Balakanda Sarga 37 In Telugu – బాలకాండ సప్తత్రింశః సర్గః

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. బాలకాండ లోని సప్తత్రింశః సర్గలో విశ్వామిత్ర మహర్షి గంగ యొక్క భూమార్గం గురించి, ఆమె కార్తికేయను కనడం, కృత్తిక నక్షత్రాలు ఆ అబ్బాయికి తల్లిపాలు ఇవ్వడం, దేవతలు ఆ అబ్బాయికి కార్తికేయ అని పేరు పెట్టడం మరియు ఆ బాలుడు ఖగోళ సైన్యాలకు అధిపతిగా అభిషేకం చేయడం గురించి తన కథనాన్ని కొనసాగిస్తున్నాడు.

కుమారోత్పత్తిః

తప్యమానే తపో దేవే దేవాః సర్షిగణాః పురా |
సేనాపతిమభీప్సంతః పితామహముపాగమన్ ||

1

తతోఽబ్రువన్సురాః సర్వే భగవంతం పితామహమ్ |
ప్రణిపత్య శుభం వాక్యం సేంద్రాః సాగ్నిపురోగమాః ||

2

యో నః సేనాపతిర్దేవ దత్తో భగవతా పురా |
[* అధికపాఠః –
స న జాతోఽద్య భగవన్నస్మద్వైరినిబర్హణః |
తత్పితా భగవాన్ శర్వో హిమవచ్ఛిఖరేఽద్య వై |
*]
తపః పరమమాస్థాయ తప్యతే స్మ సహోమయా ||

3

యదత్రానంతరం కార్యం లోకానాం హితకామ్యయా |
సంవిధత్స్వ విధానజ్ఞ త్వం హి నః పరమా గతిః ||

4

దేవతానాం వచః శ్రుత్వా సర్వలోకపితామహః |
సాన్త్వయన్మధురైర్వాక్యైస్త్రిదశానిదమబ్రవీత్ ||

5

శైలపుత్ర్యా యదుక్తం తన్న ప్రజాః సంతు పత్నిషు |
తస్యా వచనమక్లిష్టం సత్యమేవ న సంశయః ||

6

ఇయమాకాశగా గంగా యస్యాం పుత్రం హుతాశనః |
జనయిష్యతి దేవానాం సేనాపతిమరిందమమ్ ||

7

జ్యేష్ఠా శైలేంద్రదుహితా మానయిష్యతి తం సుతమ్ |
ఉమాయాస్తద్బహుమతం భవిష్యతి న సంశయః ||

8

తచ్ఛ్రుత్వా వచనం తస్య కృతార్థా రఘునందన |
ప్రణిపత్య సురాః సర్వే పితామహమపూజయన్ ||

9

తే గత్వా పర్వతం రామ కైలాసం ధాతుమండితమ్ |
అగ్నిం నియోజయామాసుః పుత్రార్థం సర్వదేవతాః ||

10

దేవకార్యమిదం దేవ సంవిధత్స్వ హుతాశన |
శైలపుత్ర్యాం మహాతేజో గంగాయాం తేజ ఉత్సృజ ||

11

దేవతానాం ప్రతిజ్ఞాయ గంగామభ్యేత్య పావకః |
గర్భం ధారయ వై దేవి దేవతానామిదం ప్రియమ్ ||

12

అగ్నేస్తు వచనం శ్రుత్వా దివ్యం రూపమధారయత్ |
దృష్ట్వా తన్మహిమానాం స సమంతాదవకీర్యత ||

13

సమంతతస్తదా దేవీమభ్యషించత పావకః |
సర్వస్రోతాంసి పూర్ణాని గంగాయా రఘునందన ||

14

తమువాచ తతో గంగా సర్వదేవపురోగమమ్ |
అశక్తా ధారణే దేవ తవ తేజః సముద్ధతమ్ ||

15

దహ్యమానాఽగ్నినా తేన సంప్రవ్యథితచేతనా |
అథాబ్రవీదిదం గంగాం సర్వదేవహుతాశనః ||

16

ఇహ హైమవతే పాదే గర్భోఽయం సన్నివేశ్యతామ్ |
శ్రుత్వా త్వగ్నివచో గంగా తం గర్భమతిభాస్వరమ్ ||

17

ఉత్ససర్జ మహాతేజాః స్రోతోభ్యో హి తదాఽనఘ |
యదస్యా నిర్గతం తస్మాత్తప్తజాంబూనదప్రభమ్ ||

18

కాంచనం ధరణీం ప్రాప్తం హిరణ్యమమలం శుభమ్ |
తామ్రం కార్ష్ణాయసం చైవ తైక్ష్ణ్యదేవాభ్యజాయత ||

19

మలం తస్యాభవత్తత్ర త్రపు సీసకమేవ చ |
తదేతద్ధరణీం ప్రాప్య నానాధాతురవర్ధత ||

20

నిక్షిప్తమాత్రే గర్భే తు తేజోభిరభిరంజితమ్ |
సర్వం పర్వతసంనద్ధం సౌవర్ణమభవద్వనమ్ ||

21

[* అధిక శ్లోకం –
తం దేశం తు తతో బ్రహ్మా సంప్రాప్యైనమభాషత |
జాతస్య రూపం యత్తస్మాజ్జాతరూపం భవిష్యతి ||
*]

జాతరూపమితి ఖ్యాతం తదాప్రభృతి రాఘవ |
సువర్ణం పురుషవ్యాఘ్ర హుతాశనసమప్రభమ్ ||

22

తృణవృక్షలతాగుల్మం సర్వం భవతి కాంచనమ్ |
తం కుమారం తతో జాతం సేంద్రాః సహమరుద్గణాః ||

23

క్షీరసంభావనార్థాయ కృత్తికాః సమయోజయన్ |
తాః క్షీరం జాతమాత్రస్య కృత్వా సమయముత్తమమ్ ||

24

దదుః పుత్రోఽయమస్మాకం సర్వాసామితి నిశ్చితాః |
తతస్తు దేవతాః సర్వాః కార్తికేయ ఇతి బ్రువన్ ||

25

పుత్రస్త్రైలోక్యవిఖ్యాతో భవిష్యతి న సంశయః |
తేషాం తద్వచనం శ్రుత్వా స్కన్నం గర్భపరిస్రవే ||

26

స్నాపయన్పరయా లక్ష్మ్యా దీప్యమానం యథాఽనలమ్ |
స్కంద ఇత్యబ్రువన్దేవాః స్కన్నం గర్భపరిస్రవాత్ ||

27

కార్తికేయం మహాభాగం కాకుత్స్థ జ్వలనోపమమ్ |
ప్రాదుర్భూతం తతః క్షీరం కృత్తికానామనుత్తమమ్ ||

28

షణ్ణాం షడాననో భూత్వా జగ్రాహ స్తనజం పయః |
గృహీత్వా క్షీరమేకాహ్నా సుకుమారవపుస్తదా ||

29

అజయత్స్వేన వీర్యేణ దైత్యసైన్యగణాన్విభుః |
సురసేనాగణపతిం తతస్తమమలద్యుతిమ్ ||

30

అభ్యషించన్సురగణాః సమేత్యాగ్నిపురోగమాః |
ఏష తే రామ గంగాయా విస్తరోఽభిహితో మయా ||

31

కుమారసంభవశ్చైవ ధన్యః పుణ్యస్తథైవ చ |
భక్తశ్చ యః కార్తికేయే కాకుత్స్థ భువి మానవః |
ఆయుష్మాన్పుత్రపౌత్రైశ్చ స్కందసాలోక్యతాం వ్రజేత్ ||

32

Balakanda Sarga 37 In Telugu Pdf With Meaning

ఓ రామా! పూర్వము దేవతల సేనలకు ఒక సైన్యాధి పతి కావాల్సి వచ్చాడు. దేవతలు అందరూ బ్రహ్మ దేవుని వద్దకు పోయి అగ్ని దేవుని ముందు పెట్టుకొని తమ కోరిక ను బ్రహ్మదేవునికి ఈ విధంగా విన్నవించుకున్నారు.

“ ఓ బ్రహ్మ దేవా! ఇప్పటి దాకా దేవతా సేనలకు మహేశ్వరుడు సైన్యాధి పతిగా ఉండేవాడు. కాని ప్రస్తుతము మహేశ్వరుడు హిమాచలము మీద తపస్సు చేసుకుంటున్నాడు. కాబట్టి మాకు వేరొక సైన్యాధి పతిని నీవే ఏర్పరుప వలెను.” అని వేడుకున్నారు.

ఆ సమయంలో మహేశ్వరుడు హిమాచలము మీద తపస్సు చేసుకుంటున్నాడు. అప్పుడు బ్రహ్మదేవుడు ఇలా అన్నాడు.

” ఓ దేవతలారా! ఉమాదేవి శాపము వలన మీలో ఎవ్వరికీ సంతానయోగ్యత లేదు. కాబట్టి మీలో ఎవరూ సైన్యాధి పతిని పుట్టించలేరు. ఆకాశ గంగ ఉన్నది కదా. అగ్ని దేవుని యందు ఆ మహాదేవుని వీర్యము నిక్షిప్తమై ఉన్నది కదా. గంగాదేవి అగ్నిదేవుని నుండి మహేశ్వరుని వీర్యమును స్వీకరించును. గంగాదేవికి అగ్ని దేవుని ద్వారా ఒక పుత్రుడు జన్మించును ఆయనే మీ దేవసేనకు అధిపతి కాగలడు. దీనికి ఉమాదేవి కూడా ఏమీ అభ్యంతరపెట్టదు.” అని అన్నాడు.

బ్రహ్మదేవుని మాటలకు సంతోషించి దేవతలందరూ తమ తమ స్థానములకు వెళ్లిపోయారు. తరువాత దేవతలందరూ పుత్రుని కొరకై అగ్నిదేవుని ప్రార్థించారు.

అగ్నిదేవుడు గంగ దేవి దగ్గరకు పోయి ” ఓ గంగాదేవీ! దేవతల కోరిక మేరకు నీవు నావలన గర్భము ధరింపుము.” అని కోరాడు.

గంగాదేవి ఒక దివ్యమైన రూపము ధరించింది. అగ్నిదేవుడు గంగాదేవిని ఆవహించాడు. తనలో నిక్షిప్తమైన మహాదేవుని వీర్యమును గంగాదేవిలో విడిచిపెట్టాడు. గంగాదేవి దేహమంతయూ తాపంతో రగిలిపోయింది.

“ఓ అగ్నీ! నేను ఈ వీర్యమును ధరింపలేను. నా వళ్లు అంతా దహించికుపోతూ ఉంది. నాకు శరీరం వశం తప్పి పోతూ ఉంది. నా వల్ల కాదు.” అని చెప్పింది.

“ఓ గంగాదేవీ! అటులయిన నేను నీలో విడిచిన వీర్యమును నీవు హిమాచలము వద్ద ఉన్న ఒక పర్వతము మీద విడువుము.” అని అన్నాడు అగ్ని.

గంగానది అగ్ని దేవుడు చెప్పినట్లే మహాదేవుని వీర్యమును ఒక పర్వతము మీద విడిచింది. అప్పుడు ఆ పర్వతము మహాదేవుని వీర్య ప్రభావము వలన బంగారము, వెండి, రాగి, ఇనుము మొదలగు ఖనిజ సంపదలతో నిండిపోయింది.

మహాదేవుని వీర్యము పడిన చోట రెల్లు పొదలు దట్టంగా పెరిగాయి. ఆ రెల్లు పొదలలో నుండి ఒక కుమారుడు పుట్టాడు. అది చూచి దేవతలు అందరూ సంతోషించారు. ఆ కుమారుని పాలు ఇచ్చి పెంచే బాధ్యత కృత్తికలకు అప్పగించారు. దేవతల ఆజ్ఞను శివసావహించిన కృత్తికలు ఆ బాలునికి స్తన్యము ఇచ్చి పెంచారు. అందుకని ఆ బాలుడు కార్తికేయుడు అనే పేరుతో పిలువ బడ్డాడు.

గంగాదేవి గర్భము నుండి జారి పడ్డాడు కాబట్టి స్కంధుడు అని కూడా పిలువ బడ్డాడు. కృత్తికలు ఆరుగురు. ఆరుగు కృత్తికలు ఒకే సమయంలో ఆ బాలునికి స్తన్యము (చనుబాలు) ఇచ్చారు. ఆ బాలుడు కూడా ఒకే సారి ఆరుముఖములతో ఆ తల్లుల చనుబాలు తాగాడు. అందుకని ఆ బాలునికి షణ్ముఖుడు అనే పేరు వచ్చింది.

తరువాత ఆ కుమారుడు దేవ సేనలకు సైన్యాధి పతి గా నియమింప బడ్డాడు. అసురులను జయించాడు. ఓ రామా! దీనినే కుమార సంభవము అని అంటారు.” అని విశ్వామిత్రుడు రామునికి కుమార స్వామి జననము గురించి చెప్పాడు.

శ్రీమద్రామాయణము
బాలకాండ ముప్పది ఏడవ సర్గ సంపూర్ణము.
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్.

బాలకాండ అష్టత్రింశః సర్గః (38) >>

Leave a Comment