ఈ పోస్ట్ లో దాసోహమనుబుద్ధిదలచరు దానవులు కీర్తన దాని భావము ఇవ్వబడి మరిన్ని అన్నమయ్య కీర్తనలు.
దాసోహమనుబుద్ధిదలచరు దానవులు – అన్నమయ్య కీర్తనలు
సంపుటి: 2
కీర్తన: దాసోహమనుబుద్ధిదలచరు దానవులు
సంఖ్య : 5
పుట: 4
రాగం: నాట
నాట
74 దాసోహ మనుబుద్ధిఁ దలఁచరు దానవులు
యీసులకే పెనఁగేరు యిప్పుడూఁ గొందరు.
||పల్లవి||
హరిచక్రముదూషించేయట్టివారే యసురలు
అరయఁ దామేదైవమన్న వారు నసురలే
ధర నరకాసురుఁడు తానే దైవమని చెడె
యిరవై యిది మానరు యిప్పుడూఁ గొందరు.
||దాసో||
పురుషోత్తమునిపూజపొంతఁ బోరు అసురలు
సరవి విష్ణుని జపించనివారు నసురలే
హిరణ్యకశిపుఁడును యీతని నొల్లక చెడె
ఇరవై యీతని నొల్ల రిప్పుడూఁ గొందరు
||దాసో||
సురలును మునులును శుకాదియోగులును
పరమము శ్రీవేంకటపతి యనుచు
శరణని బ్రదికేరు సరి నేఁడు వైష్ణవులు
యెరపరికానఁ బొయ్యే రిప్పుడూఁ గొందరు.
||దాసో||
అవతారిక:
దానవులు దేవతలు అక్కచెల్లెళ్ళ పిల్లలే కాని వారి మధ్య ఎంత అంతరం వున్నదంటే ఒకరు చెడుకు వుదాహరణైతే, ఇంకొకరు మంచికి మారుపేరు. హరికి సురులు శరణాగతులైతే, అసురులు హరి విరసులు. ఈ కీర్తనలో అన్నమాచార్యులవారు దానవులకు హరికి దాసోహమనే బుద్ధివుండదని, వారు అసూయకే అలవాటుపడ్డవారని, అందుకనే చెడిపోయారని అంటున్నారు. తన వాదనని సోదాహరణంగా నిరూపిస్తున్నారు కూడా. అసురులు అట్లావుంటే, సురులు మునులు హరి శరణాగతులు.
భావ వివరణ:
దానవులు (రాక్షసలు) దాసోహమనుబుద్ధి (శరణాగతిని) దలచరు (ఒప్పుకోరు. ఇప్పుడు (ఈ కలియుగంలో) కొందరు మానవులు, ఈసులకే (అసూయతో) పెనగేరు (ఒకరితో నొకరు కొట్లాడుచున్నారు).
అసురులంటే వేరేవరో కాదు. విష్ణుదేవుని చక్రాన్ని దూషించేవారంతా అసురులే. అ (పరిశీలించి చూచిన) తామే దైవమని అహంకరించినవారెవరైనా అసురులే. విష్ణువు భూకాంతలపుత్రుడు నరకుడు. వాడు అసురుడై లోక కంటకుడైనాడు. హరి వానిని సంహరిస్తాడు కావున భూదేవి హరిని వాడినంతము చేయవద్దని వేడుకొంది. “నేను చంపను వీడిని నీవు చావు అని తిట్టే దాకా వాడు చావడు” అని వరమిచ్చాడు విష్ణువు. నరకాసురుడు తానే దైవమని లోకకంటకుడయ్యాడు. వాడికోసం భూదేవి అంశతో పుట్టిన సత్యభామతో కృష్ణుడైన హరి తమపుత్రునే చంపించాడు. ఈరోజుల్లో నరుల్లో కూడా నరకాసురులు కోకొల్లలు.
అసురులు పురుషోత్తముని పూజదగ్గరకే పోరు. విష్ణుని జపించనివారంతా అసురులే. కృతయుగమున హిరణ్యకశిపుడు కూడా హరి నొల్లక అంతమైనాడు. ఈ కలియుగంలో కూడా కొందరు యీతని (ఈ దేవదేవుని వొల్లరు (అంగీకరించరు).
దేవతలు, మునులు, శుకుడు మొదలైన యోగులు పరమము మోక్షప్రదాత శ్రీవేంకటేశ్వరుడే అని శరణాగతితో బ్రతుకుచున్నారు. సరి (అదట్టుండగా) నేడు వైష్ణవులు కూడా కొందరు “యెరపరికాన” (రోత కలిగి) పొయ్యేరు (ద్వేషముతో జీవించుచున్నారు).
గమనిక : ఆచార్యులవారి భావన ఇదేనేమోనని నా ఊహ. నా ఆశ.
మరిన్ని అన్నమయ్య కీర్తనలు: