Sri Ramadasu Keerthanalu 61-68 In Telugu – శ్రీ రామదాసు కీర్తనలు
ఈ పోస్ట్ లో శ్రీ రామదాసు గారి కీర్తనలు వేదములో అనేక సంగీత పారంపర్యాలు ఉన్నాయి.
61. నాదనామక్రియ రూపకతాళం
పల్లవి : ముచ్చటైన వాడవేమిరా కోదండపాణి
ముచ్చటైన వాడవేమిరా
॥ముచ్చటైన॥
ముచ్చటైన వాడవేమి ముదముతో మీ పాదములు
మరువక నెల్లప్పుడు నామదిని విడువక దలచెదను నేను
॥ముచ్చటైన||
ఎందాకనే వేడుకొందు ఏమి చేయుదు నీ వేళయందు
చెంతకు చేరితి నన్ను జేపట్టుమిక మ్రొక్కెదను
॥ముచ్చటైన॥
పండ్రెండేండ్లాయెను నేను బంధిఖానాలో నుండి
నల్లుల దోమలచేత నలుగుచున్నది దేహము
॥ముచ్చటైన॥
చైత్ర వైశాఖములిపుడు చెప్పతరముగాదు ఎంతో
తహసీలు చేయగ నాకు జామీనైనా యెవ్వరులేరు
॥ముచ్చటైన||
తానీషాగారు వచ్చి తహసీలు చేసెదరు
కాసులుపంపించి నన్ను కరుణతో చెరవిడిపించు
॥ముచ్చటైన||
నేనొక్కడను మీకు సుంతనాపై నెనరులేక
మా తల్లి సీతమ్మకైన మనవిచెప్పగ నెటుబోతివో
॥ముచ్చటైన||
ఒంటరిగ నన్ను నింటి దగ్గర ఎవ్వరు
జంటతో సీతాలక్ష్మణులు వెంటనే కూడివచ్చి
॥ముచ్చటైన॥
వేమారు శ్రీభద్రాచల రామస్వామి
మీరిప్పుడు రామదాసుని చేపట్టి రక్షింపకున్న
॥ముచ్చటైన||
62. ఆనందభైరవి రూపకతాళం
పల్లవి : మేలైన చిటికెనవ్రేలు ప్రాతఃకాలమందున గుట్టె తేలు
బాలత్వమున నేను బావి నీళ్ళకు పోయి
కాలుబెట్టగ చిన్నతేలు పొడిచెనయ్య
॥మేలైన॥
చలివచ్చెనని నొప్పిచేత దీని వేడిమి పాపిష్టిఘాత
యీలాగునైన నేనేలాగు తాళుదు
మూలమైన గురుమూర్తి పాదములాన
॥మేలైన॥
మిక్కిలి నలుపుచున్నది రాముగ్రక్కన నాదరించినది
వెక్కసపెట్టుచు కడతేరనీయదు
మ్రొక్కెద నాస్వామి యోర్వగజాలను
||మేలైన॥
దరిజూపరా స్వామి కేశవా యిట్లు నరులు చేసినరీతి చేసెదవా
పుడమిలోపల భద్రగిరిరామదాసుని బడనీక కాపాడు తండ్రివి నీవే
||మేలైన॥
63. పున్నాగవరాళి ఏకతాళం
పల్లవి : రక్షించు దీనుని రామ రామ నీ రమణి తోడు నన్ను
రక్షింపకున్నను మీ తండ్రి దశరథరాజుతోడు
॥రక్షించు||
అరుదుమీరగ విభీషణుని బ్రోచితి వల్ల నాడు అట్లు
కరుణింపకున్న మీతల్లి కౌసల్యదేవితోడు
॥రక్షించు||
గిరికొన్న ప్రేమ సుగ్రీవుని బ్రోచితివల్లనాడు అట్లు
సిరులియ్యకున్న మీ కులగురువు వసిష్ఠుని తోడు
॥రక్షించు||
అలికుల వేణి యహల్య శాపము బాపితివల్లనాడు అట్లు
కలుషములన్నియు బాపకున్న లక్ష్మణునితోడు
॥రక్షించు||
పాపాత్ముడైన యక్రూరుని బ్రోచితివల్లనాడు అట్లు
నెపములెంచక కృపజూడకున్న మీయింటితోడు
॥రక్షించు||
వదలక నీ మీదనే నాసలు పెట్టవలసె నేడు
భద్రాచలరామదాసుని యేలకున్న నీ పాదములతోడు
॥రక్షించు||
64. బిళహరి ఆదితాళము
పల్లవి : రక్షించే దొరవని నమ్మితి నిన్ను
రక్షింప తప్పేమి చేసితి
॥రక్షించే॥
రక్షింప మీకంటె రక్షకులెవరు
దాక్షిణ్యమింతైన తలపుల నుంచవు
॥రక్షించే॥
నీ ప్రాపు నెఱనమ్మియుంటిని నన్ను
కాపాడు బిరుదు నీతంటినీ
చేపట్టి విడనాడజెల్లదు యిక నాకు
దాపుననుండియు మీరె దైవము సాక్షిగ
॥రక్షించే॥
ఎంతో వేడిన యేలపల్కవు నే
నెంతద్రోహినో దయజూడవు
ఎంతేసి వారల నేలేటి కర్తవు
అంతకంతకు నాపై యరమరచే సేవు
॥రక్షించే॥
భద్రాద్రివాస నీ బంటును ఇతర
పాపములేదు నావెంటను
అద్రిజ సన్నుత యమరాది వందిత
భద్రేభవరద నాపాలిటి దైవము
॥రక్షించే॥
65. శంకరాభరణ ఆదితాళము
రక్షింపుముదేవా రాచకార్యముపుట్టె రామచంద్ర
నన్ను రక్షింపకున్నను రక్షకులెశీ వరింక రామచంద్ర
॥రక్షింపుము॥
అప్పులవారితో అరికట్టుకొన్నారు రామచంద్ర స్వామీ
చెప్పశక్యముకాదు చక్షుర్గోచరమాయె రామచంద్ర
॥ రక్షింపుము॥
కుక్షిలో మీమీద కోరిక పుట్టెను రామచంద్రస్వామీ
ఇక్ష్వాకు కులతిలక ఇకనైన గానవే రామచంద్ర
॥రక్షింపుము॥
పక్షి వాహన నన్ను పాలింపదయజూడు రామచంద్రస్వామీ
అక్షయకటాక్ష మభిమానముంచవే రామచంద్ర
॥రక్షింపుము॥
అధికుని చేపట్టి అడ్డమేమనుకొంటి రామచంద్రస్వామీ
అధములకన్నను అన్యాయమైపోతి రామచంద్ర
॥రక్షింపుము॥
భయమేమి నే రామదాసుడ ననుకొంటి రామచంద్రస్వామీ
భయముబాపి బ్రోవు భద్రాద్రిపురినిలయ రామచంద్ర
॥రక్షింపుము॥
66. సౌరాష్ట్ర చాపుతాళము
పల్లవి : రామచంద్ర నన్నేల రక్షింపవో నేనేమెరుగ
నీ చిత్తము నా భాగ్యము నిన్నే నెరనమ్మితి
॥రామ||
భరతునివలె పాదుకలు పూజింపనేర
కోరి లక్ష్మణునివలె కొల్వనేర
ఓర్పుతో గుహుని నోడ నడుపనేర
॥రామ||
అంగదునివలె నేను ఆడవము బట్టనేర
సంగరమున సుగ్రీవునివలె సాధింపనేర
గాలిపక్షివలెనేను తాలిమిగమోయ నేర
బలిమితో హనుమంతునివలె పాటుపడనేర
||రామ||
లీలతో శబరివలె లాలించి విందిడ నేర
మేలిమిగ సీతవలె మెప్పిరంపనేర
గజరాజువలె నేను గట్టిగా మొరపెట్టనేర
విజయుని సతివలె వినుతింపనేర
గురిగ జాంబవంతునివలె కోరిభజింపగ నేర
॥రామ||
చేరి విభీషణునివలె శరణననేర
వరజటాయువలె ప్రాణములియ్యనేర
కరము నహల్యవలె గీర్తింపనేర
నేను రామదాసులవలె పూని మిము భజియింపనేర
నన్ను రక్షింపు భద్రాచల రామధీర
॥రామ||
67. పున్నాగవరాళి ఆదితాళము
పల్లము : రామప్రభో నీదయ నామీదను రాదేమయా శ్రీరామ
పామరుడను జడుడను తామసుడను
నేను వర్ణితంబగు నరపశువును నీ మహత్మ్య మెన్న నెంతటి వాడను
॥రామ||
రామ రామ యనిదలతు నిరంజన రామ
పరుల వేడనంటి నీ పదయుగ్మములే నమ్మి యుంటిని
నన్నరమర చేయవద్దంటిని శ్రీహరియని వేడుకొంటి
॥రామ॥
మొరలిడినంతనే కరివరు నేలిన దొరవని నమ్మితిని
నిరసించతగదు మందర గిరిధర
త్రిభువనసుందర యిందిరాసుందరీ మనోహర
॥రామ॥
ఏలనాపై గోపము మున్నేమి చేసితినో పాపము
నీలవర్ణ నీరూపము నిరతము కన్నుల జూపుము
మేలొనరించెడి శ్రీలోలుడవని చాలా నమ్మియుంటి
॥రామ॥
అఘములను బాపర నేను జేసెదను నీ సేవను
ఆశించిన శ్రీరామదాసు నిటుమోసము చేసిన దోసంబెవరిదో
వాసవార్చితాంఘ్రజలజయుగళ కైలాసవాసనుత భద్రగిరి హరి
॥రామ॥
68. ముఖారి ఆదితాళము
పల్లవి: రామరామ నీవేగతిగద సంరక్షణంబు చేయు
ఏమనందు హా దైవమా నీ మనసింక కరుగదాయె
॥రామ॥
పుడమిలోన నావంటి దురాత్ముడు పుట్టడింక నంటి
విడువబోకుమయ్యా యని మున్నే విన్నవించుకొంటి
॥రామ||
ఎన్ని విధంబుల పిలిచిన పలుకవు ఏమదృష్టముందు
ఎన్నరాని వైవస్వతు వేదనకెటు తాళుకొందు
॥రామ||
న్యాయమటయ్యా మ్రొక్కినా మొరనాలకించబోవు
శ్రీయుతముగ నిను నమ్మిన దాసు కోర్కెలొసగరావు
॥రామ||
స్వామి నేను నీవాడను నాయెడ చలము చేయకుమయ్యా
ప్రేమమీర నినుగని గొనియాడెద మోముజూపవయ్యా
॥రామ॥
నేను గొప్పగ భద్రాచలమందిర నిను నమ్మలేదా
ప్రేమజూచి బంటును శ్రీరామదాసు నేలరాదా
॥రామ||
మరిన్ని కీర్తనలు: