మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు శ్రీ ఆదిలక్ష్మి దేవి వైభవము గురించి తెలుసుకుందాం.
ప్రాణశక్తి ప్రదాయిని శ్రీ ఆదిలక్ష్మిదేవి
సుమనస వందిత సుందరి మాధవి చంద్ర సహోదరి హేమమయే
మునిగణ వందిత మోక్షప్రదాయిని మంజుల భాషిణి వేదనుతే
పంకజ వాసిని దేవ సుపూజిత సద్గుణ వర్షిణి శాంతియుతే
జయజయహే మధుసూదన కామిని ఆదిలక్ష్మీ పరిపాలయమాం.
శ్రీమన్మహాలక్ష్మీదేవి తన అష్ట విధ అంశలతో లీలా రూపంగా ధరించిన అష్టలక్ష్మీ అవతారాలలో ప్రధమమైనది శ్రీ ఆదిలక్ష్మీదేవి. ఈ తల్లి ప్రాణశక్తికి అధిష్టాన దేవత. ఆది అనే పదంలోనే సనాతనమైనది, మూలాధారమైనటువంటిది అనే అర్థాలు స్ఫురిస్తాయి. జీవించడానికి అత్యవసరమైనది ప్రాణశక్తి. అదికంటికి కనబడని శక్తి. సమస్త జీవరాశులలోనూ ప్రాణశక్తి పరిపుష్టంగా వున్నప్పుడే మిగిలిన శక్తులు రాణిస్తాయి. ఆ రకంగా ప్రాణశక్తి మీద వ్యక్తి వికాసం, తద్వారా సమాజ వికాసం కూడా ఆధారపడి వుంటాయి అంటే అతిశయోక్తి కాదు. జీవి తల్లి గర్భంలో పాంచ భౌతిక శరీరాన్ని దాల్చటానికి అవసరమైన మొదటి శక్తి ప్రాణశక్తే. “ప్రాణాధ్యైవ ఖల్విమాని భూతాని జాయన్తి ప్రాణేన జాతాని జీవంతి ప్రాణం ప్రయన్త్యభిసం విశంతీతి” అని తైత్తీరియోపనిషత్లోని భృగువల్లిలో ప్రాణశక్తి ప్రభావం గురించి చెప్పబడింది.
శ్రీ ఆదిలక్ష్మీదేవి స్వరూప స్వభావాలు
ఆదిలక్ష్మీదేవి శుద్ధ జ్ఞానానికి ప్రతిరూపమైన పద్మంలో చతుర్భుజమూర్తిగా మనకి దర్శనం యిస్తుంది. అరుణకాంతులు వెదజల్లే ఎర్రని పట్టుచీరధరించి, రెండు చేతులలో పద్మాలను పట్టుకుని, రెండు చేతులతో భక్తులకు అభయ ప్రదానం చేస్తూ వుంటుంది. ‘సుమనస వందిత’ మంచి మనస్సుతో ఆరాధించే వారికి సత్వరం మంచి ఫలితాలను యిస్తుంది. ఆదిలక్ష్మీ మాత. భక్తుల ఎడల ఎంతో కరుణని చూపించే ఆ తల్లి స్వభావరీత్యా అలక్ష్యాన్నీ, నిరాదరణనీ, మర్యాదా ఉల్లంఘనాన్ని ఎంతమాత్రమూ సహించదు. తనకి చేసే ఉపచారాల విషయంలో ఏ మాత్రం తేడా వచ్చినా సహించదు. వెంటనే తన ప్రభావాన్ని చూపిస్తూ ఆ ప్రదేశాన్ని వీడిపోతుంది. భక్తులు తప్పు తెలుసుకుని ప్రార్థిస్తే తప్పకుండా మళ్ళీ కరుణిస్తుంది. ఆమె ఆగ్రహం కూడా చివరికి అనుగ్రహంగా పరిణమిస్తుంది. ప్రణవ స్వరూపిణిగా, గాయత్రి రూపిణిగా, సర్వదేవ నమస్కృతగా వినుతికెక్కిన ఈ తల్లిని దేవతలు కూడా సదా ఆరాధిస్తూ వుంటారు. సర్వమంత్ర ఫలప్రద, సర్వతీర్థ స్థిత, అపరాజిత అయిన ఈ తల్లి భవబంధవినాశిని.
అనాదిమూర్తిరంభోజా మంభోజగర్భ వాసినీం
అంభోజ నాభజననీ, మంభోరుహ గర్భమాతృకా
కరుణాంభోనిధిః భక్త సర్వకామప్రదాయినీ
సదాస్మరామి దేవేశీ ఆదిలక్ష్మీ నమోస్తుతే॥
విష్ణు పురాణగాధల ననుసరించి ఆదిలక్ష్మి భృగుమహర్షి పుత్రికగా తెలియవస్తోంది. ఆ తల్లికి “భార్గవి” అనే పేరు అందువల్లనే వచ్చింది. భృగువు బ్రహ్మమానస పుత్రుడని ప్రతీతి. భృగుమహర్షి జ్ఞానానికి ప్రతీక. అపార తపశ్శక్తి సంపన్నుడు, జ్ఞాన వృద్ధుడు అయిన ఈ మహర్షికి బ్రహ్మ అనుగ్రహం వల్ల అరికాలిలో జ్ఞాననేత్రం వుండేది. అలాంటి జ్ఞాన సంపన్నుడైన భృగువు ఎంతో కాలం ఘోర తపస్సు చేసి లక్ష్మీదేవి తన ఔరస పుత్రిక అయ్యేటట్లు వరం పొందాడు. తద్వారా వైకుంఠ వాసుడైన శ్రీమన్నారాయణుడు భృగువుకి అల్లుడయ్యాడు. విష్ణుమూర్తి సంకల్పశక్తి అయిన ఆదిలక్ష్మీదేవి నారాయణిగా, వైకుంఠ లక్ష్మిగా భక్తులను అనుగ్రహిస్తూ వుంటుంది.
శ్రీ ఆదిలక్ష్మీదేవి ప్రభావము
శ్రీ ఆదిలక్ష్మీదేవి స్వభావాన్ని, ఆ తల్లి ఆగ్రహ అనుగ్రహ ప్రభావాలను తెలిపే -రెండు కథలు పురాణాలలో విస్తృత ప్రాచుర్యంలో వున్నాయి.