Balakanda Sarga 69 In Telugu – బాలకాండ ఏకోనసప్తతితమః సర్గః

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. బాలకాండ లోని ఏకోనసప్తతితమః సర్గలో, దశరథుడు మిథిలాకు వస్తాడు మరియు జనకుడు ఇక్ష్వాకులు అని పిలువబడే పట్టాభిషేక వంశానికి చెందినవాడు కాబట్టి అతన్ని గౌరవప్రదంగా స్వీకరిస్తాడు. అప్పుడు, రాజభోగాలు మరియు ప్రోటోకాల్ యొక్క సాధారణ మార్పిడి తర్వాత, వారందరూ హాయిగా మిథిలాలో ఉంటారు.

దశరథజనకసమాగమః

తతో రాత్ర్యాం వ్యతీతాయాం సోపాధ్యాయః సబాంధవః |
రాజా దశరథో హృష్టః సుమంత్రమిదమబ్రవీత్ ||

1

అద్య సర్వే ధనాధ్యక్షా ధనమాదాయ పుష్కలమ్ |
వ్రజంత్వగ్రే సువిహితా నానారత్నసమన్వితాః ||

2

చతురంగబలం సర్వం శీఘ్రం నిర్యాతు సర్వశః |
మమాజ్ఞాసమకాలం చ యానయుగ్మమనుత్తమమ్ ||

3

వసిష్ఠో వామదేవశ్చ జాబాలిరథ కాశ్యపః |
మార్కండేయః సుదీర్ఘాయురృషిః కాత్యాయనస్తథా ||

4

ఏతే ద్విజాః ప్రయాంత్వగ్రే స్యందనం యోజయస్వ మే |
యథా కాలాత్యయో న స్యాద్దూతా హి త్వరయంతి మామ్ ||

5

వచనాత్తు నరేంద్రస్య సా సేనా చతురంగిణీ |
రాజానమృషిభిః సార్ధం వ్రజంతం పృష్ఠతోఽన్వగాత్ ||

6

గత్వా చతురహం మార్గం విదేహానభ్యుపేయివాన్ |
రాజా తు జనకః శ్రీమాన్ శ్రుత్వా పూజామకల్పయత్ ||

7

తతో రాజానమాసాద్య వృద్ధం దశరథం నృపమ్ |
జనకో ముదితో రాజా హర్షం చ పరమం యయౌ ||

8

ఉవాచ చ నరశ్రేష్ఠో నరశ్రేష్ఠం ముదాన్వితః |
స్వాగతం తే మహారాజ దిష్ట్యా ప్రాప్తోఽసి రాఘవ ||

9

పుత్రయోరుభయోః ప్రీతిం లప్స్యసే వీర్యనిర్జితామ్ |
దిష్ట్యా ప్రాప్తో మహాతేజా వసిష్ఠో భగవానృషిః ||

10

సహ సర్వైర్ద్విజశ్రేష్ఠైర్దేవైరివ శతక్రతుః |
దిష్ట్యా మే నిర్జితా విఘ్నా దిష్ట్యా మే పూజితం కులమ్ ||

11

రాఘవైః సహ సంబంధాద్వీర్యశ్రేష్ఠైర్మహాత్మభిః |
శ్వః ప్రభాతే నరేంద్ర త్వం నిర్వర్తయితుమర్హసి ||

12

యజ్ఞస్యాంతే నరశ్రేష్ఠ వివాహమృషిసమ్మతమ్ |
తస్య తద్వచనం శ్రుత్వా ఋషిమధ్యే నరాధిపః ||

13

వాక్యం వాక్యవిదాం శ్రేష్ఠః ప్రత్యువాచ మహీపతిమ్ |
ప్రతిగ్రహో దాతృవశః శ్రుతమేతన్మయా పురా ||

14

యథా వక్ష్యసి ధర్మజ్ఞ తత్కరిష్యామహే వయమ్ |
ధర్మిష్ఠం చ యశస్యం చ వచనం సత్యవాదినః ||

15

శ్రుత్వా విదేహాధిపతిః పరం విస్మయమాగతః |
తతః సర్వే మునిగణాః పరస్పరసమాగమే ||

16

హర్షేణ మహతా యుక్తాస్తాం నిశామవసన్సుఖమ్ |
[* అధికపాఠః –
అథ రామో మహాతేజా లక్ష్మణేన సమం యయౌ |
విశ్వామిత్రం పురస్కృత్య పితుః పాదావుపస్పృశన్ |
*]
రాజా చ రాఘవౌ పుత్రౌ నిశామ్య పరిహర్షితః ||

17

ఉవాస పరమప్రీతో జనకేనాభిపూజితః |
జనకోఽపి మహాతేజాః క్రియాం ధర్మేణ తత్త్వవిత్ |
యజ్ఞస్య చ సుతాభ్యాం చ కృత్వా రాత్రిమువాస హ ||

18

Balakanda Sarga 69 In Telugu Pdf With Meaning

రాత్రి గడిచి తెల్లవారింది. దశరథుడు తెల్లరాజుజామున లేచి కాలకృత్యములు సంధ్యావందనాది కార్యక్రమములు నిర్వర్తించుకొని తన మంత్రి సుమంతుని పిలిపించాడు.

“సుమంతా! రాముని వివాహమునకు మనకు మిథిలకు వెళు తున్నాము. ముందు ధనరాసులు, రత్నములు, ఆభరణములతో కొంతమంది వెళ్లాలి. తరువాత మా వెంట చతురంగ బలములు బయలుదేరాలి. మన పురోహితులు వసిష్ఠుడు, వామదేవుడు, మహాఋషులు జాబాలి, కశ్యపుడు, మార్కండేయుడు, కాత్యాయనుడు కూడా వస్తున్నారు. వారి ప్రయాణానికి తగిన ఏర్పాట్లు చెయ్యండి. ఆలస్యము చేయవద్దు.” అని ఆదేశాలు ఇచ్చాడు.

సుమంతుడు దశరథుని ప్రయాణానికి తగు ఏర్పాట్లు చేసాడు. నాలుగు రోజుల ప్రయాణము తరువాత అందరూ మిథిలకు చేరుకున్నారు. జనకుడు వారిని తగు మర్యాదలతో ఆహ్యానించాడు. అతిథి సత్కారములు, విడిది ఏర్పాట్లు చేసాడు. దశరథ మహారాజును కలుసుకొని జనకుడు ఇలా అన్నాడు.

“ఓ దశరథమహారాజా! తమరికి మిథిలాధిపతి జనకుడు స్వాగతము పలుకుతున్నాడు. తమరి రాకతో మా మిథిలా నగరము పావనముఅయింది. తమరి కుమారుల పరాక్రమము అనుపమానము, అద్వితీయము. మా భాగ్యము కొద్దీ వసిష్ఠ మహర్షి మా నగరమునకు వచ్చారు. మాకు ఎంతో ఆనందముగా ఉంది.

ఓ దశరథమహారజా! మా భాగ్య వశమున రఘువంశ రాజులతో వియ్యమందడంతో అన్ని విఘ్నములు తొలగిపోయాయి. మా కులము పావనమయింది. రేపు నేను తలపెట్టిన యజ్ఞము పూర్తి అయిన తరువాత వివాహ మహోత్సవ కార్యక్రమము జరుపుటకు అనుమతిని ఇవ్వండి.” అని అన్నాడు జనకుడు.

అప్పుడు దశరథుడు ఇలా అన్నాడు. “ఓ జనకమహారాజా! తమరు కన్యాదాతలు. తమరు కన్యాదానం చేస్తేనే కదా మేము కన్యను స్వీకరించేది. కాబట్టి కన్యాదాన ముహూర్త నిర్ణయము మీది. తమరు ఎలా చెపుతారో అలాగే చేస్తాము.” అని అన్నాడు దశరథుడు.

ఆ మాటలకు జనకుడు ఎంతో సంతోషించాడు. ఆ రాత్రికి దశరధుడు, ఆయన వెంట వచ్చిన మునులు, పురోహితులు, పరివారము మిథిలానగరములో సుఖంగా గడిపారు. దశరథుడు విశ్వామిత్రుని వద్ద ఉన్న రామలక్ష్మణులను చూచి ఎంతో
ఆనందించాడు.

శ్రీమద్రామాయణము
బాలకాండము అరువదితొమ్మిదవ సర్గ సంపూర్ణము.
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్.

బాలకాండ సప్తతితమః సర్గః (70) >>

Leave a Comment