Kishkindha Kanda Sarga 2 In Telugu – కిష్కింధాకాండ ద్వితీయః సర్గః

రామాయణంలోని కిష్కింధాకాండ ద్వితీయ సర్గలో, హనుమంతుడు రాముడు, లక్ష్మణుడిని సుగ్రీవుని వద్దకు తీసుకువస్తాడు. సుగ్రీవుడు తన పీడలను వివరించి, వాలి తో విభేదించి, రాముని సాయంతో వాలిని సవాలు చేయాలని కోరుకుంటాడు. రాముడు, సుగ్రీవుని సమస్యలను వినిపించి, సాయం చేస్తానని హామీ ఇస్తాడు. సుగ్రీవుడు తన భయాలను, సీతాన్వేషణను రామునితో చర్చిస్తాడు. సుగ్రీవుడు రాముని స్నేహం మరియు సాయాన్ని స్వీకరించి, తన పునరుద్ధరణ కోసం ముందుకు సాగుతాడు. ఈ సర్గలో సుగ్రీవ-రాముల స్నేహం మరింత బలపడుతుంది.

సుగ్రీవమంత్రః

తౌ తు దృష్ట్వా మహాత్మానౌ భ్రాతరౌ రామలక్ష్మణౌ |
వరాయుధధరౌ వీరౌ సుగ్రీవః శంకితోఽభవత్ || ౧ ||

ఉద్విగ్నహృదయః సర్వాః దిశః సమవలోకయన్ |
న వ్యతిష్ఠత కస్మింశ్చిద్దేశే వానరపుంగవః || ౨ ||

నైవ చక్రే మనః స్థానే వీక్షమాణో మహాబలౌ |
కపేః పరమభీతస్య చిత్తం వ్యవససాద హ || ౩ ||

చింతయిత్వా స ధర్మాత్మా విమృశ్య గురులాఘవమ్ |
సుగ్రీవః పరమోద్విగ్నః సర్వైరనుచరైః సహ || ౪ ||

తతః స సచివేభ్యస్తు సుగ్రీవః ప్లవగాధిపః |
శశంస పరమోద్విగ్నః పశ్యంస్తౌ రామలక్ష్మణౌ || ౫ ||

ఏతౌ వనమిదం దుర్గం వాలిప్రణిహితౌ ధ్రువమ్ |
ఛద్మనా చీరవసనౌ ప్రచరంతావిహాగతౌ || ౬ ||

తతః సుగ్రీవసచివా దృష్ట్వా పరమధన్వినౌ |
జగ్ముర్గిరితటాత్తస్మాదన్యచ్ఛిఖరముత్తమమ్ || ౭ ||

తే క్షిప్రమధిగమ్యాథ యూథపా యూథపర్షభమ్ |
హరయో వానరశ్రేష్ఠం పరివార్యోపతస్థిరే || ౮ ||

ఏవమేకాయనగతాః ప్లవమానా గిరేర్గిరిమ్ |
ప్రకంపయంతో వేగేన గిరీణాం శిఖరాణ్యపి || ౯ ||

తతః శాఖామృగాః సర్వే ప్లవమానా మహాబలాః |
బభంజుశ్చ నగాంస్తత్ర పుష్పితాన్ దుర్గసంశ్రితాన్ || ౧౦ ||

ఆప్లవంతో హరివరాః సర్వతస్తం మహాగిరిమ్ |
మృగమార్జారశార్దూలాంస్త్రాసయంతో యయుస్తదా || ౧౧ ||

తతః సుగ్రీవసచివాః పర్వతేంద్రం సమాశ్రితాః |
సంగమ్య కపిముఖ్యేన సర్వే ప్రాంజలయః స్థితాః || ౧౨ ||

తతస్తం భయసంవిగ్నం వాలికిల్బిషశంకితమ్ |
ఉవాచ హనుమాన్వాక్యం సుగ్రీవం వాక్యకోవిదః || ౧౩ ||

సంభ్రమస్త్యజ్యతామేషః సర్వైర్వాలికృతే మహాన్ |
మలయోఽయం గిరివరో భయం నేహాస్తి వాలినః || ౧౪ ||

యస్మాదుద్విగ్నచేతాస్త్వం ప్రద్రుతో హరిపుంగవ |
తం క్రూరదర్శనం క్రూరం నేహ పశ్యామి వాలినమ్ || ౧౫ ||

యస్మాత్తవ భయం సౌమ్య పూర్వజాత్ పాపకర్మణః |
స నేహ వాలీ దుష్టాత్మా న తే పశ్యామ్యహం భయమ్ || ౧౬ ||

అహో శాఖామృగత్వం తే వ్యక్తమేవ ప్లవంగమ |
లఘుచిత్తతయాఽఽత్మానం న స్థాపయసి యో మతౌ || ౧౭ ||

బుద్ధివిజ్ఞానసంపన్నః ఇంగితైః సర్వమాచర |
న హ్యబుద్ధిం గతో రాజా సర్వభూతాని శాస్తి హి || ౧౮ ||

సుగ్రీవస్తు శుభం వాక్యం శ్రుత్వా సర్వం హనూమతః |
తతః శుభతరం వాక్యం హనూమంతమువాచ హ || ౧౯ ||

దీర్ఘబాహూ విశాలాక్షౌ శరచాపాసిధారిణౌ |
కస్య న స్యాద్భయం దృష్ట్వా హ్యేతౌ సురసుతోపమౌ || ౨౦ ||

వాలిప్రణిహితావేతౌ శంకేఽహం పురుషోత్తమౌ |
రాజానో బహుమిత్రాశ్చ విశ్వాసో నాత్ర హి క్షమః || ౨౧ ||

అరయశ్చ మనుష్యేణ విజ్ఞేయాశ్ఛన్నచారిణః |
విశ్వస్తానామవిశ్వస్తా రంధ్రేషు ప్రహరంతి హి || ౨౨ ||

కృత్యేషు వాలీ మేధావీ రాజానో బహుదర్శనాః |
భవంతి పరహంతారస్తే జ్ఞేయాః ప్రాకృతైర్నరైః || ౨౩ ||

తౌ త్వయా ప్రాకృతేనైవ గత్వా జ్ఞేయౌ ప్లవంగమ |
ఇంగితానాం ప్రకారైశ్చ రూపవ్యాభాషణేన చ || ౨౪ ||

లక్షయస్వ తయోర్భావం ప్రహృష్టమనసౌ యది |
విశ్వాసయన్ ప్రశంసాభిరింగితైశ్చ పునః పునః || ౨౫ ||

మమైవాభిముఖం స్థిత్వా పృచ్ఛ త్వం హరిపుంగవ |
ప్రయోజనం ప్రవేశస్య వనస్యాస్య ధనుర్ధరౌ || ౨౬ ||

శుద్ధాత్మానౌ యది త్వేతౌ జానీహి త్వం ప్లవంగమ |
వ్యాభాషితైర్వా విజ్ఞేయా స్యాద్దుష్టాదుష్టతా తయోః || ౨౭ ||

ఇత్యేవం కపిరాజేన సందిష్టో మారుతాత్మజః |
చకార గమనే బుద్ధిం యత్ర తౌ రామలక్ష్మణౌ || ౨౮ ||

తథేతి సంపూజ్య వచస్తు తస్య తత్
కపేః సుభీమస్య దురాసదస్య చ |
మహానుభావో హనుమాన్యయౌ తదా
స యత్ర రామోఽతిబలశ్చ లక్ష్మణః || ౨౯ ||

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే కిష్కింధకాండే ద్వితీయః సర్గః || ౨ ||

Kishkindha Kanda Sarga 2 Meaning In Telugu

రామ లక్ష్మణులను చూచి పారి పోయిన సుగ్రీవుడు ఇంకా భయపడుతూనే ఉన్నాడు. ఒక చోట నిలవడం లేదు. అన్ని దిక్కులా చూస్తున్నాడు. రామలక్ష్మణులు ఎటు వైపు నుండి వచ్చి తన మీద దాడి చేస్తారేమోనని భయంతో వణికిపోతున్నాడు. మహాబలవంతులు, ధనురాణములు ధరించిన రామలక్ష్మణులను చూచి సుగ్రీవునకు ధైర్యం సడలిపోయింది. బాగా ఆలోచించాడు. తన బలం గొప్పదా లేక ఆ మానవుల బలం గొప్పదా అని తనలో తాను తర్కించుకుంటున్నాడు. తనతో పాటుగా ఉన్న మంత్రులను పిలిచాడు. వారికి రామలక్ష్మణుల గురించి చెప్పాడు.

“అదుగో అటు చూడండి. ఆ మానవులు ఇద్దరూ నారచీరలు కట్టుకొని, ధనుర్బాణములు ధరించి దేనికోసమో వెదుకుతున్నారు. వారు వాలి పంపిన వారు అని నా అనుమానము. లేకపోతే క్రూరమృగములు సంచరించు, మానవులు చొరరాని ఈ దుర్గమారణ్యములో ఈ మానవులకు ఏమి పని. వీరు నిశ్శంశయంగా వాలి నాకోసం పంపినవారే. మనము ఇక్కడి నుండి వేరు చోటికి వెళ్లడం మంచిది.” అని అన్నాడు సుగ్రీవుడు.
సుగ్రీవుని మాట ప్రకారము ఆ వానరులు అందరూ వేరే ప్రదేశానికి వెళ్లారు. అక్కడ అందరూ వలయాకారంలో కూర్చున్నారు. మధ్యలో సుగ్రీవుడు కూర్చున్నాడు. ఆ వానరులలో హనుమంతుడు అనే పేరుగల వానరుడు, రామలక్ష్మణులను గురించి భయపడుతున్న సుగ్రీవుని చూచి ఇలా అన్నాడు.

“ఓ వానర రాజా! నీవు ఎందుకు వాలిగురించి భయపడతావు. మనము మలయ పర్వతము మీద ఉన్నాము. వాలి ఈ పర్వతము మీదికి రాలేడు. కాబట్టి వాలి వలన మనకు భయం లేదు. అదీ కాకుండా మనకు కనుచూపు మేరలో వాలి కనపడటం లేదు కదా. మరి నువ్వు వాలి గురించి ఎందుకు భయపడుతున్నావు. నీ భయానికి నాకు కారణం కనిపించడం లేదు. నీవు వాలి గురించి అనవసరంగా భయపడుతున్నావు. ఆ భయం వలన నీకు బుద్ధి క్షీణించింది. పైగా వానరసహజమైన చపలత్వము నిన్ను ఆవహించింది.

సుగ్రీవా! నీవు వానర రాజువు. రాజే ఇలా భయపడితే ఎలాగ? నీ మనస్సును ధృఢంగా ఉంచుకో. అనవసరంగా భయాందోళనలకు గురి కావద్దు. స్థిరమైన బుద్ధితో ఆలోచించు. స్థిరబుద్ధితో ఆలోచించ లేని రాజు ప్రజలను పాలించడానికి అర్హుడు కాడు. కాబట్టి భయపడటం మాను.” అని హితోపదేశం చేశాడు హనుమంతుడు. హనుమంతుని మాటలతో సుగ్రీవుని భయం తగ్గింది. హనుమంతునితో సుగ్రీవుడు ఇలా అన్నాడు. “అది కాదు హనుమాన్! ఆ మానవులను చూడు. వారు ఆజానుబాహులు. ధృడకాయులు. ధనుర్బాణములు ధరించిన వారు. వారిని చూచి ఎవరికి భయం కలగదు చెప్పు. వారు వాలి పంపగా నాకోసం వచ్చినవారే. సందేహము లేదు. లేకపోతే ఆ మానవులకు ఈ ఘోరారణ్యములో ఏమి పని.

వాలికి ఎంతో మంది స్నేహితులు ఉన్నారు. వారిలో వీరూ ఒకరేమో! వీరిని వాలి పంపాడేమో! వాలిని నమ్మకూడదు. శత్రువులను ఒక కంటితో కనిపెట్టి ఉండటం రాజధర్మం కదా! అందులోనూ కపటంగా వ్యవహరించే వాలితో ఇంకా జాగ్రత్తగా ఉండాలి. మనం భయపడకుండా, వారేం చేస్తారులే అని నిర్లక్ష్యంగా ఉంటే, అదును చూచి శత్రువులు మన మీద దెబ్బతీస్తారు. పైగా వాలి చాలా తెలివిగలవాడు. మన గురించి అన్ని విషయములను సేకరిస్తూ ఉంటాడు. అలాంటి వారి గురించి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి.

కాబట్టి మనం ఒక పని చేద్దాము. ఓ వానర వీరుడా! హనుమా! నువ్వు సామాన్య మానవుని వేషంలో ఆ మానవుల వద్దకు వెళ్లు. వారి ఇంగితమును గ్రహించు. నీ మాటలతో వారు ఎవరో! ఎక్కడ నుండి వచ్చారో! ఇక్కడకు ఎందుకు వచ్చారో! ఎవరి కోసరం వచ్చారో నేర్పుగా మాట్లాడి తెలుసుకో! వారిని నీ పొగడ్తలతో సానుకూల పరుచుకో. చక్కగా మాట్లాడు. వారి మనోభావాలను గుర్తించు. వారికి నీ మీద విశ్వాసం కలిగేటట్టు ప్రవర్తించు. అసలు వారు ఇక్కడకు ఎందుకు వచ్చారో తెలుసుకో. ఆ మానవులు ఏమైనా దురాలోచనలతో వచ్చారా! లేక నిర్మలమైన మనస్సులతో వచ్చారా అనే విషయం గ్రహించు. అసలు వాళ్లు మంచి లేక అనే విషయాన్ని వారి మాట్లాడే మాటలను బట్టి పసిగట్టు. వెళ్లు. కార్యము సానుకూలం చేసుకొని రా!” అని సుగ్రీవుడు హనుమంతుని రామలక్ష్మణుల వద్దకు దూతగా పంపాడు.

శ్రీమద్రామాయణము
కిష్కింధాకాండము రెండవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్

కిష్కింధాకాండ తృతీయః సర్గః (3) >>

Leave a Comment