Balakanda Sarga 47 In Telugu – బాలకాండ సప్తచత్వారింశః సర్గః

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. బాలకాండ లోని సప్తచత్వారింశః సర్గలో సప్తమరుత్తుల పురాణం, సప్తవాయువుల పురాణం మరియు విశాల రాజుల పురాణం రాముడు మరియు లక్ష్మణులకు చెప్పగా, విశ్వామిత్రుడు విశాల పురాణాన్ని వివరిస్తున్నాడు. దితి యొక్క అభ్యర్థన మేరకు, ఇంద్రుడు ఆమె పిండంలోని ఏడు భాగాలను సప్త మరుత్ గణాలుగా , సప్తమరుత్ గణాలుగా, ఏడు వాయుదేవతలుగా మారమని ఆశీర్వదిస్తాడు మరియు ఇంద్ర-దితి పురాణం జరిగిన ప్రదేశం, ఆ ప్రాంతం తరువాత విశాల నగరంగా మారింది.

విశాలాగమనమ్

సప్తధా తు కృతే గర్భే దితిః పరమదుఃఖితా |
సహస్రాక్షం దురాధర్షం వాక్యం సానునయోఽబ్రవీత్ ||

1

మమాపరాధాద్గర్భోఽయం సప్తధా విఫలీకృతః |
నాపరాధోఽస్తి దేవేశ తవాత్ర బలసూదన ||

2

ప్రియం తు కర్తుమిచ్ఛామి మమ గర్భవిపర్యయే |
మరుతాం సప్త సప్తానాం స్థానపాలా భవంత్విమే ||

3

వాతస్కంధా ఇమే సప్త చరంతు దివి పుత్రక |
మారుతా ఇతి విఖ్యాతా దివ్యరూపా మమాత్మజాః ||

4

బ్రహ్మలోకం చరత్వేక ఇంద్రలోకం తథాఽపరః |
దివి వాయురితి ఖ్యాతస్తృతీయోఽపి మహాయశాః ||

5

చత్వారస్తు సురశ్రేష్ఠ దిశో వై తవ శాసనాత్ |
సంచరిష్యంతి భద్రం తే దేవభూతా మమాత్మజాః ||

6

త్వత్కృతేనైవ నామ్నా చ మారుతా ఇతి విశ్రుతాః |
తస్యాస్తద్వచనం శ్రుత్వా సహస్రాక్షః పురందరః ||

7

ఉవాచ ప్రాంజలిర్వాక్యం దితిం బలనిషూదనః |
సర్వమేతద్యథోక్తం తే భవిష్యతి న సంశయః ||

8

విచరిష్యంతి భద్రం తే దేవభూతాస్తవాత్మజాః |
ఏవం తౌ నిశ్చయం కృత్వా మాతాపుత్రౌ తపోవనే ||

9

జగ్ముతుస్త్రిదివం రామ కృతార్థావితి నః శ్రుతమ్ |
ఏష దేశః స కాకుత్స్థ మహేంద్రాధ్యుషితః పురా ||

10

దితిం యత్ర తపః సిద్ధామేవం పరిచచార సః |
ఇక్ష్వాకోఽస్తు నరవ్యాఘ్ర పుత్రః పరమధార్మికః ||

11

అలంబుసాయాముత్పన్నో విశాల ఇతి విశ్రుతః |
తేన చాసీదిహ స్థానే విశాలేతి పురీ కృతా ||

12

విశాలస్య సుతో రామ హేమచంద్రో మహాబలః |
సుచంద్ర ఇతి విఖ్యాతో హేమచంద్రాదనంతరః ||

13

సుచంద్రతనయో రామ ధూమ్రాశ్వ ఇతి విశ్రుతః |
ధూమ్రాశ్వతనయశ్చాపి సృంజయః సమపద్యత ||

14

సృంజయస్య సుతః శ్రీమాన్సహదేవః ప్రతాపవాన్ |
కుశాశ్వః సహదేవస్య పుత్రః పరమధార్మికః ||

15

కుశాశ్వస్య మహాతేజాః సోమదత్తః ప్రతాపవాన్ |
సోమదత్తస్య పుత్రస్తు కాకుత్స్థ ఇతి విశ్రుతః ||

16

తస్య పుత్రో మహాతేజాః సంప్రత్యేష పురీమిమామ్ |
ఆవసత్పరమప్రఖ్యః సుమతిర్నామ దుర్జయః ||

17 [అమర]

ఇక్ష్వాకోఽస్తు ప్రసాదేన సర్వే వైశాలికా నృపాః |
దీర్ఘాయుషో మహాత్మానో వీర్యవంతః సుధార్మికాః ||

18

ఇహాద్య రజనీం రామ సుఖం వత్స్యామహే వయమ్ |
శ్వః ప్రభాతే నరశ్రేష్ఠ జనకం ద్రష్టుమర్హసి ||

19

సుమతిస్తు మహాతేజా విశ్వామిత్రముపాగతమ్ |
శ్రుత్వా నరవరశ్రేష్ఠః ప్రత్యుద్గచ్ఛన్మహాయశాః ||

20

పూజాం చ పరమాం కృత్వా సోపాధ్యాయః సబాంధవః |
ప్రాంజలిః కుశలం పృష్ట్వా విశ్వామిత్రమథాబ్రవీత్ ||

21

ధన్యోఽస్మ్యనుగృహీతోఽస్మి యస్య మే విషయం మునిః |
సంప్రాప్తో దర్శనం చైవ నాస్తి ధన్యతరో మమ ||

22

Balakanda Sarga 47 In Telugu Pdf With Meaning

తన గర్భములోనే ఏడు ముక్కలుగా ఖండింప బడిన తన కుమారుని తలుచుకొని దితి ఎంతో దు:ఖించింది. కాసేపటికి తేరుకుంది. దేవేంద్రుని చూచి ఇలా అంది.

“కుమారా! తప్పు నాది. నిన్ను అనవలసిన పని లేదు. నీ రక్షణ నీవు చూచుకున్నావు. నా గర్భస్థ శిశువును ఏడు ముక్కలుగా ఖండించావు. ఎటూ నా గర్భము విచ్ఛిన్నము అయింది. కానీ నీవు నాకు ఒక ఉ పకారము చెయ్యి. ఈ ఏడు ఖండములను ఏడు మరుత్తుస్థానములకు పాలకులుగా నియమించు.

నా ఏడుగురు కుమారులు దివ్య రూపములతో వాతస్కంధములకు స్థాన పాలకులు అగుదురు గాక! వారికి మరుత్తులు అనే పేరు సార్థకమగును గాక! ఈ మరుత్తులలో ఒకరు బ్రహ్మ లోకములోనూ, ఒకరు ఇంద్రలోకములోనూ, మూడవ వాడు వాయు లోకములోనూ నిత్యమూ తిరుగుతూ ఉండుదురుగాక! మిగిలిన నా నలుగురు కుమారులు నీ ఆజ్ఞకు లోబడి నాలుగు నా దిక్కులను పరిపాలించుదురు గాక!

నీవు నా కుమారుని ఖండించు నప్పుడు ఏడవకు ఏడవకు (మా రుత మా రుత) అని అనునయించావు. నా కుమారులు అదే పేరుతో మరుత్తులు అని పిలువ బడతారు.” అని పలికింది దితి.

ఆమె మాటలు విని ఇంద్రుడు ఆమెకు సాష్టాంగ నమస్కారము చేసాడు. ఆమె ముందు చేతులు జోడించి నిలబడ్డాడు. “అమ్మా నీవు చెప్పినట్లే జరుగుతుంది. నీకు శుభం జరుగుతుంది.” అని అన్నాడు. తరువాత దితి, దేవేంద్రుడు స్వర్గలోకము వెళ్లిపోయారు.

ఓ రామా! దితి ఇదే ప్రదేశములో తపస్సు చేసింది. ఆమెకు ఇంద్రుడు ఇక్కడనే ఉపచార ములు చేసాడు.

తరువాతి కాలంలో ఇక్ష్వాకునకు ఆలంబుస అను ఆయన భార్యకు విశాలుడు అనే కుమారుడు జన్మించాడు. ఆ విశాలుడు ఈ నగరాన్ని నిర్మించాడు. ఆయన పేరుతోనే ఈ నగరము విశాలపురము అని పిలువబడుతూ ఉంది.

ఆ విశాలుని కుమారుడు హేమ చంద్రుడు. హేమ చంద్రుని కుమారుడు సుచంద్రుడు. సుచంద్రుని కుమారుడు ధూమ్రాశ్వుడు. ధూమ్రాశ్వుని కుమారుడు సృంజయుడు. సృంజయుని కుమారుడు సహదేవుడు. సహదేవుని కుమారుడు కుశాశ్వుడు. కుశాశ్వుని కుమారుడు సోమదత్తుడు. సోమదత్తుని కుమారుడు కాకుత్సుడు
.
ఆ కాకుత్తుని కుమారుడు ప్రస్తుతము విశాల నగరము పరిపాలిస్తున్న సుమతి. మనకు ఈ రాత్రికి ఇక్కడే విశ్రమించి రేపు ఉదయము మిథిలానగరమునకు ప్రయాణము కొనసాగిస్తాము.” అని అన్నాడు విశ్వామిత్రుడు.

తాము వచ్చిన సంగతి విశాలపురమునకు రాజు సుమతికి వర్తమానము పంపారు. వెంటనే సుమతి సపరివార సమేతంగా విశ్వామిత్రుని ఎదురు వచ్చి ఆయనకు, ఆయన వెంట వచ్చినవారిని సాదరంగా ఆహ్వానించాడు. అర్ఘ్య పాద్యములను ఇచ్చి సత్కరించాడు. విశ్వామిత్రుని చూచి సుమతి ఇలా అన్నాడు.

“మహాత్మా! తమరు మా నగరానికి వచ్చి మమ్ములను కృతార్థులను చేసారు. మేము ధన్యులము అయ్యాము. నన్ను మించిన అదృష్టవంతుడు ఈ లోకంలో లేడు.” అని పలికాడు సుమతి.

శ్రీమద్రామాయణము
బాలకాండ నలుబది ఏడవ సర్గ సంపూర్ణము.
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్

బాలకాండ అష్టచత్వారింశః సర్గః (48) >>

Leave a Comment