మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. “అరణ్యకాండ” చతుస్త్రింశః సర్గలో, రావణుడు రాముడి పరాక్రమం మరియు ఆయుధాల గురించి ఆరా తీస్తాడు, దీని కోసం శూర్పణఖ రాముడు, సీత మరియు లక్ష్మణుల గురించి మరియు జనస్థానంలో ఏమి జరిగిందో వివరిస్తుంది. సీతను తన భార్యగా సాధించమని రావణుడిని ఆమె ప్రేరేపిస్తుంది, ఎందుకంటే ఆమె అందంలో సీతను మించిన వారు ఎవరూ లేరు.
సీతాహరణోపదేశః
తతః శూర్పణఖాం కృద్ధాం బ్రువంతీం పరుషం వచః |
అమాత్యమధ్యే సంక్రుద్ధః పరిపప్రచ్ఛ రావణః ||
1
కశ్చ రామః కథం వీర్యః కిం రూపః కిం పరాక్రమః |
కిమర్థం దండకారణ్యం ప్రవిష్టః స దురాసదమ్ ||
2
ఆయుధం కిం చ రామస్య నిహతా యేన రాక్షసాః |
ఖరశ్చ నిహతః సంఖ్యే దూషణస్త్రిశిరాస్తథా ||
3
ఇత్యుక్తా రాక్షసేంద్రేణ రాక్షసీ క్రోధమూర్ఛితా |
తతో రామం యథాతత్త్వమాఖ్యాతుముపచక్రమే ||
4
దీర్ఘబాహుర్విశాలాక్షశ్చీరకృష్ణాజినాంబరః |
కందర్పసమరూపశ్చ రామో దశరథాత్మజః ||
5
శక్రచాపనిభం చాపం వికృష్య కనకాంగదమ్ |
దీప్తాన్ క్షిపతి నారాచాన్ సర్పానివ మహావిషాన్ ||
6
నాదదానం శరాన్ ఘోరాన్ న ముంచంతం శిలీముఖాన్ |
న కార్ముకం వికర్షంతం రామం పశ్యామి సంయుగే ||
7
హన్యమానం తు తత్సైన్యం పశ్యామి శరవృష్టిభిః |
ఇంద్రేణేవోత్తమం సస్యమాహతం త్వశ్మవృష్టిభిః ||
8
రక్షసాం భీమరూపాణాం సహస్రాణి చతుర్దశ |
నిహతాని శరైస్తీక్ష్ణైస్తేనైకేన పదాతినా ||
9
అర్ధాధికముహూర్తేన ఖరశ్చ సహదూషణః |
ఋషీణామభయం దత్తం కృతక్షేమాశ్చ దండకాః ||
10
ఏకా కథంచిన్ముక్తాఽహం పరిభూయ మహాత్మనా |
స్త్రీవధం శంకమానేన రామేణ విదితాత్మనా ||
11
భ్రాతా చాస్య మహాతేజాః గుణతస్తుల్యవిక్రమః |
అనురక్తశ్చ భక్తశ్చ లక్ష్మణో నామ వీర్యవాన్ ||
12
అమర్షీ దుర్జయో జేతా విక్రాంతో బుద్ధిమాన్ బలీ |
రామస్య దక్షిణో బాహుర్నిత్యం ప్రాణో బహిశ్చరః ||
13
రామస్య తు విశాలాక్షీ పూర్ణేందుసదృశాననా |
ధర్మపత్నీ ప్రియా భర్తుర్నిత్యం ప్రియహితే రతా ||
14
సా సుకేశీ సునాసోరుః సురూపా చ యశస్వినీ |
దేవతేవ వనస్యాస్య రాజతే శ్రీరివాపరా ||
15
తప్తకాంచనవర్ణాభా రక్తతుంగనఖీ శుభా |
సీతా నామ వరారోహా వైదేహీ తనుమధ్యమా ||
16
నైవ దేవీ న గంధర్వీ న యక్షీ న చ కిన్నరీ |
నైవం రూపా మయా నారీ దృష్టపూర్వా మహీతలే ||
17
యస్య సీతా భవేద్భార్యా యం చ హృష్టా పరిష్వజేత్ |
అతిజీవేత్ స సర్వేషు లోకేష్వపి పురందరాత్ ||
18
సా సుశీలా వపుః శ్లాఘ్యా రూపేణాప్రతిమా భువి |
తవానురూపా భార్యా స్యాత్ త్వం చ తస్యాస్తథా పతిః ||
19
తాం తు విస్తీర్ణజఘనాం పీనశ్రోణీపయోధరామ్ |
భార్యార్థే తు తవానేతుముద్యతాహం వరాననామ్ ||
20
విరూపితాఽస్మి క్రూరేణ లక్ష్మణేన మహాభుజ |
తాం తు దృష్ట్వాఽద్య వైదేహీం పూర్ణచంద్రనిభాననామ్ ||
21
మన్మథస్య శరాణాం వై త్వం విధేయో భవిష్యసి |
యది తస్యామభిప్రాయో భార్యార్థే తవ జాయతే ||
22
శీఘ్రముద్ధ్రియతాం పాదో జయార్థమిహ దక్షిణః |
కురు ప్రియం తథా తేషాం రక్షసాం రాక్షసేశ్వర ||
23
వధాత్తస్య నృశంసస్య రామస్యాశ్రమవాసినః |
తం శరైర్నిశితైర్హత్వా లక్ష్మణం చ మహారథమ్ ||
24
హతనాథాం సుఖం సీతాం యథావదుపభోక్ష్యసి |
రోచతే యది తే వాక్యం మమైతద్రాక్షసేశ్వర ||
25
క్రియతాం నిర్విశంకేన వచనం మమ రావణ |
విజ్ఞాయేహాత్మశక్తిం చ హ్రియతామబలా బలాత్ |
సీతా సర్వానవద్యాంగీ భార్యర్థే రాక్షసేశ్వర ||
26
నిశమ్య రామేణ శరైరజిహ్మగై-
-ర్హతాన్ జనస్థానగతాన్నిశాచరాన్ |
ఖరం చ బుధ్వా నిహతం చ దూషణం
త్వమత్ర కృత్యం ప్రతిపత్తుమర్హసి ||
27
Aranya Kanda Sarga 34 In Telugu Pdf Download
నిండు సభలో, మంత్రి సామంత దండనాధుల ముందు తనను తన చెల్లెలు శూర్పణఖ ఆ ప్రకారంగా కించపరిచి మాట్లాడటం సహించలేకపోయాడు రావణుడు. ఆమె మాటలలో నిజం ఉన్నా, ఆ నిజాన్ని ఒప్పుకోడానికి అతని అహం అంగీకరించలేదు. అందుకని పెద్ద స్వరంతో ఇలా అన్నాడు.
“శూర్పణఖా! ఎవరి గురించి నువ్వు మాట్లాడుతున్నావు? రాముడు రాముడు అంటున్నావు. ఎవరా రాముడు! అతని బలపరాక్రమములు ఏపాటివి? అతను ఎలా ఉంటాడు? అతడు దండకారణ్యములోకి ఎందుకు ప్రవేశించాడు? నా సోదరులు ఖరుని, దూషణుని చంపాడు అంటున్నావు. అతని వద్ద ఏయే ఆయుధములు ఉన్నాయి. అనవసరమైన మాటలు మాని అసలు విషయం చెప్పు!” అని అన్నాడు రావణుడు.
అప్పటికి శూర్పణఖకు కూడా ఆవేశం చల్లారింది. రావణునికి ఉన్నది ఉన్నట్టు చెప్పడం మంచిది అని తలచి ఇలా చెప్పసాగింది.
“ఓ రాక్షసేంద్రా! ఆ రాముడు అయోధ్యాధిపతి దశరథుని కుమారుడు. అతడు ఆజానుబాహుడు. అరవిందళాయతాక్షుడు. ముని వేషములో ఉన్నాడు కానీ ధనుర్బాణములను ధరించాడు. సౌందర్యములో మన్మధుని మించినవాడు. అతడు నారాచ బాణములను అత్యంత వేగముగా ప్రయోగించగల నేర్పుగలవాడు. అతడు ఎప్పుడు బాణం తీస్తాడో ఎప్పుడు సంధిస్తాడో ఎప్పుడు వేస్తాడో ఎవరికి తెలియదు. కాని ఆబాణాలు తగిలి రాక్షసులు చావడం మాత్రం కనపడుతుంది.
అతని ధనుస్సుమాత్రం ఎల్లప్పుడు ఒంగి వర్తులాకారంలో ఉ ంటుంది. అతని యుద్ధము నేను ప్రత్యక్షముగా చూచాను. అతడు ఖరదూషణులను, వారి సేనాధిపతులను, 14,000 సైనికులను ఒకటిన్నర ముహూర్తకాలములో సంహరించాడు. (ముహూర్తము అంటే 48 నిమిషముల కాలము. అంటే మొత్తము యుద్ధము 72 నిమిషము లలో ముగిసిపోయింది అని అర్థము.). ఆ యుద్ధములో నేను తప్ప తక్కిన రాక్షసులు అందరూ మరణించారు. నేను స్త్రీని కాబట్టి నన్ను చంపలేదు అని అనుకుంటున్నాను.
ఆ రామునికి ఒక తమ్ముడు ఉన్నాడు. వాడి పేరు లక్ష్మణుడు. అతనికి మహాకోపము. అన్నతో సమానమైన బలపరాక్రమములు కలవాడు. అతనిని జయించడం కూడా చాలా కష్టము. రామునికి కుడిభుజము లక్షణుడు. ఇంక ఆ రామునికి ఒక భార్య ఉంది. ఆమె పేరు సీత. మహా సౌందర్యవతి. దేవతాస్త్రీలు, అప్సరసలు, గంధర్వ కాంతలు అందరూ అందంలో ఆమె కాలిగోటికి కూడా చాలరు. ముల్లోకములలో సీత వంటి సౌందర్యవతిని, దేవ, దానవ, గంధర్వ, యక్ష, కిన్నెర స్త్రీలలో నేను ఇంతవరకు చూడలేదు.
రాముడు తన భార్యను అమితంగా ప్రేమిస్తాడు. అటువంటి సీత ప్రేమను పొందిన రాముడు దేవేంద్రుని కన్నా గొప్పవాడు. (ఇప్పటిదాకా ఉన్నది ఉన్నట్టు చెప్పిన శూర్పణఖ మాట మార్చింది.) రావణా! నా ఉద్దేశంలో సీత లాంటి సౌందర్యవతి నీ వంటి వాడి దగ్గర ఉండాలి కానీ ఆ మానవునికి భార్యగా తగదు. నీవే ఆమెకు తగిన భర్తవు. ఆమె సౌందర్యమును చూచిన తరువాత నీవే ఆమెకు తగినవాడివి అనుకొని, ఆ మాట చెప్పడానికి, సీతను తీసుకురావడానికి వారి వద్దకు వెళ్లాను. ఆ సీతను బలవంతంగా నీ వద్దకు తీసుకు రావడానికి ప్రయత్నించాను. అపుడు ఆ ధూర్తుడైన లక్ష్మణుడు నన్ను పట్టుకొని నా ముక్కు చెవులు కోసి నన్ను అవమానించాడు.
నా సంగతి అటుంచు. ఈ సీతను నీవు ఒకసారి చూస్తే ఆమె లేకుండా తిరిగి లంకానగరానికి రావు. ఆమె చూపులు అనే మన్మధ బాణములకు బలి అయిపోతావు. నా కైతే ఆమె నీకు కైతే ఆమె నీకు భార్యగా తగినది అనిపించింది. నీకు కూడా అదే ఉద్దేశ్యం ఉంటే వెంటనే బయలు దేరు. ఆ రామలక్ష్మణులను చంపి సీతను తీసుకొని రా. నీ భార్యగా చేసుకో. అమరసుఖాలు అనుభవించు. ఆ రామలక్ష్మణులను చంపి, రాముని చేతిలో చచ్చిన రాక్షసుల ఆత్మలకు శాంతి చేకూర్చు.
లక్షణుని చంపితేనే నా అవమానానికి ప్రతీకారం చేసిన వాడివి అవుతావు. రామలక్ష్మణులు చస్తే సీత నీ వశం అవుతుంది. సీతలాంటి సౌందర్యరాసి భార్యగా ఉన్న నిన్ను ముల్లోకాలు శ్లాఘిస్తాయి. నీ ఇష్టం అయితే నేను చెప్పినట్టు చెయ్యి. సీత మంచి మాటలతో నీకు లొంగకుంటే, బలత్కారంగానైనా తీసుకొనిరా! నీ భార్యగా చేసుకో!
రాక్షసేంద్రా! అన్నింటి కన్నా ముందు, ఆ రాముడు నీ రాక్షససేనలను సర్వనాశనం చేసాడు అని గుర్తుంచుకో! రాముని సంహరించకపోతే దండ కారణ్యములో నీ సార్వభౌమత్వానికి విలువ ఉండదు. తరువాత నీ ఇష్టం.” అని లేని పోని మాటలతో రావణుని రెచ్చగొట్టింది శూర్పణఖ.
శ్రీమద్రామాయణము
అరణ్యకాండము ముప్పది నాలుగవ సర్గ సంపూర్ణము.
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్
అరణ్యకాండ పంచత్రింశః సర్గః (35) >>