Govardhana Giri Pooja In Telugu – గోవర్ధన గిరి పూజ

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు నీతికథలు గురించి తెలుసుకుందాం.

నీతికథలు

శ్రీమద్భాగవతము నీతికథలలో మనకు బాగా సుపరిచితమైన నీతికథ మీ అందరికోసం. అది ఎమిటంటే… గోవర్ధన గిరి పూజ.

గోవర్ధన గిరి పూజ

నందవ్రజములో ప్రతి ఏట ఇంద్రయాగము చేసేవారు. ఏడేళ్ళ పసిబాలుడైన శ్రీ కృష్ణ పరమాత్మ సదస్యులందరి ముందర తండ్రియైన నందుని ఇలా ప్రశ్నించాడు “ఇంద్రయాగము చేయుటలోని ఆంతర్యమేమిటి”? నందుడు “కృష్ణ! యజ్ఞ యాగములు కృతజ్ఞతును ప్రకటించే సాధనములు. మనకు హితము కలిగించే వేల్పులకు కృతజ్ఞత చూపడమే యజ్ఞం యొక్క ముఖ్యోద్దేశం. కృతజ్ఞుడే కాని కృతఘ్నుడు సహాయమునకు అర్హుడుకాడు కదా! ఈ కారణముగా లోకహితార్థం యజ్ఞం చేయుట ఆచారం” అని చెప్పాడు.

తండ్రియొక్క సత్యవాక్కులు విని శ్రీ కృష్ణుడిలా అన్నాడు “తండ్రీ! ఫలము కేవలము దేవతలవల్లనే కలుగదు. ఫలసిద్ధికి ముఖ్యమైన హేతువు కర్మ. ఒక మనిషి తానెన్ని సత్కార్యాలు చేశాడన్నది ముఖ్యం. అందుకే కర్మయే భగవంతుడని అనవచ్చు. స్వధర్మమాచరీంచిన వాడికి దైవము చేరువలో నుండును.

పరమాత్మ అవ్యక్తుడు సర్వవ్యాపకుడు నిరాకారుడు. అలాగే దేవతలుకూడా మనకు కనబడరు. కానీ సూక్ష్మ బుద్ధితో పరీక్షిస్తే ఈ ప్రకృతి (ఆది శక్తి) పరమాత్మ యొక్క ప్రత్యక్షస్వరూపం. కావున ప్రత్యక్షంగా మనకు కనిపించే ప్రకృతిని వదిలివేయుట మంచిది కాదు. మనము వేటిమీద ప్రత్యక్షంగా ఆధారపడి బ్రతుకుతున్నామో వాటినికూడా పూజించి మన కృతజ్ఞతా భావాన్ని సుస్థిరం చేసుకోవాలి.

మనం ఈ గోవర్ధన గిరి వద్ద నివసిస్తాము. గోసంపదతో బ్రతుకు వారము. కావున గోవర్ధన గిరి పూజ గోమాత పూజ మనకు అత్యంత ప్రధానమ్. అందునా గోవర్ధనగిరి గోవిందుని వక్షఃస్థలం నుండి పుట్టి పులస్త్య మహర్షి అనుగ్రహంచే ఇచటికి వచ్చింది”. పరమాత్ముని అమృతవాక్యాలు విన్న వ్రజవృద్ధుడైన సన్నందుడు “ఓ నందనందన! నీవు జ్ఞానస్వరూపుడవు. నీ మాటలు మాకు శిరోధార్యములు. గోవర్ధనగిరి పూజావిధానము మాకు తెలుపుము” అని అన్నాడు. పరంధాముడు గిరిపూజా విధానం తెలిపినాడు:

“గిరి పాదభాగమును శుభ్రపఱచి గోమయముతో అలుకవలెను. రంగురంగుల ముగ్గులు వేయవలెను. పూజా ద్రవ్యములు శ్రద్ధగా సమకూర్చుకోవలెను. స్నానాది క్రియలొనర్చి భక్తితో శోడషోపచారములతో గోవర్ధనుని పూజించవలెను. అర్ఘ్యపాద్య అభిషేక అలంకరణ పుష్పపూజ దీపారాధన ప్రదక్షిణ నమస్కార స్తోత్ర నైవేద్యాది సేవలు చేసిన పిమ్మట నీరాజనమీయవలెను. విప్రసంతర్పణ గోపూజ అందరికీ అన్నదానం బాగా చేయవలెను. సాష్టాంగ ప్రణామములు చేయవలెను”.

శ్రీ కృష్ణుడు అలా పూజావిధానం తెలిపి “పూజకి వచ్చేముందు మీ కర్తవ్యాలన్నీ నిర్వహించుకుని రండి. ఇంట్లో దైవపూజ మాతాపితపూజ అన్నీ చేసుకుని రండి. వృద్ధులను బాలకులను ఆకలితో వదిలేసి రాకండి. వారికి కావలసిన ఆహారం సమకూర్చండి. ఇంటి వద్ద ఉన్న గోవులకి పశు పక్షాదులకి కుక్కలకి వేటికి కావలసిన ఆహారం వాటికిచ్చి రండి” అని చెప్పాడు.

ఓ శుభదివసమున వ్రజవాసులు గోవర్ధన గిరిపూజకు తండోపతండాలుగా తఱలి వచ్చారు. యాదవుల గురువైన గర్గ మహర్షి పురోహితులు వచ్చారు. నవనందులు వృషభానుడు బంగారు పల్లకీలో రాధాదేవి వచ్చిరి. దేవతలు అప్సరసలు రాజర్షులు మహర్షులు పార్వతీ పరమేశ్వరులు విచ్చేసినారు. భక్తి శ్రద్ధలతో పూజావిధిని అనుసరించి గోవర్ధన గిరి పూజ చేశారు వ్రజవాసులు. వ్రజవాసుల భక్తికి మెచ్చి గోవర్ధనుడు సహస్రబాహులతో మానవాకృతిలో వచ్చి అందరిని ఆశీర్వదించాడు. శ్రీ కృష్ణ పరమాత్మకీ జై గోవర్ధనగిరిరాజుకీ జై అను జయజయ ధ్వానాలు భూనభోంతరాళముల ప్రతిధ్వనించాయి. వ్రజ చరిత్రలో అది ఓ సువర్ణ ఘట్టమ్.

ఈ కథలోనితి మరొక్కమాణు మీ అందరికోసం

  1. ప్రాకృతిక వనరులను నాశనం చేయడం స్వార్థబుద్ధితో ప్రకృతిని క్షోభింపచేయడం ఎన్నడూ భారతీయత కాదు. భారతీయులు ప్రకృతిని పరమాత్మ యొక్క ప్రత్యక్ష స్వరూపమని భావించి పూజిస్తారు. ఇదే శ్రీ కృష్ణుడు మనకిచ్చిన సందేశం.
  2. దైవసేవ మాతాపితసేవ భూతదయ అన్ని మానవుడి కర్తవ్యాలని గుర్తుచేశాడు శ్రీ కృష్ణుడు. అందుకే పూజకు వచ్చేముందు వృద్ధులకు బాలులకు పశు పక్షాదులకు ఆహారం సమకూర్చి రమ్మన్నాడు.
  3. మన సంస్కృతి ప్రకారము పూజా విధానము ఎట్టిదో శ్రీ కృష్ణుడు తెలిపాడు. భక్తి శ్రద్ధలతో విధినసురించి చేసిన పూజ ఫలించి గోవర్ధనుడు సాక్షాత్కరించాడు.

మరిన్ని నీతికథలు మీకోసం:

Leave a Comment