మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. అరణ్యకాండ – చతుర్వింశః సర్గలో, రాముడు సీతతో పాటు లక్ష్మణుడితో దండకారణ్యంలో ప్రవేశిస్తాడు. ఈ సమయంలో ఆయన రాక్షసులపై శత్రుత్వాన్ని కలిగి ఉంటాడు. రాక్షసులు రాముని శక్తిని పరీక్షించేందుకు అనేక మార్గాల్లో అతనిపై దాడి చేస్తారు. రాముడు ధైర్యంగా వారిని ఎదుర్కొంటాడు.
రామఖరబలసంనికర్షః
ఆశ్రమం ప్రతియాతే తు ఖరే ఖరపరాక్రమే |
తానేవోత్పాతికాన్ రామః సహ భ్రాత్రా దదర్శ హ ||
1
తానుత్పాతాన్ మహాఘోరానుత్థితాన్ రోమహర్షణాన్ |
ప్రజానామహితాన్ దృష్ట్వా వాక్యం లక్ష్మణమబ్రవీత్ ||
2
ఇమాన్ పశ్య మహాబాహో సర్వభూతాపహారిణః |
సముత్థితాన్ మహోత్పాతాన్ సంహర్తుం సర్వరాక్షసాన్ ||
3
అమీ రుధిరధారాస్తు విసృజంతః ఖరస్వనాన్ |
వ్యోమ్ని మేఘా వివర్తంతే పరుషా గర్దభారుణాః ||
4
సధూమాశ్చ శరాః సర్వే మమ రుద్ధాభినందితాః |
రుక్మపృష్ఠాని చాపాని వివేష్టంతే చ లక్ష్మణ ||
5
యాదృశా ఇహ కూజంతి పక్షిణో వనచారిణః |
అగ్రతో నో భయం ప్రాప్తం సంశయో జీవితస్య చ ||
6
సంప్రహారస్తు సుమహాన్ భవిష్యతి న సంశయః |
అయమాఖ్యాతి మే బాహుః స్ఫురమాణో ముహుర్ముహుః ||
7
సన్నికర్షే తు నః శూర జయం శత్రోః పరాజయమ్ |
సప్రభం చ ప్రసన్నం చ తవ వక్త్రం హి లక్ష్యతే ||
8
ఉద్యతానాం హి యుద్ధార్థం యేషాం భవతి లక్ష్మణ |
నిష్ప్రభం వదనం తేషాం భవత్యాయుఃపరిక్షయః ||
9
రక్షసాం నర్దతాం ఘోరః శ్రూయతే చ మహాధ్వనిః |
ఆహతానాం చ భేరీణాం రాక్షసైః క్రూరకర్మభిః ||
10
అనాగతవిధానం తు కర్తవ్యం శుభమిచ్ఛతా |
ఆపదం శంకమానేన పురుషేణ విపశ్చితా ||
11
తస్మాద్గృహీత్వా వైదేహీం శరపాణిర్ధనుర్ధరః |
గుహామాశ్రయ శైలస్య దుర్గాం పాదపసంకులామ్ ||
12
ప్రతికూలితుమిచ్ఛామి న హి వాక్యమిదం త్వయా |
శాపితో మమ పాదాభ్యాం గమ్యతాం వత్స మా చిరమ్ ||
13
త్వం హి శూరశ్చ బలవాన్హన్యా హ్యేతాన్న సంశయః |
స్వయం తు హంతుమిచ్ఛామి సర్వానేవ నిశాచరాన్ ||
14
ఏవముక్తస్తు రామేణ లక్ష్మణః సహ సీతయా |
శరానాదాయ చాపం చ గుహాం దుర్గాం సమాశ్రయత్ ||
15
తస్మిన్ప్రవిష్టే తు గుహాం లక్ష్మణే సహ సీతయా |
హంత నిర్యుక్తమిత్యుక్త్వా రామః కవచమావిశత్ ||
16
స తేనాగ్నినికాశేన కవచేన విభూషితః |
బభూవ రామస్తిమిరే విధూమోఽగ్నిరివోత్థితః ||
17
స చాపముద్యమ్య మహచ్ఛరానాదాయ వీర్యవాన్ |
బభూవావస్థితస్తత్ర జ్యాస్వనైః పూరయన్ దిశః ||
18
తతో దేవాః సగంధర్వాః సిద్ధాశ్చ సహ చారణైః |
సమేయుశ్చ మహాత్మానో యుద్ధదర్శనకాంక్షిణః ||
19
ఋషయశ్చ మహాత్మానో లోకే బ్రహ్మర్షిసత్తమాః |
సమేత్య చోచుః సహితా అన్యోన్యం పుణ్యకర్మణః ||
20
స్వస్తి గోబ్రాహ్మణేభ్యోఽస్తు లోకానాం యేఽభిసంగతాః |
జయతాం రాఘవో యుద్ధే పౌలస్త్యాన్రజనీచరాన్ ||
21
చక్రహస్తో యథా యుద్ధే సర్వానసురపుంగవాన్ |
ఏవముక్త్వా పునః ప్రోచురాలోక్య చ పరస్పరమ్ ||
22
చతుర్దశ సహస్రాణి రక్షసాం భీమకర్మణామ్ |
ఏకశ్చ రామో ధర్మాత్మా కథం యుద్ధం భవిష్యతి ||
23
ఇతి రాజర్షయః సిద్ధాః సగణాశ్చ ద్విజర్షభాః |
జాతకౌతూహలాస్తస్థుర్విమానస్థాశ్చ దేవతాః ||
24
ఆవిష్టం తేజసా రామం సంగ్రామశిరసి స్థితమ్ |
దృష్ట్వా సర్వాణి భూతాని భయాద్వివ్యథిరే తదా ||
25
రూపమప్రతిమం తస్య రామస్యాక్లిష్టకర్మణః |
బభూవ రూపం క్రుద్ధస్య రుద్రస్యేవ పినాకినః ||
26
ఇతి సంభాష్యమాణే తు దేవగంధర్వచారణైః |
తతో గంభీరనిర్హ్రాదం ఘోరవర్మాయుధధ్వజమ్ ||
27
అనీకం యాతుధానానాం సమంతాత్ప్రత్యదృశ్యత |
సింహనాదం విసృజతామన్యోన్యమభిగర్జతామ్ ||
28
చాపాని విస్ఫారయతాం జృంభతాం చాప్యభీక్ష్ణశః |
విప్రఘుష్టస్వనానాం చ దుందుభీశ్చాపి నిఘ్నతామ్ ||
29
తేషాం సుతుములః శబ్దః పూరయామాస తద్వనమ్ |
తేన శబ్దేన విత్రస్తాః శ్వాపదా వనచారిణః ||
30
దుద్రువుర్యత్ర నిఃశబ్దం పృష్ఠతో న వ్యలోకయన్ |
తత్త్వనీకం మహావేగం రామం సముపసర్పత ||
31
ఘృతనానాప్రహరణం గంభీరం సాగరోపమమ్ |
రామోఽపి చారయంశ్చక్షుః సర్వతో రణపండితః ||
32
దదర్శ ఖరసైన్యం తద్యుద్ధాభిముఖముత్థితమ్ |
వితత్య చ ధనుర్భీమం తూణ్యోశ్చోద్ధృత్య సాయకాన్ ||
33
క్రోధమాహారయత్తీవ్రం వధార్థం సర్వరక్షసామ్ |
దుష్ప్రేక్షః సోఽభవత్క్రుద్ధో యుగాంతాగ్నిరివ జ్వలన్ ||
34
తం దృష్ట్వా తేజసాఽఽవిష్టం ప్రాద్రవన్వదేవతాః |
తస్య క్రుద్ధస్య రూపం తు రామస్య దదృశే తదా |
దక్షస్యేవ క్రతుం హంతుముద్యతస్య పినాకినః ||
35
[* ఆవిష్టం తేజసా రామం సంగ్రామశిరసి స్థితమ్ |
దృష్ట్వా సర్వాణి భూతాని భయార్తాని ప్రదుద్రువుః || *]
తత్కార్ముకైరాభరణైర్ధ్వజైశ్చ
తైర్వర్మభిశ్చాగ్నిసమానవర్ణైః |
బభూవ సైన్యం పిశితాశనానాం
సూర్యోదయే నీలమివాభ్రవృందమ్ ||
36
ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే అరణ్యకాండే చతుర్వింశః సర్గః ||
Aranya Kanda Sarga 24 Meaning In Telugu
జనస్థానములో ఖరుడికి కనపడ్డ దుశ్శకునములు అన్నీ పంచవటిలో ఉన్న రామలక్ష్మణులకు కూడా కనపడ్డాయి. వాటిని చూచిన రాముడు లక్షణునితో ఇలా అన్నాడు.
“లక్ష్మణా! ఆకాశంలో కనపడే దుశ్శకునములను చూచావు కదా! ఇవన్నీ రాక్షస సంహారాన్ని సూచిస్తున్నాయి. ఇటువంటి శకునములు ఒక మహాయుద్ధమునకు ముందుకనపడతాయి. అరణ్యములో మృగములు అరిచే అరుపులు వింటుంటే మనకు కూడా అపాయము కలుగుతుంది అని అనిపిస్తూ ఉంది. ప్రాణాపాయము కూడా కలగ వచ్చు. కాబట్టి ఇక్కడ ఒక మహాయుద్ధము జరగబోతోంది అనుటలో సందేహము లేదు.
లక్ష్మణా! జాగ్రత్తగా విను. రాక్షసుల అరుపులు, భేరీనినాదములు వినిపిస్తున్నాయి. రాక్షసులు మనమీదికి యుద్ధానికి వస్తున్నారు. కాబట్టి మనము జరగబోయే దానికి దుఃఖిస్తూ కూర్చోకుండా తగిన తీసుకోవాలి. కాబట్టి నేను చెప్పినట్టు చెయ్యి. నీవు ధనుర్బాణములు ధరించి, సీతను తీసుకొని, చెట్లతోనూ, పొదలతోనూ కప్పబడి ఉన్న ఆ గుహలో ప్రవేశించు. నా మాటకు అడ్డు చెప్పవద్దు.
“నేనే రాక్షసులను చంపుతాను.” అనే మాటలు చెప్పవద్దు. మనకు సీత క్షేమము ముఖ్యము. నీవు సీతకు రక్షణగా ఉండు. నేను రాక్షసులను చంపుతాను. అంటే నీవు రాక్షసులను చంపలేవని కాదు. నీవు వీరాధివీరుడవు, శూరుడవు. నీవు ఒక్కడివే అందరు రాక్షసులను మట్టుపెట్టగలవు. కానీ నేను ఒక్కడినే రాక్షస సంహారము చేయవలెనని కోరికగా ఉంది. అందుకనీ నీవు సీతను తీసుకొని వెళ్లు.” అని అన్నాడు రాముడు.
రాముని మాటను మీరలేక, లక్ష్మణుడు, సీతను తీసుకొని గుహలోకి ప్రవేశించాడు. రాముడు కవచమును ధరించాడు. ధనుర్బాణములు తీసుకున్నాడు. ధనుష్టంకారము చేసాడు. రాముడు మొదటిసారిగా రాక్షసులతో యుద్ధ చేయబోతున్నాడు. అందుకని ఆకాశంలో దేవతలు, గంధర్వులు, సిద్ధులు, చారణులు అందరూ సమావేశమయ్యారు.
“రాముడు ఒక్కడు. రాక్షస సేనలు 14,000. ఎలా యుద్ధం చేస్తాడు.” అని ఒకరితో ఒకరు అనుకుంటున్నారు. వాళ్ల కళ్లకు రాముడు ప్రళయ కాల రుద్రుడిలా కనపడుతున్నాడు.
ఇంతలో రాక్షస సైన్యము అక్కడకు చేరుకుంది. నాలుగు పక్కల నుండి రాక్షసులు రాముని చుట్టుముట్టారు. పెద్దగా కేకలుపెడుతున్నారు. కొందరు ధనుస్సులను ఠంగు ఠంగున మోగిస్తున్నారు. యుద్ధభేరీలు మోగుతున్నాయి. ఆ భయంకర ధ్వనులకు అడవిలో ఉన్న క్రూరమృగములు సైతము పారిపోయాయి. రాక్షస సైన్యము నలుదిక్కుల నుండి రాముని దగ్గర దగ్గరగా వస్తూ ఉంది.
రాముడు చుట్టూ చూచాడు. తనను చుట్టుముట్టిన రాక్షసులను పరికించి చూచాడు. అమ్ములపొదిలోనుండి బాణములను తీసాడు. రాక్షసులు మీదికి సంధించాడు. రాక్షస సంహారం కోసరము తీవ్రమైన కోపమును తెచ్చుకున్నాడు.
(ఈవిషయము మనకు బాల కాండలో రాముని గుణగణముల గురించి చెప్పేటప్పుడు చదువుకున్నాము. రాముడు శాంతస్వభావుడు. కోపం అనేది తెలియదు. కాని అవసరమైనప్పుడు కోపాన్ని తెచ్చుకుంటాడు. అవసరం తీరిపోగానే కోపాన్ని వదిలేస్తాడు. మరలా శాంత మూర్తి అవుతాడు. అందుకే రాముడు దేవుడు అయ్యాడు. కాని మనం చీటికి మాటికీ కోపం తెచ్చుకుంటాము. అన్ని అనర్థాలను తలకు చుట్టుకుంటాము. కష్టనష్టాలను అనుభవిస్తాము. అన్ని కష్టాలు నాకే పెట్టావా భగవంతుడా అని దేవుడిని తిడతాము. అందుకే మనం మానవులం అయ్యాము.)
రాముని కోపం ఆవహించింది. రాక్షసుల మీద కోపంతో ఊగిపోయాడు రాముడు. దక్షయజ్ఞంలో విజృంభించిన రుద్రునిలా ప్రకాశించాడు రాముడు. రాక్షస సైన్యము ఆయుధములతో రాముని చుట్టుముట్టింది..
శ్రీమద్రామాయణము
అరణ్యకాండము ఇరువది నాల్గవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్