మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. అయోధ్యాకాండ చతురశీతితమః సర్గ, “గుహాగమనమ్”, రామాయణంలోని ఒక ముఖ్యమైన భాగం. ఈ సర్గలో భరతుడు మరియు గుహా మధ్య జరిగిన సంభాషణలు, భరతుడి రాముడి పట్ల ఉన్న ప్రేమను మరియు గౌరవాన్ని ప్రతిబింబిస్తాయి. గుహా, భరతుడికి రాముడి స్మృతులను వివరించి, అతడికి సహాయం చేయడానికి సన్నద్ధత వ్యక్తం చేస్తాడు. ఈ సర్గ, భక్తి, స్నేహం, మరియు విధేయతను హృదయానికి హత్తుకునేలా చూపిస్తుంది.
గుహాగమనమ్
తతర్నివిష్టాం ధ్వజినీం గంగామన్వాశ్రితాం నదీమ్ |
నిషాదరాజో దృష్ట్వైవ జ్ఞాతీన్ సంత్వరితోఽబ్రవీత్ ||
1
మహతీయమితః సేనా సాగరాభా ప్రదృశ్యతే |
నాస్యాంతమధిగచ్ఛామి మనసాపి విచింతయన్ ||
2
యథా తు ఖలు దుర్బుద్ధిర్భరతః స్వయమాగతః |
స ఏష హి మహాకాయః కోవిదారధ్వజో రథే ||
3
బంధయిష్యతి వా దాశాన్ అథవాఽస్మాన్ వధిష్యతి |
అథ దాశరథిం రామం పిత్రా రాజ్యాద్వివాసితమ్ ||
4
సంపన్నాం శ్రియమన్విచ్చన్ తస్య రాజ్ఞః సుదుర్లభామ్ |
భరతః కైకేయీపుత్రః హంతుం సమధిగచ్ఛతి ||
5
భర్తా చైవ సఖా చైవ రామర్దాశరథిర్మమ |
తస్యార్థకామాః సన్నద్ధా గంగాఽనూపే ప్రతిష్ఠత ||
6
తిష్ఠంతు సర్వ దాశాశ్చ గంగామన్వాశ్రితా నదీమ్ |
బలయుక్తా నదీరక్షా మాంసమూలఫలాశనాః ||
7
నావాం శతానాం పంచానాం కైవర్తానాం శతం శతమ్ |
సన్నద్ధానాం తథా యూనాం తిష్ఠన్త్విత్యభ్యచోదయత్ ||
8
యదా తుష్టస్తు భరతః రామస్యేహ భవిష్యతి |
సేయం స్వస్తిమతీ సేనా గంగామద్య తరిష్యతి ||
9
ఇత్యుక్త్వోపాయనం గృహ్య మత్స్యమాంసమధూని చ |
అభిచక్రామ భరతం నిషాదాధిపతిర్గుహః ||
10
తమాయాంతం తు సంప్రేక్ష్య సూతపుత్రః ప్రతాపవాన్ |
భరతాయాఽచచక్షేఽథ వినయజ్ఞో వినీతవత్ ||
11
ఏష జ్ఞాతిసహస్రేణ స్థపతిః పరివారితః |
కుశలో దండకారణ్యే వృద్ధో భ్రాతుశ్చ తే సఖా ||
12
తస్మాత్పశ్యతు కాకుత్స్థ త్వాం నిషాదాధిపో గుహః |
అసంశయం విజానీతే యత్ర తౌ రామలక్ష్మణౌ ||
13
ఏతత్తు వచనం శ్రుత్వా సుమంత్రాద్భరతః శుభమ్ |
ఉవాచ వచనం శీఘ్రం గుహః పశ్యతు మామితి ||
14
లబ్ధ్వాఽభ్యనుజ్ఞాం సంహృష్టః జ్ఞాతిభిః పరివారితః |
ఆగమ్య భరతం ప్రహ్వో గుహో వచనమబ్రవీత్ ||
15
నిష్కుటశ్చైవ దేశోఽయం వంచితాశ్చాపి తే వయమ్ |
నివేదయామస్తే సర్వే స్వకే దాసకులే వస ||
16
అస్తి మూలం ఫలం చైవ నిషాదైః సముపాహృతమ్ |
ఆర్ద్రం చ మాంసం శుష్కం చ వన్యం చోచ్చావచం మహత్ ||
17
ఆశంసే స్వాశితా సేనా వత్స్యతీమాం విభావరీమ్ |
అర్చితః వివిధైః కామైః శ్వస్ససైన్యో గమిష్యసి ||
18
ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే అయోధ్యాకాండే చతురశీతితమః సర్గః ||
Ayodhya Kanda Sarga 84 Meaning In Telugu
గంగానదీతీరమున ఉన్న శృంగిబేరపురమునకు రాజు గుహుడు. రామునికి ఆప్తమిత్రుడు. గంగానది పొడుగునా విడిది చేసిన సైన్యములను చూచాడు గుహుడు. వెంటనే తన మంత్రులను, బంధువులను సమావేశపరిచాడు.
“మీరంతా చూచి ఉంటారు. గంగానదీ తీరాన అశేష సైన్యము విడిది చేసి ఉన్నది. దీని లెక్క నాకు ఊహకు అందడం లేదు. ఈ సైన్యము అయోధ్యనుండి వచ్చినట్టు కనపడుతూ ఉంది. భరతుడు రాముని వెదుకుతూ వచ్చాడేమో తెలియదు. మనము రాముని మిత్రులమని మనలను బంధించడానికి వచ్చాడా! లేక మనలనందరినీ చంపుతాడా! రాముడు బతికి ఉంటే శాశ్వతముగా తనకు రాజ్యము లభించదని రాముని కూడా చంపడానికి వచ్చాడా! రాముడు మనకు రాజే కాదు. మనకు మిత్రుడు కూడా. అందుచేత రాముని రక్షించడం మన కర్తవ్యము.
అందుకని మీరందరూ ఆయుధములను చేత బట్టి గంగానదీ తీరములో నిలబడండి. మనము కేవలము గంగాతీరమును రక్షిస్తున్నాము అనే మిషతో అక్కడ ఉండండి. మనసేనలను కూడా సమాయత్తము చేయండి. మనకు ఐదువందల పడవలు ఉన్నాయి. వాటిలో ఒక్కొక్క పడవలో నూరుగురు సైనికులు ఉండండి. గంగా తీరమును రక్షిస్తూ ఉన్నట్టు పడవల మీద తిరగండి. భరతుడు ఏ బుద్ధితో వచ్చాడో తెలియదు. భరతుడు రాముని క్షేమం కోరే వాడయితే అతనిని వెళ్లనిద్దాము. లేని ఎడల అతనిని అడ్డుకుందాము. దీనికి మీరు సంసిద్ధంగా ఉండండి.” అని పలికాడు.
తరువాత సాంప్రదాయ ప్రకారము తన శక్తికొద్దీ కానుకలు తీసుకొని గుహుడు భరతుని వద్దకు వెళ్లాడు. గుహుని రాకను సుమంత్రుడు చూచాడు. ఆ విషయము భరతునికి చెప్పాడు.
“మహారాజా! గుహుడు తన బంధుమిత్రులతో తమ దర్శనానికి వచ్చాడు. గుహుడు రామునికి మంచి మిత్రుడు. రాముడు అడవులకు వెళ్లేటప్పుడు రామునికి ఆతిధ్యము ఇచ్చాడు. రామలక్ష్మణులు ఎక్కడ ఉన్నారో గుహునికి తెలిసి ఉంటుంది. కాబట్టి గుహుని ఆదరించు.” అని అన్నాడు సుమంత్రుడు. ఆ మాటలకు భరతుడు చాలా సంతోషించాడు. “సుమంత్రా! వెంటనే గుహుని నా వద్దకు తీసుకొని రా!” అని ఆదేశించాడు. సుమంత్రుడు గుహుని భరతుని వద్దకు తీసుకొని వెళ్లాడు. గుహుడు భరతునికి వినయంగా నమస్కరించాడు. “ఈ శృంగిబేర పురమునకు నేను రాజును. నాపేరు గుహుడు. మీకు దాసుడను. ఈ పురము మీ పురమే అనుకొనుడు. మీ ఇష్టం వచ్చినట్టు ఇక్కడ ఉండండి. మేము నీ కోసరము ఫలములు, దుంపలు, మాంసము తీసుకొని వచ్చాము. మా సపర్యలను స్వీకరించి మీరు ఈ రాత్రికి ఇక్కడే విశ్రమించండి.” అని అన్నాడు గుహుడు.
శ్రీమద్రామాయణము
అయోధ్యాకాండము ఎనుబది నాల్గవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్.