Bhudana Mahima In Telugu – భూదాన మహిమ

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు నీతికథలు గురించి తెలుసుకుందాం.

నీతికథలు

భరద్వాజ సంహిత లోని నీతికథలలో మనకు బాగా సుపరిచితమైన నీతికథ మీ అందరికోసం. అది ఎమిటంటే… భూదాన మహిమ నీతికథ.

భూదాన మహిమ

ఒకసారి దేవేంద్రునికి దేవగురువైన బృహస్పతులవారు భూదానము యొక్క గొప్పతనమును గూర్చి వివరిస్తూ ఈ కథ చెప్పారు:

మాళవ దేశములో ఒక ఘోరారణ్యమున్నది. సూర్యరస్మి కూడా చొచ్చుకు పోలేనంత దట్టమైన అడవి. ఆ మహారణ్యములో ఒక పెద్ద బూఱుగు చెట్టు ఉన్నది. శాఖోపశాఖలతో బాగా విస్తరించి ఉన్న ఆ శాల్మలీవృక్షం ఎన్నెన్నో పక్షులకు జంతువులకు సమాశ్రయాన్ని కల్పిస్తున్నది. చిలుకల కలకలరవాలతో జలపాతాల శబ్దాలతో పచ్చగా కన్నులకు పండుగగా ఉన్నది ఆ అడవి.

ఆ బూఱుగు చెట్టు కొమ్మపై తామ్రతుండం అనే ఒక రామచిలుక కాపురముండేది. ఆ శుకం తన పిల్లలకు నివ్వరిపైరు ఆహారముగా పెట్టేది. తామ్రతుండం పిల్లలు ఆ వడ్లను ఎలా తినాలో కూడా తెలియని పసికూనలు. అందుకని ముక్కుతో ఆ వడ్లను తీసుకుని పిల్లల నోటిలో పడేశేది తామ్రతుండం. ఇలా వడ్లు పెట్టేటప్పుడు కొన్ని గింజలు క్రింద పడేవి. కొన్నాళ్ళకు అవి మొలకలెత్తి కాలక్రమేణ ఒక చిన్న వరి పైరు తయాఱయింది!

ఒకరోజు ఎక్కడా సరి అయిన పచ్చగడ్డి దొరకని ఒక ఆవు ఆకలిదప్పికలతో అలసి ఆ శాల్మలీ వృక్షం దగ్గరకు వచ్చినది. తామ్రతుండం ముక్కునుండి జారిన వడ్లతో పెరిగిన పైరు చూసి సంతోషించి స్వేచ్ఛగా తిని తృప్తి చెంది వెళ్ళిపోయింది. తరువాత ఆ గోవు తినగా మిగిలిన యవలతో ఒక విప్రోత్తముడు పంచయజ్ఞాలు చేశాడు.

అలా దైవికంగా తామ్రతుండానికి మహాపుణ్యం వచ్చింది. కాలధర్మం చేశాక అది చేసుకున్న సుకృతము వలన ధనికుడనే ఒక ధర్మాత్ముడైన వైశ్యునిగా జన్మించింది. ఓడవ్యాపారి అయిన ఆ ధనికునికి పూర్వజన్మ స్మృతి ఉన్నది. అజ్ఞానవశః తన ముక్కునుండి జారిపడిన ధాన్యం మొలకెత్తి ఒక గోవు ఒక విప్పుడు ఆ పంటను ఉపయోగించినందుకే తనకి ఇంత ఫలితం వచ్చిందని తెలిసిన ఆ ధనికుడు ఎన్నో ఫలవంతాలైన మంచి మాగాడి భూములను పండితులకు దానము చేశాడు. ఆ పుణ్యఫలముతో ఇహములో సర్వభోగాలు అనుభవించి కడకు విష్ణులోకం చేరుకున్నాడు.

ఈ కథలోనితి మరొక్కమాణు మీ అందరికోసం:

సస్యసంపూర్ణము ఫలవృక్ష సమన్వితము అయిన భూమిని భక్తితో సత్పాత్రునకు సమర్పించిన వాడికి బ్రహ్మలోకం కరతలామలకం. అజ్ఞానతః తన భూమిలోని పైరు ఇతరులకి ఉపయోగ పడినందుకే తామ్రతుండానికి అంత పుణ్యం వస్తే ఇక జ్ఞానపూర్వకముగా ఫలవృక్షములున్న భూమిని అర్హునికి దానముచేస్తే ఎంత ఫలమో ఆ పరమేశ్వరునికే తెలుసు.

మరిన్ని నీతికథలు మీకోసం:

Leave a Comment