మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. బాలకాండ లోని ఏకోనవింశః సర్గలో, విశ్వామిత్ర మహర్షి దశరథుడు తాను నిర్వహిస్తున్న వైదిక కర్మను నిరంతరం భంగపరిచే రాక్షసుల నుండి రక్షించడానికి రాముడిని పంపమని అడుగుతాడు. తనకు మరియు దశరథుని ఆస్థానంలో ఉన్న ఇతర ఋషులకు రాముని సామర్థ్యాలు తెలుసునని మరియు రాముడు తన యుక్తవయస్సులో ఉన్నప్పటికీ, అతను రాక్షసులను సులభంగా చంపగలడని ఋషి దశరథ రాజును నొక్కి చెప్పాడు. కానీ ఈ అభ్యర్థనపై దశరథుడు కలత చెందాడు.
విశ్వామిత్రవాక్యమ్
తచ్ఛ్రుత్వా రాజసింహస్య వాక్యమద్భుతవిస్తరమ్ |
హృష్టరోమా మహాతేజా విశ్వామిత్రోఽభ్యభాషత ||
1
సదృశం రాజశార్దూల తవైతద్భువి నాన్యథా |
మహావంశప్రసూతస్య వసిష్ఠవ్యపదేశినః ||
2
యత్తు మే హృద్గతం వాక్యం తస్య కార్యస్య నిశ్చయమ్ |
కురుష్వ రాజశార్దూల భవ సత్యప్రతిశ్రవః ||
3
అహం నియమమాతిష్ఠే సిద్ధ్యర్థం పురుషర్షభ |
తస్య విఘ్నకరౌ ద్వౌ తు రాక్షసౌ కామరూపిణౌ ||
4
వ్రతే మే బహుశశ్చీర్ణే సమాప్త్యాం రాక్షసావిమౌ |
[* మారీచశ్చ సుబాహుశ్చ వీర్యవంతౌ సుశిక్షితౌ | *]
తౌ మాంసరుధిరౌఘేణ వేదిం తామభ్యవర్షతామ్ ||
5
అవధూతే తథాభూతే తస్మిన్నియమనిశ్చయే |
కృతశ్రమో నిరుత్సాహస్తస్మాద్దేశాదపాక్రమే ||
6
న చ మే క్రోధముత్స్రష్టుం బుద్ధిర్భవతి పార్థివ |
తథాభూతా హి సా చర్యా న శాపస్తత్ర ముచ్యతే ||
7
స్వపుత్రం రాజశార్దూల రామం సత్యపరాక్రమమ్ |
కాకపక్షధరం శూరం జ్యేష్ఠం మే దాతుమర్హసి ||
8
శక్తో హ్యేష మయా గుప్తో దివ్యేన స్వేన తేజసా |
రాక్షసా యే వికర్తారస్తేషామపి వినాశనే ||
9
శ్రేయశ్చాస్మై ప్రదాస్యామి బహురూపం న సంశయః |
త్రయాణామపి లోకానాం యేన ఖ్యాతిం గమిష్యతి ||
10
న చ తౌ రామమాసాద్య శక్తౌ స్థాతుం కథంచన |
న చ తౌ రాఘవాదన్యో హంతుముత్సహతే పుమాన్ ||
11
వీర్యోత్సిక్తౌ హి తౌ పాపౌ కాలపాశవశం గతౌ |
రామస్య రాజశార్దూల న పర్యాప్తౌ మహాత్మనః ||
12
న చ పుత్రకృతం స్నేహం కర్తుమర్హసి పార్థివ |
అహం తే ప్రతిజానామి హతౌ తౌ విద్ధి రాక్షసౌ ||
13
అహం వేద్మి మహాత్మానం రామం సత్యపరాక్రమమ్ |
వసిష్ఠోఽపి మహాతేజా యే చేమే తపసి స్థితాః ||
14
యది తే ధర్మలాభం చ యశశ్చ పరమం భువి |
స్థిరమిచ్ఛసి రాజేంద్ర రామం మే దాతుమర్హసి ||
15
యద్యభ్యనుజ్ఞాం కాకుత్స్థ దదతే తవ మంత్రిణః |
వసిష్ఠప్రముఖాః సర్వే తతో రామం విసర్జయ ||
16
అభిప్రేతమసంసక్తమాత్మజం దాతుమర్హసి |
దశరాత్రం హి యజ్ఞస్య రామం రాజీవలోచనమ్ ||
17
నాత్యేతి కాలో యజ్ఞస్య యథాఽయం మమ రాఘవ |
తథా కురుష్వ భద్రం తే మా చ శోకే మనః కృథాః ||
18
ఇత్యేవముక్త్వా ధర్మాత్మా ధర్మార్థసహితం వచః |
విరరామ మహాతేజా విశ్వామిత్రో మహామునిః ||
19
స తన్నిశమ్య రాజేంద్రో విశ్వామిత్రవచః శుభమ్ |
శోకమభ్యాగమత్తీవ్రం వ్యషీదత భయాన్వితః ||
20
ఇతి హృదయమనోవిదారణం
మునివచనం తదతీవ శుశ్రువాన్ |
నరపతిరగమద్భయం మహ-
-ద్వ్యథితమనాః ప్రచచాల చాసనాత్ ||
21
దశరథుని చూచి విశ్వామిత్రుడు ఇలా అన్నాడు.
” ఓ దశరథ మహారాజా! ఇక్ష్వాకు వంశంలో పుట్టి, వసిష్ఠుని పురోహితుని గా గల నీవు ఇంతటి వినయ విధేయతలతో మాట్లాడటం సమంజసముగా ఉంది. నేను ఏమి కోరినా నెరవేరుస్తాను అన్నావు. నేను వచ్చిన కార్యము చెబుతాను. జాగ్రత్తగా విను. విన్న తరువాత నీ మాట నిలబెట్టుకో. నేను ఒక సిద్ధికొరకు ప్రయత్నిస్తున్నాను. దానికి కొన్ని నియమాలు అవలంబిస్తున్నాను. కాని ఆ నియమాలకు మారీచుడు, సుబాహుడు అనే ఇద్దరు రాక్షసులు అవరోధము కలిగిస్తున్నారు. నేను పూనిన వ్రతము సమాప్తి అయ్యే కాలములో ఆ రాక్షసులు యజ్ఞవేదిక మీద రక్తమును మాంసమును పడవేసి అపవిత్రము చేస్తున్నారు. ఆ ప్రకారంగా ఆ వ్రతము చెడిపోయింది. అందువల్ల నిరాశతో నీ వద్దకు వచ్చాను. నేను ఆ రాక్షసులను కట్టడి చేయగలను. కానీ వ్రత సమయములో కోపము తెచ్చుకోకూడదు. శపించకూడదు. ఆ కారణం చేత నాకు ఒక వీరుడి అవసరం వచ్చింది. నీ కుమారుడు, మహావీరుడు అయిన రాముని నాకు ఇమ్ము. రాముడు ఆ
రాక్షసులను సంహరించడానికి సమర్థుడు. రాముడు ఆ రాక్షసులను సంహరించి ముల్లోకములలో కీర్తివంతుడౌతాడు. ఆ మారీచ సుబాహులను రాముడు తప్ప వేరెవ్వరూ చంపలేరు. నీవు పుత్ర వ్యామోహముతో వెనకాడకుము. నీ రాముని కి ఏం అపకారము కలగకుండా నీకు అప్పచెబుతాను.
ఓ దశరథ మహారాజా! రాముని గురించి నీకన్నా నాకు వసిష్ఠునకు మాత్రమే ఎక్కువగా తెలుసు. నీకు, నీ కుమారుడు రాముడు సామాన్యుడు గా కనపడుతున్నాడు. కాని రాముని అసలు స్వరూపము మా వంటి తపశ్శాలులకు మాత్రమే తెలుసు. ఓ రాజా! నీవు ధర్మాత్ముడవైతే, నీ రాముని కీర్తి ముల్లోకములకు తెలియవలెనంటే రాముని నా వెంట పంపు. నీ పురోహితుడు వసిష్ఠుని, మంత్రులను సంప్రదించి రాముని నా వెంట పంపు. కాని తొందరగా పంపు. ఎందుకంటే నా యాగము పదిదినములు జరుగుతుంది. ఆ పది దినములు రాముడు నా వెంట ఉండాలి. కాబట్టి సమయము మించి పోకుండా ఒక నిర్ణయము తీసుకో. నీకు క్షేమం కలుగుతుంది.” అని పలికాడు విశ్వామిత్రుడు.
విశ్వామిత్రుడు రాక్షసులను చంపడానికి రాముని పంపు అన్న మాట విన్నప్పటి నుండి దశరథుడు శోకంతో కుమిలిపోతున్నాడు. విశ్వామిత్రుని మాటలు దశరథునికి పిడుగుపాటు లాగా తగిలాయి. సింహాసనము మీద కూర్చోలేకపోయాడు దశరథుడు.
ఇది వాల్మీకి విరచిత
రామాయణ మహాకావ్యములో
బాలకాండలో పందొమ్మిదవ సర్గ సంపూర్ణము.
ఓం తత్సత్ ఓంతత్సత్ ఓంతత్సత్.