Aranya Kanda Sarga 4 In Telugu – అరణ్యకాండ చతుర్థః సర్గః

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. అరణ్యకాండ చతుర్థ సర్గం రామాయణంలో ముఖ్యమైన అధ్యాయం. ఈ సర్గలో రాముడు, సీత మరియు లక్ష్మణుడు పంచవటిలో నివసిస్తారు. ఈ క్రమంలో, శూర్పణఖ రాముణ్ని చూసి, అతనిపై మోహించి, ప్రేమను ప్రదర్శిస్తుంది. అయితే, రాముడు ఆమెను తిరస్కరిస్తాడు. కోపంతో శూర్పణఖ సీతపై దాడి చేస్తుంది.

విరాధనిఖననమ్

హ్రియమాణౌ తు తౌ దృష్ట్వా వైదేహీ రామలక్ష్మణౌ |
ఉచ్చైఃస్వరేణ చుక్రోశ ప్రగృహ్య సుభుజా భుజౌ ||

1

ఏష దాశరథీ రామః సత్యవాన్ శీలవాన్ శుచిః |
రక్షసా రౌద్రరూపేణ హ్రియతే సహలక్ష్మణః ||

2

మాం వృకా భక్షయిష్యంతి శార్దూలా ద్వీపినస్తథా |
మాం హరోత్సృజ్య కాకుత్స్థౌ నమస్తే రాక్షసోత్తమ ||

3

తస్యాస్తద్వచనం శ్రుత్వా వైదేహ్యా రామలక్ష్మణౌ |
వేగం ప్రచక్రతుర్వీరౌ వధే తస్య దురాత్మనః ||

4

తస్య రోద్రస్య సౌమిత్రిర్బాహుం సవ్యం బభంజ హ |
రామస్తు దక్షిణం బాహుం తరసా తస్య రక్షసః ||

5

స భగ్నబాహుః సంవిగ్నో నిపపాతాశు రాక్షసః |
ధరణ్యాం మేఘసంకాశో వజ్రభిన్న ఇవాచలః ||

6

ముష్టిభిర్జానుభిః పద్భిః సూదయంతౌ తు రాక్షసమ్ |
ఉద్యమ్యోద్యమ్య చాప్యేనం స్థండిలే నిష్పిపేషతుః ||

7

స విద్ధో బహుభిర్బాణైః ఖడ్గాభ్యాం చ పరిక్షతః |
నిష్పిష్టో బహుధా భూమౌ న మమార స రాక్షసః ||

8

తం ప్రేక్ష్య రామః సుభృశమవధ్యమచలోపమమ్ |
భయేష్వభయదః శ్రీమానిదం వచనమబ్రవీత్ ||

9

తపసా పురుషవ్యాఘ్ర రాక్షసోఽయం న శక్యతే |
శస్త్రేణ యుధి నిర్జేతుం రాక్షసం నిఖనావహే ||

10

తచ్ఛ్రుత్వా రాఘవేణోక్తం రాక్షసః ప్రశ్రితం వచః |
ఇదం ప్రోవాచ కాకుత్స్థం విరాధః పురుషర్షభమ్ ||

11

హతోఽహం పురుషవ్యాఘ్ర శక్రతుల్యబలేన వై |
మయా తు పూర్వం త్వం మోహన్న జ్ఞాతః పురుషర్షభః ||

12

కౌసల్యా సుప్రజా తాత రామస్త్వం విదితో మయా | [రామ తాత]
వైదేహీ చ మహాభాగా లక్ష్మణశ్చ మహాయశాః ||

13

అపి శాపాదహం ఘోరాం ప్రవిష్టో రాక్షసీం తనుమ్ |
తుంబురుర్నామ గంధర్వః శప్తో వైశ్రవణేన హ ||

14

ప్రసాద్యమానశ్చ మయా సోఽబ్రవీన్మాం మహాయశాః |
యదా దాశరథీ రామస్త్వాం వధిష్యతి సంయుగే ||

15

తదా ప్రకృతిమాపన్నో భవాన్ స్వర్గం గమిష్యతి |
ఇతి వైశ్రవణో రాజా రంభాసక్తం పురాఽనఘ ||

16

అనుపస్థీయమానో మాం సంక్రుద్ధో వ్యాజహార హ |
తవ ప్రసాదాన్ముక్తోఽహమభిశాపాత్సుదారుణాత్ ||

17

భువనం స్వం గమిష్యామి స్వస్తి వోఽస్తు పరంతప |
ఇతో వసతి ధర్మాత్మా శరభంగః ప్రతాపవాన్ ||

18

అధ్యర్ధయోజనే తాత మహర్షిః సూర్యసన్నిభః |
తం క్షిప్రమభిగచ్ఛ త్వం స తే శ్రేయో విధాస్యతి ||

19

అవటే చాపి మాం రామ ప్రక్షిప్య కుశలీ వ్రజ |
రక్షసాం గతసత్త్వానామేష ధర్మః సనాతనః ||

20

అవటే యే నిధీయంతే తేషాం లోకాః సనాతనాః |
ఏవముక్త్వా తు కాకుత్స్థం విరాధః శరపీడితః ||

21

బభూవ స్వర్గసంప్రాప్తో న్యస్తదేహో మహాబలః |
తచ్ఛ్రుత్వా రాఘవో వాక్యం లక్ష్మణం వ్యాదిదేశ హ ||

22

కుంజరస్యేవ రౌద్రస్య రాక్షసస్యాస్య లక్ష్మణ |
వనేఽస్మిన్ సుమహచ్ఛ్వభ్రం ఖన్యతాం రౌద్రకర్మణః ||

23

ఇత్యుక్త్వా లక్ష్మణం రామః ప్రదరః ఖన్యతామితి |
తస్థౌ విరాధమాక్రమ్య కంఠే పాదేన వీర్యవాన్ ||

24

తతః ఖనిత్రమాదాయ లక్ష్మణః శ్వభ్రముత్తమమ్ |
అఖనత్పార్శ్వతస్తస్య విరాధస్య మహాత్మనః ||

25

తం ముక్తకంఠం నిష్పిష్య శంకుకర్ణం మహాస్వనమ్ |
విరాధం ప్రాక్షిపచ్ఛ్వభ్రే నదంతం భైరవస్వనమ్ ||

26

తమాహవే నిర్జితమాశువిక్రమౌ
స్థిరావుభౌ సంయతి రామలక్ష్మణౌ |
మదాన్వితౌ చిక్షిపతుర్భయావహం
నదంతముత్క్షిప్య బిలే తు రాక్షసమ్ ||

27

అవధ్యతాం ప్రేక్ష్య మహాసురస్య తౌ
శితేన శస్త్రేణ తదా నరర్షభౌ |
సమర్థ్య చాత్యర్థవిశారదావుభౌ
బిలే విరాధస్య వధం ప్రచక్రతుః ||

28

స్వయం విరాధేన హి మృత్యురాత్మనః
ప్రసహ్య రామేణ వధార్థమీప్సితః |
నివేదితః కాననచారిణా స్వయం
న మే వధః శస్త్రకృతో భవేదితి ||

29

తదేవ రామేణ నిశమ్య భాషితం
కృతా మతిస్తస్య బిలప్రవేశనే |
బిలం చ రామేణ బలేన రక్షసా
ప్రవేశ్యమానేన వనం వినాదితమ్ ||

30

ప్రహృష్టరూపావివ రామలక్ష్మణౌ
విరాధముర్వ్యాం ప్రదరే నిఖాయ తమ్ | [నిహత్య తౌ]
ననందతుర్వీతభయౌ మహావనే
శిలాభిరంతర్దధతుశ్చ రాక్షసమ్ ||

31

తతస్తు తౌ కార్ముకఖడ్గధారిణౌ
నిహత్య రక్షః పరిగృహ్య మైథిలీమ్ |
విజహ్నతుస్తౌ ముదితౌ మహావనే
దివి స్థితౌ చంద్రదివాకరావివ ||

32

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే అరణ్యకాండే చతుర్థః సర్గః ||

Aranya Kanda Sarga 4 Meaning In Telugu

ఆ ప్రకారంగా రాముని లక్ష్మణుని విరాధుడు ఎత్తుకొని పోవడం చూచి సీత పెద్దగా ఏడవసాగింది. పెద్ద పెద్ద గా కేకలు వేసింది.

“ఓ రాక్షసుడా నీకు ఓ నమస్కారము. వాళ్లను వదిలిపెట్టు. కావాలంటే నన్ను తీసుకొనిపో. నాకు భయంగా ఉంది. నేను ఒంటరిగా ఇక్కడ ఉంటే ఈ అరణ్యములో ఉండే క్రూర మృగాలు నన్ను తినేస్తాయి.” అని పెద్ద పెట్టున కేకలు వేసింది.

ఆ కేకలు విన్నారు రామలక్ష్మణులు. వెంటనే విరాధుని చంపడానికి పూనుకున్నారు. వెంటనే లక్ష్మణుడు తన చేతిలో ఉన్న కత్తితో విరాధుని ఎడమచేతిని ఖండించాడు. రాముడు విరాధుని కుడి చేతిని విరిచేసాడు. రెండు చేతులు విరిగిన విరాధుడు రామలక్ష్మణులను కిందికి విసిరేసాడు. బాధతో గిలా గిలా కొట్టుకుంటూ కిందపడి మూర్ఛపోయాడు.

కిందపడ్డ విరాధుని రామలక్ష్మణులు కాళ్లతోనూ చేతులతోనూ మర్దించారు. పైకి ఎత్తి నేల మీద పడేసారు. కత్తులతో చీల్చారు. ఏమి చేసినా విరాధుని ప్రాణం పోలేదు. వరప్రసాది అయిన విరాధుడు ఆ ప్రకారంగా చావడు అని గ్రహించాడు రాముడు.

“లక్ష్మణా! ఈ విరాధుడు కత్తులతోనూ, ఆయుధములతోనూ చావడు. అలా చావు రాకుండా వీడికి వరం ఉంది. అందుకని మనం వీడిని గొయ్యి తీసి పాతిపెడదాము. సహజంగా వాడికి ప్రాణం పోతుంది. కాబట్టి నువ్వు వీడిని పూడ్చి పెట్టడానికి తగినంత గొయ్యి తవ్వు.” అని అన్నాడు. గొయ్యి తవ్వే లోపల విరాధుడు లేవకుండా రాముడు వాడి గొంతు మీద కాలు పెట్టి నిలుచున్నాడు.

అప్పుడే మూర్ఛనుండి తేరుకున్న విరాధుడు రాముని మాటలు విన్నాడు. విరాధుడు రామునితో ఇలా అన్నాడు.

“రామా! నువ్వు ఎవరో గుర్తించాను. నీభార్య సీతను, నీ తమ్ముడు లక్ష్మణుని కూడా గుర్తించాను. మీరు మహా పరాక్రమ వంతులు. మీచేతిలో నేను ఎప్పుడో చచ్చాను. ఇప్పుడు ప్రత్యేకంగా చంపడం ఎందుకు. ఇంక నా గురించి చెబుతాను.

నేను తుంబురుడు అనే పేరుగల గంధర్వుడను. ఒక సారి నేను రంభయొక్క వ్యామోహంలో పడి కుబేరుని సేవకు పోలేదు. కుబేరుని శాపము వలన నాకు ఈ రాక్షస రూపము ప్రాప్తించింది. “దశరథుని కుమారుడు రాముడు ఎప్పుడు నిన్ను యుద్ధంలో చంపుతాడో అప్పుడు నీకు నిజరూపం వస్తుంది” అని కుబేరుడు నాకు శాపవిమోచన మార్గము చెప్పాడు. ఇప్పుడు మీ దర్శనభాగ్యము కలిగింది. నాకు శాపవిమోచనము అయింది. నేను నా లోకానికి వెళ్లిపోతాను. నాకు అనుజ్ఞు ఇవ్వండి.” అని ప్రార్థించాడు.

రామ లక్ష్మణులు విరాధుని ప్రార్థనను మన్నించారు. విరాధుడు రామునితో ఇలా అన్నాడు. “రామా! ఇక్కడికి ఒకటిన్నర యోజనముల దూరములో శరభంగుడు అనే ముని ఆశ్రమము ఉంది. మీరు అక్కడకు వెళ్లండి మీకుశుభం కలుగుతుంది. ప్రస్తుతము మీరు నన్ను ఒక గోతిలో పాతిపెట్టండి. మరణించిన రాక్షసులను గొయ్యి తీసి అందులో పాతి పెట్టడం పురాతన ఆచారము. అలా చేస్తే మాకు పుణ్యలోకాలు ప్రాప్తిస్తాయి.” అని అన్నాడు.

తరువాత విరాధుడు తన ప్రాణాలు వదిలాడు. విరాధుని కోరిక ప్రకారము లక్ష్మణుడు గొయ్యి తీసాడు. రాముడు విరాధుని గొంతు మీది నుండి తన కాలు తీసాడు. విరాధుడు పెద్దపెట్టున అరిచాడు. ఆ అరుపులకు అడవి మారుమోగిపోయింది. వెంటనే లక్ష్మణుడు పెద్దపెద్ద గా కేకలు పెడుతున్న విరాధుని గోతిలో పడదోసాడు.

ఆ ప్రకారంగా రామలక్ష్మణులు, ఏ ఆయుధము చేత కూడా చావని విరాధుని, గోతిలో పెట్టి పూడ్చిపెట్టడం ద్వారా సంహరించారు. రాముని చేతనే చావ వలెనని కోరిక కల విరాధుడు, తన మరణ రహస్యమును కూడా రామునికి చెప్పాడు. అందుకని రాముడు అతడిని గోతిలో పాతిపెట్టడం ద్వారా సంహరించాడు. విరాధుడు మరలా లేవకుండా ఆ గోతి మీద పెద్ద పెద్ద బండ రాళ్లను కూడా పెట్టారు. తరువాత వారు సీత వద్దకు పోయి ఆమె భయాన్ని పోగొట్టారు. విరాధుని మరణంతో సీతారామలక్ష్మణులు సంతోషంగా ఉన్నారు.

(విరాధుని కధ మనకు కొంచెం విచిత్రంగా ఉంది కదూ! పైన చెప్పిన విధంగా గోరఖపూర్ ప్రతిలో ఉంది. రాముడు మహా బలవంతుడు. అస్త్రశస్త్ర సంపన్నుడు. అటువంటి రాముడు విరాధుడు సీతను ఎత్తుకొని పోగానే ఏడుస్తాడు. అదీ సీతను విరాధుడు ఎత్తుకొని పోయినందుకు కాదు. తమకు కలిగిన కష్టములను చూచి కైక కళ్లు చల్లబడ్డాయి కదా అని ఏడుస్తాడు. అప్పుడు లక్ష్మణుడు రాముని పరాక్రమమును గుర్తుచేస్తాడు. అయినా రాముడు ఏమీ చేయడు.

తరువాత విరాధుడు రామ లక్ష్మణులను బుజాల మీద ఎత్తుకొని పోతుంటే, “ఎటూ మనం అటే వెళతాము కదా కాస్త దూరం కలిసి వచ్చిందిలే” అని అనుకుంటాడు రాముడు. అంతేగానీ సీత ఒంటరిగా ఉంది, ఆమెకు ఏమన్నా ఆపద కలుగుతుంది అని గుర్తుకు రాదు. సీత కూడా “రామా నన్ను రక్షించు” అని ఏడవదు. విరాధునితో “నన్ను ఇక్కడ క్రూరమృగాలు తింటాయి. కావాలంటే నన్నుఎత్తుకొని పో, రామలక్ష్మణులను వదిలిపెట్టు” అని అరుస్తుంది. అప్పుడు రామునికి సీత ఒంటరిగా ఉంది అని గుర్తుకు వస్తుంది.

తాము విరాధుని చంపాలి అని అనుకుంటాడు. తరువాత విరాధుడు కూడా తనశాపవృత్తాంతము చెబుతాడు. తన శరీరాన్ని గోతిలో పెట్టి పాతిపెట్టమని కోరతాడు. తరువాత ప్రాణాలు విడుస్తాడు. రాముడు విరాధుని గొంతు మీద కాలు తీయగానే పెద్దగా అరుస్తాడు. అలా అరుస్తూ గిలా గిలా కొట్టుకుంటున్న విరాధుని రామలక్ష్మణులు గోతిలోకి తోసి కప్పెడతారు. వాడు లేవకుండా బండరాళ్లు పెడతారు. విరాధుడు ఇలాగే చస్తాడు అని రాముడు లక్ష్మణునికి చెబుతాడు. ఇవన్నీ ఒకదానికి ఒకటి పొంతన లేకుండా ఉన్నాయి కదా!

కాని రామాయణం ప్రాచ్య ప్రతిలో కధ వేరుగా ఉంది. విరాధుడు సీతను లాక్కుని తన తొడమీద కూర్చోపెట్టుకోగానే సీతకు కలిగిన దుస్థితికి రాముడికి దుఃఖము కలుగుతుంది. లక్ష్మణుడు రామునికి ధైర్యము చెప్పి విరాధుని మీద ఏడు బాణాలు ప్రయోగిస్తాడు. విరాధుడు లక్ష్మణుని మీద శూలం విసురుతాడు. రాముడు దానిని రెండు ముక్కలుగా విరిచేస్తాడు. మరొక బాణంతో రాముడు విరాధుని వక్షస్థలం చీలేట్టు కొడతాడు. విరాధుడు కిందపడతాడు. కాని చావడు.

రామునికి తనశాప వృత్తాంతము చెబుతాడు. రామునికి కోపం తెప్పించడానికే, రాముని చేతిలో మరణించి శాపవిముక్తి పొందడానికే సీతను లాక్కున్నాను అని చెబుతాడు. తరువాత రాక్షసుల ఆచారం కార తన శరీరాన్ని గోతిలో కప్పెట్టమంటాడు. తరువాత శరభంగ ముని గురించి చెప్పి, తన నిజ స్వరూపంతో గంధర్వలోకానికి వెళ్లిపోతాడు. ఈకథ సందర్భోచితంగా ఉంది. కాబట్టి మనము దీనినే అనుసరిద్దాము. పైవిషయములను నేను ఆచార్య శ్రీ పుల్లెల శ్రీరామచంద్రుడు గారి శ్రీమద్రామాయణము అరణ్యకాండ నుండి గ్రహించాను. వారికి నా పాదాభివందనములు. కృతజ్ఞతలు.)

శ్రీమద్రామాయణము
అరణ్యకాండము నాలుగవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్.

అరణ్యకాండ పంచమః సర్గః (5) >>

Leave a Comment