Balakanda Sarga 58 In Telugu – బాలకాండ అష్టపంచాశః సర్గః

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. వాల్మీకి మహర్షి రచించిన రామాయణంలోని బాలకాండలో 48వ సర్గ, అష్టపంచాశః సర్గగా పిలవబడుతుంది. ఈ సర్గలో, రాముడు, సీత, లక్ష్మణుడు, సుమంత్రుడు కలిసి విశ్వామిత్ర మహర్షి ఆశ్రమానికి చేరుకుంటారు. విశ్వామిత్రుడు సీతారాములను తన శిష్యులుగా స్వీకరిస్తాడు మరియు రాముడిని రాక్షసుల బాధలను తొలగించమని ఆదేశిస్తాడు.

|| త్రిశంకుశాపః ||

తతస్త్రిశంకోర్వచనం శ్రుత్వా క్రోధసమన్వితమ్ |
ఋషిపుత్రశతం రామ రాజానమిదమబ్రవీత్ ||

1

ప్రత్యాఖ్యాతో హి దుర్బుద్ధే గురుణా సత్యవాదినా |
తం కథం సమతిక్రమ్య శాఖాంతరముపేయివాన్ ||

2

ఇక్ష్వాకూణాం హి సర్వేషాం పురోధాః పరమో గురుః |
న చాతిక్రమితుం శక్యం వచనం సత్యవాదినః ||

3

అశక్యమితి చోవాచ వసిష్ఠో భగవానృషిః |
తం వయం వై సమాహర్తుం క్రతుం శక్తాః కథం తవ ||

4

బాలిశస్త్వం నరశ్రేష్ఠ గమ్యతాం స్వపురం పునః |
యాజనే భగవాన్ శక్తస్త్రైలోక్యస్యాపి పార్థివ ||

5

అవమానం చ తత్కర్తుం తస్య శక్ష్యామహే కథమ్ |
తేషాం తద్వచనం శ్రుత్వా క్రోధపర్యాకులాక్షరమ్ ||

6

స రాజా పునరేవైతానిదం వచనమబ్రవీత్ |
ప్రత్యాఖ్యాతోఽస్మి గురుణా గురుపుత్రైస్తథైవ చ ||

7

అన్యాం గతిం గమిష్యామి స్వస్తి వోఽస్తు తపోధనాః |
ఋషిపుత్రాస్తు తచ్ఛ్రుత్వా వాక్యం ఘోరాభిసంహితమ్ ||

8

శేపుః పరమసంక్రుద్ధాశ్చండాలత్వం గమిష్యసి |
ఏవముక్త్వా మహాత్మానో వివిశుస్తే స్వమాశ్రమమ్ ||

9

అథ రాత్ర్యాం వ్యతీతాయాం రాజా చండాలతాం గతః |
నీలవస్త్రధరో నీలః పరుషో ధ్వస్తమూర్ధజః ||

10

చిత్యమాల్యానులేపశ్చ ఆయసాభరణోఽభవత్ |
తం దృష్ట్వా మంత్రిణః సర్వే త్యజ్య చండాలరూపిణమ్ ||

11

ప్రాద్రవన్సహితా రామ పౌరా యేఽస్యానుగామినః |
ఏకో హి రాజా కాకుత్స్థ జగామ పరమాత్మవాన్ ||

12

దహ్యమానో దివారాత్రం విశ్వామిత్రం తపోధనమ్ |
విశ్వామిత్రస్తు తం దృష్ట్వా రాజానం విఫలీకృతమ్ ||

13

చండాలరూపిణం రామ మునిః కారుణ్యమాగతః |
కారుణ్యాత్స మహాతేజా వాక్యం పరమధార్మికః ||

14

ఇదం జగాద భద్రం తే రాజానం ఘోరరూపిణమ్ |
కిమాగమనకార్యం తే రాజపుత్ర మహాబల ||

15

అయోధ్యాధిపతే వీర శాపాచ్చండాలతాం గతః |
అథ తద్వాక్యమాకర్ణ్య రాజా చండాలతాం గతః ||

16

అబ్రవీత్ప్రాంజలిర్వాక్యం వాక్యజ్ఞో వాక్యకోవిదమ్ |
ప్రత్యాఖ్యాతోఽస్మి గురుణా గురుపుత్రైస్తథైవ చ ||

17

అనవాప్యైవ తం కామం మయా ప్రాప్తో విపర్యయః |
సశరీరో దివం యాయామితి మే సౌమ్యదర్శనమ్ ||

18

మయా చేష్టం క్రతుశతం తచ్చ నావాప్యతే ఫలమ్ |
అనృతం నోక్తపూర్వం మే న చ వక్ష్యే కదాచన ||

19

కృచ్ఛ్రేష్వపి గతః సౌమ్య క్షత్రధర్మేణ తే శపే |
యజ్ఞైర్బహువిధైరిష్టం ప్రజా ధర్మేణ పాలితాః ||

20

గురవశ్చ మహాత్మానః శీలవృత్తేన తోషితాః |
ధర్మే ప్రయతమానస్య యజ్ఞం చాహర్తుమిచ్ఛతః ||

21

పరితోషం న గచ్ఛంతి గురవో మునిపుంగవ |
దైవమేవ పరం మన్యే పౌరుషం తు నిరర్థకమ్ ||

22

దైవేనాక్రమ్యతే సర్వం దైవం హి పరమా గతిః |
తస్య మే పరమార్తస్య ప్రసాదమభికాంక్షతః ||

23

కర్తుమర్హసి భద్రం తే దైవోపహతకర్మణః |
నాన్యాం గతిం గమిష్యామి నాన్యః శరణమస్తి మే |
దైవం పురుషకారేణ నివర్తయితుమర్హసి ||

24

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే బాలకాండే అష్టపంచాశః సర్గః ||

Balakanda Sarga 58 Meaning In Telugu

త్రిశంకు ఆ మాటలు అంటున్నంత సేపూ వసిష్ఠుని కుమారులు కోపంతో ఊగి పోతున్నారు. వారి కోపము కట్టలు తెంచుకొంది.

” ఓ త్రిశంకూ! నీవు దుర్బుద్ధివి. చెడ్డవాడివి. నీ కుల గురువు వసిష్ఠుడు. ఆయన సత్యసంధుడు. ఆయన నిరాకరించిన తరువాత నీవు మరొకరి వద్దకు ఎలా వెళ్ల గలవు? నీకే కాదు… వసిష్ఠుడు ఇక్ష్వాకు వంశమునకే పురోహితుడు. గురువు. ఎల్లప్పుడూ సత్యమునే పలికేవాడు. అటువంటి కులగురువు మాటను నీవు ఎలా అతిక్రమి స్తున్నావు? మా తండ్రిగారు, నీ కులగురువు అయిన వసిష్ఠుడు తన వల్లకాదు అని చెప్పిన యజ్ఞమును మేము ఎలా చేయిస్తాము అని అనుకున్నావు?

నీవు మూర్ఖుడవు. లేకపోతే సశరీరంగా స్వర్గమునకు పోవడం సాధ్యమా కాదా అని కూడా తెలుసుకోలేక పోతున్నావు. వసిష్ఠుడు మూడు లోకములలో ఎవరిచేతనైనా ఎటువంటి యాగము నైనా చేయించగల సమర్థులు. అటువంటి వసిష్ఠుడు తన వల్ల కాదు అన్నాడంటే అది ఎంత దుర్లభమో అర్థం చేసుకో. ఆయన కాదు అన్న యాగమును మేము చేయించి ఆయనను అవమానించలేము. కాబట్టి, వెంటనే నీవు తిరిగినీ నగరమునకు వెళ్లు. ఈ దుష్ట ఆలోచన మానుకో. ” అని కోపంతో పలికారు వసిష్ఠుని కుమారులు.

ఆ మాటలు విన్న త్రిశంకు వినయంతో వారితో ఇలా అన్నాడు. “ముని కుమారులారా! మీ తండ్రిగారు నా చేత సశరీరంగా స్వర్గమునకు పోవుటకు తగిన యజ్ఞము చేయించుటకు సమ్మతించలేదు. మీ వద్దకు వచ్చాను మీరూ నిరాకరించారు. ఏం చేస్తాను. వేరేవాళ్లదగ్గరకు పోయి నా కోరికను నెరవేర్చుకుంటాను. నాకు సెలవు ఇప్పించండి.” అని అన్నాడు త్రిశంకు.

తాము ఇన్ని విధాలుగా చెప్పినా తన మూర్ఖపు పట్టు వీడని త్రిశంకుని చూచి వసిష్ఠుని కుమారులు కోపగించుకున్నారు.

“ఓ త్రిశంకు! నీవు క్షత్రియుడుగా ఉండ తగవు. నీవు ఛండాలుడివిగా మారిపో!” అని శపించారు.

ఆ మునికుమారుల శాపము ప్రకారము ఇక్ష్వాకు వంశపు రాజు త్రిశంకు ఛండాలుడిగా మారి పోయాడు. నల్లని వస్త్రములు, నల్లని శరీరము, చింపిరి జుట్టు, కపాల మాలికలు, ఇనుముతో చేసిన ఆభరణములు, వీటితో వికృతంగా మారిపోయాడు త్రిశంకు.

అతని ఆకారమును చూచి అతని వెంట ఉన్న రాజబంధువులు, మంత్రులు, సేనలు అందరూ భయపడి పారిపోయారు.

త్రిశంకు ఒంటరి వాడయ్యాడు. అలా నడుచుకుంటూ విశ్వామిత్రుడు తపస్సు చేసుకుంటున్న చోటికి వచ్చాడు. అతనిని చూచి విశ్వామిత్రుడు జాలి పడ్డాడు.

“నీవు త్రిశంకు మహారాజువు కదూ! ఇక్ష్వాకు వంశ రాజువు కదూ. నీవు నీ కులగురువు వసిష్ఠుని చేత నిరాకరింపబడ్డావు. అతని కుమారులచేత శపించబడ్డావు. నీకు ఏం భయం లేదు. నీ కోరిక నేను తీరుస్తాను. నీకు ఏంకావాలో అడుగు.” అని పలికాడు విశ్వామిత్రుడు.

అప్పుడు త్రిశంకు విశ్వామిత్రునితో ఇలా అన్నాడు. “ఓమహర్షీ! నాకు ఈ శరీరంతోనే స్వర్గమునకు వెళ్లవలెనని కోరిక. దాని కొరకు నూరు యజ్ఞములు చేసాను. నా కోరిక తీరలేదు. నా పురోహితుడు వసిష్ఠుడు నా కోరికను నిరాకరించాడు. ఆయన కుమారులు నా కోరిక తీర్చకపోగా నన్ను ఛండాలుడివి కమ్మని శపించారు. దిక్కుతోచని స్థితిలో మీ వద్దకు వచ్చాను. మీరే నా కోరిక తీర్చాలి.

ఓ మహర్షీ! నా గురించి మీకు తెలుసు కదా! నేను అసత్యమాడను. ధర్మపరుడను. ఎన్నో యజ్ఞములు చేసాను. ప్రజలను కన్నబిడ్డలవలె పాలించాను. పెద్దలను గౌరవించాను. ఎవరికీ ఎటువంటి అపకారము చేయలేదు. కాని నా కోరిక తీరలేదు. దైవము నా యందు అనుకూలముగా లేనపుడు పురుష ప్రయత్నము కూడా ఫలించదు కదా! దైవోపహతుడనైన నేను ఇప్పుడు మిమ్ములను ఆశ్రయించాను. ఇంక మీ దయ. మీరు కాదంటే నాకు వేరు గతి లేదు.” అని ప్రార్థించాడు త్రిశంకు.

శ్రీమద్రామాయణము
బాలకాండము యాభై ఎనిమిదవ సర్గ
సంపూర్ణము ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్.

బాలకాండ ఏకోనషష్ఠితమః సర్గః (59) >>

Leave a Comment