష్టలక్ష్మీ మూర్తులు అందించే శక్తులు
అష్టలక్ష్మి అనగా ఎనిమిది లక్ష్ములు అను అర్దం వచ్చును. అష్టలక్ష్మి మూర్తుల శక్తులు అనగా, అష్ట దేవతా మూర్తులు మనకి ప్రసాదించే అష్ట శక్తులు. ఒక్కొక్క లక్ష్మి ఒక్కొక్క శక్తిని మనకు అనుగ్రహిస్తుంది. ఏ, ఏ లక్ష్ములు ఏమేమి శక్తులని ప్రసాదిస్తారో, క్రింద ఇచ్చిన విదముగా తెలుసుకుందాము.
1. శ్రీ ఆదిలక్ష్మిదేవి
ప్రాణశక్తికి, దైహిక మానసిక ఆరోగ్యానికి అధిష్టాన దేవత.
2. శ్రీ ధాన్యలక్ష్మీ మాత
సకల సస్యసంపదలకి, పాడి పంటలకి అధిష్టాన దేవత, శారీరక ధారుఢ్యాన్న ప్రసాదించే తల్లి.
3. శ్రీ దైర్యలక్ష్మీమాత
ధైర్య సాహసాలు, మనోబలం ప్రసాదించే తల్లి.
4. శ్రీ గజలక్ష్మీమాత
సమస్త శుభాలకీ అధిష్టాన దేవత.
5. శ్రీ సంతాన లక్ష్మీ మాత
సత్సంతాన ప్రాప్తికి అధిష్టాన దేవత.
6. శ్రీ విజయలక్ష్మీ మాత
సకల కార్యసిద్ధికీ, సర్వత్రా విజయసాధనకి అధిష్టాన దేవత.
7. శ్రీ విద్యాలక్ష్మి మాత
విద్యావివేకాలకి, మన అర్హతలకి తగిన గుర్తింపు రాణింపు కలిగేలా చేసే చల్లని తల్లి దేవత.
8. శ్రీ ధనలక్ష్మీ మాత
సకలైశ్వర్య ప్రదాయిని. అన్ని సంపదలకి అధిష్టాన.
ఈ శ్రీఅష్టలక్ష్మీ ఆరాధన వైభవం పుస్తకం ద్వారా శ్రీమన్మహలక్ష్మీదేవి ప్రాదుర్భావం, వైభవ కటాక్షాలతో మొదలు పెట్టి వరుసగా ఎనిమిది మంది అష్టలక్ష్మీ మాతల స్వరూప, వైభవ, ఆగ్రహానుగ్రహ ప్రభావాలు, ఆరాధన పద్ధతులు, వీటి వల్ల కలిగే ఫలితాల గురించి వివరించటం జరిగింది. శ్రద్ధా భక్తులతో ఈ పుస్తకాన్ని చదివి ఆ జగన్మాత అనుగ్రహం వల్ల అందరూ సుఖ సంతోషాలతో ఆనందంగా వుండాలని మా ఆకాంక్ష.
మన అపోహలు – సందేహాలు
సకల జీవావళికి అవసరమైన శక్తి సామర్థ్యాలను ప్రసాదించే నిమిత్తం శ్రీ మహాలక్ష్మీదేవి అష్టలక్ష్మీ రూపాలను ధరించింది. తన పిల్లలమైన మన అభ్యున్నతికోసం అహరహం ఆరాటపడుతుంది జగన్మాత. అటువంటి లక్ష్మీదేవి అనుగ్రహం గురించి, స్వభావం గురించి మనలో ఎన్నో అపోహలు వున్నాయి. పాశ్చాత్య విజ్ఞాన ప్రభావం బాగా వంటబట్టిన మన నేటితరం వారికి మన సనాతన సాంప్రదాయం, పూజా పునస్కారాల గురించి ఎన్నో సందేహాలు అవి ఏమిటో చూద్దాం.
- లక్ష్మీదేవి అనగానే మనకి స్ఫురణకి వచ్చేది. తన చేతుల నుంచి బంగారు కాసులను అనుగ్రహించే శ్రీ ధనలక్ష్మీదేవి రూపమే అందువల్లనే లక్ష్మీపూజ అనగానే ధనాన్ని కోరి చేసే పూజ మాత్రమే అనే అపోహ జనబాహుళ్యంలో వుంది.
- ఇక లక్ష్మీదేవి అనుగ్రహం చంచలమైనదని, ఆ తల్లి అనుగ్రహం ఎంత కాలం మనవద్ద వుంటుందో తెలియదని, ఎప్పుడు వదలి వెళ్ళిపోతుందో తెలియదనే తప్పు అభిప్రాయం కూడా జనానీకంలో నెలకొని వుంది.
- అదే విధంగా లక్ష్మీ సరస్వతులు అత్తాకోడళ్ళు అనీ, లక్ష్మి వున్న చోట విద్య వుండదు అనీ, విద్య వున్నచోట లక్ష్మి వుండదు. అని అంటూ వుంటారు. ఇదీ అపోహే.
- ఇక అష్టలక్ష్మీ ఆరాధన విషయానికి వస్తే, ఇలా ఎనిమిది రకాల లక్ష్మీ రూపాలను ఎందుకు పూజించాలి? ఒక మహాలక్ష్మీ రూపాన్ని పూజిస్తే చాలదా? అనేది కూడా ఒక ప్రశ్న.
- లోకంలో అందరూ వారి వారి పద్ధతులలో భగవదారాధన చేసుకుంటూ తమ తమ కోరికలను, అవసరాలని నెరవేర్చుకుంటూ వుండగా ప్రత్యేకంగా అష్టలక్ష్మీ ఆరాధన, పూజ, వైభవాల గురించి తెలుసుకోవలసిన అవసరం ఏమిటి?
- తార్కిక దృష్టితో మాత్రమే ఆలోచించే నేటి ఆధునికులు లోకంలో ఏ పని అయినా సరే మనం కష్టపడి శ్రద్ధగా చేయటం వల్లనే పరిపూర్ణమైన ఫలితాన్ని పొందగలుగుతాం అంటారు. అంతే కాని ఆ పని సఫలం కావటానికి లక్ష్మీదేవో, మరే దేవతో అనుగ్రహం కావాలనటం మూర్ఖత్వం అని కూడా అంటూ వుంటారు.
- అదే విధంగా చేసే పనిని శ్రద్ధగా చేస్తే చాలు, అదే అసలైన పూజ అనే వారూవున్నారు. ఇవి ఎంత వరకు నిజం?
- అయినా ఈ యిరవై ఒకటవ శతాబ్దంలో సైన్సు విపరీతంగా అభివృద్ధి చెంది పోయి సృష్టికి ప్రతిసృష్టి చేయాలని ఉవ్విళ్లూరుతున్న మానవ సమాజంలో, యీ విధంగా పూజల వల్ల బీజాక్షర జపాల వల్ల ఫలితాలు కలుగుతాయంటే నమ్మేవారు ఎందరు?
- ఆధునిక యుగంలో ప్రతినిత్యం తమ తమ దైనందిన కార్యక్రమాలలో తలమునకలై ప్రతిక్షణం హడావుడి పడిపోతూ జీవించే నేటి తరం వారికి ఈ విధమైన భగవదారాధనకి సమయం ఎక్కడిది?
- భక్తిశ్రద్ధలతో కూడిన పూజా పురస్కారాలు వగైరా వయస్సు మళ్ళి, ఓపిక తగ్గిన వృద్ధులకే గాని భుక్తికోసం కోటి విద్యలు నేర్చుకుని అహరహం ధనార్జనలో సతమతమయ్యే యువతకి ఈ ఆరాధనల అవసరం ఏమిటి?
ఇలా అనేక సందేహాలు వస్తూ వుంటాయి. ఇవన్నీ చాలా సహజమైన సందేహాలే. ఏ విషయాన్నైనా సశాస్త్రీయంగా విశ్లేషిస్తే గాని నేటితరం అంగీకరించదు. అలాంటివారి కోసమే ఈ పుస్తకం. ఈ పుస్తకం శ్రద్ధగా చదివితే పైన చెప్పిన అన్ని సందేహాలకి సమాధానాలు దొరికి మనకి ఏం కావాలో కూడా మనకి తెలుస్తుంది.