Aranya Kanda Sarga 19 In Telugu – అరణ్యకాండ ఏకోనవింశః సర్గః

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. “అరణ్యకాండ” ఏకోనవింశః సర్గలో, శూర్పణఖ తన బాధాకరమైన కథను తన సోదరుడు ఖరకు ముఖ్యంగా సీతను నేరం చేస్తూ వివరిస్తుంది. సీత రక్తాన్ని తాగడానికి ఖరా యుద్ధం చేయాలని ఆమె కోరుకుంటుంది. ఖర తన సోదరిని శాంతింపజేయడానికి పద్నాలుగు రాక్షసులను రాముని అంతమొందించడానికి పంపుతాడు.

ఖరక్రోధః

తాం తథా పతితాం దృష్ట్వా విరూపాం శోణితోక్షితామ్ |
భగినీం క్రోధసంతప్తః ఖరః పప్రచ్ఛ రాక్షసః ||

1

ఉత్తిష్ఠ తావదాఖ్యాహి ప్రమోహం జహి సంభ్రమమ్ |
వ్యక్తమాఖ్యాహి కేన త్వమేవంరూపా విరూపితా ||

2

కః కృష్ణసర్పమాసీనమాశీవిషమనాగసమ్ |
తుదత్యభిసమాపన్నమంగుళ్యగ్రేణ లీలయా ||

3

కః కాలపాశమాసజ్య కంఠే మోహాన్న బుధ్యతే |
యస్త్వామద్య సమాసాద్య పీతవాన్ విషముత్తమమ్ ||

4

బలవిక్రమసంపన్నా కామగా కామరూపిణీ |
ఇమామవస్థాం నీతా త్వం కేనాంతకసమా గతా ||

5

దేవగంధర్వభూతానామృషీణాం చ మహాత్మనామ్ |
కోఽయమేవం విరూపాం త్వాం మహావీర్యశ్చకార హ ||

6

న హి పశ్యామ్యహం లోకే యః కుర్యాన్మమ విప్రియమ్ |
అంతరేణ సహస్రాక్షం మహేంద్రం పాకశాసనమ్ ||

7

అద్యాహం మార్గణైః ప్రాణానాదాస్యే జీవితాంతకైః |
సలిలే క్షీరమాసక్తం నిష్పిబన్నివ సారసః ||

8

నిహతస్య మయా సంఖ్యే శరసంకృత్తమర్మణః |
సఫేనం రుధిరం రక్తం మేదినీ కస్య పాస్యతి ||

9

కస్య పత్రరథాః కాయాన్మాంసముత్కృత్య సంగతాః |
ప్రహృష్టా భక్షయిష్యంతి నిహతస్య మయా రణే ||

10

తం న దేవా న గంధర్వా న పిశాచా న రాక్షసాః |
మయాపకృష్టం కృపణం శక్తాస్త్రాతుమిహాహవే ||

11

ఉపలభ్య శనైః సంజ్ఞాం తం మే శంసితుమర్హసి |
యేన త్వం దుర్వినీతేన వనే విక్రమ్య నిర్జితా ||

12

ఇతి భ్రాతుర్వచః శ్రుత్వా క్రుద్ధస్య చ విశేషతః |
తతః శూర్పణఖా వాక్యం సబాష్పమిదమబ్రవీత్ ||

13

తరుణౌ రూపసంపన్నౌ సుకూమారౌ మహాబలౌ |
పుండరీకవిశాలాక్షౌ చీరకృష్ణాజినాంబరౌ ||

14

ఫలమూలాశనౌ దాంతౌ తాపసౌ ధర్మచారిణౌ |
పుత్రౌ దశరథస్యాస్తాం భ్రాతరౌ రామలక్ష్మణౌ ||

15

గంధర్వరాజప్రతిమౌ పార్థివవ్యంజనాన్వితౌ |
దేవౌ వా మానుషౌ వా తౌ న తర్కయితుముత్సహే ||

16

తరుణీ రూపసంపన్నా సర్వాభరణభూషితా |
దృష్టా తత్ర మయా నారీ తయోర్మధ్యే సుమధ్యమా ||

17

తాభ్యాముభాభ్యాం సంభూయ ప్రమదామధికృత్య తామ్ |
ఇమామవస్థాం నీతాహం యథానాథాసతీ తథా ||

18

తస్యాశ్చానృజువృత్తాయాస్తయోశ్చ హతయోరహమ్ |
సఫేనం పాతుమిచ్ఛామి రుధిరం రణమూర్ధని ||

19

ఏష మే ప్రథమః కామః కృతస్తాత త్వయా భవేత్ |
తస్యాస్తయోశ్చ రుధిరం పిబేయమహమాహవే ||

20

ఇతి తస్యాం బ్రువాణాయాం చతుర్దశ మహాబలాన్ |
వ్యాదిదేశ ఖరః క్రుద్ధో రాక్షసానంతకోపమాన్ ||

21

మానుషౌ శస్త్రసంపన్నౌ చీరకృష్ణాజినాంబరౌ |
ప్రవిష్టౌ దండకారణ్యం ఘోరం ప్రమదయా సహ ||

22

తౌ హత్వా తాం చ దుర్వృత్తామపావర్తితుమర్హథ |
ఇయం చ రుధిరం తేషాం భగినీ మమ పాస్యతి ||

23

మనోరథోఽయమిష్టోఽస్యా భగిన్యా మమ రాక్షసాః |
శీఘ్రం సంపాద్యతాం తౌ చ ప్రమథ్య స్వేన తేజసా ||

24

యుష్మాభిర్నిర్హతౌ దృష్ట్వా తావుభౌ భ్రాతరౌ రణే |
ఇయం ప్రహృష్టా ముదితా రుధిరం యుధి పాస్యతి ||

25

ఇతి ప్రతిసమాదిష్టా రాక్షసాస్తే చతుర్దశ |
తత్ర జగ్ముస్తయా సార్ధం ఘనా వాతేరితా యథా ||

26

తతస్తు తే తం సముదగ్రతేజసం
తథాపి తీక్ష్ణప్రదరా నిశాచరాః |
న శేకురేనం సహసా ప్రమర్దితుం
వనద్విపా దీప్తమివాగ్నిముత్థితమ్ ||

27

Aranya Kanda Sarga 19 In Telugu Pdf Download

ముక్కులలో నుండి చెవుల నుండి రక్తం కారుతూ తన ముందు నేల మీద పడి రోదిస్తూ ఉన్న చెల్లెలు శూర్పణఖను చూచాడు. ఖరుడు. ఆమెను రెండుచేతులతో లేవనెత్తాడు.

“చెల్లెలా శూర్పణఖా! ఏమిటీ ఘోరము. ఎవరు చేసారీ పని? నీవు ఎవరో తెలిసే ఈ పని చేసాడా! వాడు తాచు పాముతో ఆడుకుంటున్నాడు అని మరిచిపోయినట్టున్నాడు. వాడికి మూడింది. వాడికి కాలపాశం మెడకు చుట్టుకోబట్టే ఇలాంటి పని చేసాడు. ఎవడు వాడు! ఎక్కడ ఉంటాడు! ఉన్నది ఉన్నట్టు చెప్పు.

అయినా నీవు సహజంగా బలవంతురాలివి కదా! పైగా కామరూపివి. నిన్ను చూస్తే యముడిని చూచినట్టే కదా! అలాంటి నీకు ఈ గతి పట్టించిన వాడు ఎవడు? వాడు దేవతా! గంధర్వుడా! భూతమా! లేక ఎవరన్నా పరాక్రమ వంతుడైన ఋషిపుంగవుడా! ఎందుకంటే సాక్షాత్తు దేవేంద్రుడు కూడా నాకు అపకారం చెయ్యడానికి వెనుకాడుతాడు. అటువంటిది నీవు నా చెల్లెలు అని తెలిసికూడా నీకు అవమానం చేసాడంటే వాడికి ఆయువు మూడింది.

ఇప్పుడే నేను వాడిని సంహరించి నీకు జరిగిన అవమానము నకు ప్రతీకారము చేస్తాను. వాడి శరీరమును కాకులు, గ్రద్దలు తింటాయి. దేవతలు గానీ, గంధర్వులు కానీ, రాక్షసులు గానీ, పిశాచములు గానీ ఎవరు అడ్డం వచ్చినా సరే వాడిని చంపకుండా విడువను. చెల్లెలా! చెప్పు. నీ భయందోళనలనుండి తేరుకొని అన్నీ వివరంగా చెప్పు.” అని అడిగాడు ఖరుడు.

శూర్పణఖ కళ్లనుండి నీళ్లు కారుతున్నాయి. కళ్లు తుడుచుకుంటూ ఖరునితో ఇలా చెప్పింది. “ఎవరో అయోధ్యను పరిపాలించే దశరథమహారాజు కుమారులట. పేరు రాముడు, లక్ష్మణుడు. వారు సుకుమారులు. సుందరాకారులు. కాని మంచి బలంగా ఉన్నారు. మునివేషములో ఉన్నా చేతిలో ధనుర్బాణాలు ఉన్నాయి. వారి ముఖంలో రాజసం తొణికిసలాడుతూ ఉంది. వారు దేవతలో మనుష్యులో చెప్పలేను. వారి పక్కనే ఒక సౌందర్యవతి అయిన స్త్రీ ఉంది. ఆ స్త్రీమూలంగానే నాకు ఈ అవమానము జరిగింది. నువ్వు వెళ్లి ఆ స్త్రీని, ఆ ఇద్దరు యువకులనుచంపి వారి రక్తముతో నా దాహము తీర్చు. అప్పటి దాకా నా పగ చల్లారదు.” అని రోషంతో పలికింది శూర్పణఖ.

ఆమె మాటలకు రగిలిపోయాడు ఖరుడు. వెంటనే తన వద్ద ఉన్న అత్యధిక బలసంపన్నులైన 14 మంది రాక్షస వీరులను పిలిపించాడు. (ఇక్కడ గమనించండి. రామాయణంలో ఈ 14 అంకె విశిష్టమైనది. రాముని వనవాసము 14 సంవత్సరములు. ఖరుడు పంపిన వారు 14 మంది. ఇంకా ఈ 14 సంఖ్య వస్తూనే ఉంటుంది. భారతంలో 18 అంకె ఉన్నట్టు రామాయణంలో 14 అంకెకు ప్రాధాన్యత ఉన్నట్టు ఉంది.).

“ఓ రాక్షసవీరులారా! ముని వేషములో ఉన్న ఇద్దరు క్షత్రియ కుమారులు, ఒక స్త్రీ దండకారణ్యములో ప్రవేశించారట. మీరు వెళ్లి ఆ ముని కుమారులను, ఆ స్త్రీని చంపండి. వారి రక్తము నా సోదరి శూర్పణఖ తాగవలెనని కోరుతూ ఉంది. వెళ్లండి. వాళ్లను చంపి వారి రక్తమును పట్టి తీసుకురండి.” అని ఆజ్ఞాపించాడు ఖరుడు.

ఆ 14 మంది రాక్షసవీరులూ శూర్పణఖను తీసుకొని రామలక్ష్మణులను వెతుక్కుంటూ వెళ్లారు.

శ్రీమద్రామాయణము
అరణ్యకాండము పంతొమ్మిదవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్.

అరణ్యకాండ వింశః సర్గః (20) >>

Leave a Comment