Aranya Kanda Sarga 13 In Telugu – అరణ్యకాండ త్రయోదశః సర్గః

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. “అరణ్యకాండ” త్రయోదశః సర్గలో, అజ్ఞాతవాసంలో ఉన్న రోజుల్లో నివాసం చేసుకోవడానికి అడవిలో ఒక స్థలాన్ని సూచించమని రాముడు అగస్త్య మహర్షిని అభ్యర్థిస్తాడు. అగస్త్య మహర్షి రామాయణం యొక్క తదుపరి కోర్సును ఊహించాడు మరియు స్త్రీత్వం మరియు సీత చుట్టూ తన సంభాషణను నడిపించాడు. అప్పుడు ఆ ఋషి పంచవటికి వెళ్లమని రాముడికి తెలియజేస్తాడు, అక్కడ సీత తన పరిసరాలను చూసి ముచ్చటగా ఉంటుంది.

పంచవటీగమనమ్

రామ ప్రీతోఽస్మి భద్రం తే పరితుష్టోఽస్మి లక్ష్మణ |
అభివాదయితుం యన్మాం ప్రాప్తౌ స్థః సహ సీతయా ||

1

అధ్వశ్రమేణ వాం ఖేదో బాధతే ప్రచురశ్రమః |
వ్యక్తముత్కంఠతే చాపి మైథిలీ జనకాత్మజా ||

2

ఏషా హి సుకుమారీ చ దుఃఖైశ్చ న విమానితా |
ప్రాజ్యదోషం వనం ప్రాప్తా భర్తృస్నేహప్రచోదితా ||

3

యథైషా రమతే రామ ఇహ సీతా తథా కురు |
దుష్కరం కృతవత్యేషా వనే త్వామనుగచ్ఛతీ ||

4

ఏషా హి ప్రకృతిః స్త్రీణామాసృష్టే రఘునందన |
సమస్థమనురజ్యంతి విషమస్థం త్యజ్యంతి చ ||

5

శతహ్రదానాం లోలత్వం శస్త్రాణాం తీక్ష్ణతాం తథా |
గరుడానిలయోః శైఘ్ర్యమనుగచ్ఛంతి యోషితః ||

6

ఇయం తు భవతో భార్యా దోషైరేతైర్వివర్జితా |
శ్లాఘ్యా చ వ్యపదేశ్యా చ యథా దేవీ హ్యరుంధతీ ||

7

అలంకృతోఽయం దేశశ్చ యత్ర సౌమిత్రిణా సహ |
వైదేహ్యా చానయా రామ వత్స్యసి త్వమరిందమ ||

8

ఏవముక్తః స మునినా రాఘవః సంయతాంజలిః |
ఉవాచ ప్రశ్రితం వాక్యమృషిం దీప్తమివానలమ్ ||

9

ధన్యోఽస్మ్యనుగృహీతోఽస్మి యస్య మే మునిపుంగవః |
గుణైః సభ్రాతృభార్యస్య వరదః పరితుష్యతి ||

10

కిం తు వ్యాదిశ మే దేశం సోదకం బహుకాననమ్ |
యత్రాశ్రమపదం కృత్వా వసేయం నిరతః సుఖమ్ ||

11

తతోఽబ్రవీన్మునిశ్రేష్ఠః శ్రుత్వా రామస్య తద్వచః |
ధ్యాత్వా ముహూర్తం ధర్మాత్మా ధీరో ధీరతరం వచః ||

12

ఇతో ద్వియోజనే తాత బహుమూలఫలోదకః |
దేశో బహుమృగః శ్రీమాన్పంచవట్యభివిశ్రుతః ||

13

తత్ర గత్వాశ్రమపదం కృత్వా సౌమిత్రిణా సహ |
రంస్యసే త్వం పితుర్వాక్యం యథోక్తమనుపాలయన్ ||

14

కాలోఽయం గతభూయిష్ఠో యః కాలస్తవ రాఘవ |
సమయో యో నరేంద్రేణ కృతో దశరథేన తే ||

15

తీర్ణప్రతిజ్ఞః కాకుత్స్థ సుఖం రాజ్యే నివత్స్యసి |
ధన్యస్తే జనకో రామ స రాజా రఘునందన ||

16

యస్త్వయా జ్యేష్ఠపుత్రేణ యయాతిరివ తారితః |
విదితో హ్యేష వృత్తాంతో మమ సర్వస్తవానఘ ||

17

తపసశ్చ ప్రభావేన స్నేహాద్దశరథస్య చ |
హృదయస్థశ్చ తే ఛందో విజ్ఞాతస్తపసా మయా ||

18

ఇహ వాసం ప్రతిజ్ఞాయ మయా సహ తపోవనే |
వసంతం త్వాం జనాః సర్వే జ్ఞాస్యంతి రఘునందన ||

19

అతశ్చ త్వామహం బ్రూమి గచ్ఛ పంచవటీమితి |
స హి రమ్యో వనోద్దేశో మైథిలీ తత్ర రంస్యతే ||

20

స దేశః శ్లాఘనీయశ్చ నాతిదూరే చ రాఘవ |
గోదావర్యాః సమీపే చ మైథిలీ తత్ర రంస్యతే ||

21

ప్రాజ్యమూలఫలశ్చైవ నానాద్విజగణాయుతః |
వివిక్తశ్చ మహాబాహో పుణ్యో రమ్యస్తథైవ చ ||

22

భవానపి సదారశ్చ శక్తశ్చ పరిరక్షణే |
అపి చాత్ర వసన్రామ తాపసాన్పాలయిష్యసి ||

23

ఏతదాలక్ష్యతే వీర మధూకానాం మహద్వనమ్ |
ఉత్తరేణాస్య గంతవ్యం న్యగ్రోధమభిగచ్ఛతా ||

24

తతః స్థలముపారుహ్య పర్వతస్యావిదూరతః |
ఖ్యాతః పంచవటీత్యేవ నిత్యపుష్పితకాననః ||

25

అగస్త్యేనైవముక్తస్తు రామః సౌమిత్రిణా సహ |
సత్కృత్యామంత్రయామాస తమృషిం సత్యవాదినమ్ ||

26

తౌ తు తేనాభ్యనుజ్ఞాతౌ కృతపాదాభివందనౌ |
తదాశ్రమాత్పంచవటీం జగ్మతుః సహ సీతయా ||

27

గృహీతచాపౌ తు నరాధిపాత్మజౌ
విషక్తతూణౌ సమరేష్వకాతరౌ |
యథోపదిష్టేన పథా మహర్షిణా
ప్రజగ్మతుః పంచవటీం సమాహితౌ ||

28

అగస్యుడు రామునికి ఆయుధములను ఇచ్చిన తరువాత ఇలా అన్నాడు.

“ఓ రామా! మీరు నన్ను చూడటానికి ఇంత దూరము వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. మీరు చాలా దూరము ప్రయాణము చేసి వచ్చారు. సుకుమారి అయిన సీత బాగా అలసి పోయినట్టు కనపడుతూ ఉంది. తండ్రి ఆదేశము ప్రకారము వనములకు వచ్చిన నీతో పాటు అనుసరించి వచ్చిన నీభార్య సీత ఇప్పటికి ఎవ్వరూ చేయని మహత్తరమైన పని చేసింది. కాబట్టి ఆమె కష్టపడకుండా చూడవలసిన బాధ్యత నీది.

సాధారణంగా స్త్రీలు సుఖములలో భర్తను వదలకుండా అంటిపెట్టుకొని ఉంటారు. కష్టకాలములో భర్తను వదిలివేస్తారు. ఈ సృష్టి మొదలైనప్పటి నుండి అది స్త్రీ నైజము. ఇంకా స్త్రీల గురించి చెప్పాలంటే వారు మెరుపుల మాదిరి చంచల స్వభావులు. వాడియైన కత్తి మాదిరి చాలా తీక్షణంగా ఉంటారు. గరుడుని మాదిరి వేగంగా ఆలోచిస్తారు.

కానీ నీ భార్య సీతలో ఈ దోషములు ఏవీ లేవు. సీత శాంత స్వభావురాలు. ఉత్తమ పతివ్రత. అందుకే నిన్ను అనుసరించి అడవులకు వచ్చి నీతోపాటు కష్టములు పడుతూ ఉంది. ఓ రామా! నీవు, సీత, లక్ష్మణుడు ఎక్కడ ఉంటారో అక్కడ సుఖశాంతులు వెల్లివిరుస్తాయి.” అని వారిని శ్లాఘించాడు అగస్త్యుడు.

అగస్యుడు పలికిన మాటలు విన్న రాముడు వినయంగా ఇలా అన్నాడు. “నా గురించి, నా భార్య గురించి, నా తమ్ముని గురించి తమరు నాలుగు మంచి మాటలు చెప్పినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. మీ అనుగ్రహానికి పాత్రుడను అయ్యాను. నేను ఈ అడవిలో ఒక పర్ణశాల నిర్మించుకొని అక్కడ నా వనవాస కాలమును గడపదలచుకున్నాను. దానికి అనువైన ప్రదేశమును మీరు సూచించండి.” అని అడిగాడు రాముడు.

“రామా! ఇక్కడికి రెండు యోజనముల దూరంలో పంచవటి అనే ప్రదేశము ఉంది. అక్కడ ఫలములు, కందమూలములు, నిర్మలమైన జలము సమృద్ధిగా లభిస్తుంది. నీవు పంచవటిలో ఒక ఆశ్రమమును నిర్మించుకొని అక్కడ నీ వనవాసకాలమును గడపవచ్చును. నీకు ఇప్పటికే వనవాసకాలము చాలావరకు గడిచిపోయింది. కొద్దికాలము మాత్రమే మిగిలి ఉంది. ఆ కొద్ది కాలము కూడా పూర్తి చేసి, నీవు నీ తండ్రిమాట నిలబెట్టు. ఆయనను తరింపజెయ్యి.

అసలు నిన్ను ఇక్కడే ఉందామనుకున్నాను. కాని ఒంటరిగా ఉండాలి అన్న నీ మనసులో మాట తెలుసుకొని నిన్ను పంచవటికి పంపుతున్నాను. పంచవటి ఇక్కడకు ఎంతో దూరంలో లేదు. కాబట్టి నీవు ఇక్కడ ఉన్నట్టే పంచవటిలో ఉండవచ్చును. పంచవటి సమీపములో గోదావరీ నది ప్రవహిస్తూ ఉంది. అక్కడ జనసంచారము అంతగా ఉండదు. నీవు ప్రశాంతముగా అక్కడ ఉండవచ్చును.

అటు చూడు. అక్కడ ఒక మధూక చెట్ల వనము కనపడుతూ ఉంది. ఆ మధూక వనమునకు ఉత్తరంగా వెళ్లండి. మీరు ఒక ఎత్తు అయిన ప్రదేశము చేరుకుంటారు. అక్కడి నుండి చూస్తే మీకు పంచవటి కనిపిస్తూ ఉంటుంది.” అని పంచవటికి పోవు మార్గము చెప్పాడు అగస్త్యుడు.

రామలక్ష్మణులు, సీత అగస్త్యునికి నమస్కరించి ఆయన వద్ద అనుజ్ఞ తీసుకున్నారు. అక్కడి నుండి పంచవటికి బయలుదేరారు.

శ్రీమద్రామాయణము
అరణ్యకాండము పదమూడవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్

అరణ్యకాండ చతుర్దశః సర్గః (14) >>

Leave a Comment