మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. “అరణ్యకాండ” త్రయస్త్రింశః సర్గలో, శూర్పణఖ రావణుని తన రాజరిక కార్యకలాపాల కోసం నిందించింది, దీని ద్వారా అతని రాజ్యం త్వరలో విపత్కర పరిస్థితిని ఎదుర్కొంటుంది. అతనికి గిబ్ చేస్తూ ఆమె ఒక రాజు, నిజంగా రాజ్యాధికారానికి తగినవాడు, రాజ్య వ్యవహారాలను ఎలా నిర్వహిస్తాడో వివరిస్తుంది. రాజులు మరియు వారి దుర్గుణాల ఆధారంగా అనేక వ్యాఖ్యానాలు తిరస్కరించబడిన అనేక నమూనాలను ఆమె మాట్లాడుతుంది.
రావణనిందా
తతః శూర్పణఖా దీనా రావణం లోకరావణమ్ |
అమాత్యమధ్యే సంక్రుద్ధా పరుషం వాక్యమబ్రవీత్ ||
1
ప్రమత్తః కామభోగేషు స్వైరవృత్తో నిరంకుశః |
సముత్పన్నం భయం ఘోరం బోద్ధవ్యం నావబుధ్యసే ||
2
సక్తం గ్రామ్యేషు భోగేషు కామవృత్తం మహీపతిమ్ |
లుబ్ధం న బహు మన్యంతే శ్మశానాగ్నిమివ ప్రజాః ||
3
స్వయం కార్యాణి యః కాలే నానుతిష్ఠతి పార్థివః |
స తు వై సహ రాజ్యేన తైశ్చ కార్యైర్వినశ్యతి ||
4
అయుక్తచారం దుర్దర్శమస్వాధీనం నరాధిపమ్ |
వర్జయంతి నరా దూరాన్నదీపంకమివ ద్విపాః ||
5
యే న రక్షంతి విషయమస్వాధీనా నరాధిపః |
తే న వృద్ధ్యా ప్రకాశంతే గిరయః సాగరే యథా ||
6
ఆత్మవద్భిర్విగృహ్య త్వం దేవగంధర్వదానవైః |
అయుక్తచారశ్చపలః కథం రాజా భవిష్యసి ||
7
త్వం తు బాలస్వభావచ్చ బుద్ధిహీనశ్చ రాక్షస |
జ్ఞాతవ్యం తు న జానీషే కథం రాజా భవిష్యసి ||
8
యేషాం చారశ్చ కోశశ్చ నయశ్చ జయతాం వర |
అస్వాధీనా నరేంద్రాణాం ప్రాకృతైస్తే జనైః సమాః ||
9
యస్మాత్ పశ్యంతి దూరస్థాన్ సర్వానర్థాన్నరాధిపాః |
చారేణ తస్మాదుచ్యంతే రాజానో దీర్ఘచక్షుషః ||
10
అయుక్తచారం మన్యే త్వాం ప్రాకృతైః సచివైర్వృతమ్ |
స్వజనం చ జనస్థానం హతం యో నావబుధ్యసే ||
11
చతుర్దశ సహస్రాణి రక్షసాం క్రూరకర్మణామ్ |
హతాన్యేకేన రామేణ ఖరశ్చ సహదూషణః ||
12
ఋషీణామభయం దత్తం కృతక్షేమాశ్చ దండకాః |
ధర్షితం చ జనస్థానం రామేణాక్లిష్టకర్మణా ||
13
త్వం తు లుబ్ధః ప్రమత్తశ్చ పరాధీనశ్చ రావణ |
విషయే స్వే సముత్పన్నం భయం యో నావబుధ్యసే ||
14
తీక్ష్ణమల్పప్రదాతారం ప్రమత్తం గర్వితం శఠమ్ |
వ్యసనే సర్వభూతాని నాభిధావంతి పార్థివమ్ ||
15
అతిమానినమగ్రాహ్యమాత్మసంభావితం నరమ్ |
క్రోధినం వ్యసనే హంతి స్వజనోఽపి మహీపతిమ్ ||
16
నానుతిష్ఠతి కార్యాణి భయేషు న బిభేతి చ |
క్షిప్రం రాజ్యాచ్చ్యుతో దీనస్తృణైస్తుల్యో భవిష్యతి ||
17
శుష్కైః కాష్ఠైర్భవేత్కార్యం లోష్టైరపి చ పాంసుభిః |
న తు స్థానాత్ పరిభ్రష్టైః కార్యం స్యాద్వసుధాధిపైః ||
18
ఉపభుక్తం యథా వాసః స్రజో వా మృదితా యథా |
ఏవం రాజ్యాత్పరిభ్రష్టః సమర్థోఽపి నిరర్థకః ||
19
అప్రమత్తశ్చ యో రాజా సర్వజ్ఞో విజితేంద్రియః |
కృతజ్ఞో ధర్మశీలశ్చ స రాజా తిష్ఠతే చిరమ్ ||
20
నయనాభ్యాం ప్రసుప్తోఽపి జాగర్తి నయచక్షుషా |
వ్యక్తక్రోధప్రసాదశ్చ స రాజా పూజ్యతే జనైః ||
21
త్వం తు రావణ దుర్బుద్ధిర్గుణైరేతైర్వివర్జితః |
యస్య తేఽవిదితశ్చారై రక్షసాం సుమహాన్ వధః ||
22
పరావమంతా విషయేషు సంగతో
న దేశకాలప్రవిభాగతత్త్వవిత్ |
అయుక్తబుద్ధిర్గుణదోషనిశ్చయే
విపన్నరాజ్యో న చిరాద్విపత్స్యసే ||
23
ఇతి స్వదోషాన్ పరికీర్తితాంస్తయా
సమీక్ష్య బుద్ధ్యా క్షణదాచరేశ్వరః |
ధనేన దర్పేణ బలేన చాన్వితో
విచింతయామాస చిరం స రావణః ||
24
Aranya Kanda Sarga 33 In Telugu Pdf Download
“అన్నా రావణా! అక్కడ జనస్థానములో జరగకూడని ఘోరాలు జరిగిపోతూ ఉంటే నువ్వు ఇక్కడ, సంతోషంగా బంగారు సింహాసనము మీద కూర్చుని రాజభోగములు, అంత:పుర స్త్రీలతో కామసుఖాలు అనుభవిస్తున్నావా! నీ రాజ్యములో ఏమి జరుగుతూ ఉందో తెలుసుకోవాలి అన్న జ్ఞానం కూడా నీకు లేదా! నీ వలె కామోప భోగములలో మునిగి తేలుతూ రాజ్యక్షేమమును మరిచే రాజును ప్రజలు గౌరవించరు. అది తెలుసుకో! రాజు ఏ కాలంలో చేయాల్సిన పనులను ఆయాకాలములలో చేయక పోతే, ఆ రాజు, అతని రాజ్యము నశించిపోవడం తథ్యం.
ప్రజలకు దూరంగా ఉంటూ, గూఢచారుల ద్వారా ప్రజల కష్టనష్టములు తెలుసుకోకుండా, ఇంద్రియలోలుడై ప్రవర్తించేరాజును ప్రజలు పదవీచ్యుతుడిని చేస్తారు. తమ ఇంద్రియములను తాము నిగ్రహించుకోలేని రాజులు, ప్రజలను ఏమి రక్షిస్తారు? అత్యంత బలవంతులైన దేవతలు, గంధర్వులు, దానవులు నీకు ప్రబల విరోధులు. వారి వలన నీకు ఎప్పుడూ ముప్పు పొంచి ఉంది. కాని నీవు వారి కదలికలను గూఢచారుల వలన తెలుసుకోకుండా ప్రమత్తుడవై ఉంటున్నావు. అటువంటి వాడివి నీవు రాజుగా ఎలా ఉండగలవు?
ఓ రావణా! రాజు అయిన వాడు తన కోశాగారమును, గూఢచార వ్యవస్థను, పరిపాలనా వ్యవహారములను, తన అధీనములో ఉంచుకొని జాగరూకతతో ప్రవర్తించాలి. అలా చేయకపోతే నీకూ, మామూలు మనిషికి తేడా లేదు. ఓ రాజా! నీకు గూఢచారులు కళ్లలాంటి వారు. వారిని నీవు నిర్లక్ష్యం చేస్తే, నీవు గుడ్డివాడి కింద లెక్క. నీవే కాదు నీ మంత్రులు కూడా అసమర్థులు అని తెలుస్తూ ఉంది. లేకపోతే కనీసం వారు అయినా జనస్థానంలో ఏమి జరుగుతూ ఉందో తమ గూఢచార వ్యవస్థద్వారా తెలుసుకోకుండా ఉంటారా!
ఒక్క మానవుడు, రాముడు అనే వాడు, 14,000 మంది రాక్షస వీరులను ఒంటి చేత్తో మట్టుపెట్టాడు. ఇది నీకు తెలుసా! ఆ రాముడు రాక్షసులను చంపి దండకారణ్యములో ఉన్న ఋషులకు మునులకు రక్షణ కల్పించాడు. జనస్థానములో రాక్షసులకు నిలువనీడలేకుండా చేసాడు. ఇవన్నీ నీకు తెలియవు. నీ సుఖములు, భోగలాలసత నీది. అధికార మదంతో నీవు ఏదీ పట్టించుకోవు. నీ రాజ్యము ప్రమాదంలో ఉంది అన్న విషయాన్ని కూడా నీవు గ్రహించలేకపోతున్నావు.
ఓ రావణా! నీవు గర్వాంధుడవు. మొండివాడివి. ప్రమత్తుడివి. ఇతరుల కష్టములను చూచి ఆనందించేవాడివి. అటువంటి నీవు కష్టములలో ఉంటే నీకు ఎవరూ సాయం చెయ్యరని, నీ మొహం కూడా చూడరని గుర్తుపెట్టుకో! నీ లాంటి గర్వాంధుడిని, ప్రజల కష్టసుఖములు పట్టించుకోనివాడిని, కోపిష్టిని ప్రజలే అంతమొం దిస్తారు. కార్యాకార్య విచక్షణ తెలియని రాజు రాజ్యభ్రష్టు డవుతాడు. ఒకసారి రాజ్యభ్రష్టత పొందిన రాజు, ఎంతటి సమర్థుడైనా, ప్రజల చేత గడ్డిపరక కన్నా హీనంగా చూడబడతాడు.
(అందుకే ఈ రోజుల్లో రాజకీయ నాయకులు ఏదో ఒక పదవికోసం పాకులాడుతుంటారు.) అందుకని రాజు ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలి. ఏమరుపాటు పనికిరాదు. అటువంటి రాజును ప్రజలు గౌరవిస్తారు. నీతి మంతుడైన రాజును, ఎల్లప్పుడూ అప్రత్తంగా ఉండే రాజును, అతడిని ప్రజలు దేవుడి వలె పూజిస్తారు.
ఓ అన్నా! రావణా! నీలో పైన చెప్పిన సుగుణములు ఏవీ లేవు. అందుకనే నీకు జనస్థానములో జరిగిన విషయములు ఏమీ తెలియవు. ఎందుకంటే నీవు మునులను., ఋషులను అవమా నించడం, చంపడం, కామోపభోగములను అనుభవించడం, వీటితోనే కాలం గడుపుతున్నావు. నీకు విచక్షణా జ్ఞానం లేదు. మంచి చెడులను నిర్ణయించే బుద్ధిలేదు. అందుకే నీవు అతి త్వరలో ఆపదలలో చిక్కుకుంటావు. నీ రాజ్యం నశిస్తుంది. తర్వాత నీ ఇష్టం.” అని నానా విధాలుగా తిట్టి ముగించింది శూర్పణఖ.
ఆ మాటలు అన్నది వేరేవాళ్లు అయితే రావణుడు వాడి తలనరికి ఉండేవాడు. కానీ ఈ మాటలు అన్నది స్వయానా తన చెల్లెలు. ఎంతో ఆపద వస్తేనే గానీ ఆమె అలా అనదు. అందుకని శూర్పణఖ మాటలలో అంతరార్థాన్ని గ్రహించడానికి ప్రయత్నిస్తున్నాడు రావణుడు.
శ్రీమద్రామాయణము
అరణ్యకాండము ముప్పదిమూడవ సర్గ సంపూర్ణము.
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్