Balakanda Sarga 15 In Telugu – బాలకాండ పంచదశః సర్గః

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. బాలకాండ లోని పంచదశః సర్గలో, రాజు దశరథుడు ఋష్యశృంగ మహర్షి ఆధ్వర్యంలో సంతానం పొందాలనే లక్ష్యంతో పుత్రకామెస్టి కర్మను ప్రారంభించాడు. దశరథ రాజు నిర్వహించే అశ్వ పూజలో అర్పించిన నైవేద్యాలను స్వీకరించడానికి ఖగోళ జీవులు గుమిగూడారు. వారు రావణుడి దురాగతాలను చూసి కలవరపడి, రావణుని అంతమొందించే మార్గం కోసం ఆలోచించమని బ్రహ్మను అభ్యర్థిస్తారు. విష్ణువు అక్కడికి చేరుకుని, రావణుని అంతమొందించడానికి తాను మానవునిగా అవతారమెత్తుతానని హామీ ఇవ్వడంతో బ్రహ్మ మరియు ఇతర దేవతలను శాంతింపజేస్తాడు.

రావణవధోపాయః

మేధావీ తు తతో ధ్యాత్వా స కించిదిదముత్తరమ్ |
లబ్ధసంజ్ఞస్తతస్తం తు వేదజ్ఞో నృపమబ్రవీత్ ||

1

ఇష్టిం తేఽహం కరిష్యామి పుత్రీయాం పుత్రకారణాత్ |
అథర్వశిరసి ప్రోక్తైర్మంత్రైః సిద్ధాం విధానతః ||

2

తతః ప్రక్రమ్య తామిష్టిం పుత్రీయాం పుత్రకారణాత్ |
జుహావ చాగ్నౌ తేజస్వీ మంత్రదృష్టేన కర్మణా ||

3

తతో దేవాః సగంధర్వాః సిద్ధాశ్చ పరమర్షయః |
భాగప్రతిగ్రహార్థం వై సమవేతా యథావిధి ||

4

తాః సమేత్య యథాన్యాయం తస్మిన్సదసి దేవతాః |
అబ్రువఁల్లోకకర్తారం బ్రహ్మాణం వచనం మహత్ ||

5

భగవంస్త్వత్ప్రసాదేన రావణో నామ రాక్షసః |
సర్వాన్నో బాధతే వీర్యాచ్ఛాసితుం తం న శక్నుమః ||

6

త్వయా తస్మై వరో దత్తః ప్రీతేన భగవన్పురా |
మానయంతశ్చ తం నిత్యం సర్వం తస్య క్షమామహే ||

7

ఉద్వేజయతి లోకాంస్త్రీనుచ్ఛ్రితాన్ద్వేష్టి దుర్మతిః |
శక్రం త్రిదశరాజానం ప్రధర్షయితుమిచ్ఛతి ||

8

ఋషీన్యక్షాన్స గంధర్వానసురాన్బ్రాహ్మణాంస్తథా |
అతిక్రామతి దుర్ధర్షో వరదానేన మోహితః ||

9

నైనం సూర్యః ప్రతపతి పార్శ్వే వాతి న మారుతః |
చలోర్మిమాలీ తం దృష్ట్వా సముద్రోఽపి న కంపతే ||

10

సుమహన్నో భయం తస్మాద్రాక్షసాద్ఘోరదర్శనాత్ |
వధార్థం తస్య భగవన్నుపాయం కర్తుమర్హసి ||

11

ఏవముక్తః సురైః సర్వైశ్చింతయిత్వా తతోఽబ్రవీత్ |
హంతాయం విహితస్తస్య వధోపాయో దురాత్మనః ||

12

తేన గంధర్వయక్షాణాం దేవదానవరక్షసామ్ |
అవధ్యోఽస్మీతి వాగుక్తా తథేత్యుక్తం చ తన్మయా ||

13

నాకీర్తయదవజ్ఞానాత్తద్రక్షో మానుషాంస్తదా |
తస్మాత్స మానుషాద్వధ్యో మృత్యుర్నాన్యోఽస్య విద్యతే ||

14

ఏతచ్ఛ్రుత్వా ప్రియం వాక్యం బ్రహ్మణా సముదాహృతమ్ |
దేవా మహర్షయః సర్వే ప్రహృష్టాస్తేఽభవంస్తదా ||

15

ఏతస్మిన్నంతరే విష్ణురుపయాతో మహాద్యుతిః |
శంఖచక్రగదాపాణిః పీతవాసా జగత్పతిః ||

16

[* అధికశ్లోకః –
వైనతేయం సమారూహ్య భాస్కర తోయదం యథా |
తప్త హాటక కేయూరో వంద్యమానః సురోత్తమైః ||
*]

బ్రహ్మణా చ సమాగమ్య తత్ర తస్థౌ సమాహితః |
తమబ్రువన్సురాః సర్వే సమభిష్టూయ సంనతాః ||

17

త్వాం నియోక్ష్యామహే విష్ణో లోకానాం హితకామ్యయా |
రాజ్ఞో దశరథస్య త్వమయోధ్యాధిపతేః విభోః ||

18

ధర్మజ్ఞస్య వదాన్యస్య మహర్షిసమతేజసః |
తస్య భార్యాసు తిసృషు హ్రీశ్రీకీర్త్యుపమాసు చ ||

19

విష్ణో పుత్రత్వమాగచ్ఛ కృత్వాఽఽత్మానం చతుర్విధమ్ |
తత్ర త్వం మానుషో భూత్వా ప్రవృద్ధం లోకకంటకమ్ ||

20

అవధ్యం దైవతైర్విష్ణో సమరే జహి రావణమ్ |
స హి దేవాన్సగంధర్వాన్సిద్ధాంశ్చ మునిసత్తమాన్ ||

21

రాక్షసో రావణో మూర్ఖో వీర్యోత్సేకేన బాధతే |
ఋషయస్తు తతస్తేన గంధర్వాప్సరసస్తథా ||

22

క్రీడంతో నందనవనే క్రూరేణ కిల హింసితాః |
వధార్థం వయమాయాతాస్తస్య వై మునిభిః సహ ||

23

సిద్ధగంధర్వయక్షాశ్చ తతస్త్వాం శరణం గతాః |
త్వం గతిః పరమా దేవ సర్వేషాం నః పరంతప ||

24

వధాయ దేవశత్రూణాం నృణాం లోకే మనః కురు |
ఏవముక్తస్తు దేవేశో విష్ణుస్త్రిదశపుంగవః ||

25

పితామహపురోగాంస్తాన్ సర్వలోకనమస్కృతః |
అబ్రవీత్ త్రిదశాన్ సర్వాన్ సమేతాన్ ధర్మసంహితాన్ ||

26

భయం త్యజత భద్రం వో హితార్థం యుధి రావణమ్ |
సపుత్రపౌత్రం సామాత్యం సమిత్రజ్ఞాతిబాంధవమ్ ||

27

హత్వా క్రూరం దురాత్మానం దేవర్షీణాం భయావహమ్ |
దశ వర్షసహస్రాణి దశ వర్షశతాని చ ||

28

వత్స్యామి మానుషే లోకే పాలయన్పృథివీమిమామ్ |
ఏవం దత్త్వా వరం దేవో దేవానాం విష్ణురాత్మవాన్ ||

29

మానుషే చింతయామాస జన్మభూమిమథాత్మనః |
తతః పద్మపలాశాక్షః కృత్వాఽఽత్మానం చతుర్విధమ్ ||

30

పితరం రోచయామాస తదా దశరథం నృపమ్ |
తతో దేవర్షిగంధర్వాః సరుద్రాః సాప్సరోగణాః |
స్తుతిభిర్దివ్యరూపాభిస్తుష్టువుర్మధుసూదనమ్ ||

31

తముద్ధతం రావణముగ్రతేజసం
ప్రవృద్ధదర్పం త్రిదశేశ్వరద్విషమ్ |
విరావణం సాధు తపస్వి కంటకం
తపస్వినాముద్ధర తం భయావహమ్ ||

32

తమేవ హత్వా సబలం సబాంధవం
విరావణం రావణముగ్రపౌరుషమ్ |
స్వర్లోకమాగచ్ఛ గతజ్వరశ్చిరం
సురేంద్రగుప్తం గతదోషకల్మషమ్ ||

33

ఋష్యశృంగుడు బాగా ఆలోచించాడు. తరువాత దశరథునితో ఇలా అన్నాడు. “మహారాజా! తమకు పుత్ర సంతానము కలగడం కోసరం, మీకు పుత్ర సంతానమును కలిగించే ఒక ఇష్టిని (యాగమును) మీచేత చేయిస్తాను. ఈ యాగమును వేదములో చెప్పబడిన అధ్వర శిరస్సు అనే మంత్రముల ఆధారంగా చేయిస్తాను.” అని పలికాడు.

దశరథుడు సంతోషంగా ఒప్పుకున్నాడు. యాగం ఆరంభం అయింది. వేద మంత్రములు చదువుతూ హోమం చేస్తున్నారు. యా యజ్ఞములో హవిర్భాగములు స్వీకరించుటకు దేవతలు అక్కడకు వచ్చారు. ఆ సమయంలో దేవతలందరూ బ్రహ్మదేవుని కలిసి ఆయనతో ఇలా అన్నారు.

” ఓ బ్రహ్మదేవా! భూలోకంలో రావణుడు అనే రాక్షసుడికి మీరు ఎన్నో వరాలు ఇచ్చారు. ఆ వరాల ప్రభావంతో గర్వించి ఆ రాక్షసుడు దేవతలను, మునులను, సజ్జనులను బాధిస్తున్నాడు. అతనిని కట్టడి చేయడం మా వల్ల కావడం లేదు. ఎందుకంటే మీరు అతనికి వరాలు ఇచ్చారు. వాటిని మేము గౌరవించాలి కదా. అందుకని మేము అతని మీద కఠినంగా వ్యవహరించలేకపోతున్నాము. అతడు చేయు అకృత్యములను చూచీ చూడకుండా పోతున్నాము.

(మంత్రిగారి అండదండలు ఉంటే పేరు మోసిన రౌడీలను మాత్రం పోలీసులు ఏమి చేయగలరు చెప్పండి.)

తమరి వరాల అండ చూచుకొని అతడు ముల్లోకములను బాధిస్తున్నాడు. దిక్పాలకులను లెక్క చెయ్యడం లేదు. ఇంద్రునికూడా ధిక్కరిస్తున్నాడు. ఇంక భూలోక వాసుల కష్టములకు అంతు లేదు. మునులను బ్రాహ్మణులను బాధిస్తున్నాడు. వారిని యజ్ఞయాగములు చేసుకోనివ్వడం లేదు. వాడి మాటలకు ఎదురు చెప్పే సాహసం ఎవరికీ లేదు.

ఇంక సూర్యుడు అతని దగ్గర చల్లగా ఉంటాడు. వాయువు అతని వద్ద మెల్లగా వీస్తాడు. సముద్రుడు కూడా అతనిని చూడగానే అలలను వెనక్కు లాక్కుంటాడు. శాంతంగా ఉంటాడు. ఆ రావణుని వలన భయపడని వాడు లేదు. అందుకని అతనిని సంహరించి ముల్లోకము లను రక్షించే ఉపాయం ఆలోచించండి.” అని ప్రార్థించారు.

బ్రహ్మదేవుడు ఆలోచించాడు. “దేవతలారా! వాడిని చంపడానికి ఒకే ఒక ఉపాయం ఉంది. నేను ఇచ్చిన వర ప్రభావంతో వాడు నరులు చేతిలో తక్క ఇంక ఎవరి చేతిలోనూ చావడు. అలాంటి వరం ఇచ్చాను కాబట్టి రావణుడు మనుష్యుల చేతిలోనే చావాలి. అది తక్క మరొక ఉపాయము లేదు.” అని అన్నాడు బ్రహ్మ.

అమ్మయ్య! రావణుడి చావుకు ఏదో ఒక కారణం దొరికింది అని సంతోషించారు దేవతలు. ఇంతలో విష్ణుమూర్తిఅక్కడకు వచ్చాడు. దేవతలందరు విష్ణువుకు నమస్కరించారు. ఆయనతో ఇలా అన్నారు.

” ఓ దేవదేవా! ముల్లోకములను కాపాడటానికి మిమ్మల్ను ఒక పని చేయమని కోరుతున్నాము. అయోధ్యకు రాజు అయిన దశరథుడు పుత్రుల కొరకు ఒక యాగము చేస్తున్నాడు. ఆయనకు ముగ్గురు భార్యలు ఉన్నారు. తమరు మా మీద దయయుంచి మీరు నలుగురుగా విడిపోయి, ఆయన ముగ్గురు భార్యలకు పుత్రులుగా జన్మించండి. బ్రహ్మదేవుని వరగర్వంతో రావణుడు అనే రాక్షసుడు ముల్లోకములలో బ్రాహ్మణులను, మునులను, దేవతలను బాధపెడు తున్నాడు. మితి మీరుతున్న ఆ రావణుని సంహరించండి. లోకాలను కాపాడండి. ఒక్క నరుడే ఆ రాక్షసుని సంహరించగలడు. కాబట్టి తమరు మానవుడిగా జన్మించి ఆ రాక్షసుని సంహరించండి.” అని వేడుకున్నారు.

విష్ణుమూర్తి వారి ప్రార్థనలను సొంతం విన్నాడు. వారితో ఇలా అన్నాడు. “ఓ దేవతలారా! మీరు భయపడకండి. మీకు త్వరలో రావణుని బారి నుండి విముక్తి లభిస్తుంది. మీరుకోరినట్టు నేను భూమి మీద అవతరిస్తాను. ఆ రావణుని సంహరిస్తాను. పదకొండు వేల సంవత్సరములు ఈ భూమిని పాలిస్తాను. ధర్మసంరక్షణ చేస్తాను.” అని పలికాడు విష్ణుమూర్తి.

“ ఓ విష్ణుదేవా! నీవు లోక భయంకరుడైన రావణుని సంహరించి తిరిగి స్వర్గలోకమునకు తిరిగి రమ్ము.” అని వేడుకొన్నారు.

ఇది వాల్మీకి విరచిత
రామాయణ మహాకావ్యములో
బాలకాండలో పదిహేనవ సర్గ సంపూర్ణము.

ఓం తత్సత్ ఓంతత్సత్ ఓంతత్సత్

బాలకాండ షోడశః సర్గః (16) >>

Leave a Comment