Balakanda Sarga 75 In Telugu – బాలకాండ పంచసప్తతితమః సర్గః

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. బాలకాండ లోని పంచసప్తతితమః సర్గలో, సందర్శకుడు పరశు రాముడు విష్ణువు మరియు శివుడి విల్లుల పురాణాలను రాముడికి వివరిస్తాడు. తన కుమారులను విడిచిపెట్టమని దశరథుడు చేసిన అభ్యర్థనను పట్టించుకోకుండా, పరశు రాముడు దశరథ రాముడిని నేరుగా ఉద్దేశించి, విష్ణువు యొక్క పొడవాటి ధనుస్సుతో లక్ష్యం వేయమని అడుగుతాడు మరియు దశరథ రాముడు అలా చేయగలిగితే, పరశురాముడు ద్వంద్వ యుద్ధం చేస్తానని చెప్పాడు. అతనిని.

వైష్ణవధనుఃప్రశంసా

రామ దాశరథే రామ వీర్యం తే శ్రూయతేఽద్భుతమ్ | [వీర]
ధనుషో భేదనం చైవ నిఖిలేన మయా శ్రుతమ్ ||

1

తదద్భుతమచింత్యం చ భేదనం ధనుషస్త్వయా |
తచ్ఛ్రుత్వాహమనుప్రాప్తో ధనుర్గృహ్యాపరం శుభమ్ ||

2

తదిదం ఘోరసంకాశం జామదగ్న్యం మహద్ధనుః |
పూరయస్వ శరేణైవ స్వబలం దర్శయస్వ చ ||

3

తదహం తే బలం దృష్ట్వా ధనుషోఽస్య ప్రపూరణే |
ద్వంద్వయుద్ధం ప్రదాస్యామి వీర్యశ్లాఘ్యమహం తవ ||

4

తస్య తద్వచనం శ్రుత్వా రాజా దశరథస్తదా |
విషణ్ణవదనో దీనః ప్రాంజలిర్వాక్యమబ్రవీత్ ||

5

క్షత్రరోషాత్ప్రశాంతస్త్వం బ్రాహ్మణశ్చ మహాయశాః |
బాలానాం మమ పుత్రాణామభయం దాతుమర్హసి ||

6

భార్గవాణాం కులే జాతః స్వాధ్యాయవ్రతశాలినామ్ |
సహస్రాక్షే ప్రతిజ్ఞాయ శస్త్రం నిక్షిప్తవానసి ||

7

స త్వం ధర్మపరో భూత్వా కాశ్యపాయ వసుంధరామ్ |
దత్త్వా వనముపాగమ్య మహేంద్రకృతకేతనః ||

8

మమ సర్వవినాశాయ సంప్రాప్తస్త్వం మహామునే |
న చైకస్మిన్హతే రామే సర్వే జీవామహే వయమ్ ||

9

బ్రువత్యేవం దశరథే జామదగ్న్యః ప్రతాపవాన్ |
అనాదృత్యైవ తద్వాక్యం రామమేవాభ్యభాషత ||

10

ఇమే ద్వే ధనుషీ శ్రేష్ఠే దివ్యే లోకాభివిశ్రుతే |
దృఢే బలవతీ ముఖ్యే సుకృతే విశ్వకర్మణా ||

11

అతిసృష్టం సురైరేకం త్ర్యంబకాయ యుయుత్సవే |
త్రిపురఘ్నం నరశ్రేష్ఠ భగ్నం కాకుత్స్థ యత్త్వయా ||

12

ఇదం ద్వితీయం దుర్ధర్షం విష్ణోర్దత్తం సురోత్తమైః |
తదిదం వైష్ణవం రామ ధనుః పరపురంజయమ్ ||

13

సమానసారం కాకుత్స్థ రౌద్రేణ ధనుషా త్విదమ్ |
తదా తు దేవతాః సర్వాః పృచ్ఛంతి స్మ పితామహమ్ ||

14

శితికంఠస్య విష్ణోశ్చ బలాబలనిరీక్షయా |
అభిప్రాయం తు విజ్ఞాయ దేవతానాం పితామహః ||

15

విరోధం జనయామాస తయోః సత్యవతాం వరః |
విరోధే చ మహద్యుద్ధమభవద్రోమహర్షణమ్ ||

16

శితికంఠస్య విష్ణోశ్చ పరస్పరజయైషిణోః |
తదా తు జృంభితం శైవం ధనుర్భీమపరాక్రమమ్ ||

17

హుంకారేణ మహాదేవః స్తంభితోఽథ త్రిలోచనః |
దేవైస్తదా సమాగమ్య సర్షిసంఘైః సచారణైః ||

18

యాచితౌ ప్రశమం తత్ర జగ్మతుస్తౌ సురోత్తమౌ |
జృంభితం తద్ధనుర్దృష్ట్వా శైవం విష్ణుపరాక్రమైః ||

19

అధికం మేనిరే విష్ణుం దేవాః సర్షిగణాస్తదా |
ధనూ రుద్రస్తు సంక్రుద్ధో విదేహేషు మహాయశాః ||

20

దేవరాతస్య రాజర్షేర్దదౌ హస్తే ససాయకమ్ |
ఇదం చ వైష్ణవం రామ ధనుః పరపురంజయమ్ ||

21

ఋచీకే భార్గవే ప్రాదాద్విష్ణుః సన్న్యాసముత్తమమ్ |
ఋచీకస్తు మహాతేజాః పుత్రస్యాప్రతికర్మణః ||

22

పితుర్మమ దదౌ దివ్యం జమదగ్నేర్మహాత్మనః |
న్యస్తశస్త్రే పితరి మే తపోబల సమన్వితే ||

23

అర్జునో విదధే మృత్యుం ప్రాకృతాం బుద్ధిమాస్థితః |
వధమప్రతిరూపం తు పితుః శ్రుత్వా సుదారుణమ్ ||

24

క్షత్రముత్సాదయన్రోషాజ్జాతం జాతమనేకశః |
పృథివీం చాఖిలాం ప్రాప్య కాశ్యపాయ మహాత్మనే ||

25

యజ్ఞస్యాంతే తదా రామ దక్షిణాం పుణ్యకర్మణే |
దత్త్వా మహేంద్రనిలయస్తపోబలసమన్వితః ||

26

స్థితోఽస్మి తస్మింస్తప్యన్వై సుసుఖం సురసేవితే |
అద్య తూత్తమవీర్యేణ త్వయా రామ మహాబల ||

27

శ్రుత్వాతు ధనుషో భేదం తతోఽహం ద్రుతమాగతః |
తదిదం వైష్ణవం రామ పితృపైతామహం మహత్ ||

28

క్షత్రధర్మం పురస్కృత్య గృహ్ణీష్వ ధనురుత్తమమ్ |
యోజయస్వ ధనుఃశ్రేష్ఠే శరం పరపురంజయమ్ |
యది శక్నోసి కాకుత్స్థ ద్వంద్వం దాస్యామి తే తతః ||

29

Balakanda Sarga 75 In Telugu Pdf With Meaning

వసిష్ఠుడు, దశరథుడు, అర్పించిన అర్ఘ్య పాద్యములు, అతిథి మర్యాదలు స్వీకరించిన పరశురాముడు, రాముని చూచి ఇలా అన్నాడు.

“ఓ రామా! నీ పరాక్రమము గురించి విన్నాను. నీవు శివుని విల్లు విరిచావని కూడా తెలిసింది. నీవు శివుని విల్లు విరవడం నాకు ఎంతో ఆశ్చర్యాన్ని కలిగించింది. నీవు పరమశివుని విల్లు విరుస్తావని నేను ఊహించలేదు. అందుకే మరొక మహత్తరమైన విల్లు తీసుకొని వచ్చాను. ఈ విల్లు నాకు మా తండ్రి జమదగ్ని ఇచ్చాడు. ఈ విల్లును కూడా నీవు ఎక్కుపెట్టి నీ పరాక్రమమును ప్రదర్శించు. అప్పుడు నేను నీవు పరాక్రమ వంతుడవనీ, వీర్య వంతుడవనీ ఒప్పుకుంటాను. నీతో ద్వంద్వ యుద్ధము చేస్తాను. రా! ఈ విల్లు తీసుకో! ” అని రాముని పిలిచాడు పరశురాముడు.

ఆ మాటలు విని దశరథుడు నిలువెల్లా వణికిపోయాడు. చేతులు జోడించి పరశురాముని ఎదుట నిలబడి ఇలా అన్నాడు.

“ఓ పరశురామా! నీ కీర్తి లోకమంతా వ్యాపించింది. నీవు బ్రాహ్మణుడవు. కాని నీవు క్షత్రియుల మీద కోపించి వారిని 21 మార్లు ఓడించావు. తరువాత శాంతిని పొందావు. కాని ఇప్పుడు అకారణంగా బాలుడైన నా కుమారుని యుద్ధానికి పిలుస్తున్నావు. ఇది న్యాయమా! నా కుమారులను ఏమీ చేయనని అభయము ఇమ్ము.

ఓ పరశురామా! నీవు సామాన్యుడవుకావు. పవిత్రమైన భృగు వంశంలో జన్మించావు. దేవేంద్రుని సమక్షంలో ఆయుధములను విడిచిపెట్టావు. నీవు జయించిన ఈ భూమండలము నంతా కశ్యపునకు దానం చేసావు. మహేంద్ర పర్వతము మీద తపస్సు చేసుకుంటున్నావు. అటువంటి నీవు అకారణంగా నా కుమారుడు రాముని యుద్ధమునకు పిలుస్తున్నావు. రాముడు నీతో యుద్ధము చేసి జయించలేడు. రాముడు లేనిచో మేము ఎవరమూ బతుకలేము. కాబట్టి మా కందరకూ ప్రాణభిక్ష పెట్టు.” అని వేడుకున్నాడు.

కాని పరశురాముడు దశరథుని మాటలు లెక్క చేయలేదు. రాముని చూచి ఇలా అన్నాడు.

“ఓ రామా! నీవు విరిచిన ధనుస్సు, నా చేతిలో ఉన్న ధనుస్సు రెండూ గొప్పవి. దివ్యలోకములకు సంబంధించినవి. బాగా ధృడమైనవి. బలమైనవి. ఈ రెండు ధనుస్సులను విశ్వకర్మ తయారు చేసాడు. అందులో ఒక ధనుస్సును త్రిపురాసుర సంహార సమయంలో దేవతలు పరమేశ్వరునికి ఇచ్చారు. ఆ ధనుస్సునే నీవు విరిచావు. ఈ రెండవ ధనుస్సు దేవతలు విష్ణువుకు ఇచ్చారు. కాబట్టి దీనిని విష్ణు ధనుస్సు అని అంటారు. ఈ ధనుస్సు కూడా శివధనుస్సుతో సమానమైనది.

ఒక సారి దేవతలు అందరూ బ్రహ్మదేవుని వద్దకు పోయి శివుడు, విష్ణువు వీరిలో అత్యధిక బలవంతుడు ఎవరు? అని అడిగారు. బ్రహ్మ కూడా చెప్పలేకపోయూడు. శివకేశవులలో ఎవరు బలవంతులో తెలుసుకోడానికి వారిద్దరి మధ్య భేదాభిప్రాయాలు కల్పించాడు. అవి వారిద్దరి మధ్య యుద్ధమునకు దారి తీసాయి. శివకేశవులకు మధ్య భయంకరమైన యుద్ధము జరిగింది. అప్పుడు విష్ణువు పెద్దగా హుంకారము చేసాడు. ఆ హుంకారమునకు శివుడు భయపడి పోయాడు. అప్పుడు విష్ణువే అధికుడు అని నిర్ణయించారు.

పరమశివునికి కోపం వచ్చింది. తన చేతిలో ఉన్న శివ ధనుస్సును విదేహ దేశాధీశుడు అయిన దేవరాతుడు అనే రాజర్షి వద్ద ఉంచాడు. విష్ణువు కూడా తన ధనుస్సును భృగు వంశీకుడు అయిన ఋచీకుని వద్ద ఉంచాడు. ఋచీకుడు మా తాతగారు. మా తాత గారైన ఋచీకుడు ఆ విష్ణు ధనుస్సును తన కుమారుడు. మా తండ్రి అయిన జమదగ్నికి ఇచ్చాడు.

పాపాత్ముడైన కార్తవీర్యార్జునుడు నా తండ్రి జమదగ్ని ని చంపాడు. నా తండ్రిని చంపాడన్న కోపంతో కార్తవీర్యార్జునుని వాని కుమారులను చంపాను. అతనినే కాదు క్షత్రియ వంశములో ఉన్న ప్రతి వానినీ పుట్టిన వాడిని పుట్టినట్టు సంహరించాను. క్షత్రియకులమును సర్వనాశనము చేసాను. భూమి మీద రాజు అనేవాడు లేకుండా చేసాను. క్షత్రియులను చంపి నేను జయించిన ఈ భూమిని కశ్యపునకు దానంగా ఇచ్చాను. తరువాత నేను మహేంద్రపర్వతము మీద తపస్సు చేసుకుంటున్నాను. ఇప్పుడు నీవు శివధనుస్సును విరిచావు అని దివ్యదృష్టి ద్వారా తెలుసుకొని నీ దగ్గరకు వచ్చాను.

ఓ రామా! నీవు క్షత్రియుడవు. క్షత్రియ ధర్మము ప్రకారము మాకు వంశపారంపర్యముగా సంక్రమించిన ఈ విష్ణుధనుస్సును తీసుకో. దీనిని కూడా ఎక్కుపెట్టి సంధించు. నాతో ద్వంద్వ యుద్ధము చెయ్యి. ” అని పలికాడు పరశురాముడు.

శ్రీమద్రామాయణము
బాలకాండము డెబ్బదిఐదవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్.

బాలకాండ షట్సప్తతితమః సర్గః (76) >>

Leave a Comment