Ayodhya Kanda Sarga 106 In Telugu – అయోధ్యాకాండ షడుత్తరశతతమః సర్గః

అయోధ్యాకాండ షడుత్తరశతతమః సర్గః వాల్మీకి రామాయణంలో ముఖ్యమైన భాగం. ఈ సర్గలో, భరతుడు రాముని అయోధ్యకు తీసుకురావాలని ప్రయత్నిస్తాడు. భరతుడు రాముడి పాదుకలను తీసుకొని తిరిగి అయోధ్యకు వెళ్తాడు, ఎందుకంటే రాముడు తన వనవాసాన్ని ముగించక ముందే రావడానికి నిరాకరిస్తాడు. రాముడు తన తండ్రి దశరథుని ఆజ్ఞలను గౌరవిస్తూ, తన వనవాస ధర్మాన్ని కొనసాగిస్తాడు. భరతుడు రాముని పాదుకలను సింహాసనంపై ఉంచి, రాముని పరిపాలనలో దేశాన్ని పాలిస్తాడు. ఈ సర్గ భక్తి, ధర్మం, మరియు పితృభక్తికి ఉన్న ప్రాధాన్యతను చూపిస్తుంది.

భరతవచనమ్

ఏవముక్త్వా తు విరతే రామే వచనమర్థవత్ |
తతో మందాకినీ తీరే రామం ప్రకృతివత్సలమ్ |
ఉవాచ భరతశ్చిత్రం ధార్మికో ధార్మికం వచః || ౧ ||

కో హి స్యాదీదృశో లోకే యాదృశస్త్వమరిందమ |
న త్వాం ప్రవ్యథయేద్దుఃఖం ప్రీతిర్వా న ప్రహర్షయేత్ || ౨ ||

సమ్మతశ్చాసి వృద్ధానాం తాంశ్చ పృచ్ఛసి సంశయాన్ |
యథా మృతస్తథా జీవన్ యథాఽసతి తథా సతి || ౩ ||

యస్యైష బుద్ధిలాభః స్యాత్పరితప్యేత కేన సః |
పరావరజ్ఞో యశ్చ స్యాత్తథా త్వం మనుజాధిప || ౪ ||

సైవం వ్యసనం ప్రాప్య న విషీదితుమర్హతి |
అమరోపమ సత్త్వస్త్వం మహాత్మా సత్యసంగరః || ౫ ||

సర్వజ్ఞః సర్వదర్శీ చ బుద్ధిమాంశ్చాసి రాఘవ |
న త్వామేవంగుణైర్యుక్తం ప్రభవాభవకోవిదమ్ || ౬ ||

అవిషహ్యతమం దుఃఖమాసాదయితుమర్హతి |
ప్రోషితే మయి యత్పాపం మాత్రా మత్కారణాత్కృతమ్ || ౭ ||

క్షుద్రయా తదనిష్టం మే ప్రసీదతు భవాన్మమ |
ధర్మబంధేన బద్ధోఽస్మి తేనేమాం నేహ మాతరమ్ || ౮ ||

హన్మి తీవ్రేణ దండేన దండార్హాం పాపకారిణీమ్ |
కథం దశరథాజ్జాతః శుద్ధాభిజనకర్మణః || ౯ ||

జానన్ ధర్మమధర్మిష్ఠం కుర్యాం కర్మ జుగుప్సితమ్ |
గురుః క్రియావాన్ వృద్ధశ్చ రాజా ప్రేతః పితేతి చ || ౧౦ ||

తాతం న పరిగర్హేయం దైవతం చేతి సంసది |
కో హి ధర్మార్థయోర్హీనమీదృశం కర్మ కిల్బిషమ్ || ౧౧ ||

స్త్రియాః ప్రియం చికీర్షుః సన్ కుర్యాద్ధర్మజ్ఞ ధర్మవిత్ |
అంతకాలే హి భూతాని ముహ్యంతీతి పురాశ్రుతిః || ౧౨ ||

రాజ్ఞైవం కుర్వతా లోకే ప్రత్యక్షం సా శ్రుతిః కృతా |
సాధ్వర్థమభిసంధాయ క్రోధాన్మోహాచ్చ సాహసాత్ || ౧౩ ||

తాతస్య యదతిక్రాంతం ప్రత్యాహరతు తద్భవాన్ |
పితుర్హి యదతిక్రాంతం పుత్రో యస్సాధు మన్యతే || ౧౪ ||

తదపత్యం మతం లోకే విపరీతమతోఽన్యథా |
అభిపత్తా కృతం కర్మ లోకే ధీరవిగర్హితమ్ || ౧౫ ||

కైకేయీం మాం చ తాతం చ సుహృదో బాంధవాంశ్చ నః |
పౌరజానపదాన్ సర్వాంస్త్రాతు సర్వమిదం భవాన్ || ౧౬ ||

క్వ చారణ్యం క్వ చ క్షాత్త్రం క్వ జటాః క్వ చ పాలనమ్ |
ఈదృశం వ్యాహతం కర్మ న భవాన్ కర్తుమర్హతి || ౧౭ ||

ఏష హి ప్రథమో ధర్మః క్షత్రియస్యాభిషేచనమ్ |
యేన శక్యం మహాప్రాజ్ఞ ప్రజానాం పరిపాలనమ్ || ౧౮ ||

కశ్చ ప్రత్యక్షముత్సృజ్య సంశయస్థమలక్షణమ్ |
ఆయతిస్థం చరేద్ధర్మం క్షత్త్రబంధురనిశ్చితమ్ || ౧౯ ||

అథ క్లేశజమేవ త్వం ధర్మం చరితుమిచ్ఛసి |
ధర్మేణ చతురో వర్ణాన్ పాలయన్ క్లేశమాప్నుహి || ౨౦ ||

చతుర్ణామాశ్రమాణాం హి గార్హస్థ్యం శ్రేష్ఠమాశ్రమమ్ |
ప్రాహుర్ధర్మజ్ఞ ధర్మజ్ఞాస్తం కథం త్యక్తుమర్హసి || ౨౧ ||

శ్రుతేన బాలః స్థానేన జన్మనా భవతో హ్యహమ్ |
స కథం పాలయిష్యామి భూమిం భవతి తిష్ఠతి || ౨౨ ||

హీనబుద్ధిగుణో బాలో హీనః స్థానేన చాప్యహమ్ |
భవతా చ వినాభూతో న వర్తయితుముత్సహే || ౨౩ ||

ఇదం నిఖిలమవ్యగ్రం రాజ్యం పిత్ర్యమకణ్టకమ్ |
అనుశాధి స్వధర్మేణ ధర్మజ్ఞ సహ బాంధవైః || ౨౪ ||

ఇహైవ త్వాఽభిషించంతు సర్వాః ప్రకృతయః సహ |
ఋత్విజః సవసిష్ఠాశ్చ మంత్రవన్మంత్రకోవిదాః || ౨౫ ||

అభిషిక్తస్త్వమస్మాభిరయోధ్యాం పాలనే వ్రజ |
విజిత్య తరసా లోకాన్ మరుద్భిరివ వాసవః || ౨౬ ||

ఋణాని త్రీణ్యపాకుర్వన్ దుర్హృదః సాధు నిర్దహన్ |
సుహృదస్తర్పయన్ కామైస్త్వమేవాత్రానుశాధి మామ్ || ౨౭ ||

అద్యార్య ముదితాః సంతు సుహృదస్తేఽభిషేచనే |
అద్య భీతాః పలాయంతాం దుర్హృదస్తే దిశో దశ || ౨౮ ||

ఆక్రోశం మమ మాతుశ్చ ప్రమృజ్య పురుషర్షభ |
అద్య తత్రభవంతం చ పితరం రక్ష కిల్బిషాత్ || ౨౯ ||

శిరసా త్వాఽభియాచేఽహం కురుష్వ కరుణాం మయి |
బాంధవేషు చ సర్వేషు భూతేష్వివ మహేశ్వరః || ౩౦ ||

అథైతత్ పృష్ఠతః కృత్వా వనమేవ భవానితః |
గమిష్యతి గమిష్యామి భవతా సార్ధమప్యహమ్ || ౩౧ ||

తథా హి రామో భరతేన తామ్యతా
ప్రసాద్యమానః శిరసా మహీపతిః |
న చైవ చక్రే గమనాయ సత్త్వవాన్
మతిం పితుస్తద్వచనే వ్యవస్థితః || ౩౨ ||

తదద్భుతం స్థైర్యమవేక్ష్య రాఘవే
సమం జనో హర్షమవాప దుఃఖితః |
న యాత్యయోధ్యామితి దుఃఖితోఽభవత్
స్థిరప్రతిజ్ఞత్వమవేక్ష్య హర్షితః || ౩౩ ||

తమృత్విజో నైగమయూథవల్లభాః
తదా విసంజ్ఞాశ్రుకలాశ్చ మాతరః |
తథా బ్రువాణం భరతం ప్రతుష్టువుః
ప్రణమ్య రామం చ యయాచిరే సహ || ౩౫ ||

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే అయోధ్యాకాండే షడుత్తరశతతమః సర్గః || ౧౦౬ ||

Ayodhya Kanda Sarga 106 Meaning In Telugu

రాముడు చేసిన వాదనను శ్రద్ధగా విన్నాడు భరతుడు. మరలా తనదైన శైలిలో తన వాదనను వినిపించసాగాడు.
“ఓ రామా! నీవు జితేంద్రియుడవు. నీకు సుఖమువస్తే సంతోషము, దు:ఖమువస్తే బాధా రెండూ లేవు. నీలాంటి వారు ఈ లోకంలో అరుదుగా ఉంటారు. మేమంతా సామాన్యులము. సుఖదు:ఖములను అనుభవిస్తూ ఉంటాము.

జీవించి ఉన్నా, మరణించినా, మంచి చేసినా, చెడు చేసినా, ఆ వ్యక్తి పట్ల సమభావనతో ఉండే వ్యక్తికి దుఃఖము కానీ సుఖము కానీ కలగవు. రెండూ సమభావనలో ఉంటాయి. ఆ గుణాలు నీలో ఉన్నాయి. కానీ నీవు బాధపడుతున్నావు. తండ్రికి ఇచ్చిన మాటను ఎక్కడ తప్పుతానో అని బాధపడుతున్నావు. నీ లాంటివాడికి అలా బాధపడటం యుక్తంకాదు.

నీవు రాజ్యం చేసినా, అరణ్యంలో ఉన్న ఒకటే కదా. అందుకని అయోధ్యకు వచ్చి రాజ్యం చేయి. తప్పేముంది. నీవు అన్నిటికీ అతీతుడవు కదా! నీవు రాజ్యం తీసుకుంటే నేను బాధ పడను. ఎందుకంటే నేను దేశాంతరములో ఉన్నప్పుడు నా తల్లి చేసిన అనాలోచిత కార్యము వలన ఇదంతా సంభవించింది. నా తల్లి చేసిన పని నాకు అసలు ఇష్టం లేదు. దానికి నా అంగీకారమూ లేదు. నా తల్లి చేసినది రాజద్రోహము. దానికి మరణదండనే సరి అయిన శిక్ష కాని ఇక్కడ నిందితురాలు నా తల్లి కాబట్టి నేను ఆ దండన అమలు చేయలేక పోతున్నాను.

నేను పవిత్రమైన ఇక్ష్వాకు వంశములో పుట్టాను. ధర్మానికి ప్రతిరూపమైన దశరథమహారాజుకు పుత్రుడుగా జన్మించాను. అటువంటి నేను అధర్మమునకు పాల్పడతాను అని నీవు ఎలా అనుకుంటావు.? ఈ అధర్మములో నా తండ్రికి కూడా భాగం ఉంది. ఆయన నా తల్లి మాటను వినకపోతే ఇంత అనర్థము వాటిల్లదు.

ఆయన నా తండ్రి, పైగా వృద్ధుడు, ఈ లోకం విడిచి వెళ్లాడు కాబట్టి సభలో ఆయనను నిందించడం భావ్యం కాదు. ఎందుకంటే ధర్మము తెలిసిన వాడు ఎవరైనా ఒక స్త్రీకి ప్రియం చేకూర్చడానికి మరొకరికి అప్రియం చేస్తాడా! కాని నా తండ్రి ధర్మం తప్పి తన భార్యకు వరములు ఇచ్చే మిషమీద నీకు అపకారము చేసాడు.

రామా! వినాశకాలే విపరీత బుద్ధీ అని వినాశకాలము దాపురించబట్టి దశరథునికి ఇటువంటి విపరీత బుద్ధి పుట్టింది. తండ్రి మంచి కార్యము చేస్తే దానిని పుత్రుడు శ్లాఘించాలి, అభినందించాలి. కాని తండ్రి అధర్మానికి పాల్పడితే, దానిని పుత్రుడు ఖండించాలి. ఆ అధర్మము వలన కలిగిన తప్పును సరిదిద్దాలి. నా తండ్రి దశరథుడు చేసిన అధర్మము వలన అయోధ్య అరాచక మయింది. ఆ తప్పును నీవు సరిదిద్ది, నీ రాజ్యము నీవు పరిపాలించు. అందరికీ ఆనందము నీ చేకూర్చు. తండ్రి చేసిన అధర్మమును చక్కదిద్దిన సుపుత్రుడిగా ప్రఖ్యాతి చెందు.

ఎందుకంటే నా తండ్రి చేసిన అధర్మమును, పాపపు పనిని లోకమంతా ఖండిస్తూ ఉంది. ఆ అధర్మమును సరిదిద్దడం నీ చేతిలో ఉంది. నా తల్లి కైక కూడా దీనికి తన అంగీకారము తెలిపింది. ఆమెను కూడా ఈ అధర్మకార్యము నుండి రక్షించు.

పైగా క్షత్రియునకు స్వధర్మపాలనను మించిన ధర్మము మరొకటి లేదు. క్షత్రియ ధర్మము రాజ్యమును పాలించుట. నీవు నీ ధర్మమును వదిలి జటలు కట్టుకొని అరణ్యములలో ఉండటం భావ్యమా! ఎక్కడా? అరణ్యము ఎక్కడ? రాజు కిరీటము ఎక్కడ? జటాజూటములు ఎక్కడ? రెండింటికీ దోమకు ఏనుగుకు ఉన్నంత తేడా ఉంది కదా! నీకు తెలియనిది ఏమున్నది.

పైగా రాజ్యపాలన క్షత్రియధర్మము. అది తక్షణ ఫలములను ఇస్తుంది. వనవాస వృత్తి కాలాంతరమున మోక్షరూపంలో ఫలిస్తుంది. క్షత్రియుడైన వాడు రజోగుణప్రధానుడు కానీ తమోగుణ ప్రధానుడు కాదు కదా! కాబట్టి రామా! ఈ తాపస ధర్మము నీకు తగినది కాదు. నీకు క్షత్రియ ధర్మమే ఉచితము.

రామా! బ్రహ్మచర్య, గృహస్థ,వానప్రస్థ, సన్యాస ఆశ్రమములు ఒకదాని తరువాత ఒకటి ఆచరించాలి. అందులోనూ గృహస్థాశ్రమము శ్రేష్టమైనది అని పెద్దలు చెబుతారుకదా! మరి నీవు ఆ పెద్దల మాటలను పెడచెవిని పెట్టి గృహస్థాశ్రమమును విడిచిపెట్టడం ధర్మమా!

దీని వలన పితృఋణము తీర్చినట్టు అవుతుంది. తండ్రిగారు చేసిన తప్పును సరిదిద్దినట్టు అవుతుంది. ఈ పాపపు కార్యము వలన నా తల్లికి తండ్రికి అంటిన పాపమును తొలగించు. వారిని పాపవిముక్తులను చెయ్యి. నీకు శిరస్సువంచి పాదములు అంటి అర్థిస్తున్నాను. నా మీద, అయోధ్య మీద దయచూపించు. నేను ఇంతచెప్పినా కాదని నీవు అరణ్యములలో ఉండటానికి నిశ్చయించుకుంటే. నేనుకూడా నీతో అరణ్యవాసము చేస్తాను. నా తల్లి చేసిన పాపమునకు నేను ప్రాయశ్చిత్తము చేసుకుంటాను. అయోధ్యకు వెళ్లినే వెళ్లను. ఇదే నా కృతనిశ్చయము.” అని పలికి భరతుడు చేతులు జోడించి రాముని ముందు నిలబడ్డాడు.

అక్కడ ఉన్న వారు కూడా శాయశక్తులా రాముని తిరిగి అయోధ్యకు రమ్మని ప్రార్థించారు. కాని రామునిలో చలనం లేదు. తన పట్టు వీడలేదు. అయోధ్యకు రావడానికి ఒప్పుకోలేదు. అక్కడ ఉన్న వారికి రాముని మనోనిశ్చయానికి అభినందించాలో లేక రాముడు అయోధ్యకు రాక పోవడానికి విచారించాలో తెలియక కొట్టుమిట్టాడు తున్నారు.

శ్రీమద్రామాయణము
అయోధ్యాకాండము నూట ఆరవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్

అయోధ్యాకాండ సప్తోత్తరశతతమః సర్గః (107) >>

Leave a Comment