Aranya Kanda Sarga 11 In Telugu – అరణ్యకాండ ఏకాదశః సర్గః

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. “అరణ్యకాండ” ఏకాదశః సర్గలో, రాముడు సరస్సు దాటి వస్తాడు, దాని నుండి దివ్య సంగీతం వినిపిస్తుంది. సరస్సు యొక్క నీటి క్రింద నుండి సంగీత స్వరాలను చూసి ఆశ్చర్యపోయిన అతను అనుసరిస్తున్న ఋషిని విచారించాడు మరియు ఆ ఋషి ఋషి మందకర్ణి యొక్క ఘట్టాన్ని వివరిస్తాడు.

అగస్త్యాశ్రమః

అగ్రతః ప్రయయౌ రామః సీతా మధ్యే సుమధ్యమా |
పృష్ఠతస్తు ధనుష్పాణిర్లక్ష్మణోఽనుజగామ హ ||

1

తౌ పశ్యమానౌ వివిధాన్ శైలప్రస్థాన్వనాని చ |
నదీశ్చ వివిధా రమ్యా జగ్మతుః సీతయా సహ ||

2

సారసాంశ్చక్రవాకాంశ్చ నదీపులినచారిణః |
సరాంసి చ సపద్మాని యుక్తాని జలజైః ఖగైః ||

3

యూథబద్ధాంశ్చ పృషతాన్మదోన్మత్తాన్విషాణినః |
మహిషాంశ్చ వరాహాంశ్చ నాగాంశ్చ ద్రుమవైరిణః ||

4

తే గత్వా దూరమధ్వానం లంబమానే దివాకరే |
దదృశుః సహితా రమ్యం తటాకం యోజనాయతమ్ ||

5

పద్మపుష్కరసంబాధం గజయూథైరలంకృతమ్ |
సారసైర్హంసకాదంబైః సంకులం జలచారిభిః ||

6

ప్రసన్నసలిలే రమ్యే తస్మిన్సరసి శుశ్రువే |
గీతవాదిత్రనిర్ఘోషో న తు కశ్చన దృశ్యతే ||

7

తతః కౌతూహలాద్రామో లక్ష్మణశ్చ మహాబలః |
మునిం ధర్మభృతం నామ ప్రష్టుం సముపచక్రమే ||

8

ఇదమత్యద్భుతం శ్రుత్వా సర్వేషాం నో మహామునే |
కౌతూహలం మహజ్జాతం కిమిదం సాధు కథ్యతామ్ ||

9

వక్తవ్యం యది చేద్విప్ర నాతిగుహ్యమపి ప్రభో |
తేనైవముక్తో ధర్మాత్మా రాఘవేణ మునిస్తదా ||

10

ప్రభావం సరసః కృత్స్నమాఖ్యాతుముపచక్రమే |
ఇదం పంచాప్సరో నామ తటాకం సార్వకాలికమ్ ||

11

నిర్మితం తపసా రామ మునినా మాండకర్ణినా |
స హి తేపే తపస్తీవ్రం మాండకర్ణిర్మహామునిః ||

12

దశ వర్షసహస్రాణి వాయుభక్షో జలాశ్రయః |
తతః ప్రవ్యథితాః సర్వే దేవాః సాగ్నిపురోగమాః ||

13

అబ్రువన్వచనం సర్వే పరస్పరసమాగతాః |
అస్మాకం కస్యచిత్స్థానమేష ప్రార్థయతే మునిః ||

14

ఇతి సంవిగ్నమనసః సర్వే తే త్రిదివౌకసః |
తత్ర కర్తుం తపోవిఘ్నం దేవైః సర్వైర్నియోజితాః ||

15

ప్రధానాప్సరసః పంచ విద్యుత్సదృశవర్చసః | [చ్చలిత]
అప్సరోభిస్తతస్తాభిర్మునిర్దృష్టపరావరః ||

16

నీతో మదనవశ్యత్వం సురాణాం కార్యసిద్ధయే |
తాశ్చైవాప్సరసః పంచ మునేః పత్నీత్వమాగతాః ||

17

తటాకే నిర్మితం తాసామస్మిన్నంతర్హితం గృహమ్ |
తథైవాప్సరసః పంచ నివసంత్యో యథాసుఖమ్ ||

18

రమయంతి తపోయోగాన్మునిం యౌవనమాస్థితమ్ |
తాసాం సంక్రీడమానానామేష వాదిత్రనిఃస్వనః ||

19

శ్రూయతే భూషణోన్మిశ్రో గీతశబ్దో మనోహరః |
ఆశ్చర్యమితి తస్యైతద్వవచనం భావితాత్మనః ||

20

రాఘవః ప్రతిజగ్రాహ సహ భ్రాత్రా మహాయశాః |
ఏవం కథయమానస్య దదర్శాశ్రమమండలమ్ ||

21

కుశచీరపరిక్షిప్తం బ్రాహ్మ్యా లక్ష్మ్యా సమావృతమ్ |
ప్రవిశ్య సహ వైదేహ్యా లక్ష్మణేన చ రాఘవః ||

22

ఉవాస మునిభిః సర్వైః పూజ్యమానో మహాయశాః |
తథా తస్మిన్స కాకుత్స్థః శ్రీమత్యాశ్రమమండలే ||

23

ఉషిత్వా తు సుఖం తత్ర పూజ్యమానో మహర్షిభిః |
జగామ చాశ్రమాంస్తేషాం పర్యాయేణ తపస్వినామ్ ||

24

యేషాముషితవాన్పూర్వం సకాశే స మహాస్త్రవిత్ |
క్వచిత్పరిదశాన్మాసానేకం సంవత్సరం క్వచిత్ ||

25

క్వచిచ్చ చతురో మాసాన్పంచషట్ చాపరాన్క్వచిత్ |
అపరత్రాధికం మాసాదప్యర్ధమధికం క్వచిత్ ||

26

త్రీన్ మాసానష్టమాసాంశ్చ రాఘవో న్యవసత్సుఖమ్ |
తథా సంవసతస్తస్య మునీనామాశ్రమేషు వై ||

27

రమతశ్చానుకూల్యేన యయుః సంవత్సరా దశ |
పరివృత్య చ ధర్మజ్ఞో రాఘవః సహ సీతయా ||

28

సుతీక్ష్ణస్యాశ్రమం శ్రీమాన్పునరేవాజగామ హ |
స తమాశ్రమమాసాద్య మునిభిః ప్రతిపూజితః ||

29

తత్రాపి న్యవసద్రామః కించిత్కాలమరిందమః |
అథాశ్రమస్థో వినయాత్కదాచిత్తం మహామునిమ్ ||

30

ఉపాసీనః స కాకుత్స్థః సుతీక్ష్ణమిదమబ్రవీత్ |
అస్మిన్నరణ్యే భగవన్నగస్త్యో మునిసత్తమః ||

31

వసతీతి మయా నిత్యం కథాః కథయతాం శ్రుతమ్ |
న తు జానామి తం దేశం వనస్యాస్య మహత్తయా ||

32

కుత్రాశ్రమమిదం పుణ్యం మహర్షేస్తస్య ధీమతః |
ప్రసాదాత్తత్రభవతః సానుజః సహ సీతయా ||

33

అగస్త్యమభిగచ్ఛేయమభివాదయితుం మునిమ్ |
మనోరథో మహానేష హృది మే పరివర్తతే ||

34

యదహం తం మునివరం శుశ్రూషేయమపి స్వయమ్ |
ఇతి రామస్య స మునిః శ్రుత్వా ధర్మాత్మనో వచః ||

35

సుతీక్ష్ణః ప్రత్యువాచేదం ప్రీతో దశరథాత్మజమ్ |
అహమప్యేతదేవ త్వాం వక్తుకామః సలక్ష్మణమ్ ||

36

అగస్త్యమభిగచ్ఛేతి సీతయా సహ రాఘవ |
దిష్ట్యా త్విదానీమర్థేఽస్మిన్స్వయమేవ బ్రవీషి మామ్ ||

37

అహమాఖ్యామి తే వత్స యత్రాగస్త్యో మహామునిః |
యోజనాన్యాశ్రమాదస్మాత్తథా చత్వారి వై తతః ||

38

దక్షిణేన మహాంఛ్రీమానగస్త్యభ్రాతురాశ్రమః |
స్థలీప్రాయే వనోద్దేశే పిప్పలీవనశోభితే ||

39

బహుపుష్పఫలే రమ్యే నానాశకునినాదితే |
పద్మిన్యో వివిధాస్తత్ర ప్రసన్నసలిలాః శివాః ||

40

హంసకారండవాకీర్ణాశ్చక్రవాకోపశోభితాః |
తత్రైకాం రజనీం వ్యుష్య ప్రభాతే రామ గమ్యతామ్ ||

41

దక్షిణాం దిశమాస్థాయ వనషండస్య పార్శ్వతః |
తత్రాగస్త్యాశ్రమపదం గత్వా యోజనమంతరమ్ ||

42

రమణీయే వనోద్దేశే బహుపాదపసంవృతే |
రంస్యతే తత్ర వైదేహీ లక్ష్మణశ్చ సహ త్వయా ||

43

స హి రమ్యో వనోద్దేశో బహుపాదపసంకులః |
యది బుద్ధిః కృతా ద్రష్టుమగస్త్యం తం మహామునిమ్ ||

44

అద్యైవ గమనే బుద్ధిం రోచయస్వ మహాయశః |
ఇతి రామో మునేః శ్రుత్వా సహ భ్రాత్రాఽభివాద్య చ ||

45

ప్రతస్థేఽగస్త్యముద్దిశ్య సానుజః సీతయా సహ |
పశ్యన్వనాని రమ్యాణి పర్వతాంశ్చాభ్రసన్నిభాన్ ||

46

సరాంసి సరితశ్చైవ పథి మార్గవశానుగాః |
సుతీక్ష్ణేనోపదిష్టేన గత్వా తేన పథా సుఖమ్ ||

47

ఇదం పరమసంహృష్టో వాక్యం లక్ష్మణమబ్రవీత్ |
ఏతదేవాశ్రమపదం నూనం తస్య మహాత్మనః ||

48

అగస్త్యస్య మునేర్భ్రాతుర్దృశ్యతే పుణ్యకర్మణః |
యథా హి మే వనస్యాస్య జ్ఞాతాః పథి సహస్రశః ||

49

సన్నతాః ఫలభారేణ పుష్పభారేణ చ ద్రుమాః |
పిప్పలీనాం చ పక్వానాం వనాదస్మాదుపాగతః ||

50

గంధోఽయం పవనోత్క్షిప్తః సహసా కటుకోదయః |
తత్ర తత్ర చ దృశ్యంతే సంక్షిప్తాః కాష్ఠసంచయాః ||

51

లూనాశ్చ పథి దృశ్యంతే దర్భా వైడూర్యవర్చసః |
ఏతచ్చ వనమధ్యస్థం కృష్ణాభ్రశిఖరోపమమ్ ||

52

పావకస్యాశ్రమస్థస్య ధూమాగ్రం సంప్రదృశ్యతే |
వివిక్తేషు చ తీర్థేషు కృతస్నాతా ద్విజాతయః ||

53

పుష్పోపహారం కుర్వంతి కుసుమైః స్వయమార్జితైః |
తత్సుతీక్ష్ణస్య వచనం యథా సౌమ్య మయా శ్రుతమ్ ||

54

అగస్త్యస్యాశ్రమో భ్రాతుర్నూనమేష భవిష్యతి |
నిగృహ్య తరసా మృత్యుం లోకానాం హితకామ్యయా ||

55

యస్య భ్రాత్రా కృతేయం దిక్ఛరణ్యా పుణ్యకర్మణా |
ఇహైకదా కిల క్రూరో వాతాపిరపి చేల్వలః ||

56

భ్రాతరౌ సహితావాస్తాం బ్రాహ్మణఘ్నౌ మహాసురౌ |
ధారయన్బ్రాహ్మణం రూపమిల్వలః సంస్కృతం వదన్ ||

57

ఆమంత్రయతి విప్రాన్ స్మ శ్రాద్ధముద్దిశ్య నిర్ఘృణః |
భ్రాతరం సంస్కృతం కృత్వా తతస్తం మేషరూపిణమ్ ||

58

తాన్ద్విజాన్భోజయామాస శ్రాద్ధదృష్టేన కర్మణా |
తతో భుక్తవతాం తేషాం విప్రాణామిల్వలోఽబ్రవీత్ ||

59

వాతాపే నిష్క్రమస్వేతి స్వరేణ మహతా వదన్ |
తతో భ్రాతుర్వచః శ్రుత్వా వాతాపిర్మేషవన్నదన్ ||

60

భిత్త్వా భిత్త్వా శరీరాణి బ్రాహ్మణానాం వినిష్పతత్ |
బ్రాహ్మణానాం సహస్రాణి తైరేవం కామరూపిభిః ||

61

వినాశితాని సంహత్య నిత్యశః పిశితాశనైః |
అగస్త్యేన తదా దేవైః ప్రార్థితేన మహర్షిణా ||

62

అనుభూయ కిల శ్రాద్ధే భక్షితః స మహాసురః |
తతః సంపన్నమిత్యుక్త్వా దత్త్వా హస్తోదకం తతః ||

63

భ్రాతరం నిష్క్రమస్వేతి చేల్వలః సోఽభ్యభాషత |
స తం తథా భాషమాణం భ్రాతరం విప్రఘాతినమ్ ||

64

అబ్రవీత్ప్రహసన్ధీమానగస్త్యో మునిసత్తమః |
కుతో నిష్క్రమితుం శక్తిర్మయా జీర్ణస్య రక్షసః ||

65

భ్రాతుస్తే మేషరూపస్య గతస్య యమసాదనమ్ |
అథ తస్య వచః శ్రుత్వా భ్రాతుర్నిధనసంశ్రయమ్ ||

66

ప్రధర్షయితుమారేభే మునిం క్రోధాన్నిశాచరః |
సోఽభిద్రవన్మునిశ్రేష్ఠం మునినా దీప్తతేజసా ||

67

చక్షుషాఽనలకల్పేన నిర్దగ్ధో నిధనం గతః |
తస్యాయమాశ్రమో భ్రాతుస్తటాకవనశోభితః ||

68

విప్రానుకంపయా యేన కర్మేదం దుష్కరం కృతమ్ |
ఏవం కథయమానస్య తస్య సౌమిత్రిణా సహ ||

69

రామస్యాస్తం గతః సూర్యః సంధ్యాకాలోఽభ్యవర్తత |
ఉపాస్య పశ్చిమాం సంధ్యాం సహ భ్రాత్రా యథావిధి ||

70

ప్రవివేశాశ్రమపదం తమృషిం సోఽభ్యవాదయత్ |
సమ్యక్ ప్రతిగృహీతశ్చ మునినా తేన రాఘవః ||

71

న్యవసత్తాం నిశామేకాం ప్రాశ్య మూలఫలాని చ |
తస్యాం రాత్ర్యాం వ్యతీతాయాం విమలే సూర్యమండలే ||

72

భ్రాతరం తమగస్త్యస్య హ్యామంత్రయత రాఘవః |
అభివాదయే త్వాం భగవన్సుఖమధ్యుషితో నిశామ్ ||

73

ఆమంత్రయే త్వాం గచ్ఛామి గురుం తే ద్రష్టుమగ్రజమ్ |
గమ్యతామితి తేనోక్తో జగామ రఘునందనః ||

74

యథోద్దిష్టేన మార్గేణ వనం తచ్చావలోకయన్ |
నీవారాన్పనసాంస్తాలాంస్తిమిశాన్వంజులాన్ధవాన్ ||

75

చిరిబిల్వాన్మధూకాంశ్చ బిల్వానపి చ తిందుకాన్ |
పుష్పితాన్పుష్పితాగ్రాభిర్లతాభిరనువేష్టితాన్ ||

76

దదర్శ రామః శతశస్తత్ర కాంతారపాదపాన్ |
హస్తిహస్తైర్విమృదితాన్వానరైరుపశోభితాన్ ||

77

మత్తైః శకునిసంఘైశ్చ శతశశ్చ ప్రణాదితాన్ |
తతోఽబ్రవీత్సమీపస్థం రామో రాజీవలోచనః ||

78

పృష్ఠతోఽనుగతం వీరం లక్ష్మణం లక్ష్మివర్ధనమ్ |
స్నిగ్ధపత్రా యథా వృక్షా యథా శాంతమృగద్విజాః ||

79 [క్షాంతా]

ఆశ్రమో నాతిదూరస్థో మహర్షేర్భావితాత్మనః |
అగస్త్య ఇతి విఖ్యాతో లోకే స్వేనైవ కర్మణా ||

80

ఆశ్రమో దృశ్యతే తస్య పరిశ్రాంతశ్రమాపహః |
ప్రాజ్యధూమాకులవనశ్చీరమాలాపరిష్కృతః ||

81

ప్రశాంతమృగయూథశ్చ నానాశకునినాదితః |
నిగృహ్య తరసా మృత్యుం లోకానాం హితకామ్యయా ||

82

దక్షిణా దిక్కృతా యేన శరణ్యా పుణ్యకర్మణా |
తస్యేదమాశ్రమపదం ప్రభావాద్యస్య రాక్షసైః ||

83

దిగియం దక్షిణా త్రాసాద్దృశ్యతే నోపభుజ్యతే |
యదాప్రభృతి చాక్రాంతా దిగియం పుణ్యకర్మణా ||

84

తదాప్రభృతినిర్వైరాః ప్రశాంతా రజనీచరాః |
నామ్నా చేయం భగవతో దక్షిణా దిక్ప్రదక్షిణా ||

85

ప్రథితా త్రిషు లోకేషు దుర్ధర్షా క్రూరకర్మభిః |
మార్గం నిరోద్ధుం నిరతో భాస్కరస్యాచలోత్తమః ||

86

నిదేశం పాలయన్యస్య వింధ్యః శైలో న వర్ధతే |
అయం దీర్ఘాయుషస్తస్య లోకే విశ్రుతకర్మణః ||

87

అగస్త్యస్యాశ్రమః శ్రీమాన్వినీతజనసేవితః |
ఏష లోకార్చితః సాధుర్హితే నిత్యరతః సతామ్ ||

88

అస్మానభిగతానేష శ్రేయసా యోజయిష్యతి |
ఆరాధయిష్యామ్యత్రాహమగస్త్యం తం మహామునిమ్ ||

89

శేషం చ వనవాసస్య సౌమ్య వత్స్యామ్యహం ప్రభో |
అత్ర దేవాః సగంధర్వాః సిద్ధాశ్చ పరమర్షయః ||

90

అగస్త్యం నియతాహారం సతతం పర్యుపాసతే |
నాత్ర జీవేన్మృషావాదీ క్రూరో వా యది వా శఠః ||

91

నృశంసః కామవృత్తో వా మునిరేష తథావిధః |
అత్ర దేవాశ్చ యక్షాశ్చ నాగాశ్చ పతగైః సహ ||

92

వసంతి నియతాహారా ధర్మమారాధయిష్ణవః |
అత్ర సిద్ధా మహాత్మానో విమానైః సూర్యసన్నిభైః ||

93

త్యక్తదేహా నవైర్దేహైః స్వర్యాతాః పరమర్షయః |
యక్షత్వమమరత్వం చ రాజ్యాని వివిధాని చ ||

94

అత్ర దేవాః ప్రయచ్ఛంతి భూతైరారాధితాః శుభైః |
ఆగతాః స్మాశ్రమపదం సౌమిత్రే ప్రవిశాగ్రతః |
నివేదయేహ మాం ప్రాప్తమృషయే సీతయా సహ ||

95

Aranya Kanda Sarga 11 Meaning In Telugu PDF

ఆ అడవిలో రాముడు ముందు నడుస్తున్నాడు. సీత మధ్యలో ఉంది. వెనక లక్ష్మణుడు నడుస్తున్నాడు. వారు అనేకములైన కొండలను, సెలయేళ్లను దాటుకుంటూ వెళుతున్నారు. నదీతీరములలో ఇసుక తిన్నెల మీద ఎగురుతున్న సారస పక్షులను, చక్రవాక పక్షులను, జలపక్షులను చూస్తూ ఆనందిస్తున్నారు. గుంపులు గుంపులుగా పోవుచున్న వన్యప్రాణులను చూచి, ఆగి అవి వెళ్లిన మీదట వెళుతున్నారు. సాయంత్రము అయింది. వారు ఒక సరస్సును సమీపించారు.

ఆ సరస్సులో నుండి గీతాలాపనలు, వాద్య ధ్వనులు శ్రవణానందంగా వినిపిస్తున్నాయి. కాని ఆ దరిదాపులలో మానవ సంచారము లేదు. సీతారామలక్ష్మణులు ఆ ధ్వనులు విని ఆశ్చర్యపోయారు. తమ వెంట వస్తున్న ఋషులను ఆ వాద్య ధ్వనులు ఎక్కడినుండి వస్తున్నాయి అని అడిగారు. అందులో ధర్మభృతుడు అనే వృద్ధుడైన ఒక ఋషిఇలా చెప్పసాగాడు.

“రామా! ఈ సరస్సుపేరు పంచ అప్సర సరస్సు. ఈ తటాకము అన్ని ఋతువులలోనూ ఒకే విధంగా నీటితో నిండి ఉంటుంది. ఈ సరస్సును మాణ్ణకర్ణి అనే ఋషి నిర్మించాడు. మాణ్ణకర్ణి అనే ఆ ఋషి పదివేల సంవత్సరములు తీవ్రంగా తపస్సు చేసాడు. ఆ తపస్సుకు దిక్పాలకులు వణికిపోయారు. ఎవరి పదవిని కోరి ఆ ఋషి తపస్సు చేస్తున్నాడో అని భయపడ్డారు. వెంటనే వారుమెరుపు తీగల వలె మెరిసిపోతున్న ఐదుగురు అప్సరసలను పిలిపించారు. ఆ ఋషి తపస్సును భగ్నం చేయమని వారిని పంపారు.

ఆ అప్సరసలు మాణ్ణకర్ణి వద్దకు వచ్చారు. తమ శృంగార హావభావాలతో ఆ మునిని ఆకట్టుకున్నారు. తమకు దాసుడిగా చేసుకున్నారు. శృంగార చేష్టలలో ఓలలాడించారు. ఆ ముని తన తపోబలంతో యువకుడిగా మారిపోయాడు. ఆ ఐదుగురు
అప్సరసలను పెళ్లి చేసుకున్నాడు. వారి కొరకు ఈ సరస్సును సృష్టించి, ఈ సరస్సు అడుగుభాగంలో ఒక గృహమును ఏర్పరిచి అందులో వారితో పాటు నివసిస్తున్నాడు. ఆ ఐదుగురు అప్సరసలు ఆలపించే గీతాలు, వాద్య ధ్వనులే మీరు వింటున్నారు.” అని అన్నాడు.

ఆ మాటలు విన్న రామలక్ష్మణులు సీత ఆశ్చర్యపోయారు. రాముడు అక్కడ కొన్ని మున్యాశ్రమములు చూచాడు. ఆ ఆశ్రమములలో ఉన్న మునులు రాముని సాదరంగా ఆహ్వానించారు. అర్ఘ్యము పాద్యము ఇచ్చి సత్కరించారు. రాముడు ఆ ముని ఆశమములలో కొంత కాలము నివసించాడు. తరువాత రాముడు ఆ అడవిలో ఎన్నో ఆశ్రమములు సందర్శించాడు. ఆయా ఆశ్రమములలో కొంత కాలము నివసించాడు.

ఒక ఆశ్రమములో పది మాసములు, మరొక ఆశ్రమములో ఒక సంవత్సరము, మరొక ఆశ్రమములో నాలుగు మాసములు, ఐదు మాసములు, ఆరు మాసములు, ఒక మాసము, ఒకటిన్నర మాసము, మూడు మాసములు, ఎనిమిది మాసములు ఈ ప్రకారంగా రాముడు, సీత, లక్ష్మణుడు ఒక్కొక్క ఆశ్రమములో పై చెప్పిన విధంగా నివసిం చారు. ఆ విధంగా ముని ఆశ్రమములలో నివసిస్తూ రాముడు, సీత, అక్ష్మణుడు తమ వనవాస కాలములో పది సంవత్సరములు ఆనందంగాగడిపారు.

(దీనికి సంబంధించిన శ్లోకము ఇక్కడ ఉదహరిస్తాను. చదవండి.)
తదాసంవసతస్తస్య మునీనామాశ్రమేషు వై,
రమతశ్చానుకూల్యేన యయు: సంవత్సరా దశ.

ఆ విధంగారాముడు ఆశ్రమములలో నివసిస్తూ ఉండగా పది సంవత్సరములు అనుకూలంగా గడిచిపోయాయి. అంటే ఈ పదిసంవత్సరములు రాముడు ఒక్క రాక్షసుని కూడా చంపలేదు. మరి రాముడు మునులను రక్షిస్తాను అని వారికి ఇచ్చిన మాట ఏమైనట్టు. వారు రాక్షసుల చేతిలో అనుదినమూ బాధలు పడుతున్నారా! చస్తున్నారా! సీతను, లక్ష్మణుని అయినా వదులుకుంటాను కానీ నేను మునులకు ఇచ్చిన మాట తప్పను. అందుకే ధనుర్బాణాలు ధరించాను అన్న రాముడు వారి ఊసెత్తకుండా పది సంవత్సరాలు ఆనందంగా గడిపాడు. కానీ వారి కష్టాలు బాధలు తీర్చలేదు. దీనిని ఎలా అర్థం చేసుకోవాలి?దీని అర్థం ఏమయి ఉంటుంది.

దీనికి సమాధానం మనకు ముప్పదవ సర్గలో కనిపిస్తుంది. రాముడు ఒక్కొక్క రాక్షసుని చంపడానికి ఇష్టపడలేదు. ఒకేసారి రాక్షసులనందరినీ మట్టు పెట్టాలని అనుకున్నాడు. అదును కోసం వేచి ఉన్నాడు. శూర్పణఖ వల్ల ఆ అవకాశం వెతుక్కుంటూ వచ్చింది. మొత్తం 14,000+5,000 సైనికులను ఖరుని, దూషణుని, త్రిశిరుని ఒకేసారి సంహరించి దండకారణ్యములో రాక్షస బాధను శాశ్వతంగా నివారించాడు. రాముడు తాత్కాలిక పరిష్కారం కోసం కాకుండా శాశ్వత పరిష్కారం కోసరం వేచిఉన్నాడు. ఇలా అర్థం చేసుకుంటే రాముని ఆంతర్యం మనకు అర్థం అవుతుంది.)

తరువాత ధర్మజ్ఞుడైన రాముడు, సీతతో, లక్ష్మణునితో ఆయా ఆశ్రమములలో నివసిస్తూ, తుదకు సుతీక్షుని ఆశ్రమమునకు చేరుకున్నాడు. రాముడు సుతీక్షుని ఆశ్రమంలో కొంతకాలము నివసించాడు.

ఒకరోజు రాముడు సుతీక్ష మహామునిని చూచి ఇలా అన్నాడు. “మహాత్మా! అగస్త్యుడు ఈ అరణ్యములోనే ఆశ్రమము నిర్మించుకొని నివసిస్తున్నాడు అని వారి గురించి కథలు కధలు గా విన్నాము. మాకు ఆయనను దర్శించవలెనని కోరికగా ఉంది. ఆయన ఆశ్రమము ఎక్కడ ఉందో దయచేసి తెలియజేయండి.” అని ప్రార్థించాడు.

“రామా! మంచి పని చేస్తున్నావు. నేనే నిన్ను అగస్త్యుని ఆశ్రమమునకు వెళ్లమని చెబుదాము అని అనుకుంటున్నాను. ఇంతలో నీవే అడిగావు. చాలా సంతోషము. ఈ ఆశ్రమము నుండి నాలుగు యోజనముల దూరంలో దక్షిణ దిశగా అగస్త్యుని సోదరుడు (అగస్త్యభ్రాత) ఆశ్రమము కలదు.

(ఈ అగస్త్య భ్రాత గురించి మన ఇంట్లో పెద్ద వాళ్లకు తెలుసు. అగస్త్యుని సోదరునికి పేరు లేదు. అంతా అగస్త్య భ్రాత అంటారు. “వీడెవడో అగస్త్య భ్రాతలా ఉన్నాడే!” అని అనడం మనం వింటూ ఉంటాము. అగస్త్యభ్రాత అనేది ఒక నానుడి.)

రామా! నీవు అగస్త్య భ్రాత ఆశ్రమములో ఒక రాత్రి ఉండి మరునాడు అగస్త్యుని ఆశ్రమమునకు వెళ్లు. అగస్త్య భ్రాత ఆశ్రమము నకు ఒక యోజన దూరంలో అగస్త్యుని ఆశ్రమము ఉంది.” అని అన్నాడు.

తరువాత రాముడు సుతీక్షుని వద్ద అనుజ్ఞ తీసుకొని అగస్త్యుని ఆశ్రమమునకు బయలు దేరాడు. దక్షిణ దిశగా నాలుగు యోజనములు ప్రయాణము చేసి అగస్త్య భ్రాత ఆశ్రమమును చేరుకున్నారు.

ఫలవృక్షములు సమృద్ధిగా కల ఆ ప్రాంతమును చూచి రాముడు లక్ష్మణునితో ఇలా అన్నాడు. “లక్ష్మణా! ఇక్కడ ఉన్న ఫలవృక్షములు, పిప్పళ్ల చెట్లు, ఆశ్రమము బయట ఉన్న సమిధలు, సేకరించిన దర్భలు, ఆరవేసిన నార చీరలు, చూస్తుంటే సుతీక్ష మహాముని చెప్పిన అగస్త్య భ్రాత ఆశ్రమము ఇదే అని తెలుస్తోంది. అటు చూడు, ఆ ఆశ్రమము పైనుండి అగ్ని హోత్రము నుండి వెలువడే పొగ ఆకాశంలోకి ఎలా పోతోందో! సందేహము లేదు. ఇదే అగస్త్య భ్రాత ఆశ్రమము.

లక్ష్మణా! నీకు తెలుసా! అగస్త్యుడు ఈ దక్షిణ ప్రాంతము అరణ్యములలో నివసించు బ్రాహ్మణులకు తాపసులకు వారికి ఎంతో ఉపకారము చేసాడు. ఎలాగంటే…..

ఈ అడవిలో వాతాపి, ఇల్వలుడు అనే ఇద్దరు రాక్షసులు ఉండేవారు. వారు ఇక్కడ నివసించే బ్రాహ్మణులను, తాపసులను మోసం చేసి చంపి తినేవారు. ఇల్వలుడు ఒక బ్రాహ్మణుడిగా వేషం వేసుకొనేవాడు. “ ఈ రోజు నా తండ్రి ఆబ్దికము మీరు భోజనానికి భోక్తగా రావాలి” అని బ్రాహ్మణులను తన ఇంటికి తీసుకొని వెళ్లేవాడు. వాతాపి ఒక గొర్రెగా మారి పోయేవాడు. శాస్త్రములలో చెప్పబడిన శ్రాద్ధకర్మల విధి ప్రకారము ఇల్వలుడు ఆ గొర్రెను చంపి ఆ మాంసముతో ఆ భోక్తగా వచ్చిన బ్రాహ్మణునకు భోజనం పెట్టేవాడు.

బ్రాహ్మణుడు భోజనం చేసిన తరువాత “వాతాపీ! బయటకు రా!” అని బిగ్గరగా అరిచేవాడు. ఆ బ్రాహ్మణుని పొట్టలో ఉన్న వాతాపి గొర్రెగా మారి, ఆ బ్రాహ్మణుని పొట్టను చీల్చుకొని బయటకు వచ్చేవాడు. వాతాపి, ఇల్వలుడు ఇద్దరూ కలిసి ఆ బ్రాహ్మణుని చంపి తినేవారు. ఈ ప్రకారము ఆ రాక్షసులు ఇద్దరూ ఎంతో మంది బ్రాహ్మణులను చంపారు. ఈ సంగతి తెలిసి దేవతలు, బ్రాహ్మణులు అగస్త్యుని శరణు వేడారు. అగస్త్యుడు సరేఅన్నాడు.

ఒక రోజు అగస్త్యుడు ఇల్వలుని ఇంటికి భోక్తగా వెళ్లాడు. వాతాపి గొర్రెగా మారాడు. ఇల్వలుడు వాతాపిని చంపి ఆ మాంసమును వండి అగస్త్యునికి వడ్డించాడు. అగస్త్యుడు తృప్తిగా భోజనం చేసాడు. “జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం” అంటూ బ్రేవ్మంటూ త్రేన్చాడు. అంతే. అగస్త్యుని పొట్టలో ఉన్న వాతాపి జీర్ణం అయిపోయాడు. ఇది తెలియని ఇల్వలుడు “వాతాపీ! బయటకు రా!’ అని అరిచాడు. ఎంత అరిచినా వాతాపి రాలేదు.

అగస్త్యుడు నవ్వాడు. “ఇంకెక్కడి వాతాపి. వాడు నా పొట్టలో ఎప్పుడో జీర్ణం అయిపోయాడు.” అన్నాడు తన పొట్ట నిమురుకుంటూ. దానికి కోపించి ఇల్వలుడు అగస్త్యుని మీద దాడి చేసాడు. అగస్త్యుడు తన తపోశక్తితో ఇల్వలుని భస్మం చేసాడు. ఆ ప్రకారంగా అగస్త్యుడు ఈ ప్రాంతంలో ఉన్న బ్రాహ్మణులకు, మునులకు రాక్షస బాధ తొలగించాడు. ఆ అగస్త్యుని సోదరుడే ఈ అగస్త్య భ్రాత” అని వివరించాడు రాముడు.

(ఈ రోజుల్లో కూడా తల్లులు పసిబిడ్డలకు ఉగ్గు, పాలు పట్టిన తరువాత “జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం మా అబ్బాయి తాగిన పాలుజీర్ణం” అని పొట్ట మీద నిమురడం మనం చూస్తూ ఉంటాము.)

అంతలో సాయంత్రం అయింది. రామలక్ష్మణులు సాయంసంధ్యలు నిర్వర్తించారు. అగస్త్యభ్రాత ఆశ్రమములోనికి ప్రవేశించి ఆయనకు పాదాభివందనము చేసారు. అగస్త్యభ్రాత కూడా రాముని సాదరంగా ఆహ్వానించాడు. ఫలములు పుష్పములు ఇచ్చి సత్కరించాడు. రాముడు, లక్ష్మణుడు, సీత ఆ రాత్రికి ఆ ఆశ్రమములోనే ఉన్నారు.

మరునాడు ఉదయమే లేచి రాముడు సంధ్యావందనాది కార్యక్రమములు పూర్తి చేసుకొని అగస్త్యభ్రాత వద్దకు వెళ్లి అగస్త్యుని ఆశ్రమమునకు వెళ్లుటకు ఆయన అనుమతి కోరాడు. అగస్త్య భ్రాత రామునికి తన అన్న అగస్త్యుని ఆశ్రమమునకు పోవుటకు మార్గము చెప్పాడు. రాముడు, సీత, లక్ష్మణులు వెంట రాగా అగస్త్య ఆశ్రమమునకు బయలుదేరాడు. అగస్త్య భ్రాత చెప్పిన గుర్తుల ప్రకారము ప్రయాణం చేస్తున్నాడు.

ఒకచోట ఫలవృక్షములు మెండుగా కనిపించాయి. లేళ్లు గుంపులు గుంపులుగా తిరుగుతున్నాయి. హెూమధూమము పైకి లేస్తోంది. దానిని బట్టి అగస్త్యుని ఆశ్రమము అక్కడకు దగ్గరలోనే ఉంది అని రాముడు అనుకొన్నాడు. అంతలోనే నారచీరలు ఆరవేసి ఉన్న ఆశ్రమ ప్రాంగణము కనపడింది. మృగములు తమ సహజ వైరము మరిచి ప్రశాంతంగా సంచరిస్తున్నాయి.

“ఎవరి తపోప్రభావంచేత రాక్షసులు ఈ ప్రాంతానికి రావడానికి భయపడుతుంటారో ఆ అగస్త్య మహా ముని ఆశ్రమము ఇదే. ఇక్కడకు దేవతలు గంధర్వులు నియమం తప్పకుండా వచ్చి అగస్త్య మహామునిని సేవిస్తుంటారు.

ఈ అగస్త్య మహాముని ఆశ్రమములో అబద్ధాలు చెప్పేవారికి, ఈ క్రూరులకు, వంచకులకు, సాటి మానవులను హింసించేవారికి స్థానము లేదు. ఎంతో మంది మహర్షులు ఇక్కడ తపస్సు చేసి, స్వర్గానికి వెళ్లారు. ఈ ఆశ్రమ ప్రాంతములో ఎవరైనా తపస్సు చేసి కోరికలు కోరుకుంటే వాటిని దేవతలు తప్పకుండా నెరవేరుస్తారు. ఇదీ ఆ ఆశ్రమ మహాత్మ్యం.

లక్ష్మణా! ముందు నీవు ఆశ్రమములోనికి ప్రవేశించి నేను, సీత మహాముని దర్శనానికి వచ్చామని అగస్త్యునికి విన్నవించు” అని రాముడు లక్ష్మణునితో అన్నాడు.

శ్రీమద్రామాయణము
అరణ్యకాండము పదకొండవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత ఓం తత్సత్.

అరణ్యకాండ ద్వాదశః సర్గః (12) >>

Leave a Comment