Kishkindha Kanda Sarga 4 In Telugu – కిష్కింధాకాండ చతుర్థః సర్గః

కిష్కింధాకాండలో చతుర్థ సర్గ, వాలి వధ అనంతరం సుగ్రీవుడు కిష్కింధ రాజ్యాన్ని పొందుతాడు. సుగ్రీవుడు రాముని సహాయం చేయడానికి తన సైన్యాన్ని సిద్ధం చేయడానికి సమయం తీసుకుంటాడు. వానర సైన్యం సీతాన్వేషణ కోసం వేర్వేరు దిశల్లో పంపబడుతుంది. రాముడు సుగ్రీవుడికి తన బాధను, సీతను వెంటనే వెతకాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తాడు. హనుమంతుడు, ఆంజనేయుడు, జాంబవంతుడు వంటి ప్రముఖ వానరులు ఈ అన్వేషణలో ముఖ్యపాత్ర పోషిస్తారు. సుగ్రీవుడు, తన ప్రామాణికతను చాటుకొని, సీతను వెతకడం కోసం అన్ని వనరులను వినియోగిస్తాడు. రాముడు, లక్ష్మణుడు ఈ ప్రయత్నంలో ఆశగా ఎదురు చూస్తారు.

సుగ్రీవసమీపగమనమ్

తతః ప్రహృష్టో హనుమాన్ కృత్యవానితి తద్వచః |
శ్రుత్వా మధురసంభాషం సుగ్రీవం మనసా గతః || ౧ ||

భవ్యో రాజ్యాగమస్తస్య సుగ్రీవస్య మహాత్మనః |
యదయం కృత్యవాన్ ప్రాప్తః కృత్యం చైతదుపాగతమ్ || ౨ ||

తతః పరమసంహృష్టో హనుమాన్ ప్లవగర్షభః |
ప్రత్యువాచ తతో వాక్యం రామం వాక్యవిశారదః || ౩ ||

కిమర్థం త్వం వనం ఘోరం పంపాకాననమండితమ్ |
ఆగతః సానుజో దుర్గం నానావ్యాలమృగాయుతమ్ || ౪ ||

తస్య తద్వచనం శ్రుత్వా లక్ష్మణో రామచోదితః |
ఆచచక్షే మహాత్మానం రామం దశరథాత్మజమ్ || ౫ ||

రాజా దశరథో నామ ద్యుతిమాన్ ధర్మవత్సలః |
చాతుర్వర్ణ్యం స్వధర్మేణ నిత్యమేవాభ్యపాలయత్ || ౬ ||

న ద్వేష్టా విద్యతే తస్య న చ స ద్వేష్టి కంచన |
స చ సర్వేషు భూతేషు పితామహ ఇవాపరః || ౭ ||

అగ్నిష్టోమాదిభిర్యజ్ఞైరిష్టవానాప్తదక్షిణైః |
తస్యాయం పూర్వజః పుత్రో రామో నామ జనైః శ్రుతః || ౮ ||

శరణ్యః సర్వభూతానాం పితుర్నిర్దేశపారగః |
వీరో దశరథస్యాయం పుత్రాణాం గుణవత్తమః || ౯ ||

రాజలక్షణసంపన్నః సంయుక్తో రాజసంపదా |
రాజ్యాద్భ్రష్టో వనే వస్తుం మయా సార్ధమిహాగతః || ౧౦ ||

భార్యయా చ మహాతేజాః సీతయాఽనుగతో వశీ |
దినక్షయే మహాతేజాః ప్రభయేవ దివాకరః || ౧౧ ||

అహమస్యావరో భ్రాతా గుణైర్దాస్యముపాగతః |
కృతజ్ఞస్య బహుజ్ఞస్య లక్ష్మణో నామ నామతః || ౧౨ ||

సుఖార్హస్య మహార్హస్య సర్వభూతహితాత్మనః |
ఐశ్వర్యేణ చ హీనస్య వనవాసాశ్రితస్య చ || ౧౩ ||

రక్షసాఽపహృతా భార్యా రహితే కామరూపిణా |
తచ్చ న జ్ఞాయతే రక్షః పత్నీ యేనాస్య సా హృతా || ౧౪ ||

దనుర్నామ దితేః పుత్రః శాపాద్రాక్షసతాం గతః |
ఆఖ్యాతస్తేన సుగ్రీవః సమర్థో వానరర్షభః || ౧౫ ||

స జ్ఞాస్యతి మహావీర్యస్తవ భార్యాపహారిణమ్ |
ఏవముక్త్వా దనుః స్వర్గం భ్రాజమానో గతః సుఖమ్ || ౧౬ ||

ఏతత్తే సర్వమాఖ్యాతం యాథాతథ్యేన పృచ్ఛతః |
అహం చైవ హి రామశ్చ సుగ్రీవం శరణం గతౌ || ౧౭ ||

ఏష దత్త్వా చ విత్తాని ప్రాప్య చానుత్తమం యశః |
లోకనాథః పురా భూత్వా సుగ్రీవం నాథమిచ్ఛతి || ౧౮ ||

పితా యస్య పురా హ్యాసీచ్ఛరణ్యో ధర్మవత్సలః |
తస్య పుత్రః శరణ్యశ్చ సుగ్రీవం శరణం గతః || ౧౯ ||

సర్వలోకస్య ధర్మాత్మా శరణ్యః శరణం పురా |
గురుర్మే రాఘవః సోఽయం సుగ్రీవం శరణం గతః || ౨౦ ||

యస్య ప్రసాదే సతతం ప్రసీదేయురిమాః ప్రజాః |
స రామో వానరేందస్య ప్రసాదమభికాంక్షతే || ౨౧ ||

యేన సర్వగుణోపేతాః పృథివ్యాం సర్వపార్థివాః |
మానితాః సతతం రాజ్ఞా సదా దశరథేన వై || ౨౨ ||

తస్యాయం పూర్వజః పుత్రస్త్రిషు లోకేషు విశ్రుతః |
సుగ్రీవం వానరేంద్రం తు రామః శరణమాగతః || ౨౩ ||

శోకాభిభూతే రామే తు శోకార్తే శరణం గతే |
కర్తుమర్హతి సుగ్రీవః ప్రసాదం హరియూథపః || ౨౪ ||

ఏవం బ్రువాణం సౌమిత్రిం కరుణం సాశ్రులోచనమ్ |
హనుమాన్ ప్రత్యువాచేదం వాక్యం వాక్యవిశారదః || ౨౫ ||

ఈదృశా బుద్ధిసంపన్నా జితక్రోధా జితేంద్రియాః |
ద్రష్టవ్యా వానరేంద్రేణ దిష్ట్యా దర్శనమాగతాః || ౨౬ ||

స హి రాజ్యాత్పరిభ్రష్టః కృతవైరశ్చ వాలినా |
హృతదారో వనే త్యక్తో భ్రాత్రా వినికృతో భృశమ్ || ౨౭ ||

కరిష్యతి స సాహాయ్యం యువయోర్భాస్కరాత్మజః |
సుగ్రీవః సహ చాస్మాభిః సీతాయాః పరిమార్గణే || ౨౮ ||

ఇత్యేవముక్త్వా హనుమాన్ శ్లక్ష్ణం మధురయా గిరా |
బభాషే సోఽభిగచ్ఛేమ సుగ్రీవమితి రాఘవమ్ || ౨౯ ||

ఏవం బ్రువాణం ధర్మాత్మా హనుమంతం స లక్ష్మణః |
ప్రతిపూజ్య యథాన్యాయమిదం ప్రోవాచ రాఘవమ్ || ౩౦ ||

కపిః కథయతే హృష్టో యథాఽయం మారుతాత్మజః |
కృత్యవాన్ సోఽపి సంప్రాప్తః కృతకృత్యోఽసి రాఘవ || ౩౧ ||

ప్రసన్నముఖవర్ణశ్చ వ్యక్తం హృష్టశ్చ భాషతే |
నానృతం వక్ష్యతే ధీరో హనుమాన్ మారుతాత్మజః || ౩౨ ||

తతః స తు మహాప్రాజ్ఞో హనుమాన్మారుతాత్మజః |
జగామాదాయ తౌ వీరౌ హరిరాజాయ రాఘవౌ || ౩౩ ||

భిక్షురూపం పరిత్యజ్య వానరం రూపమాస్థితః |
పృష్ఠమారోప్య తౌ వీరౌ జగామ కపికుంజరః || ౩౪ ||

స తు విపులయశాః కపిప్రవీరః
పవనసుతః కృతకృత్యవత్ప్రహృష్టః |
గిరివరమురువిక్రమః ప్రయాతః
సుశుభమతిః సహ రామలక్ష్మణాభ్యామ్ || ౩౫ ||

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే కిష్కింధాకాండే చతుర్థః సర్గః || ౪ ||

Kishkindha Kanda Sarga 4 Meaning In Telugu

లక్ష్మణుని మాటలు విన్న హనుమంతుడు వారు తమకు శత్రువులు కారనీ, వాలి పంపిన వారు కారనీ, ఒక కార్యము నిమిత్తము తిరుగుతున్నారనీ, వీరి మైత్రితో సుగ్రీవుని కష్టములు కూడా గట్టెక్కుతా యని సంతోషించాడు. వీరు కూడా సుగ్రీవుని వలె కష్టములలో ఉన్నట్టున్నారు. వీరి కష్టములను సుగ్రీవుడు తీర్చగలడు. అప్పుడు వీరు కూడా సుగ్రీవునకు సాయము చెయ్యగలరు. వాలి నుండి సుగ్రీవునికి రాజ్యప్రాప్తి కలుగుతుంది.” అని సంతోషించాడు.

తరువాత హనుమంతుడు లక్ష్మణుని చూచి ఇలా అన్నాడు. “మీరు చూడబోతే మునికుమారులవలె ఉన్నారు. కాని చేతిలో ధనుర్బాణములు ఉన్నవి. మీరు ఎవరికోసమో వెతుకుతున్నట్టు కనపడుతూ ఉంది. మీ గురించి వివరంగా చెప్పండి. మీ మాటలు నేను మా రాజుకు చెప్పాలి కదా!” అని అన్నాడు హనుమంతుడు.

అప్పుడు లక్ష్మణుడు హనుమంతునితో ఇలా అన్నాడు. “ఓహనుమా! ఈయన పేరు రాముడు. ఇక్ష్వాకు వంశములో జన్మించిన అయోధ్యాధిపతి దశరథుని పెద్ద కుమారుడు. గుణవంతుడు, రాజ్యము చేయుటకు అర్హుడు. కాని ఒకానొక కారణమున రామునికి రాజ్యము లభించలేదు. పైగా అరణ్యవాసము సంప్రాప్తించింది. రాముని భార్యపేరు సీత. సూర్యుని విడిచి కాంతి ఉండలేనట్టు, రాముని భార్య సీతకూడా, భర్తను విడిచి ఉండలేక, రామునితోపాటు అరణ్యములకు వచ్చింది.

నేను రాముని తమ్ముడను. నా పేరు లక్షణుడు. నేను నా అన్న వదిలను సేవించుకుంటూ వారి వెంట అరణ్యములకు వచ్చాను. మేము పర్ణశాలలో లేని సమయమున, సీత ఒంటరిగా ఉన్నప్పుడు, మాయావి అయిన ఒక రాక్షసుడు రాముని భార్య సీతను అపహరించాడు. మేము సీతను వెతుకుతూ ఉండగా, మా తండ్రి దశరథునికి మిత్రుడు అయిన జటాయువు అనే పక్షిరాజు కనిపించి, సీతను రావణుడు అనే రాక్షసుడు అపహరించి, దక్షిణ దిక్కుగా ఆకాశమార్గమున తీసుకొని వెళ్లాడు అని చెప్పాడు.

తరువాత మేము అడవిలో సీతను గూర్చి వెతుకుతూ దనువు అనే వాడు శాపవశమున వికృతాకారముతో మమ్ములను కబళించడానికి ప్రయత్నించాడు. అతని వలన మాకు మీ రాజు సుగ్రీవుని గురించి తెలిసింది. సీతను అపహరించిన వారి గురించి తెలుసుకొనడంలో సుగ్రీవుడు సామర్థ్యము కలవాడు అని అతడు మాకు తెలిపాడు. సుగ్రీవుని వెతుకుతూ మేము ఇక్కడకు వచ్చాము.

నీ ప్రశ్నలకు సమాధానంగా నేను మా గురించి, ఇక్కడకు మా రాక గురించి వివరంగా చెప్పాను. మేము మీ రాజు సుగ్రీవుని సహాయము కోరుతున్నాము. నేను, రాముడు మీ రాజు సుగ్రీవుని శరణు పొందాము. అయోధ్యాధిపతిగా ఉన్నప్పుడు ఏ రాముడు తన ప్రజలకు ధనకనకవస్తువాహనములను విరివిగా పంచి పెట్టాడో, ఏ రాముడు ముల్లోకములకు రక్షకుడో ఆ రాముడు మీ రాజు సుగ్రీవుని సహాయము కోరుతున్నాడు. ఏ దశరథుడు అందరికీ శరణాగత రక్షకుడుగా ఉండేవాడో, ఆ దశరథకుమారుడు రాముడు మీ రాజు సుగ్రీవుని శరణు కోరుతున్నాడు. ధర్మాన్ని పాలిస్తూ, లోకమునకు రక్షణ అందించిన నా రాముడు మీ రాజు సుగ్రీవుని శరణు కోరుతున్నాడు. ఏ రాముని అనుగ్రహంతో అయోధ్యా ప్రజలు సుఖంగా ఉన్నారో ఆ రాముడు మీ రాజు సుగ్రీవుని అనుగ్రహాన్ని కాంక్షిస్తున్నాడు. ఏ దశరథ మహారాజు తన సామంతురాజులందరినీ అనుగ్రహదృష్టితో చూస్తుంటాడో, ఆ దశరధ మహారాజు కుమారుడు, రాముడు మీ రాజు సుగ్రీవుని అనుగ్రహ వీక్షణాల కోసం ఎదురు చూస్తున్నాడు. తన భార్య సీతా వియోగంతో బాధపడుతున్న రాముని మీద మీ రాజు సుగ్రీవుడు తన అనుగ్రహం చూపాలి.” అని దీనంగా ప్రార్థించాడు లక్ష్మణుడు.

(పైనచెప్పబడిన లక్ష్మణుని దీనాలాపములు ప్రాచ్యప్రతిలో లేవు. ధీరోదాత్తుడైన లక్ష్మణుడు ఈ మాదిరి దీనంగా మాట్లాడటం అనుచితంగా ఉంది. కాబట్టి ఇవి తరువాత చేర్చబడినవిగా ఊహింపబడుతూ ఉంది.)

లక్ష్మణు మాటలు విన్న హనుమంతుడు చాలా సంతోషించాడు. “మా సుగ్రీవుడు మీతో తప్పకుండా మైత్రి చేస్తాడు. సుగ్రీవుడు కూడా బాధలలో ఉన్నాడు. సుగ్రీవుడు తన అన్న వాలితో వైరము పెట్టుకున్నాడు. ఎందుకంటే, వాలి తన తమ్ముడు సుగ్రీవుని భార్యను అపహరించాడు. సుగ్రీవుని అవమానించాడు. రాజ్యము నుండి వెళ్లగొట్టాడు. మీ మాదిరి మా రాజు సుగ్రీవుడు కూడా అరణ్యములలో దీనంగా కాలం గడుపుతున్నాడు. మా రాజు మాతో కలిసి సీతను వెదకడంలో మీకు సాయపడగలడు. మేమందరమూ కలిసి సీతను వెదుకుతాము. రండి మనం అందరము సుగ్రీవుడు మా రాజు సుగ్రీవుని వద్దకు వెళదాము.” అని అన్నాడు హనుమంతుడు.

ఆ మాటలు విన్న లక్ష్మణుడు రాముని చూచి “రామా! సుగ్రీవునికి కూడా మన అవసరము ఉంది. మనకూ సుగ్రీవుని అవసరము ఉంది. కాబట్టి మన కార్యము సఫలము అయినట్టే. ఇతని మాటలు ముఖ కళవళికలు చూస్తుంటే నాకు ఇతని మీద నమ్మకం కలుగుతూ ఉంది. ఇతని ముఖం చూస్తే ఇతడు అబద్ధం ఆడతాడు అని అనిపించడం లేదు. మనం వీరితో స్నేహం చేయవచ్చు.” అని అన్నాడు లక్ష్మణుడు.

ఇంతలో హనుమంతుడు తన సన్యాసి రూపము విడిచి తన నిజరూపము అయిన వానర రూపము ధరించాడు. శరీరం పెంచాడు. రామలక్ష్మణులను తన బుజాల మీద ఎక్కించుకొని సుగ్రీవుని వద్దకు తీసుకొని వెళ్లాడు. హనుమంతుడు కూడా తన రాజు సుగ్రీవునికి మరలా రాజ్య ప్రాప్తి కలుగుతుందనే సంతోషంతో రామలక్ష్మణులను సుగ్రీవుని వద్దకు తీసుకొని వెళ్లాడు.

శ్రీమద్రామాయణము,
కిష్కింధా కాండము నాలుగవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్

కిష్కింధాకాండ పంచమః సర్గః (5) >>

Leave a Comment