మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. బాలకాండ లోని ఏకవింశః సర్గలో, ఋషి విశ్వామిత్రుని కోపం దశరథ రాజుపై చూపబడింది. విశ్వామిత్ర ఋషిని శాంతింపజేయడానికి, వశిష్ట ఋషి జోక్యం చేసుకుని, రాముడిని విశ్వామిత్ర ఋషితో పంపమని దశరథ రాజును ఒప్పించాడు. అలా చేస్తున్నప్పుడు, వశిష్ట ఋషి విశ్వామిత్ర మహర్షి యొక్క సామర్థ్యాలను, అతని ఆయుధ జ్ఞానాన్ని వివరించాడు. రాముడిని విశ్వామిత్రునితో పంపిస్తే ఆ ఆయుధాలన్నీ రాముడికి ఇవ్వబడతాయని వశిష్ఠుడు కూడా సూచిస్తాడు. చివరికి దశరథుడు రాముని పంపడానికి అంగీకరించాడు.
వసిష్ఠవాక్యమ్
తచ్ఛ్రుత్వా వచనం తస్య స్నేహపర్యాకులాక్షరమ్ |
సమన్యుః కౌశికో వాక్యం ప్రత్యువాచ మహీపతిమ్ ||
1
పూర్వమర్థం ప్రతిశ్రుత్య ప్రతిజ్ఞాం హాతుమిచ్ఛసి |
రాఘవాణామయుక్తోఽయం కులస్యాస్య విపర్యయః ||
2
యదీదం తే క్షమం రాజన్గమిష్యామి యథాగతమ్ |
మిథ్యాప్రతిజ్ఞః కాకుత్స్థ సుఖీ భవ సబాంధవాః ||
3
తస్య రోషపరీతస్య విశ్వామిత్రస్య ధీమతః |
చచాల వసుధా కృత్స్నా వివేశ చ భయం సురాన్ ||
4
త్రస్తరూపం తు విజ్ఞాయ జగత్సర్వం మహానృషిః |
నృపతిం సువ్రతో ధీరో వసిష్ఠో వాక్యమబ్రవీత్ ||
5
ఇక్ష్వాకూణాం కులే జాతః సాక్షాద్ధర్మ ఇవాపరః |
ధృతిమాన్సువ్రతః శ్రీమాన్న ధర్మం హాతుమర్హసి ||
6
త్రిషు లోకేషు విఖ్యాతో ధర్మాత్మా ఇతి రాఘవ |
స్వధర్మం ప్రతిపద్యస్వ నాధర్మం వోఢుమర్హసి ||
7
సంశ్రుత్యైవం కరిష్యామీత్యకుర్వాణస్య రాఘవ |
ఇష్టాపూర్తవధో భూయాత్తస్మాద్రామం విసర్జయ ||
8
కృతాస్త్రమకృతాస్త్రం వా నైవం శక్ష్యంతి రాక్షసాః |
గుప్తం కుశికపుత్రేణ జ్వలనేనామృతం యథా ||
9
ఏష విగ్రహవాన్ధర్మ ఏష వీర్యవతాం వరః |
ఏష బుద్ధ్యాధికో లోకే తపసశ్చ పరాయణమ్ ||
10
ఏషోఽస్త్రాన్వివిధాన్వేత్తి త్రైలోక్యే సచరాచరే |
నైనమన్యః పుమాన్వేత్తి న చ వేత్స్యంతి కేచన ||
11
న దేవా నర్షయః కేచిన్నాసురా న చ రాక్షసాః |
గంధర్వయక్షప్రవరాః సకిన్నరమహోరగాః ||
12
సర్వాస్త్రాణి కృశాశ్వస్య పుత్రాః పరమధార్మికాః |
కౌశికాయ పురా దత్తా యదా రాజ్యం ప్రశాసతి ||
13
తేఽపి పుత్రా కృశాశ్వస్య ప్రజాపతిసుతాసుతాః |
నైకరూపా మహావీర్యా దీప్తిమంతో జయావహాః ||
14
జయా చ సుప్రభా చైవ దక్షకన్యే సుమధ్యమే |
తే సువాతేఽస్త్రశస్త్రాణి శతం పరమభాస్వరమ్ ||
15
పంచాశతం సుతాఁల్లేభే జయా నామ పరాన్పురా |
వధాయాసురసైన్యానామమేయాన్ కామరూపిణః ||
16
సుప్రభాఽజనయచ్చాపి పుత్రాన్పంచాశతం పునః |
సంహారాన్నామ దుర్ధర్షాన్దురాక్రామాన్బలీయసః ||
17
తాని చాస్త్రాణి వేత్త్యేష యథావత్కుశికాత్మజః |
అపూర్వాణాం చ జననే శక్తో భూయశ్చ ధర్మవిత్ ||
18
తేనాస్య మునిముఖ్యస్య సర్వజ్ఞస్య మహాత్మనః |
న కించిదప్యవిదితం భూతం భవ్యం చ రాఘవ ||
19
ఏవం వీర్యో మహాతేజా విశ్వామిత్రో మహాతపాః | [మహాయశాః]
న రామగమనే రాజన్సంశయం గంతుమర్హసి ||
20
తేషాం నిగ్రహణే శక్తః స్వయం చ కుశికాత్మజః |
తవ పుత్రహితార్థాయ త్వాముపేత్యాభియాచతే ||
21
ఇతి మునివచనాత్ప్రసన్నచిత్తో
రఘువృషభశ్చ ముమోద భాస్వరాంగః |
గమనమభిరురోచ రాఘవస్య
ప్రథితయశాః కుశికాత్మజాయ బుధ్యా ||
22
Balakanda Sarga 21 In Telugu Pdf With Meaning
ఎప్పుడైతే దశరథుడు రాముని యాగ సంరక్షణార్ధము విశ్వామిత్రుని వెంట పంపను అని అన్నాడో, విశ్వామిత్రుడు ఆగ్రహోదగ్రుడు అయ్యాడు. ఆయన కోపం తారస్థాయి కి చేరుకుంది.
“దశరథీ! ఇక్ష్వాకుల వంశములో జన్మించిన నీవు ఆడిన మాట తప్పావు. ఇది రఘు వంశము వారికి ఉచితము కాదు. ఆడిన మాటను తప్పడం నీకు ఉచితము అని తోస్తే నేను వచ్చిన దారినే వెళ్లిపోతాను. ఇచ్చిన మాటను తప్పిన నీవు నీ భార్యాబిడ్డలతో సుఖంగాఉండు.” అనిఅన్నాడు విశ్వామిత్రుడు కోపంగా.
విశ్వామిత్రునికి కోపం వచ్చింది అని తెలుసుకున్నాడు పురోహితుడు, కులగురువు వసిష్టుడు. వెంటనే లేచాడు. దశరథుని వద్దకు వచ్చి ఇలా అన్నాడు.
“ఓ దశరథ మహారాజా! నీవు ఇక్ష్వాకు వంశంలో పుట్టావు. ధర్మ సంస్థాపనకు కంకణము కట్టుకున్నావు. మంచి ధైర్యవంతుడివి. అటువంటి నీవు ఈ మాదిరి పుత్ర వ్యామోహంతో ధర్మము తప్పి ఆడిన మాట తప్పడం తగునా! నీవు నీ ధర్మమును ఆచరించి. అధర్మమును విడిచిపెట్టు. ఆడిన మాట తప్పడం అంటే నీవు ఇప్పటి దాకా సంపాదించుకున్న పుణ్యమును నశింపచేసుకోవడమే. కాబట్టి నీవు ఇచ్చిన మాట ప్రకారము రాముని విశ్వామిత్రుని వెంట పంపు.
ఓ దశరథ మహారాజా! నా మాట విను. విశ్వామిత్రుడు వెంట ఉంటే నీ రామునికి వచ్చిన భయం ఏమీ లేదు. ఎందుకంటే విశ్వామిత్రునికి తెలియని అస్త్ర శస్త్రములు ఏమీ లేవు. ఆయనకు తెలిసిన అస్త్ర శస్త్రములు దేవతలకు, రాక్షసులకు, గంధర్వులకు ఎవరికీ తెలియవు. పూర్వము భృశాశ్వసుడు తనకు తెలిసిన అస్త్ర శస్త్రములు అన్నీ విశ్వామిత్రునికి ఇచ్చాడు. ఆ అస్త్రములు సామాన్యమైనవి కావు. అవి భృశాశ్వసునకు దక్షప్రజాపతి కుమార్తెలకు జన్మించిన అస్త్రములు. అవి గొప్ప పరాక్రమము, శక్తి కలవి.
పూర్వము దక్షప్రజాపతి కుమార్తె జయ అను ఆమె రాక్షసులను సంహరించుటకు యాభై మంది పుత్రులను కన్నది. వారు కామ రూపులు, మహాబలురు. పరాక్రమవంతులు. వారే ఇప్పుడు అస్త్ర రూపములలో విశ్వామిత్రుని వద్ద ఉన్నారు. అవే కాదు ఈ విశ్వామిత్రుడు కొత్త కొత్త అస్త్రములను సృష్టించుటలో కూడా సమర్ధుడు. అటువంటి మహాపురుషుని వెంట రాముని పంపుటకు ఎందుకు సందేహిస్తావు?
నీకు ఇంకో విషయం తెలుసా! ఆ రాక్షసులను చంపడానికి విశ్వామిత్రునకు ఒక క్షణం కూడా పట్టదు. కాని నీకు నీ కుమారులకు పేరు ప్రతిష్ఠలు తీసుకు రావడానికే నీ దగ్గరకు వచ్చి నీ కుమారుడు రాముని పంపమని అర్థిస్తున్నాడు. ఈ విషయం నీవు అర్థం చేసుకొని రాముని విశ్వామిత్రుని వెంట పంపు.” అని పలికాడు.
కులగురువు వసిష్టుని మాటలకు ప్రసన్నుడయ్యాడు దశరథుడు. రాముని విశ్వామిత్రుని వెంట పంపుటకు అంగీకరించాడు.
ఇది వాల్మీకి విరచిత
రామాయణ మహాకావ్యములో
బాలకాండలో ఇరవై ఒకటవ సర్గ సంపూర్ణము.
ఓం తత్సత్ ఓంతత్సత్ ఓంతత్సత్.
బాలకాండ ద్వావింశః సర్గః (22) >>