Ayodhya Kanda Sarga 31 in Telugu – అయోధ్యాకాండ ఏకత్రింశః సర్గః

రామాయణం యొక్క అయోధ్యాకాండలో ఏకత్రింశ సర్గ రాముడి తన పుత్రుడు రాముడు, సీత మరియు లక్ష్మణుడు అడవికి వెళ్ళిన దుఃఖంతో ఉన్న రాజా దశరథుడు, తన గత దోషాలపై పశ్చాత్తాపం చెంది, కౌసల్యకి తన కథను చెప్పడం గురించి ఉంటుంది. ఆయన గతంలో శ్రవణ కుమారుడిని పొరపాటున వేట వేస్తూ, అతని తల్లిదండ్రులకు దుఃఖం కలిగించాడని చెప్పడం కీలకం. దశరథుడు తన కర్మ ఫలం గా ఇప్పుడు రాముడిని వదలవలసి వచ్చింది. ఈ సర్గలో దశరథుని దుఃఖం, పశ్చాత్తాపం మరియు రాముడి గురించి వేదనను వ్యక్తం చేస్తుంది. ఈ సంఘటనలు దశరథుని మరణానికి దారితీస్తాయి, రాజ్యం లో విషాదం నెలకొల్పుతుంది.

లక్ష్మణవనానుగమనభ్యనుజ్ఞా

ఏవం శ్రుత్వా తు సంవాదం లక్ష్మణః పూర్వమాగతః |
బాష్పపర్యాకులముఖః శోకం సోఢుమశక్నువన్ || ౧ ||

స భ్రాతుశ్చరణౌ గాఢం నిపీడ్య రఘునందనః |
సీతామువాచాతియశా రాఘవం చ మహావ్రతమ్ || ౨ ||

యది గంతుం కృతా బుద్ధిర్వనం మృగగజాయుతమ్ |
అహం త్వాఽనుగమిష్యామి వనమగ్రే ధనుర్ధరః || ౩ ||

మయా సమేతోఽరణ్యాని బహూని విచరిష్యసి |
పక్షిభిర్మృగయూథైశ్చ సంఘుష్టాని సమంతతః || ౪ ||

న దేవలోకాక్రమణం నామరత్వమహం వృణే |
ఐశ్వర్యం వాఽపి లోకానాం కామయే న త్వయా వినా || ౫ ||

ఏవం బ్రువాణః సౌమిత్రిర్వనవాసాయ నిశ్చితః |
రామేణ బహుభిః సాంత్వైర్నిషిద్ధః పునరబ్రవీత్ || ౬ ||

అనుజ్ఞాతశ్చ భవతా పూర్వమేవ యదస్మ్యహమ్ |
కిమిదానీం పునరిదం క్రియతే మే నివారణమ్ || ౭ ||

యదర్థం ప్రతిషేధో మే క్రియతే గంతుమిచ్ఛతః |
ఏతదిచ్ఛామి విజ్ఞాతుం సంశయో హి మమానఘ || ౮ ||

తతోఽబ్రవీన్మహాతేజా రామో లక్ష్మణమగ్రతః |
స్థితం ప్రాగ్గామినం వీరం యాచమానం కృతాంజలిమ్ || ౯ ||

స్నిగ్ధో ధర్మరతో వీరః సతతం సత్పథే స్థితః |
ప్రియః ప్రాణసమో వశ్యో భ్రాతా చాసి సఖా చ మే || ౧౦ ||

మయాఽద్య సహ సౌమిత్రే త్వయి గచ్ఛతి తద్వనమ్ |
కో భరిష్యతి కౌసల్యాం సుమిత్రాం వా యశస్వినీమ్ || ౧౧ ||

అభివర్షతి కామైర్యః పర్జన్యః పృథివీమివ |
స కామపాశపర్యస్తో మహాతేజా మహీపతిః || ౧౨ ||

సా హి రాజ్యమిదం ప్రాప్య నృపస్యాశ్వపతేః సుతా |
దుఃఖితానాం సపత్నీనాం న కరిష్యతి శోభనమ్ || ౧౩ ||

న స్మరిష్యతి కౌసల్యాం సుమిత్రాం చ సుదుఃఖితామ్ |
భరతో రాజ్యమాసాద్య కైకేయ్యాం పర్యవస్థితః || ౧౪ ||

తామార్యాం స్వయమేవేహ రాజానుగ్రహణేన వా |
సౌమిత్రే భర కౌసల్యాముక్తమర్థమిమం చర || ౧౫ ||

ఏవం మమ చ తే భక్తిర్భవిష్యతి సుదర్శితా |
ధర్మజ్ఞ గురుపూజాయాం ధర్మశ్చాప్యతులో మహాన్ || ౧౬ ||

ఏవం కురుష్వ సౌమిత్రే మత్కృతే రఘునందన |
అస్మాభిర్విప్రహీణాయా మాతుర్నో న భవేత్సుఖమ్ || ౧౭ ||

ఏవముక్తస్తు రామేణ లక్ష్మణః శ్లక్ష్ణయా గిరా |
ప్రత్యువాచ తదా రామం వాక్యజ్ఞో వాక్యకోవిదమ్ || ౧౮ ||

తవైవ తేజసా వీర భరతః పూజయిష్యతి |
కౌసల్యాం చ సుమిత్రాం చ ప్రయతో నాత్ర సంశయః || ౧౯ ||

అధికపాఠః –
యది దుఃస్థో న రక్షేత భరతో రాజ్యముత్తమమ్ |
ప్రాప్య దుర్మనసా వీర గర్వేణ చ విశేషతః || ౨౦ ||

తమహం దుర్మతిం క్రూరం వధిష్యామి న సంశయః |
తత్పక్ష్యానపి తాన్సర్వాంస్త్రైలోక్యమపి కిం ను సా || ౨౧ ||

కౌసల్యా బిభృయాదార్యా సహస్రమపి మద్విధాన్ |
యస్యాః సహస్రం గ్రామాణాం సంప్రాప్తముపజీవినమ్ || ౨౨ ||

తదాత్మభరణే చైవ మమ మాతుస్తథైవ చ |
పర్యాప్తా మద్విధానాం చ భరణాయ యశస్వినీ || ౨౩ ||

కురుష్వ మామనుచరం వైధర్మ్యం నేహ విద్యతే |
కృతార్థోఽహం భవిష్యామి తవ చార్థః ప్రకల్పతే || ౨౪ ||

ధనురాదాయ సశరం ఖనిత్రపిటకాధరః |
అగ్రతస్తే గమిష్యామి పంథానమనుదర్శయన్ || ౨౫ ||

ఆహరిష్యామి తే నిత్యం మూలాని చ ఫలాని చ |
వన్యాని యాని చాన్యాని స్వాహారాణి తపస్వినామ్ || ౨౬ ||

భవాంస్తు సహ వైదేహ్యా గిరిసానుషు రంస్యతే |
అహం సర్వం కరిష్యామి జాగ్రతః స్వపతశ్చ తే || ౨౭ ||

రామస్త్వనేన వాక్యేన సుప్రీతః ప్రత్యువాచ తమ్ |
వ్రజాపృచ్ఛస్వ సౌమిత్రే సర్వమేవ సుహృజ్జనమ్ || ౨౮ ||

యే చ రాజ్ఞో దదౌ దివ్యే మహాత్మా వరుణః స్వయమ్ |
జనకస్య మహాయజ్ఞే ధనుషీ రౌద్రదర్శనే || ౨౯ ||

అభేద్య కవచే దివ్యే తూణీ చాక్షయసాయకౌ |
ఆదిత్యవిమలౌ చోభౌ ఖడ్గౌ హేమపరిష్కృతౌ || ౩౦ ||

సత్కృత్య నిహితం సర్వమేతదాచార్యసద్మని |
స త్వమాయుధమాదాయ క్షిప్రమావ్రజ లక్ష్మణ || ౩౧ ||

స సుహృజ్జనమామంత్ర్య వనవాసాయ నిశ్చితః |
ఇక్ష్వాకుగురుమాగమ్య జగ్రాహాయుధముత్తమమ్ || ౩౨ ||

తద్దివ్యం రఘుశార్దూలః సత్కృతం మాల్యభూషితమ్ |
రామాయ దర్శయామాస సౌమిత్రిః సర్వమాయుధమ్ || ౩౩ ||

తమువాచాత్మవాన్రామః ప్రీత్యా లక్ష్మణమాగతమ్ |
కాలే త్వమాగతః సౌమ్య కాంక్షితే మమ లక్ష్మణ || ౩౪ ||

అహం ప్రదాతుమిచ్ఛామి యదిదం మామకం ధనమ్ |
బ్రాహ్మణేభ్యస్తపస్విభ్యస్త్వయా సహ పరంతప || ౩౫ ||

వసంతీహ దృఢం భక్త్యా గురుషు ద్విజసత్తమాః |
తేషామపి చ మే భూయః సర్వేషాం చోపజీవినామ్ || ౩౬ ||

వసిష్ఠపుత్రం తు సుయజ్ఞమార్యం
త్వమానయాశు ప్రవరం ద్విజానామ్ |
అభిప్రయాస్యామి వనం సమస్తా-
-నభ్యర్చ్య శిష్టానపరాన్ద్విజాతీన్ || ౩౭ ||

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే అయోధ్యాకాండే ఏకత్రింశః సర్గః || ౩౧ ||

Ayodhya Kanda Sarga 31 Meaning In Telugu

సీతారాములు వనవాస విషయము గురించి వాదించు కుంటున్నప్పుడు లక్ష్మణుడు అక్కడకు వచ్చాడు. బయట ఉండి వారి మాటలు అన్నీ విన్నాడు. ఆ దంపతుల అన్యోన్యతకు చలించి పోయాడు. అన్న రాముని కాళ్ల మీదపడ్డాడు.

“రామా! క్రూరమృగములతో నిండిన అరణ్యములలో నీకు తోడుగా ఉండడానికి సుకుమారి అయిన వదిన రాగా లేనిది నేను నీ వెంట రాలేనా. నేనుకూడా నీ వెంట వస్తాను. నీకు ముందు ఉండి దారి చూపిస్తాను. రామా! చిన్నప్పటి నుండి నేను నిన్ను విడిచి ఒక్క క్షణం కూడా ఉండలేదు. ఇప్పుడు కూడా ఉండలేను. నీవు లేని ఈ అయోధ్య కానీ, త్రిలోకాధి పత్యము కానీ నాకు అక్కరలేదు.” అన్నాడు లక్ష్మణుడు.

ఇప్పటి దాకా తల్లి కౌసల్యను భార్య సీతను వనవాసమునకు రావద్దని వాదించాడు. తల్లి ఒప్పుకుంది. భార్య ఒప్పుకోలేదు. ఇప్పుడు తమ్ముడు లక్ష్మణుని వంతు వచ్చింది. యధాప్రకారము లక్ష్మణుని కూడా తన వెంట అడవులకు రావద్దని నచ్చచెప్పడానికి ప్రయత్నించాడు రాముడు. లక్ష్మణుడు ససేమిరా ఒప్పుకోలేదు.

“రామా! నన్ను నీ వెంట అరణ్యమునకు ఎందుకు రావద్దు అంటున్నావో కారణం చెప్పు” అని నిలదీసాడు. దానికి రాముడు లక్ష్మణునితో ఇలా అన్నాడు. “లక్ష్మణా! నీవు నాకు మంచి స్నేహితుడవు. ధర్మతప్పకుండా చరించే వాడివి. వీరుడివి. ఎల్లప్పుడూ సన్మార్గములో పయనిస్తావు. అదీ కాకుండా నాకు నీవు ప్రాణంతో సమానం. నేను ఏది చెబితే అది చేస్తావు. అటువంటి నీవు నాతో పాటు వనమునకు వస్తే నా తల్లి కౌసల్య, నీ తల్లి సుమిత్ర ఒంటరి వాళ్లు అవుతారుకదా! వారి ఆలనాపాలనా ఎవరు చూస్తారు. వారి గురించి ఎవరు పట్టించుకుంటారు. కాబట్టి నీవు అయోధ్యలో ఉండటమే ధర్మము.

ప్రస్తుతము మన తండ్రి దశరథుడు తన భార్య కైక మోహ పాశములో చిక్కుకొని ఉన్నాడు. భరతుని పట్టాభిషేకము తరువాత కైక తన సవతులైన మన తల్లులను ఎన్ని కష్టముల పాలు చేస్తుందో ఏమో. ఇంక భరతుడు కూడా తన తల్లి కైక మాటలను విని మన తల్లుల గురించి పట్టించుకోడు. కాబట్టి నువ్వు ఇక్కడే ఉండి వాళ్లను జాగ్రత్తగా చూచుకోవాలి కదా! నీవు అలా చేసావనుకో నీకు నా మీదున్న ప్రేమ, భక్తి ప్రకటితమవుతుంది. తల్లులకు సేవ చెయ్యడం కన్నా పరమ ధర్మము ఏముంటుంది. కనీసము నా మొహం చూచి అయినా నీవు ఇక్కడే ఉండి తల్లుల సంరక్షణ చూసుకో.” అని రాముడు లక్ష్మణునితో అన్నాడు.

కాని లక్ష్మణుడు ఆ మాటలకు ఒప్పుకోలేదు. “రామా! అదేమిటి అలా అంటావు. నీవు అంటే భరతునికి భయం, భక్తి, గౌరవము. నీ పరాక్రమమునకు భయపడి భరతుడు మన తల్లులను అత్యధికంగా గౌరవిస్తాడు కానీ అవమానించడు. ఇందులో ఎలాంటి సంశయము లేదు.

అదీ కాకుండా నీ తల్లి కౌసల్యకు ఆమె పుట్టింటి ఆస్తి వెయ్యి గ్రామాలు ఉన్నాయి. ఆ గ్రామాలలలో ప్రజలు ఆమెను అత్యంత భక్తిశ్రద్ధలతో సేవిస్తారు. వాటి మీద వచ్చే ఆదాయంతో ఆమె వెయ్యిమందిని పోషించ గలదు. అందుకని మన తల్లుల గురించి మనకు భయం లేదు. కాబట్టి నన్ను నీతో కూడా రావడానికి అనుమతించు. నాజన్మ ధన్యము అవుతుంది. అరణ్యములలో నీవు సీత విహరిస్తూ ఉంటే మీకు సేవలు చేసుకుంటూ ఉంటాను. మీకు కావలసినవిఅన్నీ అమరుస్తాను.”అని అన్నాడు లక్ష్మణుడు.

ఇంక ఎంత చెప్పినా లక్ష్మణుడు వినడు అనుకున్నాడు రాముడు. లక్ష్మణునితో ఇలా అన్నాడు. “లక్ష్మణా! నీ నిర్ణయము నాకు ఎంతో సంతోషాన్ని కలిగించింది. మనము వనవాసము పోవుటకు తగిన ఏర్పాట్లు చెయ్యి. నీ స్నేహితులందరికీ చెప్పి వారి దగ్గర సెలవు తీసుకొని రా. వెళ్లు. లక్ష్మణా!జనక మహారాజు యజ్ఞమునకు మనము వెళ్లినపుడు, వరుణ దేవుడు మన ఇద్దరికీ ఒక దివ్య ధనుస్సు, అక్షయతూణీరములు, దివ్య కవచములు, రెండు ఖడ్గములు ప్రసాదించాడు కదా. వాటిని మనము గురువుగారు వసిష్ఠుల వారి ఇంట్లో ఉంచి పూజిస్తున్నాము కదా. వాటిని మన వెంట తీసుకొని రా. అని అన్నాడు రాముడు. అన్నగారి మాట ప్రకారము లక్ష్మణుడు తనమిత్రుల వద్ద సెలవు తీసుకొని, వసిష్ఠువారి ఇంటి నుండి ఆయుధములను తీసుకొన్నాడు. వాటిని తీసుకొని వచ్చి రాముడికి చూపించాడు.

“లక్ష్మణా! నేను వనవాసమునకు వెళుతున్నాను కదా! అందుకనీ నా వద్ద ఉన్న ధనము, ఆభరణములు సదాచారులైన బ్రాహ్మణులకు దానంగా ఇవ్వతలచుకొన్నాను. నీవు వెళ్లి వసిష్ఠుని కుమారుడు సుయజ్ఞుని నీ వెంట తీసుకొని రా. ఆయనతో కూడా సదాచార పరాయణులైన అనేక మంది బ్రాహ్మణులను తీసుకొని రా. నా ధనము, ఆభరణములు వారికి దానంగా ఇస్తాను.” అని అన్నాడు రాముడు.

శ్రీమద్రామాయణము
అయోధ్యాకాండము ముప్పది ఒకటవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్.

అయోధ్యాకాండ ద్వాత్రింశః సర్గః (32) >>

Leave a Comment