Balakanda Sarga 35 In Telugu – బాలకాండ పంచత్రింశః సర్గః

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. బాలకాండ లోని పంచత్రింశః సర్గలో విశ్వామిత్ర మహర్షి మరికొందరు గంగా నది ఒడ్డుకు చేరుకుంటారు మరియు వారు ఆ నదీతీరంలో విహారం చేస్తారు. అక్కడ గంగా నది గురించి రాముడు పరిశోధనాత్మకంగా అడిగినప్పుడు విశ్వామిత్రుడు గంగానది పురాణాన్ని వివరిస్తాడు, ఆమె తండ్రి హిమాలయాల నుండి దేవతలు ఆమెను ఎలా స్వర్గానికి తీసుకువెళ్లారు.

ఉమాగంగావృత్తాంతసంక్షేపః

ఉపాస్య రాత్రిశేషం తు శోణాకూలే మహర్షిభిః |
నిశాయాం సుప్రభాతాయాం విశ్వామిత్రోఽభ్యభాషత ||

1

సుప్రభాతా నిశా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే |
ఉత్తిష్ఠోత్తిష్ఠ భద్రం తే గమనాయాభిరోచయ ||

2

తచ్ఛ్రుత్వా వచనం తస్య కృత్వా పౌర్వాహ్ణికీం క్రియామ్ |
గమనం రోచయామాస వాక్యం చేదమువాచ హ ||

3

అయం శోణః శుభజలోగాధః పులినమండితః |
కతరేణ పథా బ్రహ్మన్సంతరిష్యామహే వయమ్ ||

4

ఏవముక్తస్తు రామేణ విశ్వామిత్రోఽబ్రవీదిదమ్ |
ఏష పంథా మయోద్దిష్టో యేన యాంతి మహర్షయః ||

5

ఏవముక్తా మహర్షయో విశ్వామిత్రేణ ధీమతా |
పశ్యంతస్తే ప్రయాతా వై వనాని వివిధాని చ ||

6

తే గత్వా దూరమధ్వానం గతేఽర్ధదివసే తదా |
జాహ్నవీం సరితాం శ్రేష్ఠాం దదృశుర్మునిసేవితామ్ ||

7

తాం దృష్ట్వా పుణ్యసలిలాం హంససారససేవితామ్ |
బభూవుర్మునయః సర్వే ముదితాః సహరాఘవాః ||

8

తస్యాస్తీరే తతశ్చక్రుస్త ఆవాసపరిగ్రహమ్ |
తతః స్నాత్వా యథాన్యాయం సంతర్ప్య పితృదేవతాః ||

9

హుత్వా చైవాగ్నిహోత్రాణి ప్రాశ్య చానుత్తమం హవిః |
వివిశుర్జాహ్నవీతీరే శుచౌ ముదితమానసాః ||

10

విశ్వామిత్రం మహాత్మానం పరివార్య సమంతతః |
సంప్రహృష్టమనా రామో విశ్వామిత్రమథాబ్రవీత్ ||

11

భగవన్ శ్రోతుమిచ్ఛామి గంగాం త్రిపథగాం నదీమ్ |
త్రైలోక్యం కథమాక్రమ్య గతా నదనదీపతిమ్ ||

12

చోదితో రామవాక్యేన విశ్వామిత్రో మహామునిః |
వృద్ధిం జన్మ చ గంగాయా వక్తుమేవోపచక్రమే ||

13

శైలేంద్రో హిమవాన్రామ ధాతూనామాకరో మహాన్ |
తస్య కన్యాద్వయం జాతం రూపేణాప్రతిమం భువి ||

14

యా మేరుదుహితా రామ తయోర్మాతా సుమధ్యమా |
నామ్నా మేనా మనోజ్ఞా వై పత్నీ హిమవతః ప్రియా ||

15

తస్యాం గంగేయమభవజ్జ్యేష్ఠా హిమవతః సుతా |
ఉమా నామ ద్వితీయాభూత్కన్యా తస్యైవ రాఘవ ||

16

అథ జ్యేష్ఠాం సురాః సర్వే దేవతార్థచికీర్షయా |
శైలేంద్రం వరయామాసుర్గంగాం త్రిపథగాం నదీమ్ ||

17

దదౌ ధర్మేణ హిమవాంస్తనయాం లోకపావనీమ్ |
స్వచ్ఛందపథగాం గంగాం త్రైలోక్యహితకామ్యయా ||

18

ప్రతిగృహ్య తతో దేవాస్త్రిలోకహితకారిణః |
గంగామాదాయ తేఽగచ్ఛన్కృతార్థేనాంతరాత్మనా ||

19

యా చాన్యా శైలదుహితా కన్యాఽఽసీద్రఘునందన |
ఉగ్రం సా వ్రతమాస్థాయ తపస్తేపే తపోధనా ||

20

ఉగ్రేణ తపసా యుక్తాం దదౌ శైలవరః సుతామ్ |
రుద్రాయాప్రతిరూపాయ ఉమాం లోకనమస్కృతామ్ ||

21

ఏతే తే శైలరాజస్య సుతే లోకనమస్కృతే |
గంగా చ సరితాం శ్రేష్ఠా ఉమా దేవీ చ రాఘవ ||

22

ఏతత్తే సర్వమాఖ్యాతం యథా త్రిపథగా నదీ |
ఖం గతా ప్రథమం తాత గంగా గతిమతాం వర ||

23

సైషా సురనదీ రమ్యా శైలేంద్రస్య సుతా తదా |
సురలోకం సమారూఢా విపాపా జలవాహినీ ||

24

Balakanda Sarga 35 In Telugu Pdf With Meaning

మరునాడు విశ్వామిత్రుడు రామ లక్ష్మణులు వారి వెంట వచ్చిన మునులు అంతరూ ప్రాతః కాలముననే నిద్ర లేచి, సంధ్యావందనము అగ్నిహోత్రము మొదలగు కార్యక్రమములు ముగించుకొని ప్రయాణమునకు సిద్ధము అయ్యారు. అందరూ తమ ప్రయాణమును కొనసాగించారు. మధ్యాహ్న సమయమునకు గంగానదీ తీరమునకు చేరుకున్నారు.

గంగానదీ దర్శనము చేసుకున్న రామలక్ష్మణులు, మునులు ఎంతో సంతోషించారు. వారందరూ గంగానదీలో స్నానములు చేసి పితృ తర్పణములు విడిచారు. మధ్యాహ్న భోజనములు అయిన తరువాత అందరూ విశ్వామిత్రుని చుట్టు కూర్చున్నారు.

విశ్వామిత్రుని చూచి రాముడు ఇలా అన్నాడు. ” ఓ మహర్షీ! ఇచ్చట గంగానది మూడు పాయలుగా ప్రవహించుచున్నది కదా. ఇది ఎలా ఏర్పడినది. ఈ గంగానది ఎక్కడ సముద్రములో కలుస్తుంది. వివరించండి.” అని అడిగాడు.

విశ్వామిత్రుడు గంగా నది గురించి దాని ఉత్పత్తి గురించి ఇలా చెప్పసాగాడు.

‘ఓ రామా! హిమవంతుడు అనే రాజు ఉండేవాడు. అతనికి హిమవత్పర్వతము నివాసము. హిమవత్పర్వతము సకల ధాతువులకు. ఓషధులకు నిలయము.

హిమ వంతుని భార్య పేరు మనోరమ. ఆమె మేరు పర్వతము కుమార్తె. వారికి ఇద్దరు కుమార్తెలు ఉండేవారు. వారి పేర్లు గంగ, ఉ మ. దేవతలందరూ హిమవంతుని వద్దకు పోయి గంగను తమకు ఇమ్మని అడిగారు. లోకముల యొక్క మేలు కోరిన హిమవంతుడు, తన పెద్ద కుమార్తె గంగను దేవతలకు ఇచ్చాడు. గంగ దేవతలతో పాటు వెళ్లిపోయింది.

హిమవంతుని రెండవ కుమార్తె ఉమ తపస్సు చేయడం మొదటు పెట్టింది. హిమ వంతుడు తనరెండవ కుమార్తె ఉమను మహాశివునికి ఇచ్చి వివాహము చేసాడు. గంగ, ఉమ అక్కా చెల్లెళ్లు. గంగ ఆ ప్రకారము దేవతల వెంట ఆకాశమునకు వెళ్లింది. ఉమశివుని వెంట కైలాసమునకు వెళ్లింది.

గంగ నదీ రూపంలో దేవతల నదిగా దేవలోకములో ప్రవహిస్తూ ఉంది.

శ్రీమద్రామాయణము
బాలకాండ 35వ సర్గ సంపూర్ణము.
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్.

బాలకాండ షట్త్రింశః సర్గః (36) >>

Leave a Comment