మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు నీతికథలు గురించి తెలుసుకుందాం.
నీతికథలు
శ్రీతులసీదాస కృత రామచరితమానసము లోని నీతికథలలో మనకు బాగా సుపరిచితమైన నీతికథ మీ అందరికోసం. అది ఎమిటంటే… కాకభుశుండి పూర్వజన్మ వృత్తాంతము నీతికథ.
కాకభుశుండి పూర్వజన్మ వృత్తాంతము
నారద మహర్షి పంపగా గరుడ భగవానుడు మేఘనాథుని చేతిలో తనకు తానే బంధింపబడిన శ్రీరాముని బంధములను తొలగించెను. శ్రీరాముని మాయావశుడైన గరుడుడు ఇలా ఆలోచించసాగెను “సర్వవ్యాపకుడు నిర్వికారుడు వాగాధిపతి మాయాతీతుడు అయిన పరమేశ్వరుడు ఈ భూమిపై శ్రీరామునిగా అవతరించెనని విన్నాను. శ్రీరామ నామమును జపించినంత మాత్రముననే మానవులు భవబంధవిముక్తులు అగుదురనీ విన్నాను. కానీ అట్టి మహిమాన్వితుడైన శ్రీరాముడు ఒక రాక్షసాధముని నాగపాశముచే బంధింపబడుట ఏమి”? ఇలా మాయామోహితుడై వ్యాకులచిత్తుడైన గరుడుడు బ్రహ్మర్షి అగు నారదుని కడకేగి తన సందేహమును వ్యక్తపఱచి కాపాడమని ప్రార్థించెను.
నారదుడు గరుడుని సందేహనివారణార్థం సృష్టికర్త అయిన బ్రహ్మదేవునికడకు పంపెను. తన వద్దకు వచ్చిన గరుడునితో బ్రహ్మదేవుడిలా అన్నాడు “ఓ విహగేశ్వరా! పరమశివుడు శ్రీరాముని మహిమను బాగా ఎఱుగును. కావున నీవు ఆ శంకరునే శరణువేడుము”. కుబేరుని కడకు వెళుతున్న మహాదేవుని కలిసి గరుడుడు తన సందేహమును చెప్పెను. “ఓ పక్షీంద్రా! ఎంతో కాలము సజ్జనుల సేవను చేసిగానీ జ్ఞానమును పొందలేము. నిన్ను నిరంతర రామకథాప్రసంగములు జరిగే దివ్యమైన నీలగిరిలోని పరమ భాగవతోత్తముడైన కాకభుశుండి ఆశ్రమమునకు పంపెదను” అని పార్వతీనాథుడు ఆనతిచ్చెను.
వేయి మందిలో ఒక్కడే ధర్మపథమును సర్వకాల సర్వావస్థలయందూ అనుసరించును. అట్టి కోటి ధర్మాత్ములలో ఒక్కడు పేరాశకు లోనుకాక విరాగి వలె ఉండును. అట్టి కోటి విరాగులలో ఒక్కడు జ్ఞాని అగును. అలాంటి జ్ఞానులలో కోటికొక్కడే జీవన్ముక్తుడగును. అట్టి వేయిమంది జీవన్ముక్తులలో అరుదుగా ఒక్కడు బ్రహ్మైక్యమును పొందును. అలా బ్రహ్మైక్యమును పొందినవారిలో మిక్కిలి అరుదుగా సంపూర్ణ ముగా మాయావిముక్తుడై శ్రీరాముని భక్తిలో లీనమైన ప్రాణి ఉండును. అట్టి దుర్లభమైన నిష్కల్మష రామభక్తి ఉన్న కాకభుశుండి కడకు గరుడుడు వచ్చెను. వచ్చిన గరుడుని తగిన రీతిలో గౌరవించి కుశలమడిగి సముచిత ఆసనముపై కూర్చుండబెట్టి గరుడునికి సంక్షిప్త రామాయణము మొదలగు ఎన్నెన్నో అతిరహస్యములైన తత్త్వములను వివరించి గరుడుని కోరికపై తన పూర్వజన్మ కథను ఇలా చెప్పాడు రామభక్తుడైన కాకభుశుండి.
“పూర్వము ఒకానొక కల్పములో కలియుగము ఆరంభమైనది. కలికాలము మిక్కిలి కలుషితమైనది. స్త్రీ పురుషులందఱూ పాపకర్మనిరతులై వేదవిరుద్ధముగా మోహాధీనులై క్షణికమైన జీవితకాలము కలిగియూ కల్పాంతములు దాటే గర్వము దంభము అహంకారమును కలిగియుందురు. పాషండులు తమవిపరీత బుద్ధులతో క్రొత్తక్రొత్త సాంప్రదాయాలను ఆచారాలను కల్పించి ప్రచారం చేయుదురు. ఎవరికి ఏది ఇష్టమో అదే ధర్మమని అందురు. ఒక వైపు బ్రహ్మజ్ఞానము గూర్చి మాట్లాడుతూ మఱోక వైపు లోభముచే ఎంత మహాపాపకార్యమైనా చేయుటకు వెనుకాడరు. తాము స్వయముగా భష్టమగుటే కాక సన్మార్గమున నడచువారినికూడా భృష్ణుపఱచెదరు. వర్ణాశ్రమధర్మాలు అడుగంటుతాయి. ప్రజలలో సామరస్యం సమైక్యభావం నశిస్తుంది. నిష్కారణ వైరములతో కక్షలతో ఉండెదరు. వేదశాస్త్ర పురాణములను గౌరవించరు. కుతర్కములతో వేదశాస్త్రపురాణ నిందచేసి అనంతపాపరాశిని సొంతం చేసుకుంటారు.
పూజలు దానధర్మాలు స్వార్థబుద్ధితో తామసముతో చేసెదరు. విద్యను అన్నమును అమ్ముకొనెదరు. ధనవంతులకే గౌరవమివ్వబడును. గురుశిష్య భార్యభర్త మాతాపితభ్రాత అను సంబధములకు విలులేకుండును. ఆడంబరముగా జీవించుచూ వేదమార్గమును త్యజించి దిగంబరత్వము సమర్థించి ఆపాదమస్తకమూ కపటత్వముతో నిండియున్న వారు గురువులై అధర్మబోధలు చేశాదరు. అమంగళకరమైన వేషభూషణాదులను ధరించి శిరోజములను విరియబోసుకొనెదరు. తినదగినది తినగూడనిది అను విచక్షణ తినుటకు సమయం అసమయం అను విచక్షణ చేయక అన్నింటిని అన్ని వేళలా తినెదరు. అలా పాపకూపములో పడి ఇహములో పరములో బహు క్లేశాలను అనుభవించెదరు.
కానీ ఈ కలియుగమున ఒక గొప్పగుణము కలదు. “కలౌ సంకీర్తనాన్ముక్తిః” యొగ యజ్ఞ పూజాదులకు ఆస్కారములేని ఈ యుగములో భగన్నామస్మరణ చేసి జనులు ముక్తిని పొందెదరు. ఓ పన్నగాసనా! ఇంద్రజాలికుడు ప్రదర్శించుమాయ చూచువారిపైనే ప్రభావమును చూపును. కానీ అతనిసేవకులను అది ఏమీ చేయదు. అట్లే మాయకు మూలమైన భగంపంతుని శరణుజొచ్చిన వానికి ఆ అనూహ్యమైన మాయ అంటదు.
అట్టి కలియుగములో నేను భూవైకుంఠమైన అయోధ్యానగరములో ఒక శూద్రునిగా జన్మించినాను. మనోవాక్కర్మలచే నేను అఖండ శివభక్తుడను. కానీ నా బుద్ధిమాన్యముచే ఇతరదేవతలను దూషించుచుండెడి వాడను. అతిగర్వముతో ధనగర్వముతో నేనుండగా ఒకసారి అయోధ్యలో కఱవు వచ్చింది. దరిద్రుడనై దుఃఖితుడనై ఉజ్జయినీ నగరము చేరి అక్కడ కొంత ధనము సంపాదించి పరమ శివుని ఆరాధన కొనసాగించితిని. ఒక్కడ అతిదయాళువు నీతిమంతుడు పరమసాధువైన ఒక విప్రోత్తముడు వైదిక పద్ధితిలో అహర్నిశలూ శివుని ఏకాగ్రచిత్తముతో నిష్కల్మషముగా పూజించుచుండెను. అతడు ఎన్నడునూ విష్ణు నింద చేయలేదు.
కపటబుద్ధితో నేనతనికి సేవ చేయుచుండెడివాడను. ఆ భూసురుడు నన్ను పుత్రవాత్సల్యముతో చూచుచూ బోధించుచుండెను. శివభక్తినే కాక ఇతరములైన ఎన్నో నీతులను నాకతడు బోధించెను. నేను ప్రతి దినమూ దేవాలయమునకు పోయి శివనామస్మరణము చేసెడివాడను కానీ నా అహంకారమును నేను విడువలేదు. హరిభక్తులను పండిత సజ్జనులను ద్వేషించెడివాడను.
నా గురువు నా ప్రవర్తన చూసి చాల బాధపడి నిత్యమూ ఎన్నో సదుపదేశములిచ్చెడివాడు. ఆ ఉపదేశములను పెడచెవిన పెట్టి గురుద్రోహము చేయుచూ నాలోని కోపాగ్నిని ప్రజ్వలింప చేయుచూ జీవించుచుంటిని. ఇలా ఉండగా ఒక రోజు నా గురువు నన్ను పిలిచి శివకేశవుల అభేదత్వము బోధించి “పరమాత్మ అయిన శ్రీరామునికి సర్వదేవతలు బ్రహ్మ శివుడు నమస్కరించెదరు. అట్టిది నీవు ద్వేషించుట తగదు” అని అనెను. అది వినడంతో నా కోపాగ్ని మింటికెగసెను. అనర్హుడనైన నాకు విద్యనొసగిన నా గురువునకే ద్రోహము తలపెట్టాను. అయినా క్రోధాదులను జయించిన అతడు నాపై ఏమాత్రమూ కోపపడలేదు.
ఒక రోజు నేను శివాలయములో శివనామము జపించుచుండగా నా గురూత్తముడు అచటికి వచ్చెను. నా గర్వము వలన లేచి ఆయనకు నమస్కరించలేదు. దయానిధి అయిన నా గురువుకు నా దౌష్ట్యము చూచియు కొంచెముకూడా కోపమురాలేదు! కాని గురువును నిరాదరించుట మహాపాపము. పరమశివుడు ఇది చూసి సహింపలేక “ఓరీ మూర్ఖుడా! పూర్ణజ్ఞాని అయిన నీ గురువును అవమానించినావు. నీవు క్షమార్హుడవు కాదు. సద్గురువుపై ఈర్షగొన్నవాడు కోట్లాది యుగములు రౌరవాది నరకములలో పడి తరువాత పశుపక్షాది జన్మలు పొంది అటుపై వేలకొలది జన్మలు క్లేశములభవించును. నీ విప్పుడే అజగరముపై ఒక చెట్టుతొఱ్ఱలో పడివుండు” అని నన్ను శపించెను. భయకంపితుడనైన నన్ను చూసి నా గురువర్యుడు రుద్రాష్టకముతో శివుని ప్రసన్నుని చేసుకుని పశ్చాత్తాపముతో దుఃఖిస్తున్న నాకు శాపావశానము ప్రసాదించమని వేడుకొనెను. అంతట పరమేశ్వరుడు
“ఓ కృపానిధీ! మహాపకారికైనా మహోపకారము చేయు నిన్ను మెచ్చితిని. నీ శిష్యునికి శాపావశానమిచ్చెద” అని నన్ను చూసి “చేసిన తప్పుకు శిక్ష అనుభవింపక తప్పదు. నీవు దుర్భరమైన వేయి జన్మలెత్తుతావు. కానీ నీ గురువు మహిమవల్ల దివ్యమైన అయోధ్యానగరమున పుట్టినందువల్ల నీ మనస్సును నాయందు పెట్టి నన్ను పూజించినందువల్ల నీలో అచంచలమైన రామభక్తి ఉదయిస్తుంది. ప్రతి జన్మలో నీకు పూర్వజన్మ స్మృతి ఉంటుంది. వత్సా! ఇంకెప్పుడూ సాధుసజ్జనవిపులను నిరాదరింపవద్దు.
ఇంద్రుని వజ్రాయుధముతో నాత్రిశూలముతో యముని దండముతో శ్రీహరి చక్రముతో చంపబడనివాడు సజ్జనద్రోహమనెడి అగ్నిలో పడి మాడిపోతాడు” అని చెప్పి నాపై కృపావర్షం కురిపించినాడు ఉమానాథుడు. అప్పటినుంచీ ప్రతి జన్మలోనూ నేను చేసిన తప్పులకు ఎంతో పశ్చాత్తాపముతో దుఃఖిస్తూ రామునిపై భక్తిని మఱువక చివరికి కాకి జన్మనెత్తి మహనీయుడైన లోమశ మహర్షి వద్ద శ్రీరామచరితమానసము విని కాకభుశుండినై శ్రీరామునికి ప్రియుడనైనాను”.
ఈ కథలోనితి మరొక్కమాణు మీ అందరికోసం:
- గురుద్రోహం శివకేశవులను భేదబుద్ధితో చూడడం సాధుసజ్జనులను అవమానించడం ఘోరపాపములని మహాశివుడు కాకభుశుండి తో చెప్పాడు. కావున మనము గర్వముతో ఇట్టి తప్పులెన్నడునూ చేయరాదు.
- కాకభుశుండి గురువు యొక్క దయాగుణం మనకు ఆదర్శం కావాలి. శిష్యుడెన్ని అవమానాలుచేసినా తను చెప్పిన హితవాక్యాలను పెడచెవిన పెట్టినా ఏ మాత్రమూ కోపగించుకోలేదు.
- రామభక్తుడైన కాకభుశుండి కలియుగ వర్ణనము వలన మనకు చేయకూడనివి ఎన్నో తెలిసినాయి. ఇట్టి దుష్కృతాలకు దూరముగా ఉండి ధర్మమార్గములో నడచుచూ నిత్యం భగవన్నామస్మరణ చేయడమే మన కర్తవ్యము.
మరిన్ని నీతికథలు మీకోసం: