Ayodhya Kanda Sarga 90 In Telugu – అయోధ్యాకాండ నవతితమః సర్గః

అయోధ్యాకాండలోని నవతితమః సర్గ అంటే 90వ సర్గ. ఈ సర్గలో, భరతుడు రాముని పాదుకలను సత్కారంతో తీసుకొని, సపరివారం అయోధ్యకు తిరిగి వచ్చాడు. భరతుడు రాముని పాదుకలను సింహాసనంపై ఉంచి, వాటి మార్గదర్శకత్వంలో రాజ్యాన్ని పాలిస్తానని ప్రతిజ్ఞ చేయడు. భరతుడు తన తండ్రి దశరథ మహారాజు మరణం, రాముని అరణ్యవాసం వంటి ఘోర సంఘటనల కారణంగా మనోవ్యధతో బాధపడతాడు. అతను నందిగ్రామంలో నివసిస్తూ, తాను రాముని ప్రతినిధిగా మాత్రమే ఉండి, రాముడు తిరిగి వచ్చే వరకు రాజ్యాన్ని రక్షించాలని నిర్ణయించుకుంటాడు. ప్రజలందరూ భరతుని ధర్మనిష్ఠ, విధేయతను ప్రశంసిస్తూ, రాముడు తిరిగి వచ్చే రోజును ఎదురుచూస్తారు.

భరద్వాజాశ్రమనివాసః

భరద్వాజాశ్రమం దృష్ట్వా క్రోశాదేవ నరర్షభః |
బలం సర్వమవస్థాప్య జగామ సహమంత్రిభిః || ౧ ||

పద్భ్యామేవ హి ధర్మజ్ఞో న్యస్తశస్త్రపరిచ్ఛదః |
వసానో వాససీ క్షౌమే పురోధాయ పురోధసమ్ || ౨ ||

తతః సందర్శనే తస్య భరద్వాజస్య రాఘవః |
మంత్రిణస్తానవస్థాప్య జగామానుపురోహితమ్ || ౩ ||

వసిష్ఠమథ దృష్ట్వైవ భరద్వాజో మహాతపాః |
సంచచాలాసనాత్తూర్ణం శిష్యానర్ఘ్యమితి బ్రువన్ || ౪ ||

సమాగమ్య వసిష్ఠేన భరతేనాభివాదితః |
అబుధ్యత మహాతేజాః సుతం దశరథస్య తమ్ || ౫ ||

తాభ్యామర్ఘ్యం చ పాద్యం చ దత్త్వా పశ్చాత్ఫలాని చ |
ఆనుపూర్వ్యాచ్ఛ ధర్మజ్ఞః పప్రచ్ఛ కుశలం కులే || ౬ ||

అయోధ్యాయాం బలే కోశే మిత్రేష్వపి చ మంత్రిషు |
జానన్ దశరథం వృత్తం న రాజానముదాహరత్ || ౭ ||

వసిష్ఠో భరతశ్చైనం పప్రచ్ఛతురనామయమ్ |
శరీరేఽగ్నిషు వృక్షేషు శిష్యేషు మృగపక్షిషు || ౮ ||

తథేతి తత్ప్రతిజ్ఞాయ భరద్వాజో మహాతపాః |
భరతం ప్రత్యువాచేదం రాఘవస్నేహబంధనాత్ || ౯ ||

కిమిహాగమనే కార్యం తవ రాజ్యం ప్రశాసతః |
ఏతదాచక్ష్వ మే సర్వం నహి మే శుద్ధ్యతే మనః || ౧౦ ||

సుషువే యమమిత్రఘ్నం కౌసల్యాఽనందవర్ధనమ్ |
భ్రాత్రా సహ సభార్యో యశ్చిరం ప్రవ్రాజితో వనమ్ || ౧౧ ||

నియుక్తః స్త్రీనియుక్తేన పిత్రా యోఽసౌ మహాయశాః |
వనవాసీ భవేతీహ సమాః కిల చతుర్దశ || ౧౨ ||

కచ్ఛిన్న తస్యాపాపస్య పాపం కర్తుమిహేచ్ఛసి |
అకణ్టకం భోక్తుమనాః రాజ్యం తస్యానుజస్య చ || ౧౩ ||

ఏవముక్తో భరద్వాజం భరతః ప్రత్యువాచ హ |
పర్యశ్రునయనో దుఃఖాద్వాచా సంసజ్జమానయా || ౧౪ ||

హతోఽస్మి యది మామేవం భగవానపి మన్యతే |
మత్తో న దోషమాశంకే నైవం మామనుశాధి హి || ౧౫ ||

న చైతదిష్టం మాతా మే యదవోచన్మదంతరే |
నాహమేతేన తుష్టశ్చ న తద్వచనమాదదే || ౧౬ ||

అహం తు తం నరవ్యాఘ్రముపయాతః ప్రసాదకః |
ప్రతినేతుమయోధ్యాం చ పాదౌ తస్యాభివందితుమ్ || ౧౭ ||

త్వం మామేవంగతం మత్వా ప్రసాదం కర్తుమర్హసి |
శంస మే భగవన్రామః క్వ సంప్రతి మహీపతిః || ౧౮ ||

వసిష్ఠాదిభిరృత్విగ్భిర్యాచితో భగవాంస్తతః |
ఉవాచ తం భరద్వాజః ప్రసాదాద్భరతం వచః || ౧౯ ||

త్వయ్యేతత్పురుషవ్యాఘ్ర యుక్తం రాఘవవంశజే |
గురువృత్తిర్దమశ్చైవ సాధూనాం చానుయాయితా || ౨౦ ||

జానే చైతన్మనఃస్థం తే దృఢీకరణమస్త్వితి |
అపృచ్ఛం త్వాం తథాఽత్యర్థం కీర్తిం సమభివర్ధయన్ || ౨౧ ||

జానే చ రామం ధర్మజ్ఞం ససీతం సహలక్ష్మణమ్ |
అసౌ వసతి తే భ్రాతా చిత్రకూటే మహాగిరౌ || ౨౨ ||

శ్వస్తు గంతాసి తం దేశం వసాద్య సహ మంత్రిభిః |
ఏతన్మే కురు సుప్రాజ్ఞ కామం కామార్థకోవిద || ౨౩ ||

తతస్తథేత్యేవముదారదర్శనః
ప్రతీతరూపో భరతోఽబ్రవీద్వచః |
చకార బుద్ధిం చ తదా తదాశ్రమే
నిశానివాసాయ నరాధిపాఽత్మజః || ౨౪ ||

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే అయోధ్యాకాండే నవతితమః సర్గః || ౯౦ ||

Ayodhya Kanda Sarga 90 Meaning In Telugu

భరద్వాజ మహర్షి ఆశ్రమము క్రోసెడు దూరము ఉండగానే భరతుడు తన సేనలను పరివారమును అక్కడే ఆగిపొమ్మన్నాడు. ఆయుధములను విడిచిపెట్టాడు. తాను పట్టుబట్టలు ధరించాడు. కులగురువు వసిష్ఠుడు ముందు నడుస్తూ ఉండగా, తన మంత్రులు వెనక రాగా, కాలి నడకన భరద్వాజ మహర్షి ఆశ్రమమునకు వెళ్లాడు.

భరద్వాజుని ఆశ్రమము కనుచూపు దూరములో ఉండగానే మంత్రులను ఆగిపొమ్మన్నాడు. వసిష్ఠుడు వెంటరాగా ఆశ్రమమునకు వెళ్లాడు. వసిష్ఠుని చూడగానే భరద్వాజుడు సంభ్రమంతో ఎదురు వచ్చాడు. అర్ఘ్య పాద్యములు ఇచ్చిసత్కరించాడు. భరతుని ఆదరంతో ఆహ్వానించాడు. భరతునికి అర్ఘ్యము పాద్యము ఇచ్చాడు. ఇరువురికీ ఫలములు ఇచ్చాడు. భరతుని యోగక్షేమములు కనుక్కున్నాడు భరద్వాజుడు. భరతుడు భరద్వాజునితో ఇలా అన్నాడు. “ఓ మహర్షీ! మేమంతా కుశలమే. మీరు మీ ఆశ్రమ వాసులు ఏ బాధా లేకుండా తపస్సు చేసుకుంటూ ఉన్నారు కదా!” అని అడిగాడు భరతుడు.

“మహారాజా! మాకు ఏ బాధా లేదు. ప్రశాంత జీవనము గడుపుతున్నాము. కానీ అయోధ్యలో ఉండి రాజ్యపాలన చేయవలసిన వాడివి, ఇలా అడవుల వెంట తిరగడానికి కారణమేమి? నీ అన్న రాముడు తండ్రి ఆదేశమును పాలించుటకు అరణ్యములకు వెళ్లాడు. అదినాకు తెలుసు. కాని నీవు ఇక్కడకు ఎందుకు వచ్చావు. రామునికి ఏదైనా అపకారము తలపెడుతున్నావా? లేకపోతే రాజ్యమును విడిచి ఇక్కడకు రావడానికి కారణమేమి?” అని అడిగాడు భరద్వాజుడు.

భరద్వాజుడు కూడా తనను అనుమానించడం చూచి తట్టుకోలేకపోయాడు భరతుడు. తన తల్లి చేసిన పాపపు పనికి తాను శిక్ష అనుభవిస్తున్నాడు అని అనుకున్నాడు మనసులో. భరద్వాజునితో ఇలా అన్నాడు.

“ఓ మహర్షీ! తమరు కూడా నన్ను అనుమానిస్తే నాకు ఇంక మరణమే శరణ్యము. రాముని అరణ్యవాసములో నా ప్రమేయము ఎంతమాత్రమూ లేదు. నన్ను నమ్మండి. ఆ సమయములో నేను అయోధ్యలో లేను. నేను లేని సమయమున నా తల్లి కైక నా తండ్రిని అనుచితములైన వరములు కోరి నాకు ఇంత చేటు తెచ్చిపెట్టినది. రాముని అడవులపాలు చేసినది. నాకు రాజ్యము లభిస్తుంది అని నాకు ఎంత మాత్రము సంతోషముగా లేదు. నా తల్లి కోరికను నేను అనుమతించను. ఆచరించను.

ప్రస్తుతము నేను ఇక్కడకువచ్చినకారణము… రాముని ప్రార్థించి, అర్థించి, అయోధ్యకు తీసుకొని వెళ్లి ఆయనకు పట్టాభిషేకము జరిపించడం. అదే నా ప్రధమ కర్తవ్యం. కాబట్టి రాముడు ప్రస్తుతము ఎక్కడ ఉన్నాడో నాకు తెలుపండి.”అని అడిగాడు. భరతుని మాటలు విన్న భరద్వాజుడు అతని పట్ల ప్రసన్నుడయ్యాడు.

“రాకుమారా! నీవు ఇక్ష్యాకు వంశములో పుట్టవలసినవాడవు. ధర్మాత్ముడవు. ధర్మము కోసరం అయాచితముగా వచ్చిన రాజ్యమును త్యజిస్తున్నావు. మరింత శ్లాఘనీయుడవు. నీ మనసులో మాట నాకు తెలియును. కానీ నీ శీలమును పదిమందికి తెలియజేయుట కొరకు ఆవిధంగా అడిగాను. ఇప్పుడు నీ ధర్మప్రవర్తన లోకమునకు వెల్లడి అయింది. రాముడు, లక్ష్మణుడు సీత ఎక్కడ ఉన్నారో నాకు తెలియును. ప్రస్తుతము వారు చిత్రకూట పర్వతము మీద నివసిస్తున్నారు. నీవు ఈరోజు ఇక్కడే విశ్రాంతి తీసుకొని రేపు చిత్రకూటమునకు వెళ్లవచ్చును.” అని పలికాడు భరద్వాజుడు. భరద్వాజుని మాట మన్నించి భరతుడు ఆ రాత్రికి ఆయన ఆశ్రమములోనే విశ్రాంతి తీసుకున్నాడు.

శ్రీమద్రామాయణము
అయోధ్యాకాండము తొంభయ్యవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్.

అయోధ్యాకాండ ఏకనవతితమః సర్గః (91) >>

Leave a Comment