అయోధ్యా కాండ సర్గ 30 రామాయణంలో ముఖ్యమైన అధ్యాయం. రాముడు సీతను వనములకు రావద్దని ఎన్నో విధాలా నచ్చచెప్పబోయాడు. కాని సీత వినలేదు. పైగా సీతకు కోపం వచ్చింది. అప్పటి దాకా నయానా భయానా చెప్పింది. ఆఖరుకు చస్తానని బెదిరించింది. అయినా కాని రాముడు వినలేదు. ఇంక పతి భక్తి పక్కన బెట్టి రాముని దూషించడం మొదలు పెట్టింది. “రామా! నీవు అసలు మగాడివేనా! కాదు.
నీవు పురుషరూపంలో ఉన్న స్త్రీవి. పురుష రూపంలో ఉన్న ఒక స్త్రీని నా తండ్రి జనక మహారాజు కోరి కోరి అల్లుడుగా ఎలా చేసుకున్నాడో తెలియడం లేదు.” కాని అంతలోనే సర్దుకుంది. “నాధా! నాకు ఒక సందేహము. సూర్యునిలో తేజస్సు లేదు అని అన్నా ఈ లోకం ఒప్పుకుంటుందేమో గానీ, రామునిలో పరాక్రమము లేదు అంటే ఒప్పుకోదు కదా… రాముల వారిని తన వెంట తీసుకెళ్లమని…పరి పరి విదాలు వేడుకొన్న సీతా దేవి… రాములవారి పరాక్రమము గూర్చి అడిగిన సందర్భం లోనిది…
వనగమనాభ్యుపపత్తిః
సాంత్వ్యమానా తు రామేణ మైథిలీ జనకాత్మజా |
వనవాసనిమిత్తాయ భర్తారమిదమబ్రవీత్ ||
1
సా తముత్తమసంవిగ్నా సీతా విపులవక్షసమ్ |
ప్రణయాచ్చాభిమానాచ్చ పరిచిక్షేప రాఘవమ్ ||
2
కిం త్వాఽమన్యత వైదేహః పితా మే మిథిలాధిపః |
రామ జామాతరం ప్రాప్య స్త్రియం పురుషవిగ్రహమ్ ||
3
అనృతం బత లోకోఽయమజ్ఞానాద్యద్ధి వక్ష్యతి |
తేజో నాస్తి పరం రామే తపతీవ దివాకరే ||
4
కిం హి కృత్వా విషణ్ణస్త్వం కుతో వా భయమస్తి తే |
యత్పరిత్యక్తుకామస్త్వం మామనన్యపరాయణామ్ ||
5
ద్యుమత్సేనసుతం వీర సత్యవంతమనువ్రతామ్ |
సావిత్రీమివ మాం విద్ధి త్వమాత్మవశవర్తినీమ్ ||
6
న త్వహం మనసాఽప్యన్యం ద్రష్టాస్మి త్వదృతేఽనఘ |
త్వయా రాఘవ గచ్ఛేయం యథాన్యా కులపాంసనీ ||
7
స్వయం తు భార్యాం కౌమారీం చిరమధ్యుషితాం సతీమ్ |
శైలూష ఇవ మాం రామ పరేభ్యో దాతుమిచ్ఛసి ||
8
యస్య పథ్యం చ రామాత్థ యస్య చార్థేఽవరుధ్యసే |
త్వం తస్య భవ వశ్యశ్చ విధేయశ్చ సదాఽనఘ ||
9
స మామనాదాయ వనం న త్వం ప్రస్థాతుమర్హసి |
తపో వా యది వాఽరణ్యం స్వర్గో వా స్యాత్త్వయా సహ ||
10
న చ మే భవితా తత్ర కశ్చిత్పథి పరిశ్రమః |
పృష్ఠతస్తవ గచ్ఛంత్యా విహారశయనేష్వివ ||
11
కుశకాశశరేషీకా యే చ కంటకినో ద్రుమాః |
తూలాజినసమస్పర్శా మార్గే మమ సహ త్వయా ||
12
మహావాతసముద్ధూతం యన్మామవకరిష్యతి |
రజో రమణ తన్మన్యే పరార్ధ్యమివ చందనమ్ ||
13
శాద్వలేషు యదా శిశ్యే వనాంతే వనగోచర |
కుథాస్తరణతల్పేషు కిం స్యాత్సుఖతరం తతః ||
14
పత్రం మూలం ఫలం యత్త్వమల్పం వా యది వా బహు |
దాస్యసి స్వయమాహృత్య తన్మేఽమృతరసోపమమ్ ||
15
న మాతుర్న పితుస్తత్ర స్మరిష్యామి న వేశ్మనః |
ఆర్తవాన్యుపభుంజానా పుష్పాణి చ ఫలాని చ ||
16
న చ తత్ర గతః కించిద్ద్రష్టుమర్హసి విప్రియమ్ |
మత్కృతే న చ తే శోకో న భవిష్యతి దుర్భరా ||
17
యస్త్వయా సహ స స్వర్గో నిరయో యస్త్వయా వినా |
ఇతి జానన్పరాం ప్రీతిం గచ్ఛ రామ మయా సహ ||
18
అథ మామేవమవ్యగ్రాం వనం నైవ నయిష్యసి |
విషమద్యైవ పాస్యామి మా విశం ద్విషతాం వశమ్ ||
19
పశ్చాదపి హి దుఃఖేన మమ నైవాస్తి జీవితమ్ |
ఉజ్ఝితాయాస్త్వయా నాథ తదైవ మరణం వరమ్ ||
20
ఇమం హి సహితుం శోకం ముహూర్తమపి నోత్సహే |
కిం పునర్దశ వర్షాణి త్రీణి చైకం చ దుఃఖితా ||
21
ఇతి సా శోకసంతప్తా విలప్య కరుణం బహు |
చుక్రోశ పతిమాయస్తా భృశమాలింగ్య సస్వరమ్ ||
22
సా విద్ధా బహుభిర్వాక్యైర్దిగ్ధైరివ గజాంగనా |
చిరసన్నియతం బాష్పం ముమోచాగ్నిమివారణిః ||
23
తస్యాః స్ఫటికసంకాశం వారి సంతాపసంభవమ్ |
నేత్రాభ్యాం పరిసుస్రావ పంకజాభ్యామివోదకమ్ ||
24
తచ్చైవామలచంద్రాభం ముఖమాయతలోచనమ్ |
పర్యశుష్యత బాష్పేణ జలోద్ధృతమివాంబుజమ్ ||
25
తాం పరిష్వజ్య బాహుభ్యాం విసంజ్ఞామివ దుఃఖితామ్ |
ఉవాచ వచనం రామః పరివిశ్వాసయంస్తదా ||
26
న దేవి తవ దుఃఖేన స్వర్గమప్యభిరోచయే |
న హి మేఽస్తి భయం కించిత్స్వయంభోరివ సర్వతః ||
27
తవ సర్వమభిప్రాయమవిజ్ఞాయ శుభాననే |
వాసం న రోచయేఽరణ్యే శక్తిమానపి రక్షణే ||
28
యత్సృష్టాఽసి మయా సార్ధం వనవాసాయ మైథిలి |
న విహాతుం మయా శక్యా కీర్తిరాత్మవతా యథా ||
29
ధర్మస్తు గజనాసోరు సద్భిరాచరితః పురా |
తం చాహమనువర్తేఽద్య యథా సూర్యం సువర్చలా ||
30
న ఖల్వహం న గచ్ఛేయం వనం జనకనందిని |
వచనం తన్నయతి మాం పితుః సత్యోపబృంహితమ్ ||
31
ఏష ధర్మస్తు సుశ్రోణి పితుర్మాతుశ్చ వశ్యతా |
ఆజ్ఞాం చాహం వ్యతిక్రమ్య నాహం జీవితుముత్సహే ||
32
స్వాధీనం సమతిక్రమ్య మాతరం పితరం గురుమ్ |
అస్వాధీనం కథం దైవం ప్రకారైరభిరాధ్యతే ||
33
యత్త్రయం తత్త్రయో లోకాః పవిత్రం తత్సమం భువి |
నాన్యదస్తి శుభాపాంగే తేనేదమభిరాధ్యతే ||
34
న సత్యం దానమానౌ వా న యజ్ఞాశ్చాప్తదక్షిణాః |
తథా బలకరాః సీతే యథా సేవా పితుర్హితా ||
35
స్వర్గో ధనం వా ధాన్యం వా విద్యాః పుత్రాః సుఖాని చ |
గురువృత్త్యనురోధేన న కించిదపి దుర్లభమ్ ||
36
దేవగంధర్వగోలోకాన్బ్రహ్మలోకాంస్తథా నరాః |
ప్రాప్నువంతి మహాత్మానో మాతాపితృపరాయణాః ||
37
స మాం పితా యథా శాస్తి సత్యధర్మపథే స్థితః |
తథా వర్తితుమిచ్ఛామి స హి ధర్మః సనాతనః ||
38
మమ సన్నా మతిః సీతే త్వాం నేతుం దండకావనమ్ |
వసిష్యామీతి సా త్వం మామనుయాతుం సునిశ్చితా ||
39
సా హి సృష్టాఽనవద్యాంగీ వనాయ మదిరే క్షణే |
అనుగచ్ఛస్వ మాం భీరు సహధర్మచరీ భవ ||
40
సర్వథా సదృశం సీతే మమ స్వస్య కులస్య చ |
వ్యవసాయమతిక్రాంతా సీతే త్వమతిశోభనమ్ ||
41
ఆరభస్వ గురుశ్రోణి వనవాసక్షమాః క్రియాః |
నేదానీం త్వదృతే సీతే స్వర్గోఽపి మమ రోచతే ||
42
బ్రాహ్మణేభ్యశ్చ రత్నాని భిక్షుకేభ్యశ్చ భోజనమ్ |
దేహి చాశంసమానేభ్యః సంత్వరస్వ చ మా చిరమ్ ||
43
భూషణాని మహార్హాణి వరవస్త్రాణి యాని చ |
రమణీయాశ్చ యే కేచిత్క్రీడార్థాశ్చాప్యుపస్కరాః ||
44
శయనీయాని యానాని మమ చాన్యాని యాని చ |
దేహి స్వభృత్యవర్గస్య బ్రాహ్మణానామనంతరమ్ ||
45
అనుకూలం తు సా భర్తుర్జ్ఞాత్వా గమనమాత్మనః |
క్షిప్రం ప్రముదితా దేవీ దాతుమేవోపచక్రమే ||
46
తతః ప్రహృష్టా ప్రతిపూర్ణమానసా
యశస్వినీ భర్తురవేక్ష్య భాషితమ్ |
ధనాని రత్నాని చ దాతుమంగనా
ప్రచక్రమే ధర్మభృతాం మనస్వినీ ||
47
ఇతి శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే అయోధ్యాకాండే త్రింశః సర్గః ||
Ayodhya Kanda Sarga 30 Meaning In Telugu
రాముడు సీతను వనములకు రావద్దని ఎన్నో విధాలా నచ్చచెప్పబోయాడు. కాని సీత వినలేదు. పైగా సీతకు కోపం వచ్చింది. అప్పటి దాకా నయానా భయానా చెప్పింది. ఆఖరుకు చస్తానని బెదిరించింది. అయినా కాని రాముడు వినలేదు. ఇంక పతి భక్తి పక్కన బెట్టి రాముని దూషించడం మొదలు పెట్టింది.
“రామా! నీవు అసలు మగాడివేనా! కాదు. నీవు పురుషరూపంలో ఉన్న స్త్రీవి. పురుష రూపంలో ఉన్న ఒక స్త్రీని నా తండ్రి జనక మహారాజు కోరి కోరి అల్లుడుగా ఎలా చేసుకున్నాడో తెలియడం లేదు.” కాని అంతలోనే సర్దుకుంది. “నాధా! నాకు ఒక సందేహము. సూర్యునిలో తేజస్సు లేదు అని అన్నా ఈ లోకం ఒప్పుకుంటుందేమో గానీ, రామునిలో పరాక్రమము లేదు అంటే ఒప్పుకోదు కదా.
ఎందుకంటే అది తిరుగులేని సత్యం కాబట్టి. అలాంటి పరాక్రమ వంతుడివి…. నన్ను అడవులకు తీసుకొనివెళ్లడానికి ఎందుకు భయపడుతున్నావు? దానికి ఏమైనా బలమైన కారణం ఉందా! ఉంటే అదేమిటి? కట్టుకున్న భార్యను ఒంటరిగా వదిలి అడవులకు వెళ్లడానికి కారణమేమి? భయమా! లేక పరాక్రమము లేకనా! నీ భయమునకు కారణమేమి?
మీరు సావిత్రీ సత్యవంతుల కథ వినలేదా! సావిత్రి భర్తను అనుసరించి యమలోకమునకు కూడా వెళ్లింది. నేను కేవలం అడవులకు మాత్రం వస్తాను అంటున్నాను. అంతే కదా! నాధా! నేనుసామాన్య స్త్రీల వంటి దానను కాను. పరపురుషుని కన్నెత్తి కూడా చూడను. నేను ఇక్కడ ఒకరి పంచన బతకలేను. నువ్వు ఎక్కడ ఉంటే అక్కడే ఉంటాను. నేను స్వయంగా నీ భార్యను.
యవ్వనంలో ఉన్నాను. నీతో కొంతకాలము కాపురము చేసాను. అటువంటి నన్ను దిక్కులేని దాని మాదిరి పరాయి వాళ్ల ఇంట ఉంచడం ఉచితమా! నీవేమో తండ్రి మాటను అనుసరించి అడవులకు వెళుతున్నావు. నన్నేమో ఇక్కడ నీ తండ్రిని, తల్లిని, నీ తమ్ముడు భరతునికి విధేయురాలిగా ఉండమంటున్నావు. రామా! నీకు నీ వారు ఎక్కువ కానీ నాకు కాదు కదా! నాకు నా భర్త ఎక్కువ. ఎవరి కోసరమో నేను నిన్ను విడిచి ఒంటరిగా అయోధ్యలో ఉండలేను.
మీకు అన్నీ తెలుసు. అలాంటప్పుడు నన్ను ఒంటరిగా వదిలి వెళ్లడం ఉచితము కాదు. మీ సన్నిధిలో నాకు అరణ్యమైనా స్వర్గమైనా సమానమే! మీరు ఎక్కడ ఉంటే అదే నాకు రాజభవనము. నేను రాజభవనములో ఎలాఉంటానో అరణ్యములో కూడా అలాగే ఉంటాను. మీతో కలిసి ప్రయాణము చేస్తుంటే నాకు ముళ్లు కూడా పూల మాదిరి ఉంటాయి.
అడవులలో ఉన్న దుమ్ముకూడా చందనముతో సమానమే. హాయిగా, ఆకాశమే పందిరిగా పచ్చికబయళ్లే పూల పానుపుగా మీతో పాటు శయనించడం కన్నా, రాజభవనములలో ఉన్న హంసతూలికా తల్పములు ఎక్కువ సుఖాన్ని ఇవ్వవు. మీరు తీసుకొని వచ్చిన కందమూలములు, ఫలములే నాకు పంచభక్ష్య పరమాన్నములు.
నేను అడవులలో ఉన్నప్పుడు మా పుట్టింటికానీ నా తల్లితండ్రులను గానీ తలచుకొని బెంగపెట్టుకోను. నా వలన మీకు ఎలాంటి కష్టము కలగనీయను. నాకు అది కావాలి ఇది కావాలి అని అడగను. దొరికిన
దానితో తృప్తిపడతాను.
నాధా! మరలాచెబుతున్నాను. నాకు నీతోటిదే స్వర్గము. నీవు లేనిచోట నరకమే. కాబట్టి నన్ను తమరి వెంట తీసుకొని వెళ్లండి. ఇన్ని చెప్పినా వినకపోతే నాకు మరణమే శరణ్యము. అంతే గాని, అయోధ్యలో మీ శత్రువుల మధ్య ఉండలేను. ఎందుకంటే, మీ వియోగముతో నేను కొంతకాలము తరువాత అయినా కృంగి కృశించి చచ్చిపోతాను. అలాంటిది నీ ఎదుటనే చావడం మేలు కదా!
ఒక్కక్షణమైనా మిమ్ములను విడిచి బతకలేని నేను పదునాలుగు సంవత్సరములు మిమ్ములను విడిచి పరాయి పంచన ఎలా ఉంటాను అని అనుకుంటున్నారు.” అంటూ సీత రాముని కౌగలించుకొని పెద్దగా ఏడవసాగింది. సీత కళ్లనుండి కన్నీళ్లు ధారాపాతంగా కారుతున్నాయి. శరీరం వశం తప్పుతూ ఉంది. అలాగే రాముని చేతులలో నుండి కిందికి జారిపోయింది. రాముడు సీతను గట్టిగా పట్టుకున్నాడు. ఓదారుస్తున్నాడు.
“ఓ సీతా! ఎందుకీ ఏడుపు. నీవు ఇలా దుఃఖిస్తూ ఉంటే నాకు స్వర్గములో కూడా సుఖము లభించదు. నేను ఎవరికీ భయపడను. తుదకు ఆ బ్రహ్మదేవునికికూడా! నేను నిన్ను సర్వవేళలా రక్షించు కొనుటకు సమర్థుడను. కానీ నీ అభిప్రాయము తెలుసుకొనడానికి అలా అన్నాను.
అలా కాకుండా, నిన్ను నా వెంట అరణ్యములకు రమ్మంటే, పురుషాహంకారముతో నేను నిన్ను శాసిస్తున్నాను అని నీవు నన్ను అపార్థము చేసుకొనే అవకాశము ఉంది కదా! ఓ సీతా! నేను మాత్రము నిన్ను విడిచి క్షణమైనా బతుక గలనా! ఆ బ్రహ్మ మన ఇద్దరికీ వనవాసము చెయ్యమని రాసి పెట్టినట్టున్నాడు. అందుకే ఈ విపరీత పరిణామము.
సీతా! ఇంక నేను వనవాసమునకు ఎందుకు వెళుతున్నానో వివరిస్తాను. పితృవాక్యపరిపాలన మా కులధర్మము. దానిని నేను పాటించి తీరవలెను. కారణములు ఏవైనా, నా తండ్రి వాక్యము నాకు వేదవాక్కు. ఆయన మాటలు అనుసరించి నేను అడవులకు వెళు తున్నాను. ఒకకుమారుడిగా తల్లి తండ్రుల ఎడల నా ధర్మమును అతిమ్రించుటకు నేను ఇష్టపడను.
నాకు నా తల్లి, తండ్రి, గురువు మూడు లోకములతో సమానము. వీరి తరువాతే నాకు దేవుడు. నా తల్లి తండ్రుల సేవ కన్నా యజ్ఞయాగములు ముఖ్యము కావు. నా తండ్రి ఆజ్ఞను పాలించడంతోనే, నాకు స్వర్గము, ధనము, ధాన్యము, విద్య, సంతానము, రాజభోగములు లభించినట్టు భావిస్తాను. తండ్రి ఆజ్ఞను ధిక్కరించిన నాడు, నాకు ఇవేవీ దొరకవు.
మాతాపితరుల సేవతో నేను ఉత్తమ లోకములు పొందుతాను. ఎందుకంటే పితృవాక్య పరిపాలన మన సనాతన ధర్మము. నిన్ను నాతో పాటు అరణ్యములకు తీసుకొని పోయి కష్టముల పాటు చేయడం నాకు ఇష్టం లేదు. కానీ నీ ధృఢనిశ్చయము విని నిన్ను నాతో అరణ్యములకు రావడానికి అనుమతిస్తున్నాను.
నా సహధర్మ చారిణిగా నా వెంట అడవులకు రా. నీవు నాతో వస్తాను అని అనడం నాకు ఎంతో సంతోషాన్ని ఇచ్చింది. ఇటువంటి నిర్ణయం తీసుకొని మన వంశగౌరవము కాపాడావు. కాబట్టి సీతా! మనకు వనవాసమునకు అవసరమైన ఏర్పాట్లు చెయ్యి. నిన్ను విడిచి నేనుకూడా ఒక క్షణము కూడా ఉండలేను కదా!
బ్రాహ్మణులకు దానధర్మములు చెయ్యి. వారికి భోజనము పెట్టి సంతృప్తి పరుచు. నీవు ధరించు ఆభరణములు, విలువైన వస్త్రములు, వస్తువులు అన్నీ నీ పరిచారికలకు బ్రాహ్మణులకు దానంగా ఇవ్వు.” అని అన్నాడు రాముడు.
రాముని మాటలు విని సీత సంతోషంతో పొంగి పోయింది. రాముడు చెప్పినట్టు తనది అన్న ప్రతి వస్తువు అందరికీ దానంగా ఇచ్చివేసింది. విలువైన బంగారు ఆభరణములు, రత్నములు, మణులు, పట్టు వస్త్రములు తన పరిచారికలకు ఇచ్చింది.
శ్రీమద్రామాయణము
అయోధ్యా కాండము ముప్పదవ సర్గ సంపూర్ణము ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్.