Aranya Kanda Sarga 31 In Telugu – అరణ్యకాండ ఏకత్రింశః సర్గః

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. “అరణ్యకాండ” వింశః సర్గలో, అకంపన అనే రావణుడి గూఢచారి రాముడు జనస్థానాన్ని నాశనం చేసిన వార్తను తెలియజేయడానికి అతని వద్దకు పరుగెత్తాడు. సీతను అపహరించమని రావణుడిని సూచిస్తాడు. ఎందుకంటే సీతని విడిచిపెట్టడం వల్ల రాముడికి శోకం కలుగుతుంది మరియు తద్వారా అతను మరణిస్తాడు. కొంతసేపు ఆలోచిస్తూ, సీతను అపహరించడంలో సహాయం కోరుతూ మరీచ వద్దకు రావణుడు వెళ్తాడు. మారీచా రాముడి సామర్థ్యాలను వివరిస్తూ, విష్ణువు యొక్క అవతారాలను గుర్తుచేస్తాడు మరియు రావణుడికి ఉన్నదానితో సంతృప్తి చెందమని సలహా ఇస్తాడు.

రావణఖరవృత్తోపలంభః

త్వరమణస్తతో గత్వా జనస్థానాదకంపనః |
ప్రవిశ్య లంకాం వేగేన రావణం వాక్యమబ్రవీత్ ||

1

జనస్థానస్థితా రాజన్ రాక్షసా బహవో హతాః |
ఖరశ్చ నిహతః సంఖ్యే కథంచిదహమాగతః ||

2

ఏవముక్తో దశగ్రీవః క్రుద్ధః సంరక్తలోచనః |
అకంపనమువాచేదం నిర్దహన్నివ చక్షుషా ||

3

కేన రమ్యాం జనస్థానం హతం మమ పరాసునా |
కో హి సర్వేషు లోకేషు గతిం చాధిగమిష్యతి ||

4

న హి మే విప్రియం కృత్వా శక్యం మఘవతా సుఖమ్ |
ప్రాప్తుం వైశ్రవణేనాపి న యమేన న విష్ణునా ||

5

కాలస్య చాప్యహం కాలో దహేయమపి పావకమ్ |
మృత్యుం మరణధర్మేణ సంయోజయితుముత్సహే ||

6

దహేయమపి సంక్రుద్ధస్తేజసాఽఽదిత్యపావకౌ |
వాతస్య తరసా వేగం నిహంతుమహముత్సహే ||

7

తథా క్రుద్ధం దశగ్రీవం కృతాంజలిరకంపనః |
భయాత్ సందిగ్ధయా వాచా రావణం యాచతేఽభయమ్ ||

8

దశగ్రీవోఽభయం తస్మై ప్రదదౌ రక్షసాం వరః |
స విశ్రబ్ధోఽబ్రవీద్వాక్యమసందిగ్ధమకంపనః ||

9

పుత్రో దశరథస్యాస్తి సింహసంహననో యువా |
రామో నామ వృషస్కంధో వృత్తాయతమహాభుజః ||

10

వీరః పృథుయశాః శ్రీమానతుల్యబలవిక్రమః |
హతం తేన జనస్థానం ఖరశ్చ సహదూషణః ||

11

అకంపనవచః శ్రుత్వా రావణో రాక్షసాధిపః |
నాగేంద్ర ఇవ నిఃశ్వస్య వచనం చేదమబ్రవీత్ ||

12

స సురేంద్రేణ సంయుక్తో రామః సర్వామరైః సహ |
ఉపయాతో జనస్థానం బ్రూహి కచ్చిదకంపన ||

13

రావణస్య పునర్వాక్యం నిశమ్య తదకంపనః |
ఆచచక్షే బలం తస్య విక్రమం చ మహాత్మనః ||

14

రామో నామ మహాతేజాః శ్రేష్ఠః సర్వధనుష్మతామ్ |
దివ్యాస్త్రగుణసంపన్నః పురంధరసమో యుధి ||

15

తస్యానురూపో బలవాన్ రక్తాక్షో దుందుభిస్వనః |
కనీయాన్ లక్ష్మణో నామ భ్రాతా శశినిభాననః ||

16

స తేన సహ సంయుక్తః పావకేనానిలో యథా |
శ్రీమాన్రాజవరస్తేన జనస్థానం నిపాతితమ్ ||

17

నైవ దేవా మహత్మానో నాత్ర కార్యా విచారణా |
శరా రామేణ తూత్సృష్టా రుక్మపుంఖాః పతత్రిణః ||

18

సర్పాః పంచాననా భూత్వా భక్షయంతి స్మ రాక్షసాన్ |
యేన యేన చ గచ్ఛంతి రాక్షసా భయకర్శితాః ||

19

తేన తేన స్మ పశ్యంతి రామమేవాగ్రతః స్థితమ్ |
ఇత్థం వినాశితం తేన జనస్థానం తవానఘ ||

20

అకంపనవచః శ్రుత్వా రావణో వాక్యమబ్రవీత్ |
జనస్థానం గమిష్యామి హంతుం రామం సలక్ష్మణమ్ ||

21

అథైవముక్తే వచనే ప్రోవాచేదమకంపనః |
శ్రుణు రాజన్యథావృత్తం రామస్య బలపౌరుషమ్ ||

22

అసాధ్యః కుపితో రామో విక్రమేణ మహాయశాః |
ఆపగాయాః సుపూర్ణాయా వేగం పరిహరేచ్ఛరైః ||

23

సతారాగ్రహనక్షత్రం నభశ్చాప్యవసాదయేత్ |
అసౌ రామస్తు మజ్జంతీం శ్రీమానభ్యుద్ధరేన్మహీమ్ ||

24

భిత్త్వా వేలాం సముద్రస్య లోకానాప్లావయేద్విభుః |
వేగం వాఽపి సముద్రస్య వాయుం వా విధమేచ్ఛరైః ||

25

సంహృత్య వా పునర్లోకాన్ విక్రమేణ మహాయశాః |
శక్తః స పురుషవ్యాఘ్రః స్రష్టుం పునరపి ప్రజాః ||

26

న హి రామో దశగ్రీవ శక్యో జేతుం త్వయా యుధి |
రక్షసాం వాఽపి లోకేన స్వర్గః పాపజనైరివ ||

27

న తం వధ్యమహం మన్యే సర్వైర్దేవాసురైరపి |
అయం తస్య వధోపాయస్తం మమైకమనాః శృణు ||

28

భార్యా తస్యోత్తమా లోకే సీతా నామ సుమధ్యమా |
శ్యామా సమవిభక్తాంగీ స్త్రీరత్నం రత్నభూషితా ||

29

నైవ దేవీ న గంధర్వీ నాఽప్సరా నాఽపి దానవీ |
తుల్యా సీమంతినీ తస్యా మానుషీషు కుతో భవేత్ ||

30

తస్యాపహర భార్యాం త్వం ప్రమథ్య తు మహావనే |
సీతయా రహితః కామీ రామో హాస్యతి జీవితమ్ ||

31

అరోచయత తద్వాక్యం రావణో రాక్షసాధిపః |
చింతయిత్వా మహాబాహురకంపనమువాచ హ ||

32

బాఢం కాల్యం గమిష్యామి హ్యేకః సారథినా సహ |
ఆనయిష్యామి చ వైదేహీమిమాం హృష్టో మహాపురీమ్ ||

33

అథైవముక్త్వా ప్రయయౌ ఖరయుక్తేన రావణః |
రథేనాదిత్యవర్ణేన దిశః సర్వాః ప్రకాశయన్ ||

34

స రథో రాక్షసేంద్రస్య నక్షత్రపథగో మహాన్ |
సంచార్యమాణః శుశుభే జలదే చంద్రమా ఇవ ||

35

స మారీచాశ్రమం ప్రాప్య తాటకేయముపాగమత్ |
మారీచేనార్చితో రాజా భక్ష్యభోజ్యైరమానుషైః ||

36

తం స్వయం పూజయిత్వా తు ఆసనేనోదకేన చ |
అర్థోపహితయా వాచా మారీచో వాక్యమబ్రవీత్ ||

37

కచ్చిత్సుకుశలం రాజన్ లోకానాం రాక్షసేశ్వర |
ఆశంకే నాథ జానే త్వం యతస్తూర్ణమిహాగతః ||

38

ఏవముక్తో మహాతేజా మారీచేన స రావణః |
తతః పశ్చాదిదం వాక్యమబ్రవీద్వాక్యకోవిదః ||

39

ఆరక్షో మే హతస్తాత రామేణాక్లిష్టకర్మణా |
జనస్థానమవధ్యం తత్సర్వం యుధి నిపాతితమ్ ||

40

తస్య మే కురు సాచివ్యం తస్య భార్యాపహారణే |
రాక్షసేంద్రవచః శ్రుత్వా మారీచో వాక్యమబ్రవీత్ ||

41

ఆఖ్యాతా కేన సీతా సా మిత్రరూపేణ శత్రుణా |
త్వయా రాక్షసశార్దూల కో న నందతి నిందితః ||

42

సీతామిహానయస్వేతి కో బ్రవీతి బ్రవీహి మే |
రక్షోలోకస్య సర్వస్య కః శృంగం ఛేత్తుమిచ్ఛతి ||

43

ప్రోత్సాహయతి కశ్చిత్వాం స హి శత్రురసంశయః |
ఆశీవిషముఖాదంష్ట్రాముద్ధర్తుం చేచ్ఛతి త్వయా ||

44

కర్మణా తేన కేనాఽసి కాపథం ప్రతిపాదితః |
సుఖసుప్తస్య తే రాజన్ ప్రహృతం కేన మూర్ధని ||

45

విశుద్ధవంశాభిజనాగ్రహస్త-
-స్తేజోమదః సంస్థితదోర్విషాణః |
ఉదీక్షితుం రావణ నేహ యుక్తః
స సంయుగే రాఘవగంధహస్తీ ||

46

అసౌ రణాంతః స్థితిసంధివాలో
విదగ్ధరక్షోమృగహా నృసింహః |
సుప్తస్త్వయా బోధయితుం న యుక్తః
శరాంగపుర్ణో నిశితాసిదంష్ట్రః ||

47

చాపావహారే భుజవేగపంకే
శరోర్మిమాలే సుమహాహవౌఘే |
న రామపాతాలముఖేఽతిఘోరే
ప్రస్కందితుం రాక్షసరాజ యుక్తమ్ ||

48

ప్రసీద లంకేశ్వర రాక్షసేంద్ర
లంకాం ప్రసన్నో భవ సాధు గచ్ఛ |
త్వం స్వేషు దారేషు రమస్వ నిత్యమ్
రామః సభార్యో రమతాం వనేషు ||

49

ఏవముక్తో దశగ్రీవో మారీచేన స రావణః |
న్యవర్తత పురీం లంకాం వివేశ చ గృహోత్తమమ్ ||

50

Aranya Kanda Sarga 31 In Telugu Pdf Download

(ఈ సర్గ ప్రాచ్యప్రతిలో లేదు. ఇది ప్రక్షిప్తము అనగా తరువాత చేర్చబడినది అని పండితుల అభిప్రాయము)

ఖరుడు, దూషణుడు తమతమ సేనలతో సహా యుద్ధంలో మరణించారు అన్న వార్త జనస్థానంలో దావానలంలా పాకిపోయింది. వెంటను అకంపనుడు అనే రాక్షసుడు లంకానగరానికి బయలు దేరాడు. రావణుని కలుసుకున్నాడు.

“ఓ రావణా! నేను జనస్థానము నుండి వస్తున్నాను. అక్కడ మీ ప్రతినిధులుగా ఉన్న ఖరుడు, దూషణుడు, వారి సైన్యము పూర్తిగా యుద్ధంలో చంపబడ్డారు. నేను మాత్రము తప్పించుకొని ఈ వార్త తమకు చెబుదామని వచ్చాను.” అని జరిగింది క్లుప్తంగా వివరించాడు.

ఆ మాటలు విన్న దశగ్రీవుడు కోపంతో మండి పడ్డాడు. అకంపనుని చూచి ఇలా అన్నాడు.

“ఓ అకంపనా! ఇది నిజమా! నా అధీనంలో ఉన్న జనస్థానమును నాశనం చేసి, ఖరదూషణాదులను చంపిన వాడు ఎవరు? వాడికి ఆయువు మూడిందా! లేకపోతే ఇలా ఎందుకు చేస్తాడు. నాకు అపకారము చేసిన తరువాత దేవేంద్రుడైనా, కుబేరుడైనా, యముడైనా ఆఖరుకు విష్ణువైనా సుఖంగా బతకలేరు కదా!

ఇంక వీడెంత? వాడెవరో వాడికి నా సంగతి తెలియనట్టుంది. నేను యముడికి యముడను. అగ్నిని కూడా కాల్చివేయగల సమర్థుడను. మృత్యుదేవతకే మృత్యువును. నాకు కోపం వస్తే సూర్యుడిని, అగ్నిని కూడా దహించివేస్తాను. వాయువును కూడా శాసించగలను. అకంపనా! ఇంతకూ వాడెవడు? ఎక్కడ నుంచి వచ్చాడు. ఎక్కడ ఉంటాడు?” అని కోపంగా అడిగాడు రావణుడు.

ప్రళయాగ్నితో సమానమైన రావణుని కోపం చూచి అకంపనుడు భయంతో వణికిపోయాడు. “నన్ను తమరు చంపను అని అభయం ఇస్తే జరిగింది చెబుతాను” అని అన్నాడు గడగడా వణుకుతూ.

రావణుడు కొంచెం శాంతించాడు. “అలాగే అభయం ఇచ్చాను. ఏం జరిగిందో సవిస్తరంగా చెప్పు” అని అన్నాడు. అకంపనుడు ఇలా చెప్పసాగాడు.

“అయోధ్యానగరమును పరిపాలించు దశరథుని కుమారుడు రాముడు. యువకుడు. మహా పరాక్రమశాలి. ఆజానుబాహుడు. గొప్ప వీరుడు. అతడే ఒంటరిగా ఖరుని, దూషణుని, ససైన్యంగా సంహరించాడు.” అని మరలా క్లుప్తంగానే చెప్పాడు ఏం చెబితే ఏమవుతుందో అని భయంతో.

ఆ మాటలు విన్న రావణుడు ఒక్కసారి దీర్ఘంగా నిట్టూర్చాడు. రావణునిలో ఇదివరకు ఉన్న కోపం స్థానంలో ఆలోచన చోటు చేసుకుంది. “అకంపనా! రాముడు ఒంటరిగా జనస్థానమునకు వచ్చాడా లేక ఇంద్రుని, దేవతలను తోడుగా తీసుకొని వచ్చాడా?” అని అడిగాడు, రాముని వెనుక ఉన్న శక్తులు ఏమిటో తెలుసుకుందామనే ఆలోచనతో.

రావణుని కోపం తగ్గగానే అకంపనుడిలో ధైర్యం పుంజుకుంది. మరలా రాముడి గురించి చెప్పసాగాడు.

“ఆ రాముడు మహాతేజస్సు కలవాడు. సర్వశ్రేష్ఠధనుర్ధారి. దివ్యాస్త్ర సంపన్నుడు. ఇంతెందుకు దేవేంద్రునితో సమానమైన వాడు. ఆ రాముడి వెంట లక్ష్మణుడు అని అతని తమ్ముడు ఉన్నాడు. అన్నకంటే మించిన వాడు. మహా బలశాలి. రామ లక్ష్మణుల చేరికతో వాయువు తోడైనట్టే.

అటువంటి రాముడు ఒంటరిగానే జనస్థానమును సర్వనాశనం చేసాడు. అంతేగానీ తమరు అన్నట్టు దేవేంద్రుడు గానీ, దేవతలు గానీ జనస్థానమునకు రాలేదు. రాముడు ప్రయోగించిన బాణములు కాలసర్పముల వలె జనస్థానములో ఉన్న రాక్షసులను కబళించి వేసాయి.

ఓ రాక్షసరాజా! రాముడు ఒక్కడైనా ప్రతి రాక్షసుని ముందు ఒక్కోరాముడిలాగా ప్రత్యక్షం అయి వాళ్లను నాశనం చేసాడు. ” అని అన్నాడు అకంపనుడు.

అకంపనుని మాటలు సావధానంగా విన్నాడు రావణుడు. ఎవరిని పంపినా లాభం లేదు అనుకున్నాడు. తానే జనస్థానమునకు పోవాలి అని నిశ్చయించుకున్నాడు.

“అకంపనా! ఇంక నీవు వెళ్లవచ్చు. నేనుస్వయంగా జనస్థానమునకు వెళ్తాను.” అని అన్నాడు.

“రాక్షసరాజా! నా మనవి వినండి. రాముడు సామాన్యుడు కాడు. రాముని జయించడం మన వల్లకాదు. రాముడికి కోపం వస్తే వేగవంతమైన నదీప్రవాహాన్ని కూడా నిలువరించగల సమర్థుడు. రాముడు భూమ్యాకాశాలను ఏకం చేయగల వీరుడు. సప్తసముద్రము లను ఏకం చేసి ఈ భూమిని ముంచివేయగల పరాక్రమశాలి.

రాముడు ఈ లోకములనన్నిటినీ నాశనం చేసి మరలా సృష్టించగల మేటి. (సృష్టి, స్థితి, లయకారకుడు అని అర్థం. రాముడు భగవంతుడు అని అకంపనుడి అభిప్రాయం). ఓ రావణా! నీవుగానీ, నీ రాక్షస సైన్యము కానీ రాముని జయించడం కల్ల. నీవే కాదు. దేవాసురులు ఏకమై వచ్చినా రాముని యుద్ధంలో ఎదుర్కొనలేరు.

కాని రావణా! ఎటువంటి వాడికైనా ఒక బలహీనత ఉంటుంది కదా! ఆ మార్గంలో వెళితే రాముని చంపవచ్చు. ఆ రామునికి సీత అనే అతిలోకసౌందర్యవతి భార్య ఉంది. మంచి యౌవనవతి. దేవతా స్త్రీలుగానీ, అప్సరసలు కానీ అందంలో ఆమెకు సాటిరారు. సీత అంటే రాముడికి పంచప్రాణాలు. సీత లేకుండా రాముడు బతకలేడు. నీవు కనక సీతను అపహరించి తీసుకొని వస్తే, సీత మీద బెంగతో రాముడు ప్రాణాలు విడుస్తాడు. రాముని చంపడానికి ఇది ఒకటే మార్గము.” అని ఒక ఉపాయం చెప్పాడు అకంపనుడు.

రావణునికి ఈ మాటలు కర్ణపేయంగా వినపడ్డాయి. ఒక దెబ్బతో రెండు పిట్టలు. సీతను అపహరిస్తే అటు రాముడు చస్తాడు, ఇటు సీతా తనకు దక్కుతుంది. ఇలా వక్రంగా ఆలోచించాడు రావణుడు, అకంపనుని చూచి ఇలా అన్నాడు.
“అకంపనా! మంచి ఆలోచన చెప్పావు. నేను ఒక్కడినే రేపే జనస్థానమునకు వెళ్లి, సీతను నా రథము మీద కూర్చుండపెట్టుకొని లంకకు తీసుకొని వస్తాను.” అని అన్నాడు.

వెంటనే మంచి గాడిదలు కట్టిన రథమును సిద్ధం చేయమన్నాడు. గాడిదలు కట్టిన రథంలో రావణుడు ఆకాశమార్గంలో జనస్థానమునకు వెళ్లాడు. జనస్థానము దగ్గర ఉన్న రాముని వద్దకు వెళ్లే ముందు, రావణుడు మారీచుని వద్దకు వెళ్లాడు. రావణుని చూచి మారీచుడు అతనికి సకల ఉపచారములు చేసాడు. భక్ష్యములను, భోజన పదార్థములను సమర్పించాడు. రావణుడు భోజనం చేసి మారీచుడు చూపిన ఉచితాసనము మీద కూర్చున్నాడు. అప్పుడు మారీచుడు రావణునితో ఇలా అన్నాడు.

“రాక్షసరాజా! నీకు జయము కలుగు గాక! లంకలో అందరూ క్షేమమే కదా! ఎందుకంటే ఏ కార్యమైనా నీ కనుసైగతో పూర్తి చేయగల సమర్థుడవు, అటువంటిది నీవే స్వయంగా ఇక్కడకు వస్తే నాకు ఏదో సందేహముగా ఉంది. అందుకని అడిగాను. తమరు ఏదో తొందరపని మీద ఇక్కడకు వచ్చి ఉంటారు అని అనుకుంటాను.” అని అన్నాడు మారీచుడు, “ఏం పని మీద వచ్చారు” అని సూటిగా రావణుని అడక్కుండా.

మారీచుని మాటలు విన్న రావణునికి మారీచుని మనసులోని సందేహం అర్థం అయింది. అందుకని సూటిగానే చెప్పాడు.

“మారీచా! ఎవరో రాముడు అట. జనస్థానములో ఉన్న ఖరుడు, దూషణుడు, వారి 14,000 సైన్యమును ఒంటి చేత్తో తుదముట్టించాడట. ఎవరికీ తేరిపార చూడటానికి శక్యం కాని జనస్థానమును సర్వనాశనం చేసాడట. ఆ రాముని ఉపాయంతో చంపవలెనని అనుకుంటున్నాను. ఆ రామునికి తన భార్య సీత అంటే ప్రాణము. ఆ సీతను అపహరిస్తే, రాముడు ప్రాణాలు విడుస్తాడు. అందుకని రాముని భార్య సీతను అపహరించవలెనని అనుకుం టున్నాను. దానికీ నీ సాయం కావాలి.” అని సూటిగా అడిగాడు రావణుడు.

ఒక్కసారిగా ఉలిక్కి పడ్డాడు పడ్డాడు మారీచుడు. “రావణా! నీకు ఇటువంటి ఆలోచన చెప్పిన వాడు ఎవరు? రాముని భార్య సీతను అపహరించమని చెప్పిన ఆ దుర్మారుడు, దుష్టుడు ఎవరు? వాడు నీకు ఆప్తుడు కాదు. నీకు పరమశత్రువు. నీ నాశనం కోరి నీకు ఇటువంటి ఆలోచన కలిగించాడు. “సీతను అపహరించాలి” అనే ఆలోచనే నీ సర్వనాశనానికి దారితీస్తుంది. నీకు ఈ ఆలోచన చెప్పివాడు ఎవరో కానీ, నిన్ను తప్పుదోవ పట్టించాడు. వాడు నీకు శత్రువు కాకపోతే నీకు కాలసర్పము నోటిలో కోరలు పీకమని చెబుతాడా?

రావణా! నేను చెబుతున్నాను విను. రాముడు ఒక మదగజము. దాని కాళ్ల కిందపడి నలిగిపోతావు. రాముడు ఒక సింహము. ఆ సింహము జూలుపట్టి లాగకు. లేడిపిల్ల మాదిరి దాని కోరలకు బలి అయిపోతావు. రాముడు ఒక సుడిగుండము. అనవసరంగా ఆ సుడిగుండములో దూకకు. మరలా ప్రాణాలతో బయటకు రాలేవు. ఆ ప్రవాహవేగానికి కొట్టుకుపోతావు.

ఓ లంకేశ్వరా! నా మాటవిను. తిరిగి లంకకు వెళ్లు. హాయిగా లంకను పాలించు. నీ భార్యలతో సుఖించు. రాముడిని తన భార్యతో ఆ అడవిలోనే ఉండనీ. రాముని జోలికి పోకు.” అని హెచ్చరించాడు మారీచుడు. రావణుడు మారీచుని మాటలు విని తిరిగి లంకకు వెళ్లిపోయాడు.

శ్రీమద్రామాయణము
అరణ్యకాండము ముప్పది ఒకటవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్

అరణ్యకాండ ద్వాత్రింశః సర్గః (32) >>

Leave a Comment