Ayodhya Kanda Sarga 112 In Telugu – అయోధ్యాకాండ ద్వాదశోత్తరశతతమః సర్గః

అయోధ్యాకాండలోని 112వ సర్గలో, రాముడు సీతను, లక్ష్మణుడిని తీసుకుని చిత్తుర్థానంవైపుగా ప్రయాణిస్తాడు. ఈ సర్గలో వారు ప్రస్తుతిస్తున్న ప్రకృతి దృశ్యాలు సుందరంగా వర్ణించబడ్డాయి. దారిలో సీత తన భర్త రామునికి ప్రణయాన్ని, భక్తిని ప్రదర్శిస్తుంది. రాముడు సీతకు భద్రతను, ప్రేమను అందిస్తాడు. లక్ష్మణుడు తన అన్నకు సేవ చేయడం వల్ల సంతోషిస్తున్నాడు. ఈ సర్గలో వారు అనేక అవాంతరాలను ఎదుర్కొంటారు, కానీ రాముని ధైర్యం, సీతకున్న విశ్వాసం, లక్ష్మణుడి భక్తి వారిని ముందుకు నడిపిస్తాయి. ఈ ప్రయాణం రామాయణ కథలో కీలకమైన ఘట్టం.

పాదుకాప్రదానమ్

తమప్రతిమతేజోభ్యాం భ్రాతృభ్యాం రోమహర్షణమ్ |
విస్మితాః సంగమం ప్రేక్ష్య సమవేతా మహర్షయః || ౧ ||

అంతర్హితాస్త్వృషిగణాః సిద్ధాశ్చ పరమర్షయః |
తౌ భ్రాతరౌ మహాత్మానౌ మహాత్మానౌ కాకుత్స్థౌ ప్రశశంసిరే || ౨ ||

స ధన్యో యస్య పుత్రౌ ద్వౌ ధర్మజ్ఞౌ ధర్మవిక్రమౌ |
శ్రుత్వా వయం హి సంభాషాముభయోః స్పృహయామహే || ౩ ||

తతస్త్వృషిగణాః క్షిప్రం దశగ్రీవవధైషిణః |
భరతం రాజశార్దూలమిత్యూచుః సంగతా వచః || ౪ ||

కులే జాత మహాప్రాజ్ఞ మహావృత్త మహాయశః |
గ్రాహ్యం రామస్య వాక్యం తే పితరం యద్యవేక్షసే || ౫ ||

సదానృణమిమం రామం వయమిచ్ఛామహే పితుః |
అనృణత్వాచ్చ కైకేయ్యాః స్వర్గం దశరథో గతః || ౬ ||

ఏతావదుక్త్వా వచనం గంధర్వాః సమహర్షయః |
రాజర్షయశ్చైవ తదా సర్వే స్వాంస్వాం గతిం గతాః || ౭ ||

హ్లాదితస్తేన వాక్యేన శుభేన శుభదర్శనః |
రామః సంహృష్టవదనస్తానృషీనభ్యపూజయత్ || ౮ ||

స్రస్తగాత్రస్తు భరతః స వాచా సజ్జమానయా |
కృతాంజలిరిదం వాక్యం రాఘవం పునరబ్రవీత్ || ౯ ||

రాజధర్మమనుప్రేక్ష్య కులధర్మానుసంతతిమ్ |
కర్తుమర్హసి కాకుత్స్థ మమ మాతుశ్చ యాచనామ్ || ౧౦ ||

రక్షితుం సుమహద్రాజ్యమహమేకస్తు నోత్సహే |
పౌరజానపదాంశ్చాపి రక్తాన్ రంజయితుం తథా || ౧౧ ||

జ్ఞాతయశ్చ హి యోధాశ్చ మిత్రాణి సుహృదశ్చ నః |
త్వామేవ ప్రతికాంక్షంతే పర్జన్యమివ కర్షకాః || ౧౨ ||

ఇదం రాజ్యం మహాప్రాజ్ఞ స్థాపయ ప్రతిపద్య హి |
శక్తిమానసి కాకుత్స్థ లోకస్య పరిపాలనే || ౧౩ ||

ఇత్యుక్త్వా న్యపతద్భ్రాతుః పాదయోర్భరతస్తదా |
భృశం సంప్రార్థయామాస రామమేవ ప్రియంవదః || ౧౪ ||

తమంకే భ్రాతరం కృత్వా రామో వచనమబ్రవీత్ |
శ్యామం నలినపత్రాక్షం మత్తహంసస్వరం స్వయమ్ || ౧౫ ||

ఆగతా త్వామియం బుద్ధిః స్వజా వైనయికీ చ యా |
భృశముత్సహసే తాత రక్షితుం పృథివీమపి || ౧౬ ||

అమాత్యైశ్చ సుహృద్భిశ్చ బుద్ధిమద్భిశ్చ మంత్రిభిః |
సర్వకార్యాణి సమ్మంత్ర్య సుమహాంత్యపి కారయ || ౧౭ ||

లక్ష్మీశ్చంద్రాదపేయాద్వా హిమవాన్ వా హిమం త్యజేత్ |
అతీయాత్ సాగరో వేలాం న ప్రతిజ్ఞామహం పితుః || ౧౮ ||

కామాద్వా తాత లోభాద్వా మాత్రా తుభ్యమిదం కృతమ్ |
న తన్మనసి కర్తవ్యం వర్తితవ్యం చ మాతృవత్ || ౧౯ ||

ఏవం బ్రువాణం భరతః కౌసల్యాసుతమబ్రవీత్ |
తేజసాఽఽదిత్యసంకాశం ప్రతిపచ్చంద్రదర్శనమ్ || ౨౦ ||

అధిరోహార్య పాదాభ్యాం పాదుకే హేమభూషితే |
ఏతే హి సర్వలోకస్య యోగక్షేమం విధాస్యతః || ౨౧ ||

సోఽధిరుహ్య నరవ్యాఘ్రః పాదుకే హ్యవరుహ్య చ |
ప్రాయచ్ఛత్ సుమహాతేజాః భరతాయ మహాత్మనే || ౨౨ ||

స పాదుకే సంప్రణమ్య రామం వచనమబ్రవీత్ |
చతుర్దశ హి వర్షాణి జటాచీరధరో హ్యహమ్ || ౨౩ ||

ఫలమూలాశనో వీర భవేయం రఘునందన |
తవాగమనమాకాంక్షన్ వసన్ వై నగరాద్బహిః || ౨౪ ||

తవ పాదుకయోర్న్యస్తరాజ్యతంత్రః పరంతప |
చతుర్దశే హి సంపూర్ణే వర్షేఽహని రఘూత్తమ || ౨౫ ||

న ద్రక్ష్యామి యది త్వాం తు ప్రవేక్ష్యామి హుతాశనమ్ |
తథేతి చ ప్రతిజ్ఞాయ తం పరిష్వజ్య సాదరమ్ || ౨౬ ||

శత్రుఘ్నం చ పరిష్వజ్య భరతం చేదమబ్రవీత్ |
మాతరం రక్ష కైకేయీం మా రోషం కురు తాం ప్రతి || ౨౭ ||

మయా చ సీతయా చైవ శప్తోఽసి రఘుసత్తమ |
ఇత్యుక్త్వాఽశ్రుపరీతాక్షో భ్రాతరం విససర్జ హ || ౨౮ ||

స పాదుకే తే భరతః ప్రతాపవాన్
స్వలంకృతే సంపరిపూజ్య ధర్మవిత్ |
ప్రదక్షిణం చైవ చకార రాఘవం
చకార చైవోత్తమనాగమూర్ధని || ౨౯ ||

అథానుపూర్వ్యాత్ ప్రతినంద్య తం జనం
గురూంశ్చ మంత్రిప్రకృతీస్తథానుజౌ |
వ్యసర్జయద్రాఘవవంశవర్ధనః
స్థిరః స్వధర్మే హిమవానివాచలః || ౩౦ ||

తం మాతరో బాష్పగృహీతకంఠ్యో
దుఃఖేన నామంత్రయితుం హి శేకుః |
స త్వేవ మాతౄరభివాద్య సర్వాః
రుదన్ కుటీం స్వాం ప్రవివేశ రామః || ౩౧ ||

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే అయోధ్యాకాండే ద్వాదశోత్తరశతతమః సర్గః || ౧౧౨ ||

Ayodhya Kanda Sarga 112 Meaning In Telugu

ఆ ప్రకారంగా రాముడు, భరతుని మధ్య జరిగిన వాదోప వాదములు చూచి, విని అక్కడ ఉన్న వారు ఆశ్చర్యపోయారు. వారంతా రాముని ధర్మనిరతిని ప్రశంసించారు. అక్కడ ఉన్న ఋషులు భరతునితో ఇలా అన్నారు.

“భరతా! నీవు గొప్పవంశములో జన్మించావు. సకల శాస్త్రములు అభ్యసించావు. బుద్ధిమంతుడవు. నీ అన్న రాముడు ఎలా చెబితే అలా చెయ్యి. రాముని బలవంత పెట్టకు. నీ తండ్రి దశరథుడు తన భార్య ఋణము తీర్చుకొని స్వర్గానికి వెళ్లాడు. రాముడు తండ్రి ఋణము తీర్చుకుంటున్నాడు. కాబట్టి రాముని వనవాసము చెయ్యనివ్వు.” అని చెప్పారు. తరువాత వారు ఎవరి ఆశ్రమములను వారు వెళ్లిపోయారు. కాని భరతునికి మాత్రము వారి మాటలు రుచించలేదు. ఆఖరి ప్రయత్నంగా, మాటలు తొట్రుపడుతుంటే గద్గద స్వరంతో, వణుకుతూ, చేతులు జోడించి, భయం భయంగా రామునితో ఇలా అన్నాడు.

“అన్నయ్యా! రాజధర్మము, కులధర్మము ప్రకారము పెద్దవాడే రాజుగా ఉండాలి కానీ చిన్నవాడు కాదు. ఇప్పుడు నీవు రాజధర్మము నకు కులధర్మమునకు విఘాతము కలిగించకు. నా మాట నా తల్లి మాట మన్నించు. అయోధ్యకు వచ్చి రాజ్యపాలన చేపట్టు. ఎందుకంటే నేను నీ కన్నా చిన్నవాడిని. ఈ రాజ్యభారము మోయలేను. నేను అసమర్థుడను. మన బంధువులు మిత్రులు అందరూ నీవే రాజు కావాలని ఎదురు చూస్తున్నారు. వారందరి దృష్టిలో నీవే రాజు కావడానికి సమర్థుడివి. కాబట్టి వెంటనే అయోధ్యకు బయలుదేరు.” అని అన్నాడు భరతుడు. అనడమే కాదు. రాముని పాదముల మీద పడి ప్రార్థించాడు. రాముడు భరతుని రెండు చేతులతో లేవనెత్తాడు. తన తొడమీద కూర్చోపెట్టుకున్నాడు. భరతుని తల ప్రేమతో నిమిరాడు.

“భరతా! నీవు సామాన్యుడివి కావు. బుద్ధిమంతుడివి. గురువుల దగ్గర అన్ని విద్యలూ నేర్చుకున్నావు. నీవు రాజ్యమును పాలించడానికి సమర్థుడివి. అధైర్యపడకు. ధైర్యంగా అయోధ్యకు వెళ్లు. రాజ్యాధికారము చేపట్టు. నీకు తోడుగా కులగురువు వసిష్ఠులవారు, అమాత్యులు, సైన్యాధిపతులు ఉన్నారు. వారి సాయంతో రాజ్యము పాలించు. అంతేగాని నన్ను అయోధ్యకు రమ్మని కోరకు.

చంద్రుడు తన వెన్నెలను కోల్పోయినా, హిమవత్పర్వతము తన చల్లదనాన్ని కోల్పోయినా, సముద్రము చెలియలి కట్టదాటినా, నేను మాత్రము తండ్రి ఆజ్ఞను అతిక్రమించను, అయోధ్యకు రాను. మరొకమాట. నీ తల్లి మితి మీరిన ఆశవలననో, నీ మీద ఉన్న అధిక ప్రేమ వలననో ఇదంతా చేసింది. ఫలితం మనం ఇద్దరం అనుభవిస్తున్నాము. నాతో పాటు సీత, లక్ష్మణుడు అనుభవిస్తున్నారు

గతం గత: అంతా మరిచిపో. నీ తల్లి కేవలం నిమిత్త మాత్రురాలు. ఇప్పటికే భర్తను కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉంది. ఆమెను ఏమీ అనవద్దు. దూషించవద్దు. ఒక కొడుకు తల్లిని గౌరవించినట్టు గౌరవించు. ఆమె మనసు బాధపెట్టకు.” అని హితబోధ చేసాడు రాముడు.
అప్పుడు భరతుడు బంగారముతో చేసిన పాదుకలు తెప్పించాడు. రాముని పాదముల వద్ద పెట్టాడు. రామునితో ఇలా అన్నాడు.

“రామా! ఇవి బంగారముతో చేసిన పాదుకలు. వీటిమీద నీ పాదములు ఉంచు. ఇవే నాకు శిరోధార్యములు. ఇంక నుంచి ఈ రామ పాదుకలే అయోధ్యను నీకు బదులుగా పాలిస్తాయి. నేను కేవలం నీ ప్రతినిధిని మాత్రమే. నీ ప్రతినిధిగా అయోధ్యను పాలిస్తాను.” అని అన్నాడు.
రాముడు భరతుని మాటలను మన్నించాడు. ఆ పాదుకల మీద తన పాదములను పెట్టి ఆ పాదుకలను భరతునికి ఇచ్చాడు. భరతుడు ఆ పాదుకలకు నమస్కరించాడు.

“రామా! నేటి నుంచి ఈ పాదుకలు నాకు దిశానిర్దేశము చేస్తాయి. నేను కూడా నీ మాదిరి నారచీరలు, జటలు ధరిస్తాను. అయోధ్య బయట ఆశ్రమము వేసుకొని ఉంటాను. అక్కడ ఈ పాదుకలను ప్రతిష్ఠిస్తాను. నీకు ప్రతినిధిగా రాజ్యపాలన చేస్తాను. నీరాక కోసం నిరీక్షిస్తూ ఉంటాను.

రామా! ఈ పదునాలుగు సంత్సరములు గడువు పూర్తి అచిప మరునాడు నువ్వు అయోధ్యకు రావలెను. అలా రాకపోతే ఆరోజే నేను అగ్నిప్రవేశము చేస్తాను.” అని పలికాడు భరతుడు. రాముడు భరతుని మాటలకు అంగీకరించాడు. శత్రుఘ్నుని దగ్గరకు తీసుకొని కౌగలించుకొని శిరస్సు ముద్దుపెట్టుకున్నాడు. తరువాత భరతుని చూచి ఇలా అన్నాడు.

“భరతా! నీ తల్లిని జాగ్రత్తగా చూసుకో. ఆమెపై కోపించవద్దు. నీవు ఆమెను చిన్న మాట అన్నా నామీద, సీత మీద ఒట్టు.” అని అన్నాడు. కళ్లనిండా నీళ్లు నిండగా రాముడు భరతునికి వీడ్కోలు పలికాడు. భరతుడు రాముని పాదుకలకు పూజచేసాడు. వాటిని భద్రగజము మీద రాజు కూర్చునే స్థానములో పెట్టాడు. అయోధ్యకు ప్రయాణం అయ్యాడు. రాముడు అయోధ్యనుండి వచ్చిన వారికి సాదరంగా వీడ్కోలు పలికాడు. రాముడు తన తల్లులందరికీ పాద నమస్కారము చేసాడు. దు:ఖము ఆపుకోలేక పర్ణశాలలోకి వెళ్లిపోయాడు.

శ్రీమద్రామాయణము
అయోధ్యాకాండము నూట పన్నెండవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్.

ఇంతటితో అయోధ్య గురించిన వారసత్వపు వివాదము ముగిసింది. అది త్రేతాయుగము. ధర్మం మూడు పాదాలతో నడిచింది అని పెద్దలు చెబుతారు. రాముడు, భరతుడు రాజ్యం నీది అంటే నీది అను వాదులాడుకున్నారు. అప్పనంగా అయాచితంగా వచ్చిన రాజ్యాన్ని తీసుకోడానికి రాముడు ఇష్టపడలేదు. తనది కాని దానిని అనుభవించడానికి భరతుడు ఇష్టపడలేదు. ఇదే ఆనాటి ధర్మము.

ద్వాపరం లో అలా కాదు. అంతా నాదే. నీకు ఏమీ లేదు. అనేది దుర్యోధనుడి మనస్తత్వం. కనీసం నా భాగం అన్నా నాకు ఇవ్వు. లేకపోతే చావగొట్టి తీసుకుంటాను అనేది ధర్మరాజు మనస్తత్వం. యుద్ధం ఎందుకు దండగ– పాచికలు ఉండగా. ఒక్క రక్తం బొట్టు చిందకుండా పేకాటలో సర్వస్వం గెల్చుకుందాము, ఎదుటి వాడి తల గొరిగిద్దాము అన్నది శకుని మనస్తత్వము. అందరికీ అన్నిమాటలు చెబుతూ, తాను మాత్రం అంటీముట్టనట్టు జితేంద్రియుడిలాగా ఉన్నాడు శ్రీకృష్ణుడు. ఇదీ ద్వాపర యుగ ధర్మము.

ఇంక కలియుగ ధర్మము మనం చూస్తూనే ఉన్నాము. అందినంత వరకూ దోచుకోవడం. ఆఖరుకు జైలుపాలవడం. బంగారు పళ్లాలలో తిన్న వారు, సత్తుకంచాలలో, చిప్పకూడు తినడం వారి జీవితాలలో పరాకాష్ట. నాకు, నా కొడుకులకు, నా మనుమలకు, మునిమనుమలకు కూడా ఆస్తి సంపాదించాలి అన్న అత్యాశతో అన్ని అక్రమాలు చెయ్యడం. అడ్డం వచ్చిన వాళ్లను అడ్డంగా నరికెయ్యడం. ఇదీ నేటి కలియుగ ధర్మము.
యుగ యుగానికీ ధర్మం మారుతూ ఉంటుంది. మనుషుల మనస్తత్వాలూ మారుతుంటాయి. కాని, నాడూ జాబాలి లాంటి నాస్తిక వాదులు ఉన్నారు. నేడూ రాముడు, కృష్ణుడు లాంటి జితేంద్రియులూ ఉ న్నారు. (రమణ మహర్షి, కంచి పరమాచార్య, మొదలగు వారు). మంచి చెడూ ఎప్పుడూ ఉంటాయి. కాకపోతే చెడు వైపుకు ఆకర్షితులైనంత త్వరగా మంచి వైపు ఆకర్షితులం కాము. అదే మానవ బలహీనత. ఈ బలహీనతలను జయించిన వాడు రాముడు. అందుకే రాముడు అందరికీ ఆదర్శప్రాయుడు అయ్యాడు.

నేడు రామాలయం లేని ఊరు లేదు. “శ్రీరామ” రాయని పత్రమూ లేదు. రామనామం చెయ్యని భక్తుడూ లేడు. రామరాజ్యం రావాలని కోరని వాడూ లేడు. ఇంతకూ రామరాజ్యం అంటే ఏమిటి? ఎలా ఉంటుంది? అందరూ తలొకవిధంగా చెబుతారు. కాని దీనికి రాముడి జీవితమే జవాబు. రాముడు తన జీవితం ద్వారా రెండు విషయాలు ప్రపంచానికి చెప్పాడు. ఒకటి తనది కాని దానికి ఆశించక పోవడం. రెండవది పెద్దల మాట పాటించడం. తండ్రి ఆజ్ఞను శిరసావహించడం. ఈరెండు గుణాలు నేడు ఎవరిలోనూ లేవు.

అంతర్లీనంగా రాముడు తన నడవడి ద్వారా మరొక విషయం కూడా చూచాయగా చెప్పాడు. అదేమిటంటే…..
దశరథుడు మహారాజు. మహారాజు ఆదేశాలను పాటించడం పౌరుల ధర్మము. ఒక సామాన్య మానవుడిగా రాముడు మహారాజు ఆదేశాలను పాటించాలి. అదే చేసాడు రాముడు. అంతేగానీ మహారాజు ఇచ్చిన ఆదేశాల వెనక ఉన్న కారణాలు వెదక లేదు. రాజు చెప్పాడు. నేను పాటించాలి. రాజు ఎప్పుడూ తప్పు చెయ్యడు. ఒకవేళ రాజు తప్పు చేసినా ప్రజలు దానిని ప్రశ్నించకూడదు. అదీ రాముడు ప్రతిపాదించిన ధర్మం. అందుకే రాముడు దేవుడు అయ్యాడు.

ఈనాడు మనము దానికి విరుద్ధంగా ప్రవర్తిస్తున్నాము. ప్రభుత్వము ఆదేశాలను పాటించకపోవడం మనకు దైనందిన కృత్యము అయిపోయింది. ప్రభుత్వాన్ని మోసం చేయడం, ప్రభుత్వ ఆస్తులను ఆక్రమించడం, ప్రభుత్వ ధనాన్ని అపహరించడం అలవాటయిపోయింది. పెద్ద వాళ్లను గౌరవించడం, తల్లితండ్రుల మాటలను మన్నించడం ప్రజలు ఎప్పుడో మరిచిపోయారు. గురువులను గౌరవించడం మహా పాపం అన్నట్టు ప్రవర్తిస్తున్నారు విద్యార్ధులు. తండ్రిగా భావించవలసిన గురువులతో ప్రేమాయణాలు సాగిస్తున్నారు నేటి విద్యార్ధినులు.

గురువులు కూడా తక్కువ తిన లేదు. క్లాసురూములలో పాఠాలు చెప్పడం మానేసి రాజకీయ నాయకుల చుట్టూ తిరుగుతూ, రాజకీయాలలో మునిగితేలుతూ, రాజకీయ నాయకుల మాదిరి ప్రవర్తిస్తూ విద్యార్థులను స్కూళ్లకు పోవద్దనీ, కాలేజీలకు పోవద్దని బోధిస్తూ, రైళ్లు, బస్సులు ఆపమనీ, హింస చేయమనీ ప్రేరేపిస్తున్నారు. అలాంటప్పుడు మనది రామరాజ్యం ఎలా అవుతుంది. రామరాజ్యం అని ఎలా అనగలము. ఆలోచించండి.
ఇంక భరతుడు. కులధర్మం, రాజ ధర్మం గొప్పది అన్నాడు. క్షత్రియ కులంలో పెద్ద వాడు రాజు కావడం సాంప్రదాయం. దానిని పాటించమన్నాడు. వసిష్ఠుడు కూడా ఇక్ష్వాకు వంశచరిత్రను ఏకరువుపెట్టాడు. కాని రాముడు చలించలేదు. తన తండ్రికి ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నాడు.

వీరి మధ్యలో లక్ష్మణుడు ఒక వాదాన్ని లేవదీసాడు. అందులో ఒకటి రెండు న్యాయ సూత్రాలు ఇమిడి ఉన్నాయి కాబట్టి ఇక్కడ ప్రస్తావిస్తున్నాను. లక్ష్మణుడు ప్రతిపాదించిన మొదటి సూత్రము. కైక వరాలు అడిగింది. దశరథుడు ఇస్తాను అన్నాడు. అడగడం, ఇవ్వడం, పుచ్చుకోడం వారి ఇద్దరి మధ్య జరిగిన ఒప్పందం. అంతే కాని మూడవ వ్యక్తి అయిన రామునికి ఆ ఒప్పందంతో ఎలాంటి సంబంధము లేదు. దశరథుడు కైకకు వరాలు ఇవ్వడం వలన మూడవ వ్యక్తి నష్టపోకూడదు. కాని దశరథుడు కైకకు ఇచ్చిన వరాల వల్ల రాముడు అంటే మూడవ వ్యక్తి నష్టపోయాడు. ఇది అధర్మము. ఇతరులకు నష్టం, కష్టం కలిగించని రీతిలో దశరథుడు ఎన్ని వరాలు అయినా ఇవ్వవచ్చు. కైక పుచ్చుకోవచ్చు. కాని ఆ వరాలు ఇవ్వడం వల్ల మూడవ వ్యక్తి నష్టపోతే ఆ వరాలను, దాని మూలంగా రాజు ఇచ్చిన ఆదేశాలను పాటించనవసరం లేదు. రాముడిని కాదని భరతుడికి రాజ్యాభిషేకం చెయ్యవచ్చు. కానీ రాముడు అడవులకు పోవడం దేనికి. ఇదీ లక్ష్మణుని వాదన.

ఈ రోజుల్యో సర్వీసు రూల్సులో ఇది పాటిస్తున్నారు. పైవాడికి అనుగ్రహం కలిగితే ప్రమోషన్లు, అన్ని నిబంధనలను తుంగల్లో తొక్కి యధేచ్ఛగా ఇస్తున్నారు. కాని ఆ ప్రమోషను ఇవ్వడం ద్వారా మూడవ వ్యక్తికి నష్టం కలిగించకూడదు. అది చట్టవిరుద్ధం. అలా మూడవ వ్యక్తికి నష్టం జరిగితే కోర్టు జోక్యం చేసుకొని ఆ నష్టాన్ని నివారిస్తుంది.

మీరు అధిక ప్రసంగం అని అనుకోకపోతే ఇక్కడ నా స్వానుభవం వివరిస్తాను. అప్పుడు నేను కోర్టుమాస్టరు గా హైకోర్టులో పనిచేస్తున్నాను. హైకోర్టులో అన్ని ఉద్యోగనియామకాలు ఛీఫ్ జస్టిస్ చేస్తాడు. అసిస్టెంటు రిజిస్ట్రారు పోస్టుకు, లా గ్రాడ్యుయేట్ అయి ఉండాలి. ఒక అసిస్టెంటు రిజిస్ట్రారు పోస్టుఖాళీ అయింది. నా పైన నలుగురు సీనియర్సు ఉన్నారు. కాని వారు మెట్రిక్యులేట్సు. నేను లా గ్రాడ్యుయేట్. న్యాయప్రకారం, ధర్మ ప్రకారము ఆ పోస్టులో నన్ను నియమించాలి. కాని అప్పటి ఛీఫ్ జస్టిస్, కేవలం మెట్రిక్యులేట్ అయిన సీనియర్ను, ఆయన సెంట్రల్ లా మినిస్టరుకు తెలియడం వల్ల, అన్ని నిబంధనలను తోసి పుచ్చి అసిస్టెంటురిజిస్ట్రారు గా నియమించారు. “అయ్యా! మీరు మీ ఇష్టంవచ్చినవారిని ఇష్టం వచ్చినట్టు నియమించు కోవచ్చు. కానీ దానివలన ఇతరులకు అన్యాయం జరగకూడదు. అది రూలు.” అని మేము వాదించాము. కాని మా వాదన అరణ్య రోదన అయింది లెండి. న్యాయం చెయ్యవలసిన న్యాయమూర్తులే ఆశ్రిత పక్షపాతంతో అన్యాయాలకు పాల్పడుతుంటే, మనది రామరాజ్యం ఎలా అవుతుంది.

ఇంక రెండవ సూత్రం. దశరథుడు మహారాజు. ఇంటికి పెద్ద వాడు. రాజ్యము పిత్రార్జితము. దశరథుడు తన ఇష్టం వచ్చిన వాళ్లకు ఇవ్వడానికి వీలు లేదు. కులధర్మాన్ని పాటించి పెద్దవాడికే ఇవ్వాలి. కానీ దశరథుడు స్త్రీవ్యామోహంలో పడి చిన్నవాడైన భరతుడికి రాజ్యాన్ని కట్టబెట్టాడు. అడ్డం వస్తాడని రాముని అడవులకు పొమ్మన్నాడు. ఇదంతా స్త్రీవ్యామోహంతో చేసాడు కాబట్టి రాముడికి తండ్రి ఆదేశాలను పాటించనవసరం లేదు. తండ్రి చేసిన పనులు చట్టరీత్యా చెల్లవు. ఈ నాడు కూడా ఈ సూత్రం అమలులో ఉంది. దీనినే పయస్ ఆబ్లిగేషన్ అంటారు. ఉమ్మడి కుటుంబంలో తండ్రి ఆస్తిని అజమాయిషీ చేస్తుంటాడు. కుటుంబక్షేమం కోసం అప్పులు చేస్తాడు. ఆస్తులు అమ్ముతాడు, కొంటాడు. తండ్రి చనిపోతే, తండ్రి చేసిన అప్పులకు కొడుకులు బాధ్యులు అవుతారు. కాని, కొడుకులు మైనర్లుగాఉ న్నప్పుడు, తండ్రి స్త్రీవ్యామోహంతోనో, జూదం ఆడటానికో అప్పులు చేస్తే కుటుంబ ఆస్తులను అన్యాక్రాంతం చేస్తే, కొడుకులు తండ్రి చేసిన పనులకు బాధ్యులు కారు. కొడుకులు ఆ అప్పులు తీర్చనవసరం లేదు. పైగా ఆ ఆస్తులను తిరిగి స్వాధీనం చేసుకోవచ్చు. తండ్రి చేసిన లావాదేవీలకు కట్టుబడనవసరం లేదు. ఇదీ నేటి సూత్రము. దీనినే నాడు లక్ష్మణుడు సూత్రప్రాయంగా ప్రతిపాదించాడు.

ఇది ఇలా ఉంటే, అయోధ్యా కాండ చదివిన తరువాత ఒక సందేహము వస్తుంది. కైక రాముని అల్లారుముద్దుగా పెంచింది. రాముడు అంటే ఎంతో ప్రేమ. అలాంటి కైక కేవలం ఒక దాసి చెప్పిన మాటలు విని రామునికి ఇంతటి అపకారము తలపెడుతుందా. ఒక వేళ పుత్రవ్యామోహంతో భరతునికి పట్టాభిషేకము చెయ్యాలని కోరినా, రాముని అడవులకు పంపుతుందా. అంత క్రూరంగా ప్రవర్తిస్తుందా! కాని కైక అలాఎందుకు చేసింది. ఎందుకు నిందలపాలయింది. దీని వెనక బలమైనకారణం ఏమైనా ఉందా! ఊహిస్తే ఉంది అని అనిపించక మానదు. ఇలా జరగడానికి అవకాశం ఉందేమో ఆలోచించండి..

దశరథుడికి హటాత్తుగా రాముడికి పట్టాభిషేకము చెయ్యాలని ఆలోచన వచ్చింది. అదీ మరునాడే. ఆలోచించుకోడానికి కూడా వ్యవధి లేదు. రాముని పిలిచి తన నిర్ణయం చెప్పాడు. కైకకు కూడా చెప్పలేదు. కాని కైకకు మంథర ద్వారా తెలిసింది. మొదట్లో ఆనందించింది. కాని ఆలోచించింది.
కైక సామాన్యురాలు కాదు. గొప్పరాజనీతిజ్ఞురాలు. భర్తకు రాజకీయాలలో చేదోడు వాదోడుగా ఉండేది. యుద్ధాలలో కూడా పాల్గొంది. దేవ దానవ యుద్ధంలో, దశరథుడి తోపాటు స్వయంగా తాను కూడా పాల్గొని యుద్ధం చేసింది. దశరథుని రెండు సార్లు ప్రాణాపాయస్థితినుండి కాపాడింది. కైక అంతటి వీరనారి. పూర్వాపరాలు ఆలోచించగల దిట్ట.

రాముడికి పట్టాభిషేకము అనగానే మొదట్లో సంతోషము కలిగినా, తరువాత కొంచెం భయం వేసింది. రాముడు చిన్నవాడు. యౌవనంలో ఉన్నాడు. రాజకీయాలు కొత్త. అస్సలు అనుభవం లేదు. ఇంతటి భారాన్ని మొయ్యలేడు. ఇప్పుడు రాముడు రాజు అయితే చిన్న వయసులో భోగలాలసుడు అయ్యే ప్రమాదం ఉంది. రాజ్యము అరాచకము అవుతుంది. రాముడికి తన రాజ్యము ఎంతవరకూ విస్తరించింది. ఏమేమి సామంత రాజ్యాలు ఉన్నాయి. మిత్రులు ఎవరు? శత్రువులు ఎవరు? ఏమీ తెలియదు. పైగా దక్షిణ దిశలో దండకారణ్యంలో రాక్షస మూకలు తమ స్థావరాలను ఏర్పరచుకొని ఉన్నాయి. వారు ఇంకా ముందుకు చొచ్చుకొని వచ్చే ప్రమాదం ఉంది. రాక్షసులు మునులకు, జానపదులకు అపకారం చేస్తున్నారని, వేధిస్తున్నారని వార్తలు వస్తున్నాయి. దానిని నివారించాలి.

ఈ పరిస్థితులలో రాముడు రాజు అయి అంత:పురంలో కూర్చుంటే అతనికి దేశం గురించి తెలిసే అవకాశం లేదు. కాబట్టి రాముడు దేశాటన చెయ్యాలి. అడవులలో తిరగాలి. అక్కడి స్థితి గతులు తెలుసుకోవాలి. దానికి మార్గం వెతకాలి.” ఇదీ కైక ఆలోచన. కైక మరొక కోణంలోనుండి కూడా ఆలోచించింది. రాముడు కేవలం స్వలాభం కోసం పాటుపటేవాడా. లేక ప్రజా క్షేమం కోసం రాజ్యాన్ని కూడా త్యజించే జితేంద్రియుడా. రాముడు స్వార్థపరుడా లేక ప్రజల మేలుకోరేవాడా. అందుకే ఈ వరాలు కోరే నాటకం ఆడింది. అందుకే రాముని 14 సంవత్సరాలు అరణ్య వాసం చెయ్యాలి అని కోరింది. రెండవది భరతునికి పట్టాభిషేకము. ఇందులో రెండు సూత్రాలు ఇమిడి ఉన్నాయి.

మొదటిది… నాటి న్యాయసూత్రాల ప్రకారం, రాముడు రాజ్యాన్ని తనకు తెలిసీ 14 ఏళ్లు అన్యాక్రాంతం చేస్తే, తిరిగి దానిని కోరే హక్కు లేదు. (అది ఈ రోజుల్లో అడ్వర్సుపోసేషన్ సూత్రం ప్రకారం 12 ఏళ్లుగా ఉంది. ) తన రాజ్యం పోతుందని తెలిసీ రాముడు అడవులకు పోతాడా. లేక తండ్రి మీద తిరగబడతాడా అని పరీక్షించవచ్చు.

రెండవది… రాముడు తిరిగి వస్తే భరతుడు తిరిగి రాజ్యం రామునికి ఇస్తాడా. లేక నీకు హక్కులేదు పొమ్మంటాడా! దీనితో భరతుని నిజాయితీ కూడా తేలిపోతుంది.

కాబట్టి కైక రాముని ఒక పరిపూర్ణ మహారాజుగా తీర్చిదిద్దాలని అనుకుంది. రాజ్యపాలన గురించి అవగాహన కలిగించాలి అనుకొంది. ప్రజల కష్టసుఖాలు రాముడు తెలుసుకోవాలి అనుకొంది. రాజ్యంలో శత్రువులను నాశనం చెయ్యడం, రాజ్య విస్తరణ ముఖ్యం అనుకొంది. ఇవన్నీ జరగాలంటే రాముడు దేశాటన చెయ్యాలి. అందుకే తన గుండెల నిండా బాధనునింపుకొని, కన్నీళ్లు ఆపుకుంటూ, మనసులోనే కుమిలిపోతూ, అత్యంత కఠినంగా ప్రవర్తించింది. అందరితోనూ ఛీ అనిపించుకుంది. నాడే రాముడు పట్టాభిషిక్తుడు అయి ఉంటే మనకు రామాయణం లేదు. రాముని గురించి అనుకొనే వాడే లేడు. మనకు రామాయణాన్ని అందించిన ఘనత కైకకు దక్కుతుంది. రాముని కీర్తి ఆసేతుహిమాచలము వ్యాపింపచేసింది. రాముడి రాజ్యాన్ని లంక దాకా విస్తరింపచేసింది. రాముని చేత రాక్షస సంహారం చేయించింది. అయోధ్యకు శత్రుశేషం లేకుండా చేసింది. కాని పుట్టెడు అపకీర్తిని మూట గట్టుకొంది. తుదకు భర్తను కూడా కోల్పోయింది. అంతటి త్యాగమూర్తి కైక. కాని అందరి మనసుల్లో ఒక స్వార్ధపరురాలిగా, చరిత్రహీనురాలిగా మిగిలిపోయింది కైక.

ఈ నాడు రాముని ఊరూరా, ఇంటింటా పూజించు కుంటున్నా మంటే దానికి మూలకారణం కైక అని మనం తెలుసుకుంటే, ఆమె జీవితం ధన్యం అయినట్టే. )

అయోధ్యాకాండ త్రయోదశోత్తరశతతమః సర్గః (113) >>

Leave a Comment