మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు, మన పెద్దవాళ్ళు తెలుగులో నేటి తరానికి అందించిన సూక్తులు మీ అందరికోసం… ఈ బ్లాగ్ లో వున్నా సూక్తులు మీ భవిష్యత్తుకి ఉపయోగపడతాయని ఆసిస్తూ… మీ భక్తివేద్.కం.
సూక్తులు
- ఒక మేధావితో ఓ గంట కాలక్షేపం వంద పుస్తకాలు చదివిన దానితో సమానం ఒక సత్పురుషుడితో ఓ గంట కాలక్షేపం వంద పుణ్యక్షేత్రాల సందర్శనంతో సమానం.
- కుంభ వర్షం కురిసినా బోర్లించిన కుండలో నీరు నిలవనట్లే, ఆత్మ విశ్వాసం లేని వాడు విశ్వమంతా తిరిగినా వీసమెత్తు సాధించలేడు.
- నీ మనసు ఒక అద్దంలాంటిది నీ అంతరాత్మ ఒక జ్యోతిలాంటిది, ఆ అద్దంలో చూసి నీ తప్పులు దిద్దుకో, ఆ జ్యోతి వెలుగులో నీ మార్గం తెలుసుకో.
- అదే పనిగా చింతించవలదు మిత్రమా చితి – చనిపోయిన మనిషిని కాల్చి వేస్తే, చింత – బ్రతికున్న మనిషినే కాల్చి వేస్తుంది.
- రేపు అనేది ఒక ప్రామిసరీ నోటు, నిన్న అనేది ఒక చెల్లని చెక్కు, నేడు అనేదే నీ జేబులోని రెడీ క్యాష్ సద్వినియోగం చేస్తే లభిస్తుంది శభాష్!
- ఓ మనిషీ! పృథివి గర్వించదగిన అవతారానివి నీవు, తెలివితేటలు, శక్తియుక్తులు పుణికి పుచ్చు కొని పుట్టావు, కొండలను పిండికొట్టగలవు, నదీజలాల దారులు మళ్ళించగలవు, స్వయంకృషితో నీ జన్మభూమిని స్వర్గ – సీమగ మలచుకోలేవా?
- దీపం మాట్లాడదు వెలుగునిస్తుంది. లైట్ హౌస్ కేక పెట్టదు దారి చూపిస్తుంది. మనసున్న మనిషి ప్రగల్భాలు పలుకడు పున్నమి వెన్నెలలా ప్రేమానురాగాలు పంచుతాడు.
- మంచీ చెడుల కలయికయే మనిషి జీవితం మంచిని తీసుకో చెడును వదులుకో, అరటి తొక్కను తీసి లోపలి పండు తిన్నట్లు వడ్లమీది పొట్టు తీసి బియ్యం వండుకున్నట్లు.
- సమాజంలోని మాలిన్యాన్నినిర్మూలించడానికి, నీకున్నసామర్ధ్యం చాలదని నిరాశచెందకు, కొవ్వొత్తి ఒకటి చాలు కొండంత చీకటిని పారద్రోలి, కొంత వెలుగును ప్రసాదించడానికి!
- కాస్త స్వార్థమే లేకపోతే మనిషికి మనుగడే లేదు స్వార్థమే జీవిత పరమార్ధమైతే మనిషి లేడు – మనుగడ లేదు!
- ఎండకు కండువా కప్పుకో, వర్షంవస్తే ఛత్రం విప్పుకో, దుష్టుడు కనిపిస్తే ప్రక్కకు తప్పుకో చివరకు నీ గమ్యం చేరుకో.
- పొగిడేవాడిని జాగ్రత్తగా కనిపెట్టు అరనిమిషంలో అందలం ఎక్కిస్తాడు అరచేతిలో వైకుంఠం జూపిస్తాడు ఖాళీ విస్తరి మాత్రమే వడ్డిస్తాడు.
- అందమైన ఆకర్షణ లెన్నో వున్న యీ ప్రపంచంలో మనకు నియమావళి అనే ఓ కళ్ళెం వుంటేనే మన జీవితం సరైన దారిలో నడుస్తుంది కళ్ళకు గంతలు కట్టిన గుఱ్రంలా.
- క్షేత్ర మెరిగి విత్తనం వేయాలి పాత్రనెరిగి దానం చేయాలి జీతమెరిగి కోత బెట్టాలి మనిషి నెరిగి వాతపెట్టాలి.
- పరిస్థితులు అనుకూలిస్తే పనులు అవుతాయని ఎదురు చూస్తే యీ జన్మ సరిపోదు, చుట్టూ వున్న పరిస్థితులను అనుకూలించేలా మలుచుకోగలిగితేనే నీ గొప్పతనం.
- అధికారం, ఐశ్వర్యం అన్నీ వున్నవాడు ఏం చేసినా చెల్లుతుందనే అహంతో గుఱ్రం బదులు గాడిదనెక్కితే నడి వీధిలో నడ్డి విరిగేలా పడ్డాడట.
- హృదయ పూర్వకంగా చేయని దానం అధికార దర్పంతో చేసిన దానం పేరు ప్రతిష్టలు ఆశించి చేసే దానం దానం కాదు – లంచంతో సమానం.
- నీవు పెట్టిన అన్నం మూడు గంటల్లో జీర్ణమైపోతుంది నీవు చేసిన మేలు మాత్రం మూడు తరాల వరకు నిలుస్తుంది.
- కవితకందని వస్తువు లేదు, గాయకుని కందని రాగం లేదు, మనసుకందని భావం లేదు మేధస్సుకందనిదేదీ లేదు.
- చెప్పుల్లేవని ఏడ్చేవాడికి, కాళ్ళులేని వాడు కనిపించేవరకు, అర్ధంకాలేదట తానెంతటి అదృష్టవంతుడో!
- మనిషికి మంచీ చెడూ అనే ఆలోచన లేకపోతే నీతి నియమం పాటించాలనే వివేకం లేకపోతే కనిపించినదంతా కావాలనే ఆశ చావకపోతే మనిషికీ – గొడ్డుకు తేడా ఏముంది?
- చెప్పడం తేలిక – చేయడం కష్టం తప్పుల్లేకుండా చేయడం మహా కష్టం ఏమీ చేయనివాడు ఏదో ఒకటి చేసేవాణ్ణి విమర్శించడం మహా తేలిక.
- మట్టిలో కలిసిపోయే ముందు మంచి పనులు కొన్ని చేయండి, ఒక ఇంటిలో దీపం పెట్టండి, ఒక అభాగ్యుడి జీవితంలో ఆహ్లాదం నింపండి!
- తనకోసం బ్రతికేవాడు స్వార్ధపూరిత మనిషి భార్యా పిల్లల కొరకు బ్రతికేవాడు సాదాసీదా మనిషి పది మంది శ్రేయస్సు కోరేవాడు మంచిమనిషి సర్వజనుల శ్రేయస్సు కోరేవాడు మహా మనీషి.
- వేయి మందిలో ఓ వీరుడు పుట్టవచ్చు, పది వేల పామరులకు ఓ పండితుడు పుట్టవచ్చు పది లక్షల మందిని పట్టి పట్టి వెదికినా, ఓ దాత దొర్కడం చాల కష్టం.
మరిన్ని సూక్తులు మీకోసం: