Balakanda Sarga 67 In Telugu – బాలకాండ సప్తషష్టితమః సర్గః

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. బాలకాండ లోని సప్తషష్టితమః సర్గలో, శివుడి ధనుస్సు యొక్క బిగువును పరిశీలించాలనుకున్నప్పుడు రాముడు దానిని విరిచాడు. జనకుడు కలవరపడ్డాడు, మరికొందరు విల్లు విరిచే పేలుడుకు మూర్ఛపోయారు, మరియు జనకుడు సీతను రాముడికి వివాహ ప్రతిపాదన చేస్తాడు. ఆ ప్రతిపాదనకు విశ్వామిత్రుని ఆమోదం మేరకు జనకుడు తన సర్వాధికారులను అయోధ్యకు పంపుతాడు.

ధనుర్భంగః

జనకస్య వచః శ్రుత్వా విశ్వామిత్రో మహామునిః |
ధనుర్దర్శయ రామాయ ఇతి హోవాచ పార్థివమ్ ||

1

తతః స రాజా జనకః సచివాన్వ్యాదిదేశ హ |
ధనురానీయతాం దివ్యం గంధమాల్యవిభూషితమ్ ||

2

జనకేన సమాదిష్టాః సచివాః ప్రావిశన్పురీమ్ |
తద్ధనుః పురతః కృత్వా నిర్జగ్ముః పార్థివాజ్ఞయా ||

3

నృణాం శతాని పంచాశద్వ్యాయతానాం మహాత్మనామ్ |
మంజూషామష్టచక్రాం తాం సమూహుస్తే కథంచన ||

4

తామాదాయ తు మంజూషామాయసీం యత్ర తద్ధనుః |
సురోపమం తే జనకమూచుర్నృపతిమంత్రిణః ||

5

ఇదం ధనుర్వరం రాజన్పూజితం సర్వరాజభిః |
మిథిలాధిప రాజేంద్ర దర్శనీయం యదిచ్ఛసి ||

6

తేషాం నృపో వచః శ్రుత్వా కృతాంజలిరభాషత |
విశ్వామిత్రం మహాత్మానం తౌ చోభౌ రామలక్ష్మణౌ ||

7

ఇదం ధనుర్వరం బ్రహ్మన్ జనకైరభిపూజితమ్ |
రాజభిశ్చ మహావీర్యైరశక్తైః పూరితుం పురా ||

8

నైతత్సురగణాః సర్వే నాసురా న చ రాక్షసాః |
గంధర్వయక్షప్రవరాః సకిన్నరమహోరగాః ||

9

క్వ గతిర్మానుషాణాం చ ధనుషోఽస్య ప్రపూరణే |
ఆరోపణే సమాయోగే వేపనే తోలనేఽపి వా ||

10

తదేతద్ధనుషాం శ్రేష్ఠమానీతం మునిపుంగవ |
దర్శయైతన్మహాభాగ అనయో రాజపుత్రయోః ||

11

విశ్వామిత్రస్తు ధర్మాత్మా శ్రుత్వా జనకభాషితమ్ |
వత్స రామ ధనుః పశ్య ఇతి రాఘవమబ్రవీత్ ||

12

బ్రహ్మర్షేర్వచనాద్రామో యత్ర తిష్ఠతి తద్ధనుః |
మంజూషాం తామపావృత్య దృష్ట్వా ధనురథాబ్రవీత్ ||

13

ఇదం ధనుర్వరం బ్రహ్మన్ సంస్పృశామీహ పాణినా |
యత్నవాంశ్చ భవిష్యామి తోలనే పూరణేపి వా ||

14

బాఢమిత్యేవ తం రాజా మునిశ్చ సమభాషత |
లీలయా స ధనుర్మధ్యే జగ్రాహ వచనాన్మునేః ||

15

పశ్యతాం నృసహస్రాణాం బహూనాం రఘునందనః |
ఆరోపయత్స ధర్మాత్మా సలీలమివ తద్ధనుః ||

16

ఆరోపయిత్వా ధర్మాత్మా పూరయామాస వీర్యవాన్ |
తద్బభంజ ధనుర్మధ్యే నరశ్రేష్ఠో మహాయశాః ||

17

తస్య శబ్దో మహానాసీన్నిర్ఘాతసమనిఃస్వనః |
భూమికంపశ్చ సుమహాన్పర్వతస్యేవ దీర్యతః ||

18

నిపేతుశ్చ నరాః సర్వే తేన శబ్దేన మోహితాః |
వర్జయిత్వా మునివరం రాజానం తౌ చ రాఘవౌ ||

19

ప్రత్యాశ్వస్తే జనే తస్మిన్రాజా విగతసాధ్వసః |
ఉవాచ ప్రాంజలిర్వాక్యం వాక్యజ్ఞో మునిపుంగవమ్ ||

20

భగవన్దృష్టవీర్యో మే రామో దశరథాత్మజః |
అత్యద్భుతమచింత్యం చ న తర్కితమిదం మయా ||

21

జనకానాం కులే కీర్తిమాహరిష్యతి మే సుతా |
సీతా భర్తారమాసాద్య రామం దశరథాత్మజమ్ ||

22

మమ సత్యా ప్రతిజ్ఞా చ వీర్యశుల్కేతి కౌశిక |
సీతా ప్రాణైర్బహుమతా దేయా రామాయ మే సుతా ||

23

భవతోఽనుమతే బ్రహ్మన్ శీఘ్రం గచ్ఛంతు మంత్రిణః |
మమ కౌశిక భద్రం తే అయోధ్యాం త్వరితా రథైః ||

24

రాజానం ప్రశ్రితైర్వాక్యైరానయంతు పురం మమ |
ప్రదానం వీర్యశుల్కాయాః కథయంతు చ సర్వశః ||

25

మునిగుప్తౌ చ కాకుత్స్థౌ కథయంతు నృపాయ వై |
ప్రీయమాణం తు రాజానమానయంతు సుశీఘ్రగాః ||

26

కౌశికశ్చ తథేత్యాహ రాజా చాభాష్య మంత్రిణః |
అయోధ్యాం ప్రేషయామాస ధర్మాత్మా కృతశాసనాన్ ||

27

[* యథావృత్తం సమాఖ్యాతుమానేతుం చ నృపం తదా | *]

Balakanda Sarga 67 In Telugu Pdf With Meaning

జనకుడు చెప్పిన మాటలు విన్నాడు విశ్వామిత్రుడు. “ఓ జనక మహారాజా! నీవు చెప్పినది అంతా విన్నాము. నీవద్ద ఉన్న ధనుస్సును రామునికి చూపించు.” అని అన్నాడు.

జనకుడు పూజా మందిరములో పూజలందుకుంటున్న ఆ ధనుస్సును తీసుకొని రమ్మని సామంతులను ఆజ్ఞాపించాడు. జనకుని ఆజ్ఞాను అనుసరించి సామంతులు ఎనిమిది చక్రముల గల ఒక వాహనము మీద అమర్చి ఉన్న ఆ శివ ధనుస్సును తీసుకొని వచ్చారు. 5,000 మంది ధృడకాయులు ఆ ధనుస్సు ఉన్న వాహనమును లాగుకొని వచ్చారు.

“జనక మహారాజా! తమరు ఆదేశించినట్టు, నీవు రామునికి చూపదలచుకొన్న శివధనుస్సును తీసుకొని వచ్చాము.” అని అన్నారు సామంత రాజులు.

జనకుడు విశ్వామిత్రుని, రామలక్ష్మణులను చూచి ఇలా అన్నాడు. “ఓ విశ్వామిత్ర మహర్షీ! ఈ ధనుస్సు మాకు వంశపారంపర్యముగా వచ్చింది. దీనిని ఎంతో మంది రాజులు, రాజకుమారులు

ఎక్కుబెట్టబోయి విఫలమయ్యారు. రాజులే కాదు, దేవతలు, గంధర్వులు, అసురులు కూడా దీనిని ఎక్కుపెట్టలేకపోయారు. కాబట్టి ఈ ధనుస్సును ఎత్తుటకు గానీ, ఎక్కుబెట్టుటకు కానీ మానవ మాత్రులకు సాధ్యము కాదుకదా! ఓ విశ్వామిత్ర మహర్షీ! దీనిని రామలక్ష్మణులకు చూపుము.”అని అన్నాడు జనకుడు.

విశ్వామిత్రుడు రాముని వంక చూచాడు. “రామా! ఈ ధనుస్సును చూడు.” అన్నాడు.

విశ్వామిత్రుని మాటలను విన్న రాముడు “అలాగే మహాత్మా! తమరు చెప్పినట్టు నేను ఆ ధనుస్సు ఉన్న పేటికను తెరిచి ఆ ధనుస్సును చూస్తాను. తాకుతాను. ఆ ధనుస్సును ఎత్తడానికి, నాకు శక్తి ఉంటే దానిని ఎక్కుపెట్టడానికి ప్రయత్నిస్తాను.” అని అన్నాడు.

అంగీకార సూచకంగా విశ్వామిత్రుడు తల ఊపాడు. రాముడు ఆ ధనుస్సును అవలీలగా ఎత్తి పట్టుకున్నాడు. దానిని నిలబెట్టాడు. అందరూ ఆశ్చర్యంగా చూస్తున్నారు. రాముడు ఆ ధనుస్సును ఏ మాత్రం శమపడకుండా ఎక్కుపెట్టాడు. ఆ ధనుస్సుకు ఉన్న నారిని పట్టుకొని తన చెవి దాకా లాగాడు. ఆ ధనుస్సు ఒంగింది. ఫెడేల్ మని మధ్యకు విరిగిపోయింది. రెండు ముక్కలు అయింది.

ఆ ధనుస్సు విరిగినపుడు పిడుగు పడ్డట్టు భయంకర మైన శబ్దం వచ్చింది. భూమి కంపించినట్టయింది. ఆ శబ్దానికి అక్కడ ఉన్న వారంతా కిందపడి మూర్ఛపోయారు. ఇదంతా తనకు ముందే తెలుసు అన్నట్టు విశ్వామిత్రుడు చూస్తున్నాడు.

తరువాత జనకుడు విశ్వామిత్రునితో ఇలా అన్నాడు. “ఓ మహర్షీ! దశరథుని కుమారుడైన శ్రీరాముని వీరత్వమును బలపరాక్రమ ములను ప్రత్యక్షంగా చూచాను. నా దేహం గగుర్పొడిచింది. మనసంతా ఆశ్చర్యంతో నిండిపోయింది. ఇది కలా నిజమా అని నమ్మలేకున్నాను. ఇది అత్యద్భుతము, ఊహాతీతము. అనుకున్న ప్రకారము నా కుమార్తె సీత, దశరథపుత్రుడు రాముని వివాహమాడి మా వంశమునకు కీర్తి ప్రతిష్ఠలు తీసుకురాగలదు అని విశ్వసిస్తున్నాను. సీతను “వీరశుల్క” గా అనగా సీతను వివాహమాడుటకు వీరత్వమునే శుల్కముగా నిర్ణయించాను. ఆ వీరత్వము రాముని వద్ద ఉన్నది అని గ్రహించాను. నా ప్రాణసమానమైన నా కుమార్తె సీతను రామునికి మనస్ఫూర్తిగా సమర్పిస్తాను.

ఓ విశ్వామిత్ర మహర్షీ! తమరు ఆజ్ఞాపిస్తే మా మంత్రులు వెంటనే అయోధ్యకు పోయి, రామలక్ష్మణులు తమరి సంరక్షణలో సుఖంగా ఉ న్నారని తెలిపి, రాముడు శివధనుర్భంగము చేయడం, నేను నా కుమార్తె సీతను రామునికి ఇచ్చి వివాహం చేయ సంకల్పించడం మొదలగు విషయములన్నిటి గురించి దశరథమహారాజుకు వివరంగా చెప్పి, దశరథ మహారాజును బంధుమిత్ర సపరివార సమేతము గా మిధిలకు తోడ్కొని రాగలరు. ” అని వినయంగా పలికాడు.

అలాగే కానిమ్ము అని విశ్వామిత్రుడు జనక మహారాజుకు అనుజ్ఞ ఇచ్చాడు. వెంటనే జనక మహారాజు తన మంత్రులతో సంప్రదించాడు. అయోధ్యకు వెళ్లి దశరధమహారాజుకు జరిగిన విషయములు అన్నీ చెప్పి వారిని సగౌరవంగా మిథిలకు తీసుకొని వచ్చుటకు మంత్రులను పంపించాడు.

శ్రీమద్రామాయణము
బాలకాండము అరవై ఏడవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్.

బాలకాండ అష్టషష్టితమః సర్గః (68) >>

Leave a Comment